షూటింగ్స్ బంద్.. కరోనా ఎఫెక్ట్..
posted on Apr 14, 2021 @ 12:38PM
అవును, మీరు చదివింది నిజమే. సినిమా షూటింగ్స్ ప్యాకప్. కేవలం సినిమాలే కాదు, టీవీ సీరియల్స్, యాడ్స్ షూటింగ్స్ కూడా నిలిపివేశారు. కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసేందుకు బుధవారం సాయంత్రం నుంచి షూటింగ్స్ చిత్రీకరణను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా చైన్ ను బ్రేక్ చేసేందుకు బుధవారం రాత్రి 8గంటల నుంచి మే 1వతేదీ ఉదయం 7గంటల వరకు కొవిడ్ ఆంక్షలు అమలు చేస్తారు.
షూటింగుల నిలిపివేత నిర్ణయం తమకు భారీ షాక్ అని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బీఎన్ తివారీ చెప్పారు. కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగులు జరుపుతున్నామని, దీనికి తమను అనుమతించాలని కోరుతూ తాము సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాయాలని భావిస్తున్నట్టు తివారీ చెప్పారు. షూటింగుల నిలిపివేతతో అమితాబ్ బచ్చన్ ‘గుడ్ బై’, షారూఖ్ ఖాన్ ‘పఠాన్’, సల్మాన్ ఖాన్ ‘టైగర్3’ సినిమాల షూటింగ్ నిలిచిపోయింది. మహారాష్ట్ర మాదిరే మన టాలీవుడ్‌లోనూ షూటింగ్స్ ఆపేస్తారా? అనే భయం తెలుగు సినీ పరిశ్రమను వేధిస్తోంది.