ఏపీపై మరోసారి కేసీఆర్ సెటైర్లు! పాలకుడు వీకైతే అంతే..
posted on Apr 14, 2021 @ 9:40PM
ఇంటికి పెద్ద బలహీనంగా ఉంటే ఆ కుటుంబం అందరికి లోకువే.. రాష్ట్రానికి పాలకుడు వీక్ గా ఉంటే పక్క రాష్ట్రాలకు అలుసే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీని పట్టించుకోవడం మానేసింది. పాలకుడు అడిగే పరిస్థితిలో లేదు కాబట్టే వరుసగా అన్యాయాలు చేసుకుంటూనే పోతోందనే చర్చ జరుగుతోంది. ఇది చాలదన్నట్లు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏపీని అవహేళన చేసే పరిస్థితులు నెలకొన్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరోసారి ఆంధ్రప్రదేశ్ పై సెటైర్లు వేశారు. ఇటీవలే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఏపీలో అంతా రివర్స్ అయిందని కామెంట్ చేశారు కేసీఆర్. గతంలో ఏపీలో ఒకరం భూమి అమ్మి తెలంగాణలో రెండు ఎకరాలు కొనేవారని... కాని ప్రస్తుతం తెలంగాణలో ఎకరం ల్యాండ్ అమ్మితే ఏపీలో రెండు ఎకరాల భూమి వస్తుందన్నారు. ఏపీలో అంతా రివర్స్ గా ఉందంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంధ్రా ప్రజలకు ఇబ్బందిగా మారింది.
తాజాగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార సభలో మరోసారి ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఇండియాలో ఈ యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసింది తెలంగాణ అన్నారు. తెలంగాణను హేళన చేసిన.. ఆంధ్రా 29 లక్షలతో మూడో స్థానానికి పడిపోయిందని హేళనగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ధనిక రాష్ట్రమైందని.. ఇతర రాష్ట్రాలు మాత్రం అప్పుల్లో మునిగిపోయాయని చెప్పారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. జగన్ తనను ప్రశ్నించలేరనే భావనతోనే కేసీఆర్.. ప్రతిసారి ఏపీని టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో పాలన సరిగా లేదనే అర్ధం వచ్చేలా కేసీఆర్ మాట్లాడుతున్నారని అంటున్నారు. ఇది ముందుముందు ఏపీకి నష్టం కల్గిస్తుందని, వ్యాపార వేత్తలు ఏపీకి రాకుండా పోయే పరిస్థితి ఉందనే ఆందోళనలో కొందరి నుంచి వ్యక్తమవుతోంది. మొదటి సారి మాట్లాడినప్పుడే కేసీఆర్ కు ఏపీ పాలకులు కౌంటర్ ఇస్తే .. మళ్లీ మళ్లీ ఇలా మాట్లాడే అవకాశం లేకుండా పోయిదనే చెబుతున్నారు.