మాస్క్ లేకుంటే మటాషే.. గాలి ద్వారా కరోనా వ్యాప్తి!
posted on Apr 14, 2021 @ 8:35PM
దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి సంబంధించి మరో షాకింగ్ న్యూస్. ఇది జనాలను మరింత కలవరపరిచే వార్తే. కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు డా.శ్రీనివాస్ హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పడకల కొరత ఏర్పడుతుందన్నారు డా.శ్రీనివాస్. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు.
గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే గంటల్లోనే మిగతా వారికి వ్యాపిస్తుందని వెల్లడించారు. ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్ వేసుకోమని చెప్పామని..ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. ప్రజల జీవనోపాధి దెబ్బతినకూడదనే లాక్‌డౌన్ పెట్టడం లేదన్నారు. ప్రజలు స్వీయనియంత్రణ పాటించకపోతే పరిస్థితి విషమిస్తుందని డా.శ్రీనివాస్ హెచ్చరించారు.
సెకండ్ వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఫస్ట్ వేవ్ సమయంలో 20 శాతం మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చేరారని... సెకండ్ వేవ్ లో 95 శాతం మంది ఇంటి వద్దే ఉంటూ చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 47 వేల పడకల్లో సగానికి పైగా కోవిడ్ పేషెంట్లకే వాడుతున్నామని తెలిపారు. సీరియస్ కేసులు వస్తే... ప్రైవేట్ ఆసుపత్రులు గాంధీ ఆసుపత్రికి పంపుతున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ ధర్నాలు చేయవద్దని కోరారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అన్నారు.