జపాన్ లో బద్దలైన అగ్నిపర్వతం
posted on Jul 25, 2022 @ 10:35AM
జపాన్ లో అగ్ని పర్వతం బద్దలైంది. పలు పట్టణాలలో లావా ప్రవహిస్తోంది. అధికారులు ముందు జాగ్రత్తగా పట్టణాలను ఖాళీ చేయించినా అపార నష్టం సంభవించింది. గత కొంత కాలంగా దక్షిణజపాన్ లోని సకురజీమా అగ్ని పర్వతం లావా వెదజల్లుతూ, యాక్టివ్ గా ఉంది.
ఇది ఎప్పుడో అప్పుడు బద్దలౌతుందని భావిస్తూనే ఉన్నాయి. అయితే ఆదివారం రాత్రి హఠాత్తుగా ఒక్క సారిగా బద్దలైంది. దీంతో ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అగ్నిపర్వతానికి సమీపంలోని అరిమురా, పురుస తదితర పట్టణాలు, ప్రాంతాల ప్రజలను హుటాహుటిక ఖాళీ చేయించారు.
అయితే అగ్నిపర్వతం బద్దలైన సమయం రాత్రి కావడంతో వెంటనే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు. సకురజిమా అగ్ని పర్వతం కొన్నేళ్లుగా యాక్టివ్ గా ఉంది. తరచూ బూడిద, పొగను వెదజల్లుతోందని అధికారులు తెలిపారు.
గత కొంత కాలంగా ఆ పర్వతాన్ని సందర్శించేందుకు, దాని సమీపంలోనికి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించడం లేదని అధికారులు చెప్పారు. తాజాగా ఆదివారం రాత్రి ఒక్కసారిగా అగ్ని పర్వతం బద్దలైందనీ, 2.5 కిలోమీటర్ల ఎత్తున రాళ్లు, దుమ్ము ఎగజిమ్మిందని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం నుంచి వెలువడిన దుమ్ము, ధూళి మేఘాల్లో కలిసి.. ఆ ప్రాంతమంతా చిమ్మచీకటి అలుముకుందని వివరించారు.