మెడీ బలం విపక్షాల అనైక్యతే!
posted on Jul 24, 2022 @ 10:43AM
రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక అయిపోతుంది. విపక్షాల ఐక్యత ఎండమావేనని మరోసారి తేలిపోయింది. మళ్లీ మళ్లీ అదే రుజువు అవుతుంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుస విజయాలకు అసలైన కారణం సొంత ప్రతిభ కంటే.. సొంత బలం కంటే విపక్షాలలో ఉన్న అనైక్యతే కారణమని పదే పదే రుజువు అవుతోంది. అయినా విపక్షాలు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు.
సొంత బలం కంటే తమ అనైక్యతే మోడీ సర్కార్ బలోపేతం కావడానికి కారణమౌతోందని తెలిసినా, విభేదాలను పక్కన పెట్టి కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఏకాభిప్రాయానికి రావడంలో ఘోరంగా విఫలమౌతోంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను చూస్తున్న సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్న ఈ సంగతి విపక్షాలకు ఎందుకు తెలియడం లేదో అర్ధం కాదు. రాష్ట్రపతి ఎన్నికలలో పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మద్దతుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేశారు. అంటే విపక్ష పార్టీల ఐక్యత ఎంత బలంగా ఉందో తేటతెల్లమౌతుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే సరే సరి. ఓటింగ్ కు దూరం అని మమతా బెనర్జీ ప్రకటించడంతోనే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు నిలిపాయన్నది కూడా అర్ధం కాని పరిస్థితి.
తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని ఎదుర్కోక తప్పని పరిస్థితి. అయితే ఆ రెండు పార్టీల కార్యక్షేత్రం వాటి వాటి రాష్ట్రాలే. ఎందుకంటే బీజేపీతో పోరు చేయకుంటే ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడం ఆ పార్టీలకు అసాధ్యమౌతుంది కనుక. ఈ రెండు పార్టీలూ మినహాయిస్తు మిగిలిన విపక్షాలు వేటికీ కేంద్ర ప్రభుత్వంతో అంటే బీజేపీతో జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజకీయాలలో అదీ జాతీయ స్థాయి రాజకీయాలలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది.
దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ పోటీ ఇచ్చే పార్టీ కానీ, కూటమి కానీ లేకుండా పోయింది. కేంద్రంలో మోడీ సర్కార్ పై జాతీయ స్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితుల్లో జనానికి కూడా బీజేపీ వినా మరో పార్టీ కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రజలు ప్రత్యామ్నాయం కనిపించినప్పుడే తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటుతారు. అలా కనిపించనప్పుడు ఎవరైతేనేం అన్న నిర్లిప్తంతో ఉండిపోతారు. ఇప్పుడు దేశంలో ప్రజల పరిస్థితి అదే.