రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ.. యూపీలో 8 మంది మృతి
posted on Jul 25, 2022 @ 10:48AM
ఉత్తర ప్రదేశ్ లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కనీసం 8 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ రెండు బస్సులూ కూడా బీహార్ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా వెళుతున్న బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వేగంగా వస్తున్న బస్సు దానిని ఢీ కొంది. సంఘటనా స్థలంలోనే ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన పలువురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతుంది.
అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం లక్నో ట్రూమాకేర్ సెంటర్ కు తరలించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.