పుష్పా.. ఐ హేట్ ట్రాఫిక్!
posted on Jul 24, 2022 @ 4:02PM
పుష్పా.. ఐ హేట్ టియర్స్.. అంటాడు బచ్చన్ ఓ సినిమాలో. ఈరోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు ఈ డైలాగ్‌ని మార్చి టియర్స్ స్థానంలో ట్రాఫిక్ అని అనుకుంటున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నగరాలు, పట్టణాల్లో ఉద్యోగానికి వచ్చిన వారు టూవీలర్ ఉంటే బాగుండు అనుకునేవారు. నగరం వెలుపల, పట్టణాల వెలుపల పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వస్తే బస్సల్లో పడి పోలేక దాదాపు అంతా అనుకున్నది అదే. ఎవరు కార్లో వెళుతున్నా, వేగంగా టూ వీలర్ మీద వెళుతున్నా అదే మాట అనుకుంటూ కనీసం సెకండ్ హ్యాండ్‌ది తీసుకోవాలనుకునేవారు. అయినా ఆ రోజులు వేరు. పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఉండేవి కావు. ఇప్పుడు మనుషుల కంటే వాహానాల జోరు, శబ్దాల హోరు ఎక్కువయిపోయింది. దీంతో రోడ్లు బాగున్నా, లేకు న్నా ట్రాఫిక్ జామ్స్ మాత్రం విసిగిస్తున్నాయి. ఇపుడు కూడా ఇంత వాహనయోగం కలుగుతున్నా ఆఫీసులకు, పనులకు వెళ్లడం చాలా ఆలస్యమవుతోంది. ఇది మనం కల్పించుకున్న ఇబ్బంది గనుక గట్టిగా కామెంట్ చేయడానికీ కష్టమే.
మరీ ముఖ్యంగా బంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్స్ లేని సమయం ఉండదు. ప్రతీవారికీ వాహనాల మీద త్వరగా వీలయినంత వేగంగా వెళ్లాలన్న ఆతృత మనిషిని ఏ పనీ చేయనీయని స్థితికి తెచ్చేసింది. వేగంతో పాటు జాగ్రత్తలు పాటించడం మీద అంతగా దృష్టి లేకపోవడంతో ప్రమాదాలు అంతే స్థాయిలో జరుగుతున్నాయి. అసలు మాటి మాటికి బ్రేకులు వేసుకుంటూ కార్లు, హారన్లు కొడుతూ టూవీలర్లు, ఆటోలూ నానా గందరగోళం సృష్టిస్తున్నాయి. చాలా మంది తమ వాహనాల గేర్లు పాడవుతున్నాయనో, అసలు వాహనాలే కొంతకాలం పూర్తిగా మార్చవలసిన పరిస్థితి ఏర్పడుతోందనో గోడు పెడుతున్నారు.
ఇవన్నీ గమనిస్తున్న ఒక బంగళూరు ఉద్యోగి తన కారు గేర్లు అమ్మకానికి పెడుతున్నానని ప్రకటించాడు... సరదాగా! అప్పుడైనా గేర్ల గురించిన జాగ్రత్తలు తీసుకుంటారని. అతను తన కారు 3,4,5 అమ్మేస్తానని అవి షోరూమ్ కండిషన్స్‌లో నిరుపయోగంగా ఉన్నాయన్నాడు! కానీ బంగళూరు, ముంబై, హైదరాబాద్‌నుంచీ అతనికి ట్విటర్ సమాధానాలు వచ్చాయి. బాబూ.. నీ కంటే మా పరిస్థితే దారుణంగా ఉంది.. మేము ఏకంగా కారే అమ్మేద్దామనుకుంటున్నామని!
సో, కారులేదని, టూవీలర్ లేదని బాధపడవద్దు.. ఐ హేట్ నాట్ టియర్స్... ఓన్లీ ట్రాఫిక్ పుష్పా!