సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లే!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సెకండ్ ఛాన్స్ కోసం, స్కెచ్ సిద్దం చేసుకుంటున్నారు. అది కూడా అలాగా ఇలాక్కాదు.. 175 కు 175 అనే మైండ్ గేమ్’ తో దూసుకు పోతున్నారు. అయితే, రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారా? అంటే, లేదని చెప్పేందుకు పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని వైసీపీ నాయకులే గుసగుసలు పోతున్నారు.
ముఖ్యమంత్రి ఆలోచనలు ఇలాగే ఉంటే, ఇలాగే మైండ్ గేమ్ ఆడుతూ పోతే చివరకు బొక్క బోర్లా పడడం ఖాయమని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆశలన్నీ నవరత్నాల మీదనే ఉన్నాయి. అలాగే, సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్ప కుండా ప్రజల ఖాతాల్లో . పైసలు వేస్తున్నాము కాబట్టి, ప్రజలు చచ్చుకుంటూ మళ్ళీ తమకే ఓటేస్తారని, తమనే గెలిపిస్తారని, అనుకుంటున్నారు. ఆశ పడుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నగా ఉందని వైసీపీ నాయకులు వాపోతున్నారు.
ప్రజలు ఇచ్చిందేదో పుచ్చుకుంటున్నారు, కానీ, సంతృప్తి చెందిన దాఖలాలు అయితే లేవని అంటున్నారు. అది కూడా ఎవరో బయటి వారు కాదు, వైసీపీ జెండామోస్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలే, అంటున్నారు. ఇంకో ఛాన్స్ అంటే ప్రజలు నో .. ఛాన్స్ అంటున్నారని, వైసీపే నాయకులే వాపోతున్నారు. జగన్ రెడ్డి, మాట తప్పను, మడమ తిప్పను అంటే నిజమే అనుకుని, అయన వెంట నడిచిన జనాలే ఇప్పడు, జగన్ రెడ్డి మాట తప్పడం మడమ తిప్పడం మాత్రమే కాదు, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని, అదే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని అంటున్నారు. రాష్ట్రంలో చిన్నా పెద్ద పనులు వేటికి టెండర్లు పిలిచినా, కాంట్రాక్టర్లు ఎవరూ, ముందుకు రావడం లేదు. ఒకసారి కాదు, రెండు మూడు సార్లు, టెండర్ ప్రకటనలు ఇచ్చినా, పత్రికల ఆఫీసుల నుంచి అడ్వర్టైజ్మెంట్ బిల్లులు వస్తున్నాయే, తప్ప టెండర్లు వేసేందుకు, కాంట్రాక్టర్లు మాత్రం ముందుకు రావడం లేదు. ఇది దేనికి సంకేతం, ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకు విశ్వాసం లేదని చెప్పేందుకు నిదర్శనం కాదా అని వైసీపీ క్యాడర్,నాయకులను ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బకాయిలు, కొండలా పెరిగిపోతున్నాయి. అప్పులు, వడ్డీలు కట్టలేక, కాంట్రాక్టర్లు ఆందోళనలు చేయడమే కాదు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా జగనన్న పట్టించుకోవడం లేదని, చివరకు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. కాంట్రాక్టర్లు మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ కు ఏదో మేలు చేసేందుకు అన్నట్లు, నామినేషన్ పనులు కేటాయించినా, క్షేత్ర స్థాయి నాయకులు, క్యాడర్ సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు రాక అప్పులు, వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు అమ్ముకున్న పార్టీ నాయకులు నామినేషన్ పనులంటే వద్దు పొమ్మంటున్నారు. ఇది దేనికి సంకేతం. ముఖ్యమంత్రి మీద సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం సన్నగిల్లింది అనేందుకు నిదర్శనం కాదా, అని వైసేపీలోనే చర్చ జరుగుతోందంటే, జగన్ రెడ్డి విశ్వాస స్థాయి, ఎంతగా దిగజారిందో వేరే చెప్పనక్కర లేదని అంటున్నారు.
అలాగే, వైసీపీ సర్పంచ్‌లు కూడా, పదవులు వదిలి పెట్టి పారి పోతున్నారు. గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు రాకపోవడంతో అప్పులు పాలైన సర్పంచ్‌లు మీరిఇచ్చిన పదవి కోదండం, వైసీపీకి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రెండు దండాలు అని చెప్పి, పొరుగు రాష్ట్రాలకు పోయి, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే తాజాగా ప్రభుత్వ భూములు ప్లాట్స్ వేసి అమ్ముదామంటే కొనే నాధుడే కనిపించడం లేదు. అది కూడా ఎక్కడో కాదు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రీమ్ కాపిటల్, వైజాగ్ మహానగరంలోనే, ప్రభుత్వ ప్లాట్లు కొనేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. వైజాగ్ నగరంలో జగన్ రెడ్డి ప్రభుత్వం, జగనన్నస్మార్ట్ టౌన్ షిప్ లో సుమారు 2000 ప్లాట్లను వేలం ద్వారా అమ్మకానికి పెట్టింది. ఆయినా, స్పందన లేదు. చివరకు చేసేది లేక దరఖాస్తు గడువును రెండు సార్లు పొడిగించింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయినా ఫలితం లేదు.నో రెస్పాన్స్.. ముఖ్యమత్రి తన గ్రాఫ్ బ్రహ్మాండంగా వుందని .. మురిసి పొతున్నారు.
ఆయన గ్రాఫ్ ఎంత బ్రహ్మాండగా వుందో, అయన మీద ప్రజల విశ్వసం ఎ స్థాయిలో వుందో జగనన్నస్మార్ట్ టౌన్ షిప్’ ప్లాట్స్ కథే చేపుతోందని అంటున్నారు. రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు.చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. నిజానికి ప్రభుత్వం నేరుగా అమ్ముతోందంటే దానికో క్రేజ్ ఉంటుంది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రావు. క్లియర్ టైటిల్ ఉంటుంది. అదే సమయంలో ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పిస్తారని అనుకుంటారు. గత ప్రభుత్వం అమరావతిలో హ్యాపీనెస్ట్ అనే ప్రాజెక్ట్ చేపడితే గంటల్లో బిజినెస్ క్లోజ్ అయింది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కనీస స్పందన రావడం లేదు. నిజానికి, రేపో మాపో రాజధాని అయ్యే నగరంలో స్థలం అంటే, ప్రజలు క్యూ కట్టి ఎగరేసుకు పోతారు.. కానీ, వైజాగ్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నగా వుంది.. అంటే.. జగన్ రెడ్డి మీద విశ్వాసం లేకపోవడమే కారణమని అంటున్నారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు, వైజాగ్ ఎప్పటికీ రాజధాని కాదు అందుకే జనం జగన్ ను నమ్మడం లేదని, వైసీపీ నాయకులే అంటున్నారు. ఇలా ఒకరని కాదు, అన్ని వర్గాల ప్రజలు, చివరకు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందుతున్న సామాన్య జనం కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరో ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దంగా లేరని అంటున్నారు. మీటలు నొక్కి నోట్లు వేశాం.. ఓట్లేందుకు వేయరు అంటూ జగన్ రెడ్డి తమను కట్ట బానిసల కంటే హీనంగా చూపుతున్నారని, పేదరికాన్ని పరిహాసం చేస్తున్నారని. అందుకే జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేదే లేదని అంటున్నారని, వైసేపీ క్యాడర్ అంటున్నారు. అందుకే, జగన్ రెడ్డికి సెకండ్ ఛాన్స్ .. అంటే ఇచ్చేదే లే.. అనే సమాధానమే ఏపీ అంతటా వినిపిస్తోంది.