విశాఖ వైసీపీ నేతల ఘర్షణ
posted on Jul 24, 2022 @ 10:34AM
పరిస్థితులు పార్టీకి అననుకూల మైనపుడు నాయకునికి మద్దతు నివ్వాలి. కానీ ప్రాంతీయ నాయకుల మధ్య విభేదాలు మరీ రోడ్డుకెక్కితే పోయేది పార్టీ పరువే. ఇదే స్పష్టం చేసింది విశాఖపట్నం వైసీపీ నాయకుల వైరి. ఇక్కడి హిందూస్థాన్ షిప్‌యార్డులో ప్రమాదవశాత్తూ మృతిచెందిన కార్మికుడి నివాసానికి పరామర్శించడానికి వెళ్లి అక్కడ గొడవపడ్డారు. అలాంటి చోట కూడా వారి మధ్యవైరాన్ని ప్రదర్శించుకునే స్థాయిలో విభేదాలు తలెత్తాయన్నది స్పష్టమైంది.
అంతా బాగానే ఉంది అనుకున్నచోట కూడా వివాదాలు తలెత్తాయి. విశాఖ ఎం.పీ సత్యనారాయణ దగ్గరే వైసీపీ నేతలు దాడి చేసుకోవడం విడ్డూరం. ఎం.పి తో పాటు స్థానిక కార్పొరేటర్ లావణ్య, 61 వ వార్డు కార్పొరేటర్ పీ.వీ.సురేష్ , వైసిపి నేతలు పొట్టి మూర్తి, మిగిలిన నాయకులు వెళ్లారు. ఎంపీ తో పాటు వెళ్తున్న క్రమంలోనే అక్కడ తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
స్థానిక కార్పొరేటర్ లావణ్య వర్గం ఆగ్రహించి ఇక్కడ మీ పెత్తనమేంట౦టూ కార్పొరేట్ పీవీ సురేష్, వైసిపి నేత పొట్టి మూర్తిలతో వాదనకు దిగారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలుగజేసుకొని బాహాబాహీకి దిగిన ఇరువర్గాలను సముదాయించారు. అయితే ఈ వివాదంపై వైసిపి నేత పొట్టి మూర్తి కార్పొరేటర్ పి.వి. సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పి.వి.సురేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.