పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జీఎస్టీయార్పణమేనా?
posted on Jul 24, 2022 @ 12:44PM
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. అయితే ఆరంభమైన నాలుగు రోజులలో ఒక్కటంటే ఒక్క గంట సభ సజావుగా సాగిన దాఖలాలు లేవు. అధికార, విపక్షాల మధ్య వాగ్విదవాదాల కారణంగా సభ స్తంభించిపోయింది ఒక్క ముక్కలో తేల్చేయడం సరికాదు. సభ సజావుగా సాగకపోవడానికి కారణం జీఎస్టీ. అవును. జీఎస్టీ అంటూ చేస్తున్న వడ్డింపులకు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ధరలూ పెంచేసినా, పెంచేస్తున్నా సహించి జనం సహనంగా ఉంటున్నారు.
అయితే పసి వారికి ఆహారం అయిన పాలపై కూడా సేవా పన్ను విధించడంపై జనాగ్రహమే పార్లమెంటు సభ్యుల నిరసనల వెనుక ఉన్నదనడంలో సందేహం లేదు. పాలపై సేవా పన్ను వ్యతిరేకత కేవలం విపక్షాలకే పరిమితమైన అంశంగా పరిగణించడానికి ఇసుమంతైనా అవకాశం లేదు. ఎందుకంటే పాలపై సేవా పన్నును నిరసిస్తున్నది పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య జనం. వడ్డింపులే పాలనా అన్నట్లుగా మోడీ2.0 హయాం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జీఎస్టీ మండలి సమావేశంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయాన్ని యావద్దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది. పాలు, పెరుగుజ జున్ను వంటి వస్తువులపై పన్ను విధించడంలోని ఔచిత్యాన్ని అన్ని రంగాల వారూ ప్రశ్నిస్తున్నారు. పాల కొరత లేదు. దేశంలో శ్వేత విప్లవం విజయవంతం అయ్యింది. ఎంతటి కరవు పరిస్థితుల్లోనైనా కొరవ లేకుండా పాలు, మజ్జిగ వంటివి పుష్కలంగా లభించే పరిస్థితి ఉంది. పాల కల్తీపై దృష్టి పెట్టాల్సింది పోయి పాలపైనే జీఎస్టీ విధిస్తూ పేదలకు, పసి కందులకు వాటిని దూరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఎలా చూసినా ప్రజా వ్యతిరేకత విధానమే. పాల వ్యాపారంలోని బడా బడా సంస్థలు వచ్చి చేరాయి కనుక పాలపై పన్ను విధించి ఆదాయం దండుకోవాలన్న దుష్ట చింతన వినా పాల ఉత్పత్తులపై సేవా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మరో ఉద్దేశం ఉన్నట్లు కనిపించదు.
అసలు జీఎస్టీ విధానం మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది. సామాన్యులు వినియోగించే వస్తువులపై జీఎస్టీ తక్కువ ఉండాలన్న జనం డిమాండ్ ను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై జనాభిప్రాయాన్నే కాదు, విపక్షాల ఆందోళనలనూ కేంద్రం పట్టించుకోవడం లేదు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కోసమే జీఎస్టీ అంటూ చెబుతున్న కేంద్రం.. సంపన్నులు, పేదలను ఒకే గాటన కట్టి పన్నుల విధానాన్ని అవలంబిస్తున్నది. జీఎస్టీ వచ్చిన తరువాత ప్రతి నెలా జీఎస్టీ ఆదాయాన్ని వెల్లడిస్తున్న కేంద్రం.. పన్ను రాబడి పెరిగిందనీ, అదంతా తమ ఘనతేననీ భుజాలు చరిచేసుకుంటోంది. కానీ సామాన్యుల నడ్డి విరిగిన విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది.
నెలకు లక్షా నలభైవేల కోట్ల రూపాయిలు పైనే వసూళ్ళు జరుగుతున్నాయని సంబరపడిపోతున్న సర్కార్ సంపన్నులు, ఉన్నత ఆదాయ వర్గాలపై పన్ను విధించాలని, సామాన్యులకు మినహాయింపు ఇవ్వాలన్న ప్రాథిమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించేసింది. ఇప్పటికే వంటగ్యాస్ సిలిండర్ ధరను ఈ ఏడాదిలో పదిపదిహేను సార్లు పెంచింది. గతంలో పన్ను లేని ఎల్‌ఈడీ లైట్లపై ఇప్పుడు 18 శాతం జీఎస్టీ విధించారు. మరో వైపు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించా లని ఒక వంక ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.అంతెందుకు చదువునే పిల్లలు వాడుకునే పెన్సిల్, షార్పనర్, ఎరైజర్ వంటి వాటిపై కూడా 18 శాతం జీఎస్టీ విధించడమంటే.. జనం చావు జనం ఛస్తారు.. ప్రభుత్వం పని మాత్రం రాబడి పెంచుకోవడమే అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.