కాశ్మీరీలకు మిలిటెంట్లతోపాటు పులుల కష్టాలు
posted on Jul 24, 2022 @ 12:20PM
మీ పిల్లాడు మా వీధిలో ఆడుతూ కిటికీ పగలగొట్టాడు..ఓ తండ్రి గోడు. ఏమమ్మో.. మీ పిల్లాడు పాకుతూ వచ్చి గుమ్మాన్ని తడిపాడు..చూస్తున్నవా.. ఓ తల్లి గొడవ.. మీ కుక్కపిల్ల మా చెట్ల కుండీ నెట్టేసింది.. ఓ అమ్మాయి ఫిర్యాదు.. ఇలాంటివి మనం నిత్యం వింటూంటాం.. చూస్తుంటాం. ఇలాంటివి సిటీ వాతావరణంలో, అందునా అపార్ట్‌మెంట్స్‌లో మామూలే. ఈజీగానే తీసుకోవా లని, చిన్నవాట్లకు ఆగ్రహించకూడదంటారు పెద్దవాళ్లు. కానీ, కాశ్మీరులో జంతువులకు ఎవరు ఏం చెబుతారు?
కాశ్మీర్ అనగానే కాల్పులు, బాంబు దాడులు ఇవే మనకు బాగా తెలిసినవి. ఈమధ్య కాలంలో మరో విపత్తు ఎదుర్కొంటున్నా రు కాశ్మీరు వాసులు. మిలిటెంట్లతో కాదు ఇక వారు పులులతోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది.
నిత్యం భయాందోళనతో బికు బికు మంటూ బతకాల్సి వస్తోంది. బారాములా జిల్లా బాతంగి బోనియార్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల రుత్బా ని పులి చంపే సింది. ఆమె రోజూ వెళ్లినట్టే తన తల్లితోపాటు పశువులను కాయడానికి వెళ్లింది. పశువులను తోలుతూ అటూ ఇటూ తిరుగుతూ కాస్తంత అటవీ ప్రాంతం లోపలికి వెళ్లింది రుత్బా అంతే అక్కడే పొంచి ఉన్న పులి అమాంతం ఆమె మీదకి దూకి చంపేసింది. ఈ వార్త ఆ జిల్లా ప్రాంమంతా విస్తరించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇది నిజానికి మొదటి సంఘటన కాదు. చాలా రోజు లుగా ఇలాంటి పులి, నక్క దాడులు జరుగుతూనే ఉన్నాయి. జనం చాలా జాగ్రత్తగానే మసులుతున్నారు. అసలే మిలిటెంట్ల దాడులతో భయం నీడలో ఉన్న ప్రజలంతా ఇపుడు ఈ జంతువుల దాడికి బలి కావాల్సి వస్తోంది.
ఉదయాన్నే చక్కగా సిద్ధమై తనతో పాటు వచ్చిన పిల్ల అలా నవ్వుతూ తుళ్లూతోన్న పిల్ల అమాంతం దాడికి బలై శవంగా మారుతుందని ఏ తల్లయినా ఊహిస్తుందా? హలీమా తన కూతురిని ఆ పరిస్థితుల్లో చూసి దుఖంతో కుంగిపోయింది. నా బంగారు తల్లిని మింగేసింది ముదనష్టపు పులి అంటూ శాపనార్ధాలు పెడుతోంది. వాస్తవానికి అసలా ప్రాంతంలో ఒంటరిగా ఎవ్వరూ తిరగవద్దని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. కానీ మరీ అంత భయపడాల్సిందేమీ లేదన్న చిన్న ధైర్యంతో పశువుల కాస్తూ తిరుగుతూనే ఉన్నారు. చిన్న శబ్దమయినా జాగ్రత్త పడుతూంటారు. అలాంటిది హఠాత్తుగా ఇలా దాడి జరిగిపోయింది.
కాశ్మీరు లోయప్రాంతంలో ఇటీవల ఇలా పులులు దాడి జరుగుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ సంఘటనల గురించి అటవీ అధికారు లకు తెలిసి జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే మిలిటెంట్ల దాడితో స్వేచ్ఛగా రక్షణ చర్యలు తీసుకోలేని పరిస్థితులు వారిని ఇలాంటి ప్రమాదాల నుంచి ప్రజల్ని కాపాడలేకపోతున్నారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అస్లమ్ షేక్ అనే సామాజిక కార్యకర్త తెలిపారు. గ్రామాల్లోని పేదలు తమకు తాము రక్షణ కల్పించుకునే స్థితి లేకపోవడంతో రోజూ భయంతోనే బతుకుతున్నారన్నారు.
రోజూ పనికి వెళ్లకుంటే పూట గడవదు, అలాగని పనికి వెళితే ఇలాంటి దాడులు జరుగుతు న్నాయన్నారు. మనిషి, జంతువుల మధ్య ఈ ఘర్షణ 2011 నుంచి కనీసం రెండువందల కుటుంబాలు దెబ్బతిన్నాయి, రెండు వేలమంది తీవ్రంగా గాయపడ్డారని అటవీశాఖ అధికారుల లెక్క. గత ఏడాది నుంచి 1,658 సంఘటనలు జరిగాయి. ఈ ఏడాది ఇప్పటికే 17 మంది చనిపోగా 141 మంది గాయపడ్డారు. చాలా సంఘటనల్లో ప్రజలు ఎదురుదాడి చేసి తప్పించుకోగలిగారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొవలసి వస్తున్న కాశ్మీరు లోయప్రాంత ప్రజలకు ప్రభుత్వాలు మరింత రక్షణ కల్పించాలని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.