పులివెందులలో ప్రజలకు కనిపించకుండా పరదాలు.. కోనసీమలో వరద కష్టాలను కప్పేయడానికి తెరలు!

ఏ నాయకుడైనా ప్రజలకు ఎప్పుడు ముఖం చాటేస్తాడు. ప్రజలలో తన పట్ల వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలిసినప్పుడు. అని వార్యంగా ప్రజల ముందుకు రావలసినప్పుడు అధికారంలో ఉన్న నాయకుడైతే తనను వ్యతిరేకించే వర్గాన్ని నిర్బంధించి.. తన అనుకూల వర్గాలను చుట్టూ పెట్టుకుని జేజేలు కొట్టించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రెండు విధానాలనూ ఇప్పటికే ఉపయోగించేశారు. నెలల తరబడి ప్యాలెస్ దాటి జనంలోకి రాకుండా ఉండటమూ అయిపోయింది. పులివెందుల పర్యటనలో జనం ఆయనకు సమీపంలోకి రాకుండా బ్యారికేడ్లు పెట్టడమూ అయిపోయింది. ఇప్పుడాయన విపక్షాల విమర్శల కారణంగా అనివార్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు వెళుతున్నారు. మంగళవారం (జులై 26)న ఆయన కోనసీమ జిల్లాలోని కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించనున్నారు. పర్యటన షెడ్యూల్ పక్కాగా ఖరారైపోయింది. ఆయన పర్యటించే ప్రాంతాలలో ఏర్పాట్లూ చేసేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లేమిటంటారా? ఉంటాయి. రాజుగారు ప్రజల అవస్థలను చూడలేరు. అందుకు అవేమీ ఆయనకు కనిపించకుండా తెరలు కట్టేయడమే ఏర్పాట్లన్న మాట. తెరల మాటున వరద నష్టాన్ని, బాధితుల ఇబ్బందుల్నీ కప్పేసిన తరువాత తీరికగా జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారన్న మాట. అంతా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది అని ప్రకటనో, ప్రసంగమో, లేదా మీడియా సమావేశంలోనో చెప్పేసి తన భుజాలను తానే చరిచేసుకుని పర్యటన ముగిస్తారన్న మాట. నాయకుడు బాధితులతో మమేకం అవ్వాలి. కష్టాల్లో ఆదుకుంటానన్న భరోసా ఇవ్వాలి. వరద ముంపులో ఉన్న సమయంలోనే వారి దగ్గరకు వెళ్లాలి. ముంపు బాధలను ప్రత్యక్షంగా చూడాలి. అందుకు భిన్నంగా వదర నీటిలో జనం నిండా మునిగి ఉన్న సమయంలో ఏరియల్ వ్యూ అంటూ గాలిలో తిరిగి వెళ్లిపోయిన జగన్.. అసందర్బంగా వివిధ శాఖల సమీక్షలు నిర్వహించారే తప్ప వరద బాధితుల కష్టాల గురించి మాట్లాడింది లేదు. ఇప్పుడు విపక్ష నేత వరద ప్రభావిత ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించి వరదలోనే ముంపు బాధితులకు కలిసి వారికి భరోసా ఇచ్చి వచ్చిన తరువాత అనివార్యంగా జగన్ పర్యటనకు బయలు దేరుతున్నారు.   అది కూడా వరద తీసేసిన తరువాత. అది కూడా వదర ఛాయలు కూడా జగన్ కు కనిపించకుండా అధికారలు తెరలతో కప్పేసిన తరువాత. భారీ నష్టం జరగలేదని చెప్పడానికి ఏం చేయాలో అన్నీ అధికారులు చేసేసిన తరువాత.   వరద బాధితులు తమను ప్రభుత్వం పట్టించుకోలేదని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే..  వరద బాధితులను తాము బ్రహ్మాండంగా ఆదుకున్నాం.. వారికి కష్టమనేది తెలియకుండా అన్ని చర్యలూ తీసుకున్నామంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలలో విపక్ష నేత పర్యటనపై విమర్శలు గుప్పించింది. అసలాయన ఎందుకు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారంటూ నిలదీసింది. ఆయన పర్యటన వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందంటూ దుయ్యబట్టింది. వాస్తవంలో వరద బాధితులను గోదారికి వదిలేసిందన్న బాధితుల ఆగ్రహాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడేమో జగన్ కోనసీమలో పర్యటించి తెరల వెనుక ఉన్న కష్టాన్ని, నష్టాన్ని చూడకుండా తమ ప్రభుత్వం బ్రహ్మాండంగా పని చేసిందనీ, వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందనీ చెప్పడానికి ఒక రోజు పర్యటనకు రాజు వెడలె రవితేజములలరగ అన్నట్లు పర్యటించేస్తారన్నమాట.

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల జీతాలకు బడ్జెట్ నిల్!

అరి చేతిలో వైకుంఠం చూపించేసి చివరకు అరిటాకులో చద్దన్నం పెట్టారన్నది ఓ నానుడు. జగన్ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. అధికారంలోకి రావడానికి నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చేసి.. ఇప్పుడు వాటి అమలు  చేయలేక కోతలు, వడ్డింపులు, బాదుడు అంటూ జనం నెత్తిన బండ పడేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఒక త్రిశంకు స్వర్గం అని తేలిపోయింది. ఆయా సచివాలయాల ఉద్యోగులకు వేతనాలకు బడ్జెట్ లేదని స్వయంగా ప్రభుత్వమే చెప్పకుండానే చెప్పేసింది.  అంటే ఏన్నో వడపోతల తరువాత, ఆందోళనల తరువాత ప్రబేషన్ పొందినా వారికి పెరిగిన వేతనాలు వచ్చే పరిస్థితి లేదని తేలిపోయింది. ప్రొబేషన్ కోసమే రోడ్డెక్కిన సచివాలయాల ఉద్యోగులు పూర్తిగా విజయం సాధించలేదు. దాదాపు 60 వేల మందికి ప్రభుత్వం ప్రొబేషన్ ఇవ్వలేదు. పోనీ ఇచ్చిన వారికైనా పెరిగిన వేతనాలు ఇస్తుందా అంటే అదీ లేదని ఇప్పుడు చెబుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పగా చెప్పుకునే జగన్.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యగోలు విషయంలో ప్రతి సారీ మాట తప్పుతున్నారు.. మడమ తిప్పుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు దాదాపు రెండున్నరేళ్లకు పైగా కేవలం 15 వేల రూపాయల వేతనానికి ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రొబేషన్ విషయంలోనూ వారు నానా ఇబ్బందులూ పడ్డారు. పరీక్ష రాసి అందులో అర్హత సంపాదించి ఉద్యోగం సాధించుకున్న వారిని ప్రొబేషన్ కోసం మళ్లీ పరీక్ష అన్నారు.  తొలుత ఉద్యోగాలు ఇచ్చే సమయంలో మాత్రం ప్రొబేషన్ కు మళ్లీ ఎటువంటి పరీక్షలూ అవసరం లేదనీ, ఆటో మేటిగ్గా వచ్చేస్తుందని ప్రకటించిన జగన్.. రెండున్నరేళ్ల తరువాత పరీక్ష రాసి అర్హత సాధించుకోవాలన్నారు. అలా కొత్త నిబంధనతో దాదాపు 60 వేల మందిని ప్రొబేషన్ కు అనర్హులుగా ప్రకటించారు. పోనీ అర్హులంటూ ప్రొబేషన్ ఇచ్చిన వారికైనా ప్రభుత్వం ప్రకటించిన విధంగా పెరిగిన వేతనాలు ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఎందుకంటే అందుకు బడ్జెట్ లేదట. ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించడానికి నిబంధనలు అంగీకరించవట. ఈ నెల నుంచి కొత్త వేతనాలు అందుకుంటామని ఎదురు చూస్తున్న సచివాలయాల ఉద్యోగులకు ట్రెజరీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ఇది. ఆ కారణంగా ఈ నెల కూడా గతంలోలా 15 వేల రూపాయల వేతనం మాత్రమే వస్తుందని ట్రెజరీ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు సమాచారం అందించాయి.ముందు మందు నిబంధనలన్నీ పూర్తి చేసి అరియర్స్ తో సహా వేతనాలిస్తామని ప్రభుత్వ వర్గాలు సచివాలయాల ఉద్యోగులకు చెబుతున్నాయి. 

మువ్వన్నెల రాజకీయం ..! మోడీతో కేసీఆర్ ‘ఢీ’

అనుకుంటాం కానీ, అసలు అసలే. అరువు అరువే. కడుపులో లేంది కౌగిలించుకున్నా రాదు.  అది దేశ భక్తి అయినా, దైవ భక్తి అయినా, మరో భక్తి భావన ఏదైనా స్వతహాగా లోపలి నుంచి రావాలి, కానీ, పెదవుల పై పూసుకుని పలికే  లిప్ స్టిక్ పలుకులు  పెద్దగా ప్రయోజనం ఉండదు. ప్రభావం చూపావు. ఒరిజినల్, డూప్లికేట్ల  మధ్య  పొంతన పోలిక కుదరదు. అసలు అసలే,, నకిలీ నకిలీనే.. అసలు నకిలీ కాదు, నకిలీ అసలు కాలేదు.  అప్పుడెప్పుడో, కొంత కాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెరాస ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత, మీరు ‘జై శ్రీరామ్’ అంటే  మేము ‘జై హనుమాన్’ అంటాం అంటూ బీజేపేతో భక్తి పోటీకి దిగారు. అన్నట్టుగానే కొంతా కాలం పాటు, అక్కడక్కడ హనుమాన చాలీసా పారాయణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫోటోలు, వీడియోలు పోస్టు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత, ఎందుకనో, ఆమె సైలెంటై పోయారు.  అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్  కూడా నాకంటే గొప్ప హిందువు ఎవరున్నారు, నేను చేసినన్ని పూజలు, యాగాలు ఎవరు చేశారు? అంటూ అప్పుడప్పుడు, ‘నేనూ హిందువునే ... అని గుర్తు చేస్తూ ఉంటారు. అయితే,,ఆయన కడుపులోంచి వచ్చిన  హిందుగాడు బొందు గాడు డైలాగు పాపులర్ అయినంతగా, ఆయన  చెప్పిన నేనూ హిందువునే ...డైలాగు పాపులర్ కాలేదు.  అదలా  ఉంటే, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీతో  దేశభక్తిలో పోటీకి దిగుతున్నారు. దేశానికి స్వాతంత్ర్య సిద్ధించి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సంవత్సర కాలంగా, అజాదీ కా అమృత్ మహోత్సవ్  పేరిట వేడుకలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ సంవత్సరం పంద్రాగస్టు పండగకు రెండు రోజుల ముందు నుంచి ఆగష్టు 13 నుంచి 15 వరకు, ప్రతీ ఇంటి పైన మువ్వన్నెల జెండాను ఎగరేయాలని ప్రధాని నరేంద్ర  మోడీ పిలుపు నిచ్చారు. ప్రధాని పిలుపు నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా  పేరిట  దేశ వ్యాప్తంగా జెండా పండగ  నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.  మామూలుగా అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోరు. ముఖ్యమంత్రి అయిన ఎనిమిదేళ్ళలో ఆయన ఏనాడు జాతిపిత మహత్మా గాంధీ జయంతి, వర్ధంతి వేడుకల్లో పాల్గొన లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకల్లోనూ పాల్గొన లేదు. ఈ సంవత్సరం రాజభవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లోను ముఖ్యమంత్రి  పాల్గొన లేదు, మీ జెండా మీది మా ‘అజెండా’ మాది అన్నట్లుగా సెపరేట్ గా జెండా ఎగరేశారు. ఇక సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. మిత్ర పక్షం ఎంఐఎంను, ముస్లిం మనోభావాలను దెబ్బతీయడం ఇష్టం లేకనో ఏమో  ముఖ్యమంత్రి కేసీఆర్, సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని ఎప్పుడో  మరిచి పోయారు.  అయితే, దేశభక్తి ఓటు మొత్తాన్ని మోడీ మూట కట్టుకుపోతారనే భయం వలన చేతనో ఏమో కానీ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని హైజాక్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేశారని అంటున్నారు.  హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, బీజేపీ సర్కార్ నిర్వహిస్తోందన్నట్లుగా కాకుండా.. రాష్ట్ర ప్రభుతమే నిర్వహిస్తున్నామన్నట్లుగా నిర్వహించాలని,  ప్రతి ఇంటిపైన ఎగరేసేందుకు జాతీయ జెండాలను రాష్ట ప్రభుత్వమే పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే,   మేమూ హిందువులమే .. అన్నట్లుగా,  మాకూ దేశ భక్తి ఉందని నిరూపించుకునేందుకు స్వాతంత్ర్య దినోత్సవం అయ్యే వరకూ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతృతవంలోనే ర్యాలీలు.. సభలు.. సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అందరికీ జెండాలు పంచడం ద్వారా బీజేపీ వ్యూహాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి  వ్యూహ రచన చేశారని అంటున్నారు.  అయితే, అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్న హ‌ర్‌ ఘ‌ర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. అందులో భాగంగా, జెండా కర్రతో సహ త్రివర్ణ పతాకాన్ని, ఇంటింటికి అందించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంది. అంటే, ఈ కార్యక్రమాల గురించి ప్రజలకు  అవగాహన కల్పించేందుకు, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పత్రికా ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగ్స్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తోంది. సినిమా థియేటర్లలో లఘు చిత్రాలు ప్రదర్శించేలా చర్యలు  తీసుకుంది. విద్యార్థిని విద్యార్థులు, యువతి యువకులు, క్రీడా కారులతో ర్యాలీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో  దేశ భక్తీ పోటీలో  తమదే పై చేయి అనిపించుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస ప్రభుత్వం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. అయితే.... అధికారులు కొందరు ఇదంతా చూస్తుంటే  పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు .. అన్న సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు తోడి కోడ‌ళ్ల పోరు!

పెర‌ట్లో చెవి క‌మ్మ దొరికితే నాదంటే నాద‌ని కోడ‌ళ్లు తిట్టుకున్నారు. అత్త‌గారు వెళ్లి ఇదెవ‌రిదో వాళ్లు ఇవాళ క‌మ్మ‌టి వంట చేస్తే నేనే తేలుస్తాన‌న్న‌ది. అంతే అత్త‌గారు ప‌క్కింటి క‌ల‌గూర‌గంప క‌బుర్ల‌కు వెళ్లింది, కోడ‌ళ్లు త‌మ బంగారాన్ని కాపాడుకోవ‌డానికి వ‌చ్చీ రాని వంట‌ చేయ‌డంలో త‌ల‌ మున‌క‌ల‌య్యారు. ఆన‌క తిండి ఎలా గున్నా అవ‌స్థ‌ మాత్రం పెద్ద కోడ‌లిదే. అదుగో అలా ఉంది ఉద్ధ‌వ్, షిండేల సంగ‌తి. అస‌లు శివ‌సేన అంటేనే మొన్న‌టి దాకా  ఉద్ద‌వ్ థాక్రే నాయ‌క‌త్వంలోనిదే. ఇపుడు షిండే  రాజ‌కీయ హ‌డావుడితో ఆయ‌న దుకాణం కూడా శివ‌సేన‌గా మారింది. దీంతో పార్టీ గుర్తు త‌మ‌కే ఉండాల‌న్న పోరు తోడికోడ‌ళ్ల ర‌గ‌డ‌లానే మారింది. మ‌హా రాష్ట్ర‌కే కాదు యావ‌త్ భార‌తా వ‌నికి వీరి గోడు మంచి కాల‌క్షేపంగా మారింది. ఎన్నిక‌ల క‌మిష‌న్ ముందు ఇరు వర్గాలూ పార్టీ, సింబ‌ల్ త‌మ‌కు ఎందుకు ఇవ్వాల‌న్న‌ది వివ‌రిస్తూ సంబంధిత ప‌త్రాలు అధికారుల ముందు పెట్టారు. ఇక వారే తేల్చ‌వ‌లె.  షిండే 40 మంది ఎమ్మెల్యేల‌తో ఉద్ధ‌వ్ థాక్రేను ఎదిరించి వేరు కుంప‌టి పెట్ట‌డం అధికారంలోకి వ‌చ్చేయ‌డం జ‌రిగి నెల రోజులు అయింది. మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇంత‌టి సంక్షోభం శివ‌సేన ఎప్పుడూ ఎదుర్కొన‌లేదు. జూన్ 30న రాష్ట్రంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌యింది. బిజెపి మ‌ద్దతుతో షిండే ముఖ్య‌మంత్రిగా , ఫ‌డ్న‌వీస్ ఉప ముఖ్య‌మంత్రిగా సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన సంగతి అంద‌రికీ తెలిసిందే. అధికారం చేజిక్కించుకోవ‌డం  అయిపోయింది. కానీ పార్టీ గుర్తు విష‌యంలో గోల ఆరంభ‌మయింది. అస‌లు శివ‌సేన పార్టీ అంటేనే థాక్రే వారిది క‌నుక పార్టీ,  సింబ‌ల్ రెండూ  మాకే చెందుతాయ‌ని ఉద్ధ‌వ్ థాక్రే గొంతు చించు కుంటున్నారు.  కానీ మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 44 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌స‌భ ఎంపీలు త‌న వేపు వ‌చ్చేరు గ‌నుక శివ‌సేన మాదే అవుతుంద‌ని షిండే గొడ‌వ పెట్టుకున్నారు. అధికారం పోయి, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, ఎమ్మెల్యేల‌ను కోల్పోయిన  థాక్రేకు శివ‌సేన అస‌లు పార్టీ సింబ‌ల్ ఇవ్వ‌డం న్యాయం కాద‌ని షిండే వాద‌న‌. అందు వ‌ల్ల ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై ఇద్ద‌రూ ఒత్తిడి తెస్తున్నారు. అయితే  ఇంత‌కు ముందు థాక్రే వ‌ర్గాన్ని ర‌ద్దు చేయాల‌ని, పార్టీ సింబ‌ల్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని  మ‌హా అసెంబ్లీ స్పీక‌ర్ రాహుల్ న‌ర్వేక‌ర్‌ను షిండే కోరారు. కానీ ఆ విష‌యంలో నిర్ణ‌యం అప్పుడే తీసుకోవ‌ద్దంటూ ఇటీవ‌ల  స్పీక‌ర్‌కు  సుప్రీం కోర్టు చెప్పింది.  ఇదిలా ఉండ‌గా, ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌తో పాటు అనేక ప్రాంతీయ సంస్థ‌ల ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ కార‌ణంగా పార్టీ సింబ‌ల్ విష‌యంలో ఇరు వ‌ర్గాలు త్వ‌ర‌ప‌డుతున్నాయి. ఇసి కి పార్టీ పేరు,  గుర్తు విష‌యంలో త‌మ వాద‌న‌లు వినాల‌ని కోరుతూ ఇరువ‌ర్గాలు ఇప్ప‌టికే అభ్య‌ర్ధ‌న‌లు అంద‌జేశారు.    

పుష్పా.. ఐ  హేట్ ట్రాఫిక్‌!

పుష్పా.. ఐ హేట్ టియ‌ర్స్‌.. అంటాడు బ‌చ్చ‌న్ ఓ సినిమాలో. ఈరోజుల్లో పెద్ద పెద్ద న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఈ డైలాగ్‌ని మార్చి టియ‌ర్స్ స్థానంలో ట్రాఫిక్ అని అనుకుంటున్నారు. నాలుగు ద‌శాబ్దాల క్రితం న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ఉద్యోగానికి వ‌చ్చిన వారు టూవీల‌ర్ ఉంటే బాగుండు అనుకునేవారు. న‌గ‌రం వెలుప‌ల‌, ప‌ట్ట‌ణాల వెలుప‌ల పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు వ‌స్తే బ‌స్స‌ల్లో ప‌డి పోలేక దాదాపు అంతా అనుకున్న‌ది అదే. ఎవ‌రు కార్లో వెళుతున్నా, వేగంగా టూ వీల‌ర్ మీద వెళుతున్నా అదే మాట అనుకుంటూ క‌నీసం సెకండ్ హ్యాండ్‌ది  తీసుకోవాల‌నుకునేవారు. అయినా ఆ రోజులు వేరు. పెద్ద‌గా ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఉండేవి కావు. ఇప్పుడు మ‌నుషుల కంటే వాహానాల జోరు, శ‌బ్దాల హోరు ఎక్కువ‌యిపోయింది. దీంతో రోడ్లు బాగున్నా, లేకు న్నా ట్రాఫిక్ జామ్స్ మాత్రం విసిగిస్తున్నాయి. ఇపుడు కూడా ఇంత వాహ‌న‌యోగం క‌లుగుతున్నా ఆఫీసుల‌కు, ప‌నుల‌కు వెళ్ల‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతోంది. ఇది మ‌నం క‌ల్పించుకున్న ఇబ్బంది గ‌నుక  గ‌ట్టిగా కామెంట్ చేయ‌డానికీ క‌ష్ట‌మే.   మ‌రీ ముఖ్యంగా బంగ‌ళూరు, హైద‌రాబాద్‌, చెన్నై లాంటి న‌గ‌రాల్లో ట్రాఫిక్ జామ్స్ లేని స‌మ‌యం ఉండ‌దు. ప్ర‌తీవారికీ వాహ‌నాల మీద త్వ‌ర‌గా వీల‌యినంత వేగంగా వెళ్లాల‌న్న ఆతృత మ‌నిషిని ఏ ప‌నీ చేయ‌నీయ‌ని స్థితికి తెచ్చేసింది. వేగంతో పాటు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మీద అంత‌గా దృష్టి లేక‌పోవ‌డంతో ప్ర‌మాదాలు అంతే స్థాయిలో జ‌రుగుతున్నాయి. అస‌లు మాటి మాటికి బ్రేకులు వేసుకుంటూ కార్లు, హార‌న్లు కొడుతూ టూవీల‌ర్లు, ఆటోలూ నానా గంద‌ర‌గోళం సృష్టిస్తున్నాయి. చాలా మంది త‌మ వాహ‌నాల గేర్లు పాడ‌వుతున్నాయ‌నో, అస‌లు వాహ‌నాలే కొంత‌కాలం పూర్తిగా మార్చవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌నో గోడు పెడుతున్నారు.  ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న ఒక బంగ‌ళూరు ఉద్యోగి త‌న కారు గేర్లు అమ్మ‌కానికి పెడుతున్నాన‌ని ప్ర‌క‌టించాడు... స‌ర‌దాగా! అప్పుడైనా గేర్ల గురించిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని. అత‌ను త‌న  కారు 3,4,5 అమ్మేస్తాన‌ని అవి షోరూమ్ కండిష‌న్స్‌లో నిరుప‌యోగంగా ఉన్నాయ‌న్నాడు! కానీ బంగ‌ళూరు, ముంబై, హైద‌రాబాద్‌నుంచీ అత‌నికి ట్విట‌ర్ స‌మాధానాలు వ‌చ్చాయి. బాబూ.. నీ కంటే మా ప‌రిస్థితే దారుణంగా ఉంది.. మేము ఏకంగా కారే అమ్మేద్దామ‌నుకుంటున్నామ‌ని! సో, కారులేద‌ని, టూవీల‌ర్ లేద‌ని బాధ‌ప‌డ‌వ‌ద్దు..  ఐ హేట్  నాట్ టియ‌ర్స్‌... ఓన్లీ ట్రాఫిక్  పుష్పా!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జీఎస్టీయార్పణమేనా?

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. అయితే  ఆరంభమైన నాలుగు రోజులలో ఒక్కటంటే ఒక్క గంట సభ సజావుగా సాగిన దాఖలాలు లేవు. అధికార, విపక్షాల మధ్య వాగ్విదవాదాల కారణంగా సభ స్తంభించిపోయింది ఒక్క ముక్కలో తేల్చేయడం సరికాదు. సభ సజావుగా సాగకపోవడానికి కారణం జీఎస్టీ. అవును. జీఎస్టీ అంటూ చేస్తున్న వడ్డింపులకు నిరసనగా విపక్ష ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్ని ధరలూ పెంచేసినా, పెంచేస్తున్నా సహించి జనం సహనంగా ఉంటున్నారు. అయితే పసి వారికి ఆహారం అయిన పాలపై కూడా సేవా పన్ను విధించడంపై జనాగ్రహమే పార్లమెంటు సభ్యుల నిరసనల వెనుక ఉన్నదనడంలో సందేహం లేదు. పాలపై సేవా పన్ను వ్యతిరేకత కేవలం విపక్షాలకే పరిమితమైన అంశంగా పరిగణించడానికి ఇసుమంతైనా అవకాశం లేదు. ఎందుకంటే పాలపై సేవా పన్నును నిరసిస్తున్నది పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య జనం. వడ్డింపులే పాలనా అన్నట్లుగా మోడీ2.0 హయాం సాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీఎస్టీ మండలి సమావేశంలో పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించాలన్న నిర్ణయాన్ని యావద్దేశం ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నది. పాలు, పెరుగుజ జున్ను వంటి వస్తువులపై పన్ను విధించడంలోని ఔచిత్యాన్ని అన్ని రంగాల వారూ ప్రశ్నిస్తున్నారు. పాల కొరత లేదు. దేశంలో శ్వేత విప్లవం విజయవంతం అయ్యింది. ఎంతటి కరవు పరిస్థితుల్లోనైనా కొరవ లేకుండా పాలు, మజ్జిగ వంటివి పుష్కలంగా లభించే పరిస్థితి ఉంది. పాల కల్తీపై దృష్టి పెట్టాల్సింది పోయి పాలపైనే జీఎస్టీ విధిస్తూ పేదలకు, పసి కందులకు వాటిని దూరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ఎలా చూసినా ప్రజా వ్యతిరేకత విధానమే. పాల వ్యాపారంలోని బడా బడా సంస్థలు వచ్చి చేరాయి కనుక పాలపై పన్ను విధించి ఆదాయం దండుకోవాలన్న దుష్ట చింతన వినా పాల ఉత్పత్తులపై సేవా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో మరో ఉద్దేశం ఉన్నట్లు కనిపించదు. అసలు జీఎస్టీ విధానం మొదటి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగానే ఉంది. సామాన్యులు వినియోగించే వస్తువులపై జీఎస్టీ తక్కువ ఉండాలన్న జనం డిమాండ్ ను కేంద్రం అసలు పట్టించుకోవడం లేదు. ఈ విషయమై జనాభిప్రాయాన్నే కాదు, విపక్షాల ఆందోళనలనూ కేంద్రం పట్టించుకోవడం లేదు. వన్ నేషన్ వన్ ట్యాక్స్ కోసమే జీఎస్టీ అంటూ చెబుతున్న కేంద్రం.. సంపన్నులు, పేదలను ఒకే గాటన కట్టి పన్నుల విధానాన్ని అవలంబిస్తున్నది. జీఎస్టీ వచ్చిన తరువాత ప్రతి నెలా జీఎస్టీ ఆదాయాన్ని వెల్లడిస్తున్న కేంద్రం.. పన్ను రాబడి పెరిగిందనీ, అదంతా తమ ఘనతేననీ భుజాలు చరిచేసుకుంటోంది. కానీ సామాన్యుల నడ్డి విరిగిన విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నది.   నెలకు లక్షా నలభైవేల కోట్ల రూపాయిలు పైనే వసూళ్ళు జరుగుతున్నాయని సంబరపడిపోతున్న సర్కార్ సంపన్నులు, ఉన్నత ఆదాయ వర్గాలపై పన్ను విధించాలని, సామాన్యులకు మినహాయింపు ఇవ్వాలన్న ప్రాథిమిక సూత్రాన్ని పూర్తిగా విస్మరించేసింది. ఇప్పటికే వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను ఈ ఏడాదిలో పదిపదిహేను సార్లు పెంచింది. గతంలో పన్ను లేని ఎల్‌ఈడీ లైట్లపై   ఇప్పుడు 18 శాతం జీఎస్టీ విధించారు. మరో వైపు ఎల్‌ఈడీ లైట్లను వినియోగించా లని ఒక వంక ప్రభుత్వమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.అంతెందుకు చదువునే పిల్లలు వాడుకునే పెన్సిల్, షార్పనర్, ఎరైజర్ వంటి వాటిపై కూడా 18 శాతం జీఎస్టీ విధించడమంటే.. జనం చావు జనం ఛస్తారు.. ప్రభుత్వం పని మాత్రం రాబడి పెంచుకోవడమే అన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాశ్మీరీల‌కు మిలిటెంట్ల‌తోపాటు పులుల క‌ష్టాలు

మీ పిల్లాడు మా వీధిలో ఆడుతూ కిటికీ ప‌గ‌ల‌గొట్టాడు..ఓ తండ్రి గోడు. ఏమ‌మ్మో.. మీ పిల్లాడు పాకుతూ వ‌చ్చి గుమ్మాన్ని త‌డిపాడు..చూస్తున్న‌వా.. ఓ త‌ల్లి గొడ‌వ‌.. మీ కుక్క‌పిల్ల మా చెట్ల కుండీ నెట్టేసింది.. ఓ అమ్మాయి ఫిర్యాదు.. ఇలాంటివి మ‌నం నిత్యం వింటూంటాం.. చూస్తుంటాం. ఇలాంటివి సిటీ వాతావ‌ర‌ణంలో, అందునా అపార్ట్‌మెంట్స్‌లో మామూలే. ఈజీగానే తీసుకోవా లని,  చిన్న‌వాట్ల‌కు ఆగ్ర‌హించ‌కూడ‌దంటారు పెద్ద‌వాళ్లు.  కానీ, కాశ్మీరులో జంతువుల‌కు ఎవ‌రు ఏం చెబుతారు?  కాశ్మీర్ అన‌గానే కాల్పులు, బాంబు దాడులు ఇవే మ‌న‌కు బాగా తెలిసిన‌వి. ఈమ‌ధ్య కాలంలో మ‌రో విప‌త్తు ఎదుర్కొంటున్నా రు కాశ్మీరు వాసులు. మిలిటెంట్ల‌తో కాదు ఇక వారు పులుల‌తోనూ యుద్ధం చేయాల్సి వ‌స్తోంది. నిత్యం భ‌యాందోళ‌న‌తో బికు బికు మంటూ బ‌త‌కాల్సి వ‌స్తోంది. బారాములా జిల్లా బాతంగి బోనియార్ గ్రామానికి చెందిన 12 ఏళ్ల  రుత్బా ని  పులి చంపే సింది. ఆమె రోజూ వెళ్లిన‌ట్టే త‌న త‌ల్లితోపాటు ప‌శువుల‌ను కాయ‌డానికి వెళ్లింది.  ప‌శువుల‌ను తోలుతూ అటూ ఇటూ తిరుగుతూ కాస్తంత అట‌వీ ప్రాంతం లోప‌లికి వెళ్లింది రుత్బా అంతే అక్క‌డే పొంచి ఉన్న పులి అమాంతం ఆమె మీద‌కి దూకి చంపేసింది. ఈ వార్త ఆ జిల్లా ప్రాంమంతా విస్త‌రించి ప్ర‌జ‌ల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తోంది. ఇది నిజానికి మొద‌టి సంఘ‌ట‌న కాదు. చాలా రోజు లుగా ఇలాంటి పులి, న‌క్క దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. జ‌నం చాలా జాగ్ర‌త్త‌గానే మ‌సులుతున్నారు. అస‌లే మిలిటెంట్ల దాడుల‌తో భ‌యం నీడ‌లో ఉన్న ప్ర‌జ‌లంతా ఇపుడు ఈ జంతువుల దాడికి బ‌లి కావాల్సి వ‌స్తోంది.  ఉద‌యాన్నే చ‌క్క‌గా సిద్ధ‌మై త‌న‌తో పాటు వ‌చ్చిన పిల్ల అలా న‌వ్వుతూ తుళ్లూతోన్న పిల్ల అమాంతం దాడికి బ‌లై శ‌వంగా మారుతుంద‌ని ఏ త‌ల్ల‌యినా ఊహిస్తుందా? హ‌లీమా త‌న కూతురిని ఆ ప‌రిస్థితుల్లో చూసి దుఖంతో కుంగిపోయింది. నా బంగారు త‌ల్లిని మింగేసింది ముద‌న‌ష్ట‌పు పులి అంటూ శాప‌నార్ధాలు పెడుతోంది. వాస్త‌వానికి అస‌లా ప్రాంతంలో ఒంట‌రిగా ఎవ్వ‌రూ తిర‌గ‌వ‌ద్ద‌ని అధికారులు హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. కానీ మ‌రీ అంత భ‌య‌ప‌డాల్సిందేమీ లేద‌న్న చిన్న ధైర్యంతో ప‌శువుల కాస్తూ తిరుగుతూనే ఉన్నారు. చిన్న శ‌బ్ద‌మ‌యినా జాగ్ర‌త్త ప‌డుతూంటారు. అలాంటిది హ‌ఠాత్తుగా ఇలా దాడి జ‌రిగిపోయింది.  కాశ్మీరు లోయ‌ప్రాంతంలో ఇటీవ‌ల ఇలా పులులు దాడి జ‌రుగుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ సంఘ‌ట‌న‌ల గురించి అట‌వీ అధికారు ల‌కు తెలిసి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే ఉన్నారు. అయితే మిలిటెంట్ల దాడితో స్వేచ్ఛ‌గా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోలేని ప‌రిస్థితులు వారిని ఇలాంటి ప్ర‌మాదాల నుంచి ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతున్నారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయ‌ని అస్ల‌మ్ షేక్ అనే సామాజిక కార్య‌క‌ర్త తెలిపారు. గ్రామాల్లోని పేద‌లు త‌మ‌కు తాము ర‌క్ష‌ణ క‌ల్పించుకునే స్థితి లేకపోవ‌డంతో రోజూ భ‌యంతోనే బ‌తుకుతున్నార‌న్నారు. రోజూ పనికి వెళ్ల‌కుంటే పూట గ‌డ‌వ‌దు, అలాగ‌ని ప‌నికి వెళితే ఇలాంటి దాడులు జ‌రుగుతు న్నాయ‌న్నారు. మ‌నిషి, జంతువుల మ‌ధ్య ఈ ఘ‌ర్ష‌ణ 2011 నుంచి క‌నీసం రెండువంద‌ల కుటుంబాలు దెబ్బ‌తిన్నాయి, రెండు వేల‌మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారని అట‌వీశాఖ అధికారుల లెక్క‌. గ‌త ఏడాది నుంచి 1,658 సంఘ‌ట‌న‌లు జ‌రిగాయి. ఈ ఏడాది ఇప్ప‌టికే  17 మంది చ‌నిపోగా 141 మంది గాయ‌ప‌డ్డారు. చాలా సంఘ‌ట‌న‌ల్లో ప్ర‌జ‌లు ఎదురుదాడి చేసి త‌ప్పించుకోగ‌లిగారు.  ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవ‌ల‌సి వ‌స్తున్న కాశ్మీరు లోయ‌ప్రాంత ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వాలు మ‌రింత ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సామాజిక కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. 

జోష్‌.. వాంతుల రోగి

పిల్లాడు వ‌రుస‌గా నాలుగు త‌మ్ములు తుమ్మితే.. అది కొంప‌దీసి వ‌ర్షాకాలం కాకుంటే, ఇంట్లో ఉన్న‌వాళ్లంతా తెగ  ఖంగారు ప‌డు తూంటారు. ఇంట్లో బామ్మ‌గారు ఏదో ఆకులు, అల్లం నూరి వాస‌న‌ప‌ట్టి రెస్ట్ తీసుకోమంటుంది. అంతే సాయంత్రానికి ఠ‌క్కున అన్నీ తుమ్ముల బెడ‌దా తీరి ఆడుకోడానికి వెళ‌తాడు.. బామ్మ‌గారు న‌వ్వుకుంటారు. కానీ జోష్ రైట్ అనే 13ఏళ్ల  పిల్ల‌వాడి సంగ‌తే వేరు. వాడికి ఇలాంటి చిట్కాలేమీ ప‌నిచేయ‌వు. అత‌ను చిత్ర‌మైన వాంతుల‌ జ‌బ్బుతో బాధ‌ప‌డుతున్నాడు. ప్ర‌తీ ఐదు నిమిషాల‌కు పెద్ద వాంతిచేసుకుంటాడు! ఎడిన్‌బ‌ర్గ్‌కి చెందిన జూలీ పిల్లాడే ఈ జోష్ రైట్‌. చాలాకాలం నుంచి ఈ పిల్లాడికి గొంతు మండిన‌ట్ట‌యి వాంతులు అవు తుంటాయి. ఇదేదో మ‌హ‌మ్మారి మ‌న ఊళ్ల‌లో అనేక భూత పిశాచ వైద్యాలు చేయించేస్తారు. కానీ ఎడిన్‌బ‌ర్గ్‌లో అలాంటి అవ‌కాశం లేదు. పిల్లా డిని ప్ర‌తీ ఆరు వారాల‌కు ఒక‌సారి ఆస్ప‌త్రికి జూలీ తీసికెళుతుంటారు. చిత్ర‌మేమంటే  విచిత్ర వామిటింగ్ సిండ్రోమ్ (విఎస్‌) మూల కార‌ణ‌మేమిట‌న్న‌ది వాళ్ల‌కి అంతు చిక్క‌డం లేదు. ఎన్ని ప‌రీక్ష‌లు చేసినా వారికి అర్ధం కావ‌డంలేద‌ని డాక్ట‌ర్లే చెబుతున్నారు. లోకంలో ఇలాంటి జ‌బ్బూ ఉంటుందా అని చ‌ర్చిస్తున్నారు.  నోరంతా ఉమ్మి చేరుకుంటుంది వెంట‌నే వాంతి చేసుకుంటూంటాడు. దీనికి తోడు అప్పుడ‌ప్పుడూ ర‌క్తం కూడా ప‌డుతోందిట‌. ఇది మ‌రీ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అంద‌రూ గ్ర‌హించారు. 13ఏళ్ల పిల్లాడు ఏమ‌యిపోతాడా అని ఆ త‌ల్లి భ‌య‌ప‌డుతోంది. మామూలు ద‌గ్గు, జ్వ‌ర‌మైతేనే  బ‌డికి రావ‌ద్ద‌ని అంటూంటారు. పాపం జోష్‌కి చదువుకోవాల‌ని, డాక్ట‌ర్ కావాల‌ని ఉంది. కానీ స్కూలు చ‌దువే అయ్యేట్టు లేదు. ఇంటిద‌గ్గ‌ర ట్యూష‌న్ చెప్ప‌డానికి కూడా టీచ‌ర్లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. వారికీ ఇది అంటుకుంటుంది. ఇది అంటువ్యాధి కాద‌ని మొత్తుకుంటున్నా వారి భ‌యం వారిది. అస‌లా వీధిలోకి వెళ్ల‌డానికి ఎవ‌రూ ధైర్యం చేయ‌డంలేదు.   ఇత‌ర పిల్ల‌లు, స్నేహితులు అంతా బాగానే చ‌దువుతున్నారు, ఆడుకుంటున్నారు.. త‌న‌కెందుకు ఇలా అయింద‌ని పిల్లాడు దిగులు ప‌డి మ‌రీ నీర‌సించాడు. స్కూలుకి స‌రిగా వెళ్ల‌లేక‌పోతున్నాడు. క్లాసులో ఇత‌రుల‌కు ఇబ్బందిగా ఉంద‌ని అత‌నే ఇంటి ద‌గ్గ‌ర చ‌దువుతానంటున్నాడు. జోష్‌కి ఒక‌డే కొడుకు. వీడిని బాగా చ‌దివించి మంచి ఉద్యోగిగా చూడాల‌ని ఎన్నో క‌ల‌లు కంటోం ది. కానీ జోష్ ఆరోగ్యం ఆమెను భ‌య‌పెడుతోంది. ఎవ‌రికీ చెప్పుకోలేదు, డాక్ట‌ర్లూ ధైర్యం చెప్ప‌లేక‌పోతున్నారు. అత‌నికి జీవితాంతం ఈ జ‌బ్బు ఉంటుంద‌నే అంటున్నారు. మ‌రి పూర్తిగా త‌గ్గేది ఎన్న‌డ‌న్న‌ది ప‌రిశోధ‌కులు తేల్చాల్సిందేన‌ట‌. ఇక ఆమెకు వాడి తోనే జీవితం, ప్ర‌తీ క్ష‌ణం. 

మెడీ బలం విపక్షాల అనైక్యతే!

 రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. ఉప రాష్ట్రపతి ఎన్నిక అయిపోతుంది. విపక్షాల ఐక్యత ఎండమావేనని మరోసారి తేలిపోయింది. మళ్లీ మళ్లీ అదే రుజువు అవుతుంది. వాస్తవానికి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుస విజయాలకు అసలైన కారణం సొంత ప్రతిభ కంటే.. సొంత బలం కంటే విపక్షాలలో ఉన్న అనైక్యతే కారణమని పదే పదే రుజువు అవుతోంది. అయినా విపక్షాలు గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. సొంత బలం కంటే తమ అనైక్యతే మోడీ సర్కార్ బలోపేతం కావడానికి కారణమౌతోందని తెలిసినా, విభేదాలను పక్కన పెట్టి కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఏకాభిప్రాయానికి రావడంలో ఘోరంగా విఫలమౌతోంది.  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియను చూస్తున్న సామాన్య ప్రజలకు కూడా తెలుస్తున్న ఈ సంగతి విపక్షాలకు ఎందుకు తెలియడం లేదో అర్ధం కాదు. రాష్ట్రపతి ఎన్నికలలో ప‌లు రాష్ట్రాల అసెంబ్లీల్లో   క్రాస్ ఓటింగ్ జ‌రిగింది. ఇతక పార్టీల నుంచి ముర్ముకు మ‌ద్ద‌తుగా ఉన్న వారి కంటే అదనంగా 125 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు ఓటేశారు. అంటే విపక్ష పార్టీల ఐక్యత ఎంత బలంగా ఉందో తేటతెల్లమౌతుంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నిక అయితే  సరే సరి.  ఓటింగ్ కు దూరం అని మమతా బెనర్జీ ప్రకటించడంతోనే విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని ఎందుకు నిలిపాయన్నది కూడా అర్ధం కాని పరిస్థితి.   తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీని ఎదుర్కోక తప్పని పరిస్థితి. అయితే ఆ రెండు పార్టీల కార్యక్షేత్రం వాటి వాటి రాష్ట్రాలే. ఎందుకంటే బీజేపీతో పోరు చేయకుంటే ఆయా రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడం ఆ పార్టీలకు అసాధ్యమౌతుంది కనుక. ఈ రెండు పార్టీలూ మినహాయిస్తు మిగిలిన విపక్షాలు వేటికీ కేంద్ర ప్రభుత్వంతో అంటే బీజేపీతో జాతీయ స్థాయిలో పోరాడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆ అవసరం ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాజకీయాలలో అదీ జాతీయ స్థాయి రాజకీయాలలో ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. దీంతో జాతీయ స్థాయిలో బీజేపీ పోటీ ఇచ్చే పార్టీ కానీ, కూటమి కానీ లేకుండా పోయింది.  కేంద్రంలో మోడీ సర్కార్ పై జాతీయ స్థాయిలో ఎంత వ్యతిరేకత ఉన్నా.. ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితుల్లో జనానికి కూడా బీజేపీ వినా మరో పార్టీ కనిపించని పరిస్థితి నెలకొంది.  ప్రజలు ప్రత్యామ్నాయం కనిపించినప్పుడే తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటుతారు. అలా కనిపించనప్పుడు ఎవరైతేనేం అన్న నిర్లిప్తంతో ఉండిపోతారు. ఇప్పుడు దేశంలో ప్రజల   పరిస్థితి అదే.

విశాఖ వైసీపీ నేత‌ల ఘ‌ర్ష‌ణ‌

ప‌రిస్థితులు పార్టీకి అన‌నుకూల‌ మైన‌పుడు నాయ‌కునికి మ‌ద్ద‌తు నివ్వాలి. కానీ ప్రాంతీయ నాయ‌కుల మ‌ధ్య విభేదాలు మ‌రీ రోడ్డుకెక్కితే పోయేది పార్టీ ప‌రువే. ఇదే స్ప‌ష్టం చేసింది విశాఖ‌ప‌ట్నం వైసీపీ నాయ‌కుల  వైరి. ఇక్క‌డి హిందూస్థాన్ షిప్‌యార్డులో ప్ర‌మాద‌వ‌శాత్తూ మృతిచెందిన కార్మికుడి నివాసానికి  ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లి అక్క‌డ గొడ‌వ‌ప‌డ్డారు. అ\లాంటి చోట కూడా వారి మ‌ధ్య‌వైరాన్ని ప్ర‌ద‌ర్శించుకునే స్థాయిలో విభేదాలు త‌లెత్తాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది.  అంతా బాగానే ఉంది అనుకున్న‌చోట కూడా వివాదాలు త‌లెత్తాయి. విశాఖ‌ ఎం.పీ  స‌త్య‌నారాయ‌ణ ద‌గ్గ‌రే వైసీపీ నేత‌లు దాడి చేసుకోవ‌డం విడ్డూరం. ఎం.పి తో పాటు స్థానిక కార్పొరేటర్ లావణ్య, 61 వ వార్డు కార్పొరేటర్ పీ.వీ.సురేష్ , వైసిపి నేతలు పొట్టి మూర్తి, మిగిలిన నాయకులు వెళ్లారు. ఎంపీ తో పాటు వెళ్తున్న క్రమంలోనే అక్క‌డ తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది.  స్థానిక కార్పొరేటర్ లావణ్య వర్గం ఆగ్ర‌హించి ఇక్క‌డ‌ మీ పెత్తనమేంట౦టూ కార్పొరేట్ పీవీ సురేష్, వైసిపి నేత పొట్టి మూర్తిలతో వాదనకు దిగారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కలుగజేసుకొని బాహాబాహీకి దిగిన ఇరువర్గాలను సముదాయించారు. అయితే ఈ వివాదంపై వైసిపి నేత పొట్టి మూర్తి కార్పొరేటర్ పి.వి. సురేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పి.వి.సురేష్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సూప‌ర్  చోప్రా .. 19 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ భార‌త్ కు  ర‌జ‌తం

భార‌త అథ్లెట్ నీర‌జ్ చోప్రా మ‌రోసారి దేశానికి మ‌రో చ‌రిత్రాత్మ‌క విజ‌యాన్ని అందించాడు. అమెరికా ఒరెగాన్‌లో జ‌రుగుతున్న ప్ర‌ప‌పంచ ఛాంపియ‌న్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియ‌న్ చోప్రా 88.13 మీట‌ర్లు జావెలిన్ విసిరి ర‌జ‌త ప‌త‌కాన్ని కైవ‌సం చేసుకున్నా డు. ఆదివారం ఉద‌యం జ‌రిగిన పైనల్స్‌లో నాలుగో ప్ర‌య‌త్నంలో ఈ ఫీట్ సాధించాడు. కాగా అమెరికాలోని ఒరెగాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చారిత్రాత్మక అధ్యా యాన్ని లిఖించాడు. కాగా ఈ విభాగంలో డిఫెండింగ్​ ఛాంపియన్​, గ్రెనెడాకు చెందిన అండర్సన్​ పీటర్స్​ మరోసారి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. పీటర్స్​ తన తొలి ప్రయ త్నంలోనే 90.46 మీటర్ల దూరం జావెలిన్ విసిరి స్వ‌ర్ణ‌ప‌త‌కం గెలుచుకున్నాడు.  2003లో అథ్లెటిక్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో లాంగ్ జంప్ లో కాంస్య పతాకాన్ని అంజు బాబీ జార్జ్ గెలుచుకున్న ఏకైక భారతీయురాలిగా నిలిచింది. 2022లో నీరజ్ మళ్ళీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పతాకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించాడు. టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకాన్ని అందుకున్న నీరజ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో 12మందితో తలప డ్డాడు.  మరో భారతీయ క్రీడాకారుడు రోహిత్ యాదవ్ కూడా ఫైనల్ లో పతకం కోసం పోటీపడ్డాడు.  ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒకే ఎడిషన్ లో ఇద్దరు భారతీయ క్రీడాకారులు అదీ జావెలిన్ త్రో లో ఫైనల్ రౌండ్ కు చేరుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. క్వాలిఫై యింగ్ రౌండ్ లో  80.42 మీటర్ల త్రో విసిరి.. రోహిత్ యాదవ్  11వ స్థానంలో నిలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత్‌కు రెట్టింపు ఆనందం దక్కింది.  అయితే జావెలిన్ త్రో ఫైనల్లో రోహిత్ యాదవ్ అత్యుత్తమ 78.72 మీటర్లతో 10వ స్థానంలో నిలిచాడు.

కాటికెళ్లాలన్నా.. కట్టె కాలాలన్నా.. బాదుడే బాదుడు

అనాదిగా రాజుల‌కు, ప్ర‌భుత్వాల‌కు, ధ‌నిక‌వ‌ర్గానికి, వ్యాపారుల‌కు సులువుగా చిక్కేది సామాన్య‌ప్ర‌జ‌లే. ప‌చ్చిమిర‌ప‌కాయ నుంచి ప‌చారీ సామాన్ల వ‌ర‌కూ దేని జోలికి స్వేచ్ఛ‌గా వెళ్ల‌నీయ‌రు. ఏదో ర‌కంగా క‌నీసం రెండు రూపాయ‌లు అద‌నంగా కొట్టేద్దామ‌నే అనుకుంటారు. కాలం మారినా, ఆ  దాడి ఆలోచ‌న‌లో మాత్రం పెద్ద‌గా మార్పు రావ‌డం లేదు, పేరు మార్చారంతే. ఇంకా చెప్పా లంటే ఆ చట్టబద్ధమైన దోపిడీకి హద్దూ..పొద్దూ లేకుండా పోతోంది. ప్రజలు ఉన్నది పన్నులు కట్టడానికే.. తాము కట్టించు కోవడా నికే అన్నట్లుగా ప్రభుత్వాలు చెలరేగిపోతున్నాయి.  ఏదో ఒక సాకుతో అధిక ప‌న్నులు వ‌సూలు చేయ‌డం దేశంలో ఇప్పుడు నిత్య‌కృత్య‌మైంది. మ‌రీ ముఖ్యంగా జీఎస్టీతో ఉద్యోగుల జీవితాల‌ను మ‌రింత సంక్లిష్టం చేశారు. సంపాద‌న‌లో స‌గం ఏదో ఒకర‌కం ప‌న్నుల‌కే పోతోంది. ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌లు విసిగెత్తు తున్నారు. ఏది కొనాల‌న్నా, తినాల‌న్నా ప్ర‌భుత్వం దాన్నిగురించి ఏమ‌న్నా అన్న‌దా అని ఆలోచించాల్సిన ప‌రిస్థితి క‌ల్పించారు. కేంద్రం కేవ‌లం వ్యాపార‌సంస్థ‌లు, ఆయా కుటుంబాల‌కు మాత్ర‌మే కొమ్ము కాస్తోంద‌న్న‌ది ప్ర‌తీ విష‌యంలోనూ తెలిసిపోతోంది. ఈ ర‌క‌మైన దోపిడీని దేశంలో సామాన్యులు ఊహించ‌లేదు. చిత్ర‌మేమంటే పెరుగు మీద‌కూడా ఐదు శాతం ప‌న్ను విధించ‌డం. ఇంత‌కంటే దారుణాన్ని ఊహించ‌లేం.  ప్ర‌జ‌లంతా ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆహారం తీసుకోవ‌డానికి అస‌లా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక అనారోగ్యం పాలై ఆస్ప‌త్రికి వెళితే పెద్ద చికిత్స‌, ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మైతే వాటిని అడ్డుపెట్టుకుని ఆస్ప త్రులు ముందే వాటి ఖ‌ర్చు చెప్పి ప్రాణం లాగేస్తున్నారు. ఓట్లు వేయించు కుని గ‌ద్దె ఎక్కుతున్నామ‌న్న ఇంగితం కూడా లేకుండా పోతోంది. ఓట్ల స‌మ‌యంలో అనేక ప్ర‌మాణాలు, హామీల వ‌ర్షంలో ముంచెత్తి ఓట‌రు న‌వ్వుమొహం చెరిగే లోగా విజేత‌లై దూర‌మ వుతున్నారు.  అస‌లు ప‌న్నులు అతిగా ఎందుకు విధిస్తున్నాము, ప్ర‌స్థ‌త‌స్థితిలో క‌ట్టేట్టున్నారా లేదా అన్న‌ది ప్ర‌భువుల వారికి బొత్తిగా గిట్ట‌ని అంశం. దాన్ని గురించి ఆలోచించ‌మ‌నే అధికారులు, మిత్రులు చెబుతూంటారేమో..కానీ అధికార పార్టీవారికి, ప్ర‌ధాని, ముఖ్య మంత్రుల‌కు, ఆర్ధిక మంత్రుల‌కు అవేవీ చెవికి ఎక్క‌డం లేదు. ఇలాంటివారిని చూసి  ప్రజలు ఏడ్వలేక నవ్వుతూ సెటైర్లు వేస్తు న్నారు. ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రజలను ఎందుకు పిండుకోవాలనుకుంటుందనేది ఎక్కువ మంది ఆవేదన చెందుతున్న మాట. నిజానికి  ఇది మొదటిది కాదు.. అలాగని చిట్టచివరిదీ కాదు. ఇంకా ఎన్ని వాతలుంటాయో.. ఎలాంటి వాటి మీద ఉంటా యో చెప్పడం కష్టం. కానీ మధ్య తరగతి జీవి మాత్రం ఈ పన్నుల చక్రబంధంలో ఇరుక్కుని నలిగిపోతున్నాడు. సంపాదిస్తే ఆదాయపు పన్ను.. ఖర్చు పెడితే జీఎస్టీ… పెట్రోల్, డిజిల్ టాక్సులు ఎక్స్ ట్రా ! బ‌త‌క‌డానికి ఊపిరి మీద కూడా రేపో మాపో ప‌న్ను విధిస్తే.. సారీ.. ఈ ఆలోచ‌న వారికెందుకు ఇవ్వ‌డం.. చ‌చ్చేదీ సామాన్య‌లం మ‌న‌మే!  ఎక్క‌డ ఎక్కువ వ‌స్తువులు కొని ఆనందిస్తారేమోన‌ని ప్ర‌భుత్వానికి ఈర్ష్య. అవును అందుకే   జీఎస్టీ లేని వస్తువంటూ లేదు.  బిల్లు వేయని దగ్గర కొన్నా, ఆ వస్తువులో జీఎస్టీ పన్ను కూడా కలిపేసి ఉంటుంది. అంటే, సంపాదించుకున్నదానికి పన్ను కట్టడమే కాకుండా, ఖర్చు పెడుతున్న ప్రతీ దానికి పన్నులు కట్టాలన్నమాట. తినే తిండి దగ్గర్నుంచి ప్రతీ దానికి పన్ను కట్టాలి. ఇవిగాక పెద్ద‌మొత్తంలో  ప్రజల్ని దోచుకోవడానికి పెట్రోల్, డీజిల్ పన్నులు ఉండనే ఉన్నాయి. దీనికి జీఎస్టీలో చోటు లేదు. అంటే విడిగా పన్నులు బాదేస్తారన్నమాట. దీని ద్వారా కేంద్రానికి ఏటా మూడు, నాలుగు లక్షల కోట్ల ఆదాయం వస్తుందంటే ప్రజల సంపద ఎంతగా పీల్చుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిత్ర‌మేమంటే బ‌త‌క‌డానికి ఉద్యోగం, ప‌న్నులు క‌ట్ట‌డానికి జీతం అన్న‌ట్టుగా బ‌డుగు జీవుల బ‌తుకులు మార్చేశారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌వారికోస‌మే ప్ర‌జ‌లు బ‌త‌కాల‌న్న‌మాట‌!  ఆలోచించే తీరిక లేకుండా కష్టపడి మధ్యతరగతి ప్రజలు పన్నులు కడుతున్నారు. పాలకవర్గాలతో సన్నిహితంగా ఉన్న వారు మరింత ధనవంతులైపోతున్నారు. ఈ అంతరాలు ఇలా పెరిగిపోతే జరిగేది దేశాభివృద్ధి కాదు.. వినాశనం. ఆ విషయాన్ని సంకుచిత మనస్థత్వం కలిగిన పాలకులు అర్థం చేసుకోడం కష్టం. ప్రజలు అలాంటి వారిని ఆదరించినంత కాలం ఈ పన్నుపోట్లు తప్పవు. ప్రజలు కట్టే పన్నులతో రాజకీయ ఖర్చులు చేసుకోవడం ఆగదు. మనమింతే.. మన పాలకులూ ఇంతే !

బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే పనులు నాసిరకం..!

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్న సామెతలా ఉంది ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ఘనంగా ప్రారంభించిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే. యూపీలో అత్యంత వెనుక బడిన ప్రాంతమైన బుందేల్ ఖండ్ నుంచి ఢిల్లీకి అనుసంధానం చేస్తూ నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వేను కేంద్రం కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించింది. ఆ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మోడీ ఇటీవలే ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ వేతో బుందేల్ ఖండ్ ముఖచిత్రమే మారిపోతుందంటూ మోడీ ఘనంగా ప్రకటించారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ణానం ఉపయోగించి నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వే దేశం పురోగామి బాటలో పయనిస్తున్నదనడానికి తాజా ప్రత్యక్ష నిదర్శనమని మోడీ అన్నారు. ఈ ఎక్స్ ప్రెస్ వే చిత్రాలు, వీడియోలు దేశ వ్యాప్తంగా అందరూ చూశారు. బీజేపీ అయితే అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ లను తలదన్నే లాంటి ఎక్స్ ప్రెస్ వేను మోడీ ఇండియాలో అదీ వెనుకబడిన బుందేల్ ఖండ్ లో నిర్మించారంటూ తెగ భుజాలు చరిచేసుకుంది. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈ సారి అది బీజేపీ ప్రచారార్భాటంలోని డొల్ల తనాన్ని, కేంద్రం నిర్మించిన ఈ ఎక్స్ ప్రెస్ వే పనులు ఎంత నాసిరకమో తేటతెల్లం చేసేసింది. ఇటీవలి వర్షాలకు బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేపై పలు చోట్ల రోడ్డు కొట్టకుపోయింది. గోతులు పడిపోయింది. రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేకుండా పోయింది.వేల కోట్లు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని గప్పాలు కొట్టుకున్న కేంద్రం అవమానంతో తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రారంభించిన రోజుల వ్యవధిలోనే వర్షాలకు ఎక్స్ ప్రెస్ వే దెబ్బతినడంపై నెటిజన్లు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. మోడీ సర్కార్ ప్రచారార్భాటాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అవినీతి రాజ్యమేలుతోందంటూ విమర్శలు గుప్పించే మోడీ.. బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే వెనుక అవినీతి ఎవరిదో చెప్పాలని నిలదీస్తున్నారు. ఎక్స్ ప్రెస్ వేలు ప్రకృతి వైపరీత్యాలలో సైతం దెబ్బతినకుండా ఉండేలా నిర్మిస్తారు. కానీ బుందేల్ ఖండ్ రహదారి మాత్రం చిన్న పాటి వర్షాలకే ధ్వంసమైంది. భారీ వరదలు రాలేదు. రహదారిపై నీటి ప్రవాహం లేదు. వర్షానికే రహదారి ఛిద్రమైంది. అంటే ఈ ఎక్స్ ప్రెస్ వే ఎంత నాసిరకంగా నిర్మించారో ఇట్టే అర్థమైపోతోంది. దీనిపై మోడీ పెదవి విప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.   అవినీతి అంటే ఇదని ఫోటోలు పెట్టి చూపిస్తున్నారు. సాధారణంగా ఎక్స్ ప్రెస్ వేలు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాల్లోనూ దెబ్బతినకుండా స్ట్రాంగ్‌గా నిర్మిస్తారు. కానీ భయంకరమైన వరదలేమీ రాకుండానే ఆ ఎక్స్ ప్రెస్ వే చాలాచోట్ల దెబ్బతింది. రిపేర్లు చేసి మళ్లీ ఎక్స్ ప్రెస్ వేను వినియోగంలోకి తీసుకు రావొచ్చు కానీ.. అసలు మరక మాత్రం బీజేపీ ప్రభుత్వంపై పడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం అంటూ విపక్షాలు విమర్శించాడనికి అవకాశం చిక్కింది. గత ప్రభుత్వాల హయాంలో నిర్మించిన అనేకఎక్స్ ప్రెస్ వేలు… ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడ్డాయని ఫోటోలుపెడుతున్నారు. 

జారి పడి గాయపడ్డ కేటీఆర్.. మూడు వారాలు విశ్రాంతి

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. ప్రగతి భవన్ లో ఆయన ప్రమాద వశాత్తూ జారి పడటంతో ఎడమ కలి మడమ వద్ద హెయిర్ లైన్ ప్రాక్చర్ అయ్యింది. దీంతో వైద్యులు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఆదివారం నాడు ఆయన జన్మదినం కావడంతో అభిమానులు క్యాడర్ ఘనంగా జరపాలని భావించినప్పటికీ ఆయన రాష్ట్రంలో భారీ వరదలు, వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ కింద బాధితులకు చేతనైన సహాయం చేయాలని కేడర్ కు, అభిమానులకు సూచించారు. జన్మదినానికి ముందు రోజు ఆయన గాయపడటంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ట్విట్టర్ వేదికగా పలువురు పేర్కొన్నారు. ఇలా ఉండగా తనకు అనుకోని విశ్రాంతి దొరికిందంటూ కేటీఆర్ సరదా ట్వీట్ చేసి..ఓటీటీలో మంచి సినిమాలు చూస్తాననీ నెటిజన్లకు చెప్పారు. మంచి సినిమాలూ, కార్యక్రమాలను సూచించాలని కోరారు. మొత్తం మీద ఓ మూడు వారాల పాటు కేసీఆర్ టెలికాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితమౌతారు. ఆయన ప్రత్యక్షంగా ఎటువంటి కార్యక్రమాలకూ హాజరయ్యే అవకాశం లేదు. నిజానికి ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యవహారాలన్నీ తానై చేస్తున్నారు. విపక్షాలపై విమర్శల దూకుడు పెంచారు. ప్రారంభోత్సవాలు, పార్టీ వ్యవహారాలూ అన్నిటినీ తన భుజస్కంధాలపై వేసుకుని చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన ఓ మూడు వారాలు ప్రత్యక్షంగా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనకపోవడం టీఆర్ఎస్ కు ఒక విధంగా ఇబ్బందే అని చెప్పాలి.  కాగా మంత్రి హరీష్ రావు కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

క్రియాశీల రాజకీయాల్లో చేరాలని ఎంతో అనుకున్నా.. జస్టిస్ ఎన్వీ రమణ

క్రిశీలరాజకీయాల్లో చేరాలని ఒక దశలో ఎంతో అనుకున్నాననీ, అందుకోసం ఎంతో కష్టపడ్డాననీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. అయితే విధి మరోలా నడిపిందని చెప్పారు.  జార్ఖండ్ రాంచీలో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ స్టడీ & రీసెర్చ్ ఇన్ లా నిర్వహించిన జస్టిస్ ఎస్‌బి సిన్హా స్మారక ఉపన్యాసంలో  లైఫ్ ఆఫ్ ఏ జడ్జి అన్న అంశంపై ఆయన మాట్లాడారు. సరిగ్గా  నెల రోజులలో పదవీ వరమణ చేయనున్న జస్టిస్‌ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాథాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మీడియా పోకడలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియాల మధ్య స్పష్టమైన తేడాను ఆయన గుర్తించారు. ప్రింట్ మీడియా ఇప్పటికీ ఎంతో కొంత బాధ్యతగా వ్యవహరిస్తోందనీ, అయితే డిజిటల్ మీడియా మాత్రం తెలిసీ తెలియని తనంతో బాధ్యతల గురించి పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందన్నారు.   గతంలో పలు సందర్భాలలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిజం ఆవశ్యకతను గట్టిగా సమర్ధించిన ఆయన తాజాగా సోష‌ల్ మీడియా తీరుపై నిశిత విమర్శలు చేశారు. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో జరగుతున్న ప్రచారం న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పని తీరుపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.  సామాజిక మాధ్యమానికి వాస్తవమేదో, అవాస్తవమేదో, మంచి, చెడుల గురించి చెప్పే సామర్థ్యం కానీ, నైపుణ్యం కానీ ఇసుమంతైనా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మీడియా స్వయంగా విచారణ చేసేసి తీర్ులు కూడా ఇచ్చేస్తోందని, మిడిమిడి జ్ణానంతో చర్చలు నిర్వహించి వెల్లడి చేస్తున్న అభిప్రాయాల ప్రభావం ప్రజలపై కూడా పడుతుందని అన్నారు. ఇటువంటి వాటి వల్ల ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతుందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.  

ఈడీ దూకుడు ప్రతిపక్షాలే టార్గెట్

ప్రతిపక్ష పార్టీల  భయాలు నిజం అవుతున్నాయి. సీబీఐ,ఈడీ,ఎన్ఐఎ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీల నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఓవంక నేషనల్  హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్  అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారిస్తోంది. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా  ఆందోళనలు నిర్వహిస్తోంది. మరో వంక కేంద్ర దర్యాప్తు సంస్థలను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పభుత్వం దుర్వినియోగ పరుస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం విపక్షాల ఆందోళన, అభ్యంతరాలను అంతగా పట్టించుకున్నట్లు లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది., ప్రభుత్వ పాత్ర. ప్రమేయం లేదని,కోర్టుల ఆదేశాల మేరకే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని  కేంద్ర మంత్రులు, అధికార బీజేపీ నాయకులు విపక్షాల విమర్శలను కొట్టి వేస్తున్నారు.  అదలా ఉంటే, అదే సమయంలో ఈడీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ బిగ్ షాకిచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ నేత, మమతా దీదీ మంత్రివర్గంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి పార్థా చటర్జీని అరెస్ట్ చేసింది. వివరాలలోకి వెళితే, 2018 లోపార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో, రాష్ట్రంలో  ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవిగా భావిస్తున్న రూ.20 కోట్ల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు పార్థా ఛటర్జీ అనుచరుడు అర్పితా ముఖర్జీ నివాసంలో స్వాదీనం చేసుకున్నారు.  ఈడీ అధికారులు  శుక్రవారం మంత్రి పార్థా ఛటర్జీ, విద్యా మంత్రి ప్రకాశ్‌ అధికారి, ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రాథమిక విద్యా మండలి మాజీ అధ్యక్షుడు మాణిక్‌ భట్టాచార్య, మరికొందరి నివాసాలపై  ఏక కాలంలో దాడులు నిర్వహించారు. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్‌డీగా పనిచేసిన పి.కె.బందోపాధ్యాయ్‌, వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్జీ తదితరుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అనుచరుడు అర్పితా ముఖర్జీ ఇంట్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఏకంగా రూ.20 కోట్ల నోట్ల కట్టలను ఈడీ అధికారులు సీజ్ చేశారు. స్కూల్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్‌సీ), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో సోదాలకు వెళ్లిన అధికారులకు ఈ డబ్బు దొరికింది. దర్యాప్తులో భాగంగా వేర్వేరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అనంతరం.. మంత్రి పార్థా చటర్జీని ఈడీ అరెస్టు చేసింది. అర్పితా ముఖర్జీ ఇంట్లో దొరికిన రూ.20 కోట్లు ఉపాధ్యాయ నియామక కుంభకోణానికి సంబంధించినవేనని భావిస్తున్నట్లు ఈడీ ఒక ప్రకటనలో పేర్కొంది. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను అర్పితా ముఖర్జీ నివాసం నుంచి జప్తు చేసినట్లు తెలిపింది. నేరాన్ని నిరూపించడంలో ఉపయోగపడే పత్రాలతో పాటు డొల్ల కంపెనీల వివరాలు, విదేశీ కరెన్సీ, బంగారం, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు కుంభకోణంతో సంబంధమున్న వ్యక్తుల వద్ద లభించాయని వెల్లడించింది. పార్థా ఛటర్జీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి.  నిజమే, చట్టం ముందు అందరూ సమానమే, అవినీతికి పాల్పడిన వారిని రక్షించాలని ఎవరూ .. కోరుకోరు. కానీ,..ప్రతిపక్ష పార్టీల నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మాత్రమే దాడులు, సోదాలు, అరెస్టులు జరగడమే అనుమానాలకు తావిస్తోంది.  

అంత‌గా ల‌భించ‌ని కొత్త బ్ల‌డ్ గ్రూప్‌.. ఇఇఎం నెగెటివ్‌!

ఎవ‌రికైనా ర‌క్తం కావాల్సివ‌చ్చిన‌పుడు పేషెంటు ర‌క్తం ఏ గ్రూప్‌కి చెందిందో అదే గ్రూప్ ర‌క్తం ఉన్న‌వారి నుంచి ర‌క్తాన్ని కోర‌తారు. అలాగాకుండా కొంద‌రికి మామూలుగా దొరికేది కాకుండా వేరే గ్రూప్ ర‌క్తం కావాల్సి వ‌స్తుంటుంది. అప్పుడు స‌ద‌రు ఆస్ప‌త్రి, డాక్ట‌ర్లు తెగ కంగారు ప‌డుతూంటారు. ఎలాగో ఒక డోన‌ర్‌ని ప‌ట్టుకోగ‌ల్లుతారు. అయితే అంత‌కు మించిన ఆశ్చ‌ర్య‌క‌ర‌మేమంటే, గుజ‌రాత్‌లో ఒక మ‌నిషి ర‌క్తం స‌హ‌జంగా ఉండే ఏ, బి, ఓ లేదా ఏబి గ్రూప్ ర‌క్త‌మే ల‌భిస్తుంది. కానీ గుజ‌రాత్ లో ఒక పెద్దా య‌నకు గుండెజ‌బ్బు. ఆయ‌న్ను ఆస్ప‌త్రికి తీసుకువ‌చ్చి ఆప‌రేష‌న్‌కి సిద్ద‌ప‌డ్డారు. అందుకు ర‌క్తం కావాల్సి వ‌చ్చింది. ఆయ‌న ర‌క్తం ఏ గ్రూప్‌కి చెందింద‌నేది డాక్ట‌ర్లు తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయారు.  అది  ఇఎంఎం నెగెటివ్ గ్రూప్‌.  ఇది అస‌లు దొర‌క‌డ‌మే దుర్ల‌భం అని తేల్చారు. ఆ 65 ఏళ్ల పెద్దాయ‌న ర‌క్తం గ్రూప్ భార‌త‌దేశంలో లభిస్తుంది. ఇత‌ర దేశాల్లో అంత‌గా ల‌భించ‌ద‌ని తెలుసుకున్నారు. మామూలుగా మ‌నిషి శ‌రీరంలో నాలుగు ర‌కాల ర‌క్తం గ్రూప్‌లు ఉంటాయి, వాటికి 42 ర‌కాల అద‌న‌పు ర‌క్తం ర‌కాలు ఏ, బి, ఓ, ఆర్ హెచ్ అనేవి ఉంటాయిట‌. అలాగే ఇఎంఎం ఎక్కువగా ఉండే 375 రకాల యాంటిజెన్‌లు అంటే శరీరంలో రోగనిరోధక  ప్రతి స్పందనను ప్రేరేపించే టాక్సిన్ లేదా ఇతర విదేశీ పదార్ధం, ముఖ్యం గా నెగెటివ్ ల ఉత్పత్తి చేసేవి కూడా ఉంటాయి. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అలాంటి పది మంది మాత్రమే వారి రక్తంలో ఇఎంఎం  హై-ఫ్రీక్వెన్సీ యాంటిజెన్‌ను కలిగి లేరు, ఇది వారిని సాధారణ మానవులకు భిన్నంగా చేస్తుంది. అటువంటి అరుదైన బ్లడ్ గ్రూపులు ఉన్నవారు తమ రక్తాన్ని ఎవరికీ దానం చేయలేరు లేదా ఎవరి నుండి పొందలేరు. ప్రపంచంలో ఇలాంటి అరుదైన బ్లడ్ గ్రూప్ ఉన్నవారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని, అయితే ఇప్పుడు గుజరాత్ లోని రాజ్‌కోట్‌కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి ఈ బ్లడ్ గ్రూప్‌తో గుర్తించ బడ్డారని నివేదికలు చెబుతున్నాయి.  గుండెపోటుతో అహ్మదాబాద్‌లో చికిత్స పొందుతున్న 65 ఏళ్ల రోగికి గుండె శస్త్రచికిత్సకు రక్తం అవసరమని సూరత్‌లోని సమ ర్పన్ బ్లడ్ డొనేషన్ సెంటర్  వైద్యుడు సన్ముఖ్ జోషి  తెలిపారు. అయితే అహ్మదాబాద్  ల్యాబొరేటరీలో అతని బ్లడ్ గ్రూప్ కనిపించకపోవడంతో ఆ నమూనాలను సూరత్‌లోని రక్తదాన కేంద్రానికి పంపారు. పరీక్ష తర్వాత, నమూనా ఏ గ్రూపుతో సరిపోలడం లేదు, దీంతో వృద్ధుడితోపాటు అతని బంధువుల రక్త నమూనాలను దర్యాప్తు కోసం అమెరికాకు పంపినట్లు ఆయన తెలిపారు.  ఆ త‌ర్వాత , వృద్ధుని రక్త వర్గం భారతదేశంలో మొట్టమొదటిది  అలాగే ప్రపంచంలోని పదవ అరుదైన రక్త సమూహంగా గుర్తిం చిన‌ట్టు  డాక్టర్ జోడించారు. రక్తంలో ఇఎంఎం లేకపోవడంవల్ల, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ (ఐఎస్ బిటి) దీనికి ఇఎంఎం నెగెటివ్ అని  పేరు పెట్టింది.

ఉలిపి క‌ట్టె బీజేపీ!

దేశంలో బీజేపీ వారు బొత్తిగా భ‌రించ‌లేని వారి  పెద్ద‌ జాబితాలో ఇక మిగిలింది క‌మేడియ‌న్స్‌! యువ హాస్యనటుడు మునావర్ ఫరూఖీ ఎక్కడికి వెళ్లినా షోలు రద్దవుతుండ‌టమే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. ఈమ‌ధ్య‌నే బంగ‌ళూరులో ఆయ‌న ప్ర‌ద‌ర్శ‌న ర‌ద్దు చేయాల‌ని పోలీసుల‌ నుంచి తాఖీదు అందుకున్నారు నిర్వాహ‌కులు. హిందూ జాగ‌ర‌ణ్ స‌మితి,  జై శ్రీ‌రామ్ సేనా అనే రెండు హిందూత్వ సంస్థ‌ల సూచ‌న‌ల మేర‌కే పోలీసులు తాఖీదును పంపార‌న్న‌ది నిర్వాహ‌కుల‌కూ అర్ధ‌మ‌యింది. ఫారూకీ షో ఇలా ఆగిపోవ‌డం ఇది మొద‌టిసారి కాదు, ఇంతకు ముందు ఓ డజను సార్లు ఇలా జరిగింది. మామూలుగా చ‌ట్ట  ప్ర‌కారం చూస్తే పోలీసుల‌కు ఈ షో ఆపాల్సిన అవ‌స‌రం ఎంత మాత్ర మూ లేదు. అంతే కాదు భారీ బందోబ‌స్తు పెట్టా ల్సిన గ‌త్యంత‌ర‌మూ ఉండేది కాదు. కానీ పోలీసులు హిందూ జాగ‌ర‌ణ్ వారి హెచ్చ‌రిక‌ల‌ను అమ‌లు చేయాల్సి వ‌చ్చింది. చిత్ర‌మేమంటే ఇదే బంగ‌ళూరు వేదిక మీద గ‌తంలో మూడు ప‌ర్యాయాలు ఆయ‌న షోలు జ‌రిగేయి. ఈ పోలీసులే పొట్ట‌చెక్క‌ల య్యేలా న‌వ్వారుట‌! మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో వ‌లె క‌ర్ణాట‌కా కూడా బీజేపీ పాల‌న‌లోనే ఉంది. అక్క‌డ‌యితే ఫ‌రూకీ రాజ‌కీయ జోక్ పేల్చి ఏకంగా జైలు పాల‌య్యాడు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోనూ వారంట్లు జారీ అయ్యాయి.   అస‌లు క‌మెడియ‌న్స్‌తో మ‌రీ ముఖ్యంగా ఫ‌రూకీతో బీజేపీ వారికి వ‌చ్చిన ఇబ్బందేమిటి?   హిందూత్వ వీరుల‌కు ఈయ‌న ఎందు కు న‌చ్చ‌లేదు?   విదూష‌కుని పాత్ర గురించి అంద‌రికీ తెలిసిన‌దే. అలాగంటే, మ‌హారాష్ట్ర‌లో ప్ర‌ద‌ర్శించే త‌మాసా వంటి జానప‌ద ప్ర‌దర్శ‌న‌ల్లో హాస్య‌గాడు ఉంటాడు క‌దా? అలాగే రామ్‌లీలా నాట‌కాల్లో మ‌రి అంతా  హాస్య‌గాళ్ల హాస్య‌ ధోర‌ణితోనే  గ్రామాల్లో  రాత్రిళ్లు తెల్లారుతుంటాయి. మ‌రి మ‌డిసి అన్నాక కూసంత ఆస్యం ఉండాలంటారు గ‌దా! అస‌లే కార్మికులు, క‌ర్ష‌కుల‌తో నిండి, రోజూవారి క‌ష్టాల‌తో బ‌తుకులు ఈడుస్తున్న ప్ర‌జలూ, ఈమాత్రం హాస్యానికీ నోచుకోకూడ‌ద‌ని ప్ర‌భుత్వాలే నిర్ణ‌యించేస్తే ఎలా? అలాంట‌పుడు  సంఘ్ వ్యవస్థ సమర్థించే స్వయం ప్రకటిత హిందూ నాగరికతని తామే కాపాడుతున్నామ‌న్న అతి భావ‌న‌లో ఉన్న‌వారు జోకుల‌ను ఎందుకు భ‌రించ‌లేక‌పోతున్నారు?  ఫరూఖీపై దాడి చేయడం దేనికి అంటే , ఫరూఖీ ఒక ముస్లిం, హిందూత్వ మితవాదం ముస్లింలను జాతీయ స్రవంతి నుండి పక్కకు నెట్టాలని నిశ్చయించుకుంది. ఈ ఏడేళ్లలో మతోన్మాదం పెరగడం విస్త‌రించ‌డం చూసిన ఎవరికైనా దాన్ని బహిరంగంగా చెప్పనవసరం లేదు. వివిధ రాష్ట్రాల్లోని బిజెపి పరిపాలనలు ఉన్మాద సంస్థలు,  ఫ్రీలా న్సర్‌ల ప్రయత్నాలను దయతో చూశాయి, మద్దతు కూడా ఇచ్చాయి. పోలీసులూ సంతోషంగా సహకరిస్తున్నారు. కానీ క‌మెడియ‌న్లు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ మీద కాస్తంత వెట‌కారంతో విసిరే మాట‌లు, జోక్స్‌ను హిందూత్వ కార్య‌క‌ర్త‌లకు బొత్తిగా మింగుడు ప‌డ‌కుండా ఉంది. జీవితాన్ని, విమ‌ర్శ‌ల్ని స‌ర‌దాగా తీసుకోవ‌డం కూడా చేత‌కాని వారు అధికారంలో ఉండ‌ట‌మే దుర దృష్టం. 2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌య‌లో ఫ‌రూక్ కామెడీ షో ఒక చిత్ర‌మైన అంశాన్ని లేవ‌నెత్తింది.. అస‌లా గొడ‌వ‌ల్లో జునాగ‌ఢ్ కుర్రాళ్లెవ‌రూ పాల్గొన‌లేద‌ని, కార‌ణం వాళ్లంత  బ‌ద్ధ‌కిస్టులు మ‌రొక‌రు లేక‌పోవ‌డ‌మేననీ. ఇలాంటి  జోకులు మతతత్వ అంశాలకు మతోన్మాద దర్పణం చూపకుండా ఉండ‌వు క‌నుక వీటిని ఆ మ‌హానుభావులెవ‌రూ స‌ర‌దాగా తీసుకోలేరు.  ఏడేళ్లలో ఒక్క మీడియా సమావేశం కూడా నిర్వహించని ప్రధాని గుజరాత్‌లోని జర్నలిస్టుల పట్ల కూడా అంతే జాగ్రత్తగా ఉన్నారు.  టెలివిజన్ ఛానెల్స్‌, అనేక ప్రింట్ పబ్లికేషన్‌లు వంటి బిజెపి అనుకూల మీడియా ప్రోత్సాహం పొందుతుంటే, మిగిలినవి దూష‌ణ‌కు గుర‌వుతున్నాయి. కీలకమైన వ్యవసాయ చట్టాలు రద్దయిన  సెషన్‌తో సహా ఐదు సెషన్‌ల కోసం పార్లమెంటు సెషన్ కవర్ చేయడానికి ప్రెస్‌లకు అను మతి లేదు. మన ప్రభుత్వాలనిర్వాకం ఇలా ఉంది మరి.

హేతుబ‌ద్దీక‌ర‌ణ‌పేర ఖాళీల భర్తీకి ఏపీ స‌ర్కార్ గండి

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గండి కొట్టేందుకు ఏపీ సర్కార్ హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయులను ఉన్న‌చోట‌నే స‌ర్దుబాటు చేసే అవకాశం ఉంది.  అస‌లు మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి అనేక సాంకేతిక ఇబ్బందులున్నాయని చెబుతోంది.   కొన్నిచోట్ల ఎక్కువ‌మంది విద్యార్ధులు, మ‌రికొన్ని చోట్ల ఎక్కువ‌మంది ఉపాధ్యాయులు ఉండ‌డం వంటి కారణాల వల్ల బోధన   అన్ని ప్రాంతాల్లోనూ   స‌మానంగా జ‌ర‌గ‌డం లేదని చెబుతోంది. ఈ కారణం చెబుతూ ఖాళీల భర్తీ జోలికి వెళ్లకుండా  ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ  నిర్వహించాలని ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది.   కరోనా వ‌ల్ల‌ గత రెండేళ్లుగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు.  అయితే హేతుబద్ధీకరణ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే పాఠ శాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారు? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉం టుంది?  అన్న విషయంపై  నివేదికను సిద్ధం చేశారు. ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం రేషనలైజేషన్‌లో స్థాన చలనం ఉంటుంది.  ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు   రెగ్యులర్‌గా నడుస్తుండడంతోపాటు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే   ఖాళీలు భర్తీ చేయాలంటే ముందుగా హేతుబద్ధీకరణ జరగాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసి నట్టు తెలిసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.  అయితే రేషనలైజేషన్‌లో భాగంగా ఎక్కువ మంది టీచర్లకు స్థాన చలనం అనివార్యమౌతుందని చెబుతున్నారు.  మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని నెల వారీగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నివే దికల్లో ఒకవేళ విద్యార్థుల ప్రగతి తగ్గినట్టుగా స్పష్టమైతే.. సంబంధిత పాఠశాల టీచర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.