సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువు తీస్తున్న జగన్
posted on Jul 25, 2022 @ 11:13AM
ముఖ్యమంత్రి ఎవరైనా ఏం చేయాలి? తెలిసో తెలియకో పొరపాటు చేసిన తన పార్టీ ఎమ్మెల్యేలకు వారి పొరపాటు ఏమిటో తెలియజేయాలి. సరిచేసుకునే అవకాశం ఇవ్వాలి. మరో సారి ఇలా చేయవద్దని మందలించాలి. మన్నించి వారి ఆబోరు కాపాడాలి. ఆ మాటకు వస్తే.. తన పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా విపక్ష ఎమ్మెల్యేల అభిమానం కూడా దెబ్బ తినకుండా చూసుకోవాలి. కానీ ఏపీ సీఎం జగన్ తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది.సొంత పార్టీ ఎమ్మెల్యేల పరువును ఆయనే తీసేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎంతసేపూ తన మాటే నెగ్గాలని, తానే అన్నింటికీ సుప్రీం అన్నట్లు జగన్ వ్యవహారం ఉందంటున్నారు. మూడేళ్లు సాధన చేసి మూలన ఉన్న ముసలిదాని నడ్డి విరగ్గొట్టాడన్న చందంగా ఉంది జగన్ ధోరణి అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఇజ్జత్ తీస్తే.. తన ఇజ్జత్ తీసుకున్నట్లేనని జగన్ గుర్తించలేకపోతున్నారని అంటున్నారు.
మూడేళ్లుగా ప్రజల కష్టాలు, ఇబ్బందులు, కడగండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తనకు జనం కావాలని, జనం ఓట్లు మళ్లీ తనకే కావాలంటూ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకూ వెళ్లాలని తరుముతున్నారు. ఇక్కడ మళ్లీ జనం గోడు కాదు జగన్ కు కావాల్సింది. వాళ్ల ఓట్లు మాత్రమేనట. గడప గడపకూ వెళ్లి తన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో చేసేసిందంటూ ప్రచారం చేయాలని జగన్ తన ఎమ్మెల్యేలను పంపుతున్నారు. వైసీపీ సర్కార్ ఈ మూడేళ్లలో ఒరగబెట్టింది ఇదిగో.. అంటూ ఏదో ఒక పేపర్ ఎమ్మెల్యేల చేతిలో పెట్టి.. జనాన్ని చెవిలో జోరీగలాగా ఊదర గొట్టాలని చెబుతున్నారు. తద్వారా తన పార్టీ ఎమ్మెల్యేలను కొరియర్ బాయ్ లుగా మార్చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వస్తున్నాయి. అంతే కాదు తమ వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాల్లోని ప్రజలు రోడ్లు లేవు, నీళ్లు రావు, విద్యుత్ సరఫరా ఇవ్వలేదు, టీడీపీ హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడంలేదేం.. ఇలా ఎన్నెన్నో స్థానిక సమస్యలతో నిర్మొహమాటంగా నిలదీస్తున్నారు. కొన్ని చోట్ల అయితే.. జనం తాము ఓటు వేసి గెలిపించిన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తిట్లు, శాపనార్థాలు పెడుతూ.. తీవ్రంగా అవమానించి మరీ వెళ్లగొడుతున్న సంఘటనలు ఎదురవుతుండడం గమనార్హం.
నిజానికి ఎవరైనా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కాగలిగారంటే.. జగన్ హవా కొంత తోడైనప్పటికీ.. ఆ ఎమ్మెల్యే విజయం వెనుక ఎంతో కొంత తన కృషి, సేవ, జనంలో పలుకుబడి తప్పకుండా ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ.. వైసీపీ ఎమ్మెల్యేల గెలుపు వెనుక కేవలం తన కష్టం, కృషే ఉందనే ధోరణి జగన్ లో బాగా వేళ్లూనుకుపోయి ఉందంటున్నారు. అందుకే వారిని తన పోస్టుమాన్ ల మాదిరి, కొరియర్ బోయ్ ల మాదిరిగా పరిగణిస్తున్నారంటున్నారు. తద్వారా ప్రజాస్వామ్యం అనే మాటకు విలువే లేకుండా తూట్లు పొడుస్తున్నారని సొంత పార్టీ వారే దుయ్యబడుతున్నారు.
వాస్తవానికి స్థానిక సమస్యలపై ప్రజలు ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిలదీయాలి? తమ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీనో, జెడ్పీటీసీనో, జెడ్పీ చైర్మన్ నో అడగాలి. కానీ, గడప గడపకూ అంటూ తమ ముందుకు వచ్చిన ఎమ్మెల్యే పట్ల కొన్ని చోట్ల కడుపు మండిన జనం నిలదీస్తున్నారు. దీంతో గడప గడపకు మన ప్రభుత్వం దేవుడెరుగు తమ గడపనే దాటలేని పరిస్థితి పలువురు ఎమ్మెల్యేలకు వచ్చింది. ఒక పక్కన జనం మధ్యకు వెళ్లాల్సిందే అని జగన్ హుంకరిస్తున్నా పబ్లిక్ లోకి వచ్చేందుకు పలువురు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారంటున్నారు.
తన మాటే శాసనం అనే తీరులో జగన్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నా స్థానిక సమస్యలపైనా, అభివృద్ధి లేమి పైనా జనానికి జవాబు చెప్పేందుకు తమ వద్ద పాయింట్ లేకపోవడంతో ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో గుర్తుకు రాని తాము ఎన్నికల తరుముకొస్తున్న వేళ మాత్రమే గుర్తొచ్చామా? అనే ప్రశ్న కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తమ అనుచరులు, శ్రేయోభిలాషుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న దాఖలాలు ఉంటున్నాయి. అధినేత తమను గౌరవిస్తే.. జిల్లా స్థాయి నేతలు, అధికారులు గౌరవిస్తారని, సీఎం వద్దే తమకు విలువ లేనప్పుడు ఇంకెవరు తమను పట్టించుకుంటారని అంటున్నారు.
మూడేళ్లుగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్రంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసి, తమను ఇబ్బందుల పాలు చేయడంలో ప్రజల్లో వైసీపీ పట్ల, జగన్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో జనం మధ్యకు వెళ్లి, వారి మధ్యే తిరిగి, ప్రజల సమస్యలు తెలుసుకుని, వారి మనసులు గెలుచుకోవలసిన అవసరం ఉందని తెలిసి వచ్చినట్లుందని పలువురు అంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలను వారి వారి నియోజకవర్గాలకు బలవంతంగా తరుముతున్నారంటున్నారు. ఇంతవరకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ లు నొక్కి పాలన సాగించిన జగన్ కు చేతులు కాలినట్లున్నాయని, అందుకే జనం గుర్తుకు వచ్చారంటున్నారు.
చివరిగా ఒక విషయం గుర్తు చేసుకోవాలి.. ‘వైసీపీలో జగన్.. పార్టీ జెండా మోసిన వారు మాత్రమే ఉంటారు’ అన్న మాజీ మంత్రి పేర్ని నాని మాటలు అక్షర సత్యాలు కావచ్చంటున్నారు. ఎమ్మెల్యేలకు కనీసం ద్వార దర్శన భాగ్యం అయినా కల్పించాలని పేర్ని చేసిన ప్రతిపాదన త్వరలో నెరవేరే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.