కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ
posted on Aug 5, 2022 @ 10:34AM
జనాన్ని కలుసుకుంటే నిరసనలు ఎదుర్కొనవలసి వస్తుందని భావిస్తున్న జగన్ జనంలోకి వెళ్లడం కంటే పార్టీ కార్యకర్తలను తన వద్దకు పిలిపించుకుని వారిని ఎన్నికలకు సమాయత్తం చేసి పార్టీ గెలుపునకు కెటలిస్టులుగా మార్చాలని యోచిస్తున్నట్లున్నారు. అందుకే ఆయన నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆయన కుప్పం కార్యకర్తలతోనే ఆయన ఈ భేటీలకు శ్రీకారం చుట్టారు. విపక్ష నేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలను ఆయన తాడేపల్లి సీఎం కార్యాలయానికి పిలిపించుకుని వచ్చే ఎన్నికలలో పార్టీ విజయానికి తీసుకోవలసిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
తెలుగుదేశం అధినేత సొంత నియోజకవర్గంలో ఆయనను ఓడించగలిగితే.. రాష్ట్రంలో క్లీన్ స్వీప్ అన్న లక్ష్యం సునాయసంగా సాధించగలమని జగన్ కార్యకర్తలకు తెలిపారు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో వైసీపీ విజయంతో అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు ఓటమికి బీజాలు పడ్డాయని జగన్ వారితో అన్నారు. అదే ఉత్సాహంతో ముందుకు సాగి అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి పరాభవం ఎదురయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు.
మరో సారి వచ్చే ఎన్నికలలో 175కు 175స్థానాలలోనూ మనదే విజయం అంటూ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నించారు. గడపగడపకూ మన ప్రభుత్వం వైఫల్యం, మంత్రల బస్సుయాత్రకు ఎదురైన పరాభవం వీటిని వేటినీ ఆయన కనీసం ప్రస్తావించలేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోనూ సమస్యలే లేవని, జనం అంతా వైసీపీవైపే ఉన్నారనీ కార్యకర్తలను నమ్మించే ప్రయత్నమే తప్ప, నియోజకవర్గ సమస్యల పరిష్కారం, జనాలను ఆకర్షించేందుకు తీసుకోవలసిన చర్యలు కానీ, హామీల అమలులో వైఫల్యాలు గానీ ఈ భేటీలో ఏ మాత్రం ప్రస్తావనకు రాలేదు. మనం గెలుస్తున్నాం.. గెలవాలంతే అన్న ధోరణిలోనే కుప్పం కార్యకర్తలతో జగన్ భేటీ సాగిందని విశ్వసనీయంగా తెలిసింది.