బయటపడుతున్నపార్థా, అర్పిత భాగస్వామ్య డీల్స్
posted on Aug 5, 2022 7:06AM
టీచర్స్ రిక్రూట్ మెంట్ కుంభకోణం కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. అంతులేని దోపిడీ జరిగిందని తేటతెల్లమౌతోంది. ఈ కేసులో ఇప్పటికే పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితలను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీలకు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోనికి వచ్చింది. అర్పిత ముఖర్జీ పేరిట ఏకంగా 31 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయని, ఆ అన్ని పాలసీలలోనూ నామినీగా అన్నింట్లోనూ పార్థ ఛటర్జీ పేరే ఉందనీ ఈడీ అధికారులు గుర్తించారు. పాఠశాలల ఉద్యోగ నియామకాల కుంభకోణం కేసు కుంభకోణం కేసుకు సంబంధించి బెంగాల్ మంత్రి పార్థ చటర్జీ అరెస్టయ్యారు. ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ప్లాట్ లో ఇటీవల ఈడీ సోదాలలో రూ.21.90 కోట్ల రూపాయలు కుప్పలుగా పోసి ఉండటాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన రాజకీయంగా సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగకముందే మళ్లీ పార్థా చటర్జీ అర్పిత ముఖర్జీకి చెందిన మరో ప్లాట్ లో ఈడీ నిర్వహించిన సోదాలలో కూడా భారీగా నగదు, బంగారం పట్టుబడింది.
అలాగే పలు కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో సారి పట్టుబడిన సొమ్ము కూడా కొలువుల కుంభకోణానికి సంబంధించిన సొమ్మేనని చెబుతున్నారు. తొలుత తనిఖీల్లో అర్పిత మొదటి ఫ్లాట్‌లో జరిపిన సోదాల్లో రూ. 21.90 కోట్ల నగదు, రూ. 56 లక్షల విదేశీ కరెన్సీ, రూ. 76 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సొమ్ము సొమ్ము మంత్రి పార్థ ఛటర్జీకి చెందినదేనని విచారణలో అర్పిత ఈడీ అధికారులకు తెలిపారు. విపక్షాల నాయకులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పి వేధిస్తున్నదని పార్లమెంటులో ఒక పక్క విపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలో ఇలా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన నాయకుడు మంత్రి భారీ నగదుతో పట్టుబడటం విపక్షాలను డిఫెన్స్ లో పడేసినట్లైంది. తన కేబినెట్ సహచరుడి విషయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఆయన తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్ష అయినా వేయండి అంటూ ఓ ప్రకటన చేసేసి ఆ కుంభకోణంలో తన పాత్ర లేదని చెప్పుకోవడానికే పరిమితమయ్యారు. అంతే కాకుండా ఆయనను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసేశారు.
ఈ కేసుకు సంబంధించి.. ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్న విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎల్ఐసీ పాలసీలతో పాటు ఏపీఏ యూటిలిటీ సేవల కింద జనవరి 1, 2012 నుంచి ఇద్దరి మీద భాగస్వామ్యానికి సంబంధించిన దస్తావేజులు వెలుగులోకి వచ్చాయి. ఈ భాగస్వామ్యం పేరు మీదనే పలు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు తమ దర్యాప్తులో తేలింది. కొన్ని ఆస్తులను నగదు రూపంలోనూ కొనుగోలు చేశారని, ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సిఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అలాగే అర్పిత నివాసంలో బోల్పూర్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిన ఓ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన కన్వేయన్స్ డీడ్ పత్రాన్ని కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ డీడ్ 2012 నాటిదని, దీన్నిబట్టి పార్థ ఛటర్జీ, అర్పిత ముఖర్జీ మధ్య ఆర్థిక, భూ సంబంధ లావాదేవీలు గత పదేళ్లుగా సాగుతున్నాయని ఈడీ నిర్ధారణకు వచ్చింది.
కాగా, ఈడీ సోదాల్లో బయటపడ్డ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై జరిగిన కుట్రకు కాలమే సమాధానం చెబుతుందని టీఎంసీ బహిష్కృత నేత.. బెంగాల్ మాజీమంత్రి పార్థ ఛటర్జీ చెబుతున్నారు. మరోవైపు ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీ మాత్రం తాను లేని టైమ్ లో తన ఇంట్లో ఆ డబ్బును పార్థా చటర్జీనే ఉంచారని, తన ఇంటిని మినీ బ్యాంకుగా వాడుకున్నారని ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు.