ఏపీకి భారీ వర్ష సూచన
posted on Aug 5, 2022 7:57AM
తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే ఏపీని మరో మారు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు శుక్రవారం (ఆగస్టు 5) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, పార్వతీపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది.
ఇక కడప, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాలలో సాధారణ వర్షపాతం ఉంటుందని పేర్కొంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాల్సిందిగా సంబంధిత శాఖలకు సూచించింది. డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వర్ష పాతం అధికంగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రాంతాలలో మోహరించింది.