మునుగోడులో కాల్పుల కలకలం
posted on Aug 5, 2022 7:43AM
తెలంగాణలో కాల్పుల సంస్కృతి విస్తరిస్తోందా? వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఔనని అనిపించక మానదు. తాజాగా నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కాంగ్రెస్ కు, అసెంబ్లీ సభ్యత్వానికీ రాజీనామా చేయడంత వార్తలలోకి ఎక్కిన మునుగోడు తాజాగా కాల్పుల ఘటనతో మరోసారి సంచలనానికి వేదిక అయ్యింది.
ఈ కాల్పులకూ, రాజకీయాలకూ ఏం సంబంధం లేదు. మునుగోడు మండలం సింగారం గ్రామంలో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన లింగు స్వామికి శీతల పానియాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉంది. గురువారం (ఆగస్టు 4) రాత్రి తన దుకాణాన్ని మూసేసి బ్రాహ్మణ వెల్లం గ్రామానికి బయలు దేరాడు.
అయితే మార్గ మధ్యంలో బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు లింగస్వామిపై కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు లింగుస్వామి మరణించాడని బావించి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి రక్తపు మడుగులో కుప్ప కూలిన లింగుస్వామిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగుస్వామి ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాపారంలో గొడవలే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు.