ఆ గట్టునుంటావా.. ఈ గట్టుకొస్తావా అంటూ.. పవన్ కు పాల్ ఆప్షన్లు
posted on Aug 5, 2022 8:19AM
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సారి హాస్యం పండించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో తనదే హవా అని దర్జాగా చెప్పేశారు. తనతో కలిస్తే జగన్ ను మరో సారి ఏపీ సీఎంగా చేస్తానన్నారు. అంతేనా తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు.
తన మాట వింటే జగన్ ఏపీ ముఖ్యమంత్రి అవుతారనీ, తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఏపీకి అన్ని విధాలుగా సహకరించి రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేస్తానని చెప్పుకొచ్చారు. అయితే జగన్ తనతో కలవక పోతే తనకేం నష్టం లేదనీ, తాను తెలంగాణ సీఎం అవ్వడం ఖాయమనీ, కానీ జగన్ మాత్రం తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ సారి ఆయన హాస్య ప్రసంగానికి వేదిక అనంతపురం. అనంతపురంలో కేఏపాల్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇంత వరకూ కొన్ని కుటుంబాలకే ఇప్పటి వరకూ అధికారం ఉందని, వాళ్లే సంపద దోచుకుంటున్నారని తాను ఆ పరిస్థితిని చిటికెలో మార్చేస్తాననీ చెప్పరు. ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా రెండు ఆప్షన్షు ఇచ్చారు. తమ్ముడూ పవన్ నువ్వు ఆగట్టు నుంటావో..ఈ గట్టు నుంటావో తేల్చుకోవాలని సూచించారు. పులి లాంటి తనవైపో, పిల్లిలాంటి చంద్రబాబు వైపో తేల్చుకోవాలని పవన్ కు సూచించారు. తన వైపు ఉంటే ఏపీకి ముఖ్యమంత్రి కాలేకపోయినా అధికారంలో భాగస్వామ్యం ఉంటుందనీ, లేకుంటే రాజకీయ ఉనికే ఉండదనీ హెచ్చరించినంత పని చేశారు.
ఇక తెలంగాణ విషయంలో అయితే ఆరు నూరైనా నూరు ఆరైనా కేసీఆర్ మరోసారి సీఎం కాలేరని తేల్చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన అంతం కావడం ఖాయమన్నారు. ఇన్నీ చెప్పిన ఆయన దేశంలో 18 పార్టీలు తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నాయన్నారు. తాను ప్రధాన మంత్రి అయితే దేశం ముఖచిత్రాన్నే మార్చేస్తాననీ, అగ్రరాజ్యం అమెరికాను మించి అభివృద్ధి చేస్తాననీ చెప్పుకున్నారు. ఇంతకీ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? దేశ ప్రధాని పదవిపై కన్నేశారా అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలలో తన ప్రజాశాంతి పార్టీదే హవా అని తేల్చేశారు.