పోలీసులు సుప్రీం ఆదేశాలు పాటించమనండి...సీఎస్‌కు టీడీపీ వినతి
posted on Sep 18, 2022 @ 9:46AM
అక్రమంగా అరెస్ట్, లాకప్డెత్, కోర్టుకు హాజరుపరచకుండా నిర్బంధించి హింసించటం..ఇలా పోలీస్ శాఖపై ఎన్నో సందర్భాల్లో ఆరోపణలు చూశాం..చూస్తూనే వున్నాం. విచారణ పేరుతో నింది తులకు చిత్రహింసలు, ఒక్కోసారి నిరపరాధులు కోర్టు మొహం చూడకుండానే పోలీస్ అతి మర్యాదలు, ఇలా కక్షపూరితంగా హింసించిన సందర్భాల్లో లాకప్ డెత్లు దానిపై విచారణలు కూడా జరిగాయి. పోలీస్ శాఖలో ఈ తరహా హింసను అరికట్టడా నికి ఎన్నోమార్గదర్శకాలు వెలు వడ్డా, ఇప్పటికీ పరిస్థితిలో మార్పు రావటంలేదని న్యాయ నిపుణు లు, మానవ హక్కుల సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
కేసుల విచారణ సమయంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాల ప్రకారం వ్యవహరించేలా ఆదేశా లు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీడీపీ న్యాయ విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ విభాగానికి చెందిన ప్రముఖ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఒక లేఖ రాశారు.
రాష్ట్రంలో పోలీసులు మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నారు. ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు అవసరం. నిందితు లను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు, సీఐడీ, ఏసీబీ సంస్థలకు చెందిన అధికారులు, సిబ్బంది వేధింపులకు, శారీరక హింస కు పాల్పడుతున్నారు. అర్ధరాత్రి వేళ తలుపులు పగలగొట్టి మరీ అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. విచారణ పేరుతో అనుమానితులను చిత్రహింసలకు, భావోద్వేగ వేధింపులకు గురి చేస్తున్నారు. అనుమానితులకు చెందిన డెస్క్‌టాప్ కంప్యూ టర్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఐపాడ్‌లు వంటి వాటిని దోచుకొంటున్నారు. తీసుకొన్న వస్తువుల వివరాలు దర్యాప్తు సమయంలో రికార్డుల్లో నమోదు చేయడం లేదు. విచారణ ప్రదేశాల్లో సీసీ కెమేరాలు పెట్టడం లేదు. దర్యాప్తు సంస్థల అధికారులు, సిబ్బంది వారి శాఖకు, హోదాకు సంబంధించిన బ్యాడ్జీలు పెట్టుకోవడం లేదు.
ఇటువంటి చర్యలు సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమే. అనుమానితులను విచారంచే ముందు దర్యాప్తు సంస్థల అధికా రులు, సిబ్బంది తమ పేరు, హోదా తెలిపే బ్యాడ్జీలు తప్పనిసరిగా ధరించాలి. కోర్టు ఆదేశాలకు కట్టుబడి విచారణ ప్రదేశంలో సీసీ కెమేరాలు అమర్చాలి. విచారణ దృశ్యాలు రికార్డు చేయాలి. పోలీస్ స్టేషన్లు, దర్యాప్తు సంస్థల కార్యాలయాల వద్ద తప్పని సరిగా సీసీ కెమేరాలు అమర్చేలా చర్యలు తీసుకోవాలి’’ అని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
పోలీసులపై వలసవాద ముద్ర తొలగిపోవడం లేదు. వేధింపులను, అణచివేతలను వారు ఓ సాధనంగా ఇంకా ఉపయోగిస్తు న్నారు. అరెస్టు చేసే అధికారాన్ని వినియోగించడంలో పోలీసుల అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. పోలీసుల అవినీతికి అరెస్ట్ అనేది లాభదాయకమైన వనరుగా మారిపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పోలీసుల అధికార దుర్వినియోగా నికి అడ్డుకట్ట వేయకపోవడం మేజిస్ట్రేట్ ల వైఫల్యం. నిందితుడిని ముందుగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతా విషయాలను పరిశీ లించడం సరికాదు. అరెస్ట్ సమయంలో సెక్షన్41 నిబంధనలను సరిగ్గా పాటిస్తే ముందస్తు బెయిల్ కోసం వచ్చే వారి సంఖ్య గణ నీయంగా తగ్గుతుంది. యాంత్రికంగా రిమాండ్ చేయడం మేజిస్ట్రేట్ లకు తగని పని. అరెస్ట్ అధికారాన్ని వాడే సమయంలో వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక క్రమం మధ్య సమతుల్యతను పాటించాలి. అరెస్టు వల్ల ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. స్వేచ్ఛ ను కోల్పోతాడు. అతనిపై పడిన అరెస్టు మచ్చ జీవితాంతం కొనసాగుతుంది. ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప అరెస్ట్ అధి కారాన్ని ఉపయోగించకూడదు. కొంత దర్యాప్తు చేసిన తర్వాత ఆ వ్యక్తి మీద వచ్చిన ఆరోపణల్లో సత్యం ఉందని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు అరెస్టు చేయవచ్చు. అయితే ఆ నేరం కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్ అయినంత మాత్రాన అరెస్టు చేయడం చట్టబద్ధం కాదు.
అరెస్టు చేసే అధికారం ఉండటం ఒక ఎత్తయితే, దానికి న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తు. ఆరోపణలు రాగానే వ్యక్తులను అరెస్టు చేయకూడదు. అరెస్టు చేయడానికి ముందు పోలీస్ అధికారి తనని తాను ప్రశ్నించుకోవాలి. అరెస్టు ఎందుకు చేయాలి? నిజంగా అవసరమా ? ఏ ప్రయోజనం కోసం అది ఉపయోగపడుతుంది ? ఏ ఉద్దేశాన్ని నెరవేరుస్తుంది ? ఈ ప్రశ్నలు వేసుకొని వాటికి జవాబులు దొరికిన తర్వాత ఒకటి రెండు కారణాలు సంతృప్తికరంగా అనిపిస్తే అరెస్టు అధికారాన్ని ఉపయోగించాలి. ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో లేదా ఏడేండ్ల వరకు శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో పోలీసులకు సంతృప్తి కలిగినప్పుడు కూడా అరెస్టు చేసే అధికారం లేదు. ఆ వ్యక్తి తిరిగి నేరం చేయకుండా నిరోధించడానికి, అరెస్టు తప్పనిసరని పోలీస్ అధికారి సంతృప్తి చెందినప్పుడు, కేసును సరైన దిశలో దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాన్ని ఆ వ్యక్తి అదృశ్యం, తారుమారు చేయకుండా ఉండటానికి, ఇతర నేరాలు చేయకుండా ఉండటానికి అరెస్టు చేయవచ్చు. ఆ వ్యక్తిని అరెస్టు చేయకుండా భవిష్యత్తులో కోర్టు ముందు హాజరు పరచలేమని భావించినప్పుడు కూడా అరెస్టు చేయవచ్చు. అయితే ఈ కారణాలని పోలీస్ అధికారి రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.