వైఎస్ ది హత్య.. నా ప్రాణాలకూ ముప్పు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
posted on Sep 19, 2022 8:22AM
వైఎస్ షర్మిల దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా, ఏపీ సీఎం జగన్ సోదరిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆమెది పరిచయం అక్కర్లేని పేరు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలు పాలైన సందర్భంగా జగనన్న విడిచిన బాణాన్ని అంటూ ఆమె చేసిన పాదయాత్ర, ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలూ అప్పట్లో ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి, ఆకట్టుకున్నాయి.
ఏపీలో 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి అధికారంలోకి రావడానికి షర్మిల ప్రచారం కూడా ఓ కారణం అని అనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆ తరువాత కారణా లేమైనా ఆమెకు ఏపీ సీఎం జగన్ కూ మధ్య దూరం పెరిగింది. దీంతో ఆమె ఆంధ్రను వదిలేసి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ సొంత కుంపటి పెట్టుకున్నారు.
ప్రజా సమస్యలపై నిరంతర యాత్రలలో ఆమె జనం మధ్యే ఉంటున్నారని చెప్పాలి. అయితే తెలంగాణలో ఆమె యాత్రను అసలెవరైనా పట్టించుకుంటున్నారా? అంటే అనుమానమే. తీవ్ర పదజాలంతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులపై చేస్తున్న విమర్శలకు ఎవరూ స్పందిస్తున్న దాఖలాలు లేవు. ఆమెపై చర్యలు తీసకోవాలంటూ మంత్రులు తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేసినా అదేమంత పెద్ద విషయంగా ప్రజలెవరూ భావించలేదు.
అయితే ఇప్పడు ఆమె గురించి ఈ ప్రస్తావన ఎందుకంటే..తాజాగా ఆమె తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం మౌనంగా ఉండి ఇప్పుడు తన తండ్రి వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కాదని బాంబు పేల్చారు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాదంటూ ఆయన కుమార్తె, వైఎస్సార్ టీపీ అదినేత్రి చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా సంచలనం రేపాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి, జగన్ ముఖ్యమంత్రి కావడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం, తద్వారా వచ్చిన సానుభూతే కారణమని పరిశీలకులు అంటారు.
ఇప్పుడు అన్నతో విభేదించి తెలంగాణ రాజకీయాల్లో ఒంటరి పోరు సాగిస్తున్న షర్మిల తన తండ్రి మరణం అనుమానాస్పద స్థితిలో సంభవించిందంటూ చేసిన వ్యాఖ్యలు మామూలుగా తీసుకోవడానికి వీల్లేదు. కేవలం తన సోదరుడిలా తన తండ్రి మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించు కోవాలని ఆమె భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో తన సోదరుడికి కలిసి వచ్చిన ఈ సెంటిమెంట్ తెలంగాణలో తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ హెలికాప్టర్ వెనుక కుట్ర ఉందని చెప్పిన షర్మిల తన ప్రాణాలకూ ముప్పు ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైఎస్ మరణాన్ని రాజకీయంగా వాడుకోవడం ఆయన పిల్లలైన జగన్, షర్మిలలకు ఇదే మొదటి సారి కాదు.
గతంలో ఏపీలో ప్రచార సమయంలో జగన్, షర్మిలలు రిలయన్స్ పై ఇటువంటి ఆరోపణలే చేశాడు. అప్పట్లో రిలయన్స్ షోరూలంపై దాడులు కూడా జరిగిన సంగతి విదితమే. ఇంత కాలం తరువాత ఇప్పుడు ఇప్పుడు మళ్లీ షర్మిల మళ్లీ తన తండ్రి మరణం వెనుక కుట్ర.. ఆయనది హత్య అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడానికి ఆమె పార్టీని కానీ, ఆమె యాత్రను కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడమే కారణమని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకూ 2 వేల కిలోమీటర్లు నడిచినా (పాదయాత్ర) ఫలితం లేకపోవడం.. ప్రజలే కాదు.. పార్టీలూ పట్టించుకోకపోవడం టీఆర్ఎస్ అధినేత, నేతలను తీవ్ర పదజాలంతో విమర్శించినా వారి నుంచి స్పందన లేకపోవడంతో షర్మిల సంచలనం కోసం, గుర్తింపు కోసం వైఎస్ మరణం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారంటున్నారు. వైఎస్ఆర్ ను చంపారని.. తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపణలు చేశారు.