పవన్ బస్సు యాత్ర వాయిదా.. సినిమాల కోసమేనా అని జనసేన శ్రేణుల అనుమానం
posted on Sep 19, 2022 @ 11:10AM
మామూలుగా రాజకీయ నాయకులు ప్రజలకు మతిమరుపు ఎక్కువ అనుకుంటారు.. అందుకే గతంలో ఇచ్చిన హామీలను విస్మరించి కొత్త కొత్త హామీలతో ప్రజలను ఇట్టే మభ్యపెట్టేయచ్చనుకుంటారు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు స్వయంగా మతి మరుపు ఎక్కువ.. ప్రతి రోజూ పుస్తకాలు చదువుతాను.. పుస్తకాలు ఉంటే నాకింకేం అక్కర్లేదు అనే ఆయన ఏ రోజు చదివింది ఆ రోజే మరచిపోతారేమో అని పించేలా ఉంటుంది ఆయన వ్యవహారం. ఆయనకు తానో రాజకీయ పార్టీ అధినేతను అన్న సంగతి కేవలం వీకెండ్ లోనే గుర్తుకు వస్తుందా అన్న అనుమానం జన బాహుల్యంలో కలిగే విధంగా ఆయన కేవలం ఆదివారాలు (వీకెండ్)లో మాత్రమే మాట్లాడతారు.
అదీ గత వారం ఏ మాట్లాడారో మరచిపోయి అందుకు పూర్తిగా భిన్నంగా తదుపరి వారం మాట్లాడతారు. సరిగ్గా ఈ విషయం మీదే మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని జనసేనానిని విమర్శలతో ఓ ఆట ఆడుకున్నారు. తన అన్న చిరంజీవి పెట్టిన పార్టీ ప్రజారాజ్యంతో రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ తరువాత చాలా కాలం పాటు కేవలం సినిమాలే జీవితం అన్నట్లుగా బతికేసి ఆ తరువాత తీరిగ్గా జనసేనను స్థాపించారు. 2019 ఎన్నికలలో అధికారమే లక్ష్యం అంటూ ఒంటరిగా బరిలోకి దిగి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి పరిమితమయ్యారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. సరే ఆ తరువాత ఏం జ్ణానోదయం అయ్యిందో ఏమో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్నారు.
మొన్నీ మధ్య తన అన్న చిరంజీవి పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఉండి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లో బలీయమైన రాజకీయ శక్తిగా అవతరించి ఉండేదని అన్నారు. తన అన్న పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ఇప్పుడు వైసీపీలో కీలక స్థానాలలో ఉన్న వారే కారణమనీ, వారి తప్పుడు సలహాలతోనే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారనీ సూత్రీకరించారు. ఆ విషయం మరచిపోయారో ఏమో తాజాగా తన అన్న చిరంజీవి రాజకీయంగా తప్పులు చేశారనీ, కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి ద్రోహిగా మారారనీ అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఈ విషయాన్ని పేర్ని నాని 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తనతోపాటు 18 స్థానాలు గెలిపించుకుకున్న చిరంజీవి.. ఆ తరువాత వాస్తవం అర్ధం చేసుకుని రాజకీయాల నుంచి బయటకు వచ్చేశారనీ, అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ లా రోజుకో పార్టీ, పూటకో సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనీ విమర్శలు గుప్పించారు.
ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి వరదలు వస్తే బాధితులకు అండగా నిలబడ్డారు, వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆ పార్టీ యువ నేతగా పవన్ కల్యాణ్ ఒకటి రెండు సభలలో ప్రసంగాలకే పరిమితమయ్యారని పేర్ని నాని గుర్తు చేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం పార్టీకి కనీసం రాజీనామా కూడా చేయకుండా సినిమాలంటూ రాజకీయ తెర మీద నుంచి అదృశ్యమయ్యారని పవన్ పై విమర్శలు గుప్పించారు. ఆ విషయాలన్నీ విశ్మరించి ఇప్పుడు వైసీపీ ఇన్ని సీట్లకే పరిమితమౌతుందంటూ చిలక జోస్యం చెప్పడమేమిటని విరుచుకుపడ్డారు. అసలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన ఎన్ని స్థానాలలో అభ్యర్థులను నిలబెడుతుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.
పేర్ని నాని విమర్శించారని కాదు కానీ, అసలు పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా స్థిరత్వం ప్రదర్శిస్తున్నారా అన్ని జనసేన శ్రేణుల్లోనే సందేహం వ్యక్తమౌతోంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని అందరి కంటే ముందు పోత్తు ఊసెత్తిన పవన్ కల్యాణ్ ఇప్పుడా మాట విస్మరించి ఓటు చీల్చే రాజకీయం చేస్తున్నారా అన్న అనుమానాలు ఆ పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి. దసరాకు బస్సు యాత్ర అని ఘనంగా ప్రకటించి ఇప్పుడు వాయిదా వేయడానికి కారణాలే ఎందుకు చెప్పడం లేదని అంతర్గత చర్చల్లో మధన పడుతున్నారు.
ఆయనకు రాజకీయాలు పార్ట్ టైమ్ లా ఉన్నాయనీ, ఫుల్ టైమ్ ప్రొఫెషన్ సినీమాలేనని అంటున్నారు. ఇప్పుుడ బస్సు యాత్ర వాయిదాకు కూడా సినిమా షూటింగులే కారణమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.