కాంగ్రెస్‌ను యువభారత్ పార్టీగా మారుద్దాం...శశిథరూర్ సూచన
posted on Oct 7, 2022 @ 12:18PM
వెనకటికి పులి చారల కోసం తోడేలు వాతలు పెట్టించుకుందిట. ఇపుడు కేసీఆర్ తన పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ ఎస్ గా మార్చారు. ఎన్నికల కమిషన్ ఓకే అనేస్తే ఇక అదే పేరు ఖాయమై ఎన్నికల్లోకి అదే పేరుతో పోటీ చేస్తుంది. ఆయన జాతీయ రాజకీయాలమీద దృష్టి సారించడంతో పార్టీని ఆ దిశగా పరుగులు పెట్టించాలని ఆ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలే ఎక్కవగా వినపడుతు న్నాయి. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, వీరాభిమానులను ఉత్సహంగా ఉరకలు వేయిం చడానికి కార్యోన్ముఖులను చేయడానికి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసా గిస్తున్నారు. దీనికి తోడుగా యువతను ఆకట్టుకోవడానికి అసలు పార్టీ పేరునే యువ భారత్ కాంగ్రెస్ అంటూ పేరు మారిస్తే ఎలా ఉంటుందని థరూర్ అభిప్రాయాన్ని కాంగ్రెస్ సీనియర్లకు వినిపించేలా అన్నారు. అనాదిగా దేశంలో అన్ని ప్రాంతాల్లో గట్టి మద్దతు, కార్యకర్తల బేస్ ఉన్న పురాతన పార్టీకి పేరు మార్చాలని థరూర్ ఎందుకు ఆలోచన చేసినట్టు?
కాంగ్రెస్ క్రమేపీ యువతను మరింతగా ఆకట్టుకుంటూ భవిష్యత్ మరింత అనుకూలించేలా వ్యూహ రచ నలు చేస్తూ ముందుకు పోతోంది. అయితే పార్టీ నాయకత్వం మార్పు అవసరం అని భావించిన కాం గ్రెస్ ఏకగ్రీవ ఎన్నిక కష్టమై ఎన్నిక దాకా వెళుతోంది. పోటీలో సీనియర్లు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఉన్నారు.
కాంగ్రెస్ భావీభారత పౌరులను ఆకట్టుకోవాలంటే ఇలా భారత్ జోడో యాత్రలు చేయడంతో పాటు పార్టీ లోకి యువతను మరింత ఆకట్టుకోవాలని భావించారు. దేశంలో యువత ఎక్కువ శాతం ఉందని వారిని పార్టీవైపు మొగ్గేలా చేస్తే పార్టీ మరింత పటిష్టపడి బీజేపీని ఎదిరించగలదని థరూర్ అభిప్రాయం. అంతేకాదు అందుకు పార్టీ పేరునీ మార్చుకుంటే బావుంటుందనే సూచన ఢిల్లీ పెద్దలకు మరింత బాగా వినిపించేలా అన్నారు. సాధారణ కార్యకర్తలు, ముఖ్యంగా యువకుల నుంచి తనకు సానుకూల స్పం దన వస్తోందని చెప్పారు.
రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడీ యాత్ర, కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలు పార్టీకి ముఖ్యమని, విప క్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో తనకు యువత మద్దతుగా నిలవడం సంతోషంగా ఉంది. 35 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసున్న వారు దేశ జనాభాలో 65 శాతం ఉన్నారు. మనది యువ భారత్. యువ భారత్ పార్టీగా కాంగ్రెస్‌ను మార్చాలని భావిస్తున్నానన్నారు. యువ భారత్ ఆశలు, ఆకాంక్షలు, కలలకు ప్రాతినిధ్యం వహించాలని ఆశిస్తున్నానని, ప్రస్తుతం యువ భారత్‌కు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముంది. యువతతో పాటు పార్టీలోని సీనియర్లు కూడా తనకు మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని శశిథరూర్ అన్నారు.