కావడానికి చిన్న గ్రామమే...కేసీఆర్‌కు మహా కీలకం
posted on Oct 7, 2022 @ 11:18AM
తన పార్టీ పేరును టీఆర్ ఎస్ నుంచి బీఆర్ ఎస్‌కు మార్చినా, దేశ రాజకీయాల్లోకి దూసుకెళ్ళాలని ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు నియోజకవర్గం లోని చిన్న పల్లె మీద ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించారు. అదే లంకలపల్లి. హైదరాబాద్ నుంచి 75 కి.మీ దూరంలో ఉన్న ఈ పల్లో జనాభా కేవలం 2,085మంది. అయినా దీనికో ప్రత్యేకతా ఉంది. ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున రంగంలోకి దిగడానికి సిద్ధపడుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సన్నిహితుడు పాకా సతీష్ గ్రామం అది. అతను తన అనుచరులతో కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లోకి చేరడానికి ఉత్సాహ పడుతున్నాడు. మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనుంది.
మునుగోడు మండలంలోని ఆ పల్లె గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్ కు మద్దతునిస్తూన్నది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి మారడంతో కాంగ్రెస్‌కు పట్టు సడలింది. గత సర్పంచ్ ఎన్నికల్లో సతీష్ 1,857 లో అధిక శాతం సాధించి గెలిచాడు. అతనికి సర్పంచ్‌గా మంచి పేరు ఉంది. అంతకు ముందు ఎన్నికల్లోనూ మంచి మెజారిటీతో సర్పంచ్‌గా గెలిచాడు. కాగా మునుగోడు ఉప ఎన్నికలకు ముందే సతీష్ కాంగ్రెస్‌ను కాదని టీఆర్ ఎస్ కారు ఎక్కేందుకు సిద్ధపడటం ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బే అవుతుందంటున్నారు.
అయితే ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామం కాదు. రెండు మాసాలుగా సతీష్ కోసం టీఆర్ ఎస్ వలవేసింది. చేప ఇప్పటికి పడిందంతే! చాలామంది సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు ఈ ప్రాంతంలో అనాదిగా కాంగ్రెస్‌కే మద్దతునిస్తూన్నారు. ఇపుడు వారంతా సతీష్ బాటలో నడిచే అవకాశం ఉంది. ఉప ఎన్నికలకు రాష్ట్ర ఆరోగ్యమంత్రి హరీష్ రావును మర్రిగోడు మండల ఇన్‌ఛార్జును చేశారు కేసీఆర్. ఆయ న్ను సర్పంచ్‌లతో సమావేశమై మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ ఎస్ ను గెలిపించాలన్న సం దేశాన్ని బాగా వినిపించమని కేసీఆర్ ఆదేశించారు. అంతేగాక రోజూ నిద్రపోనీకుండా చేసి అక్కడి వారి నుంచి సమాచార సేకరణకు ఉపక్రమించారు.
దీనికి తోడు టీఆర్ ఎస్ పేరు బీఆర్ ఎస్‌గా మారడంతోనే గ్రామంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి ఆనం దించారు. టీఆర్ ఎస్‌ను మునుగోడులో గెలిపించే పథకంలో భాగంగా టీఆర్ ఎస్ సీనియర్లు హరీష్, కేటీ ఆర్, ఇతర ఎమ్మెల్యేలు అందరూ ఈ చిన్నగ్రామంలో ప్రచారం మీదనే ఎక్కువ దృష్టిపెట్టారు. ఇటీవలి టీఆర్ ఎస్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలోనూ, గ్రామాల్లో పార్టీ ప్రచారానికి ప్రతీ ఎమ్మెల్యేకీ ఒక్కో గ్రామం అప్ప గించారు.
మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మొత్తం 80 గ్రామాలు ఉన్నాయి. ఎన్నికలు ముగిసే వరకూ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి పార్టీ ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికకు ప్రతీ గ్రామాన్ని ఎంతో కీలకంగా తీసుకోవడమే కాకుండా కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.