కోనసీమలో బీఆర్ఎస్ పోస్టర్ల కలకలం
posted on Oct 7, 2022 @ 10:57AM
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి పూర్తిగా రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రకంపనలు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా చెప్పుకునే కోససీమలో బీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి.
ఆ పోస్టర్లు ఎవరు వేశారు అన్న విషయంలో స్పష్టత లేకపోయినా, కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని ప్రధాన కూడలి అయిన గడియారస్తంభం సెంటర్ లో బీఆర్ఎస్ పోస్టర్లు వెలిశాయి. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పేర వెలసిన ఈ పోస్టర్లలో ఆ అభ్యర్థి పేరు కూడా లేదు. కేసీఆర్ పై ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉంటుందనీ, ఇంత కాలం ఏపీపై విద్వేషం వెళ్లగక్కిన ఆయనను జాతీయ పార్టీ పెట్టిన వెంటనే ఏపీ జనం ఎలా అంగీకరించి, ఆయన పార్టీని స్వాగతిస్తారనీ పలు విశ్లేషణలు వెలువడ్డాయి.
ఆయన ఏ అజెండాతో ఏపీలో ప్రవేశించగలుగుతారని కూడా పలువురు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత జీవీఎల్.నరసింహరావు కూడా బీఆర్ ఎస్ పార్టీపై స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ కు బీఆర్ ఎస్ వస్తే రావచ్చనీ, కానీ వచ్చేముందు ఆ పార్టీని తాము నిలదీస్తామని స్పష్టం చేశారు. అలాగే ఏపీలో అధికార వైసీపీ కూడా కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీపై స్పందించింది. ప్రస్తుతానికి పార్టీ పేరు ప్రకటించారు మినహా, రాజకీయ అజెండాను, వచ్చే ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో పోటీ చేస్తామనేది స్పష్టంగా చెప్పలేదనీ అందుకే ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను తాము స్వాగతిస్తామని వ వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కేసీఆర్ పార్టీతో తమకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
కేసీఆర్ కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్ ఎస్ పార్టీ పేరుతో వెలసిన ఫ్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్ ఛార్జిలను ప్రకటించలేదు. అయినప్పటికి కోనసీమలోని అమలాపురం పట్టణంలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ ఎస్ ఏంపీ అభ్యర్థినంటూ ఫ్లెక్సీలు వెలిశాయి.