కొడాలి నాని పరిస్థితి ఏంటి.. వైసీపీ కూరలో కరివేపాకేనా?
posted on Oct 7, 2022 7:23AM
వాడుకోవడం అనే పదాన్ని వాడుకోవడంలో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలిసినంతగా.. ఆ పార్టీలో మరోకరిని తెలియదనే ఓ చర్చ వైసీపీలో లీడర్ నుంచి క్యాడర్ వరకు జోరుగా నడుస్తోంది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చే వరకు తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల సేవలను ఎంతగా ఉపయోగించుకున్నారో తెలిసిందే. ఆ తరువాత అధికారం దక్కిన తరువాత వారిని జగన్ పక్కన పెట్టేయడంతో వారు తెలంగాణకు పరిమితమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇలా వదిలించుకునే వారి జాబితాలోకి గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని పేరు కూడా చేరిందన్న చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది.
ఇటీవల జగన్ అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో.. పని తీరు బాలేదంటూ హెచ్చరించిన వారి జాబితాలో కొడాలి నాని పేరు కూడా ఉందని, ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేనట్టేనని పార్టీ వర్గాల్లోనే కాదు, గుడివాడ నియోజకవర్గంలో కూడా జోరుగా సాగుతోంది. జగన్ వ్యవహార శైలి కొడాలి నాని స్పందన సంగతి పక్కన పెడితే, నాని ఫ్యాన్స్ మాత్రం తెగ హర్టయిపోయారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే.. తన కేబినెట్‌లోకి కొడాలి నానిని తీసుకున్నారు. ఆ క్రమంలో జగన్‌పై దోమ కాదు సరికదా ఈగ కూడా వాలనివ్వకుండా కొడాలి నాని చూసుకున్నారని.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బాహుబలి సినిమాలో కట్టప్ప మాదిరిగా జగన్ పట్ల వ్యవహరించారని వారు గుర్తు చేసుకుంటున్నారు. జగన్‌పై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఇలా విమర్శలు గుప్పిస్తే.. అలా ప్రెస్ మీట్ పెట్టి.. అలా అలా బండబూతులతో వారిపై విరుచుకుపడేవారని కొడాలి నాని ఫ్యాన్స్ ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.
దీంతో పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పేరు కాస్తా.. బూతుల సరఫరా శాఖ మంత్రిగా ప్రజల్లో నానిపోయిందని వారు చెబుతున్నారు. జగన్ తొలి కేబినెట్‌లో ఇతర మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నాబాబు వగైరా వగైరా ఉన్నా.. వారికెవరికీ రానీ పేరు..గుర్తింపు కొడాలి నానికి మాత్రమే వచ్చిందని వారు వివరిస్తున్నారు. అలాంటి తమ నాయకుడు ప్లస్ తమ ఆరాధ్య దైవం కొడాలి నానిని అలా వాడుకొని ఇలా వదిలేస్తారా? అంటూ వారంతా జగన్ పై గుస్సా అవుతున్నారు.
చివరికీ జగన్ కోసం కొడాలి నాని రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆయన కుమారుడు నారా లోకేశ్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై నాని విమర్శలు గుప్పించారని వారు గుర్తు చేసుకొంటున్నారు. జగన్ మలి కేబినెట్‌లో కూడా కొడాలి నానికి చోటు దక్కుతుందని తామంతా భావించామని.. కానీ అలా జరగలేదని వారు వివరిస్తున్నారు.
చివరికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి.. వైయస్ఆర్ పేరు పెట్టడంపై కొడాలి నాని మనస్సు తీవ్రంగా గాయపడిందని..... అయన ఈ అంశంపై తమ అభిమాన నాయకుడు నాని ఎక్కడా పెదవి విప్పలేదని.. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కోసం తమ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంత చేస్తే.. చివరికీ ఆయన పట్ల వైయస్ జగన్ ఇలా.. వ్యవహరించడం సరికాదని మొత్తం మీద నానిని జగన్ కూరలో కరివేపాకులా తీసి పారేశారన్న భావన మాత్రం అందరిలో వ్యక్తమౌతోంది.