బీజేపీ’ బీ టీమ్ బీఆర్ఎస్
posted on Oct 6, 2022 @ 9:38PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మిత్రులు. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి ఇద్దరూ హ్యాట్రిక్ సాధించేందుకు, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మక వైరాన్ని ప్రదర్శిస్తున్నారు. నువ్వు కొట్టినట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్న రీతిలో వ్యవహరిస్న్తున్నారు. ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి అటు ఉభయ పక్షాలూ ఒకరిపై ఒకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది ప్రత్యర్ధి పార్టీలు చేసే ఆరోపణ అనిపించినా, కాదు. నిజం.
నిజానికి, ఇదే విషయాన్ని తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో నెత్తీ నోరూ కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా ఎందుకనో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పడు మరోసారి అదే విషయం తేట తెల్లంగా తెలిసిపోయింది. విజయ దశమి పండగ పూట కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసేఆర్ తెలంగాణ మోడల్ ఒక్కటే ప్రత్యామ్నాయం అంటూ చాలా కాలంగా ప్రచారం కూడా జరుగుతోంది.
కానీ, ఇంతా చేసి చివరకు జాతీయ పార్టీ ప్రకటన తర్వాత, ఆయన తమ జాతీయ పోరాటం గుజరాత్ నుంచి కాదు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రారంభ మవుతుందని ప్రకటించారు. నిజానికి, కర్ణాటక, మహా రాష్ట కంటే ముందుగా గుజరాత్ అసెంబ్లీకి మరో రెండు నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నిజంగా మోడీని, గుజరాత్ మోడల్ ను వ్యతిరేకించడమే నిజం అయితే, ముందుగా ఆయన తమ జాతీయ పోరాటాన్ని గుజరాత్ నుంచి ప్రారంభిచాలి. కానీ, అయన అసలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావనే తీసుకురాలేదు. దీని భావమేమి చంద్రశేఖర అంటే సమాధానం రాదు.
నిజానికి కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే కేంద్రంలో మళ్ళీ మరో సారి మోడీని గెలిపించెందుకే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదే పదే చెపుతున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేసీఆర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచేందుకు కాంగ్రెస్ మిత్ర పక్షాలను ఏకంచేసి దిశగా ప్రయత్నాలు సాగిస్తునారు. తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిశారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేద్దాం రమ్మని ఆహ్వానించారు. అలాగే, మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచి విడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ లోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పొతే కేసేఆర్ థర్డ్ ఫ్రంట్ ఆలోచన కాంగ్రెస్ ను బలహీన పరిచి బీజేపీని బలపరిచేందుకు చేసిన కుట్ర. సరే ఆ ప్రయత్నం ఫలించ లేదనుకోండి అది వేరే విషయం.
ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టే ఇప్పుడు జాతీయ పార్టీ పేరున తక్షణం అసెంబ్లీ ఎన్నికలు జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలను వదిలేసి బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కర్ణాటక,మహారాష్ట్రలను ఎంచుకున్నారు. అంత వరకు ఎందుకు గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు. సో ... అనుమానం లేకుండా కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్, నిజానికి భారతీయ జనత పార్టీ (బీజేపీ) బీ టీమ్. ఇది కూడా ఆరోపణ కాదు నిజం అంటున్నారు. అందుకే, అందరి మీదకు ఒంటికాలు మీద లేచే సిబిఐ, ఈడీ తెలంగాణకు వచ్చే సరికి వట్టి ఊపులే తప్ప గట్టి చర్యలు తీసుకోవడం లేదని పరిశీలకులు సైతం అంటున్నారు.