షర్మిల.. నాడు జగనన్న బాణం.. నేడు?
posted on Oct 13, 2022 @ 5:44PM
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం ఏపీలో సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’ అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే షర్మిల ఎవరు వదిలిన బాణం అన్న ప్రశ్న ముగిసిన అధ్యాయంగా మారిపోవాలి.
తెలంగాణలో ఆమె బాటలో ఆమె రాజకీయ అడుగులు(యాత్ర) వేస్తున్నారు. అయితే ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు మరో మారు షర్మిల ఎవరి చేతిలో బాణం అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. అంతే కాదు.. వైఎస్ఆర్టీపీ పేర ఆమె చేస్తున్న రాజకీయ యాత్ర, వేస్తున్న అడుగుల లక్ష్యం ఏమిటి? నిజంగా ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్ కు నేరుగా గురిపెట్టారా? లేక రాజకీయ వ్యూహంతో గదిలో స్విచ్, వరండాలో లైట్ అన్న చందంగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తున్నాయి.
నిజానికి షర్మిలకు వెన్నుదన్నుగా ఉన్నశక్తులేమిటి? వ్యక్తులెవరు? ఈ ప్రశ్నలకు కూడా గట్టిగానే వినిపిస్తున్నారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధినేత్రిగా వేస్తున్న అడుగులు మాత్రం బయటకు తెలియకపోయినా ఒక లక్ష్యన్ని సాధించేందుకేనని మాత్రం పరిశీలకులు చెబుతున్నారు. ఆ లక్ష్యం కోసమే తెలంగాణలో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు తెలంగాణ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్ అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో బంధువు సంతోష్ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు సంధిస్తున్నారు. నిజానికి ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే ఎక్కువగానే షర్మిల తెరాస ప్రభుత్వాన్ని విమర్శలతో దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో ప్రధాని మోడీ బట్టలు ఊడదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.
అయితే ఉరుములేని పిడుగులా ఆమె ఇటీవల ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఇందుకోసమే ఆమె ప్రజా ప్రస్థానం పాదయత్రకు షార్ట్ బ్రేక్ ఇచ్చారు. హస్తినలో ఆమె రహస్యంగా ఎవరిని కలిశారో, ఏమేం మంతనాలు జరిపారో తెలియదు కానీ, ప్రత్యక్షంగా మాత్రం సీబీఐ డైరెక్టర్ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైనా అవినీతి ఆరోపణలు చేశారు. సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్షా 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరుతూ ఫిర్యాదు చేసినట్లు ఆమె మీడియాకు చెప్పారు. అయితే వాస్తవం చెప్పాలంటే.. ఆమె ఇప్పుడు ఢిల్లీ వెళ్లి మరీ సీబీఐకి చేసిన ఫిర్యాదులో కొత్త విషయాలేవీ లేవు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో, సందర్భం వచ్చినప్పుడూ, రానప్పుడూ కూడా ఇవే ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని ఎప్పుడో మీడియా ముందుంచారు.
అంతెందుకు సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇప్పటి దాకా ఆ ఆరోపణలపై ఎటువంటి దర్యాప్తూ, జరగలేదు. మరిప్పుడు అవే పాత ఆరోపణలతో షర్మిల సీబీఐకి ఫిర్యాదు ఢిల్లీ ఎందుకెళ్ళారు? ఈ ఫిర్యాదు వెనుక ఆమె టార్గెట్ ఎవరు? అన్న ప్రశ్నలూ, సందేహాలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. పైకి గురి కేసీఆర్ ఫ్యామిలీపైనే అన్నట్లు కనిపించినా.. ఆమె నిజంగా టార్గెట్ చేసింది మాత్రం తన అన్న, ఏపీ సీఎం జగన్ నే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా భావించే మేఘా కృష్ణారెడ్డి లక్ష్యంగానే షర్మిల ఈ ఫిర్యాదు చేశారనీ, ఆమె వెనుక బీజేపీ పెద్దలున్నారనీ కూడా అంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు షర్మిల తన ఫిర్యాదుతో బీజేపీ పెద్దల కేసీఆర్ ను ఇరుకున పెట్టాలన్న లక్ష్యానికీ, తన అన్న జగన్ ను ఇరుకుల పెట్టాలన్న లక్ష్యానికీ గురిపెట్టేలా సీబీఐకి ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. అందుకూ నాడు జగన్ వదిలిన బాణం షర్మిల ఇప్పుడు బీజేపీ చేతిలో ఆస్త్రంగా మారారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.