మునుగోడు హుజురాబాద్ కాదు!
posted on Oct 13, 2022 @ 12:05PM
హుజురాబాద్ ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఅర్ కోరి తెచ్చుకున్నారు. గులాబీ పార్టీ ఓనర్లం మేమే అంటూ ఈటల రాజేందర్ ధిక్కార స్వరం వినిపించిన నేపధ్యంలో, ఇంకెవరూ అలాంటి సాహసం, చేయకుండా ఈటలపై వేటు వేశారు. అయితే కేసీఆర్ లెక్క తప్పింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో, కేసీఆర్ సర్వ శక్తులు ఒడ్డినా ఓటమి తప్పించుకోలేక పోయారు.
బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగిన ఈటల 20 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరేశారు. నిజానికి, హుజురాబాద్ ఓటమి అక్కడితో ఆగలేదు. ఈటల ఏకుమేకయ్యారు. అంతవరకు సక్సెస్ ‘స్టొరీ’గా సాగిన తెరాస కథ మలుపు తిరిగింది. తెరాసకు చిక్కులు మొదలయ్యాయి. అంతవరకు కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో పక్కాగా థర్డ్ ప్లేస్ లో ఉన్న బీజేపీ, అటు కాంగ్రెస్ కు ఇటు తెరాసకు కూడా సవాలుగా మారింది. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం కన్ను పడింది. ఇక ఆ తర్వాత ఏమి జరుగుతోందన్నది చరిత్ర.
ఈ క్రమంలోనే, మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక దానంతట అదిగా వచ్చింది కాదు. హుజురాబాద్ ఉప ఎన్నికను కేసీఆర్ ఎలా అయితే కోరి తెచ్చుకున్నారో అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ కోరి తెచ్చుకుంది. ఫలితం కూడా అలాగే ఉంటుందా అంటే అది వేరే చర్చ. కానీ హుజురాబాద్ లో కనిపించిన తెరాస దూకుడు, మునుగోడులో కనపడడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. అంతే కాకుండా తెరాస నాయకత్వం మునుగోడు విషయంలో తప్పుడు సంకేతాలు పంపిస్తోందని అంటున్నారు.
అభ్యర్ధి ఎంపిక మొదలు ప్రచార వ్యూహం వరకు తెరాస నాయకత్వం అడుగులు తడబడుతున్న వైనం కనిపిస్తోందని అంటున్నారు. హుజురాబాద్ అంతకుముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో హరీష్ రావు ఇంచార్జిగా వ్యవహించారు. ఆ రెండు ఉపఎన్నికల్లో తెరాస ఓడినా చివరి వరకు గులాబీ పార్టీలో ఓటమి భయం కనిపించలేదు. మునుగోడు విషయంలో ఇప్పటికి కూడా ఇంచార్జి విషయంలో పూర్తి స్పష్టత లేదు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కంగాళీ వ్యవహారంతో, ‘టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్’ అన్నట్లుగా మునుగోడు వంటకం తయారవుతుందని అంటున్నారు.
మరో వంక తెరాసని ఓటమి భయం వెంటాడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే, తెరాస నాయకత్వం తప్పుడు సంకేతాలు పంపిందని పార్టీ శ్రేణులనుంచే వినిపిస్తోంది. ఒక విధంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్ధి ఎంపిక విషయంలో మీనా మేషాలు లెక్కిస్తూ వచ్చారు. చివరకు ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు. ఈలోగా పార్టీలో లుకలుకలు కొన్ని బయట పడ్డాయి. అదెలా ఉన్నా అభ్యర్థి ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి సర్వేలపై ఆధారపడి, చివరి వరకూ ఎటూ తేల్చుకోలేక పోవడం పార్టీ బలహీతను బయట పెట్టుకున్నట్లు అయిందని, పరిశీలకులు అంటున్నారు. ఆలాగే, తోక పార్టీలు, సూదీ దబ్బనం పార్టీలంటూ అవహేళన చేసిన సిపిఐ, సిపిఎం పార్టీలతో ‘బేరం’ కుదుర్చుకోవడం, ఒక ఉప ఎన్నిక కోసం ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం కూడా రాంగ్ సిగ్నల్స్ పంపిందని అంటున్నారు. అదలా ఉంటే, ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కుమార్తె కవిత మినహా ఎమ్మెల్సీలు, అందరికీ ముక్కలు ముక్కలుగా బాధ్యతలు అప్పగించడం, ఓటమి భయాన్ని సూచిస్తోందని అంటున్నారు.
మరో వంక మంత్రి కేటీఆర్ మునుగోడు ఎన్నికల ఫలితం వల్ల టీఆర్ఎస్‌కు వచ్చేది పోయేది ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికలప్పుడూ అదే చెప్పారు. తేడా వస్తుందన్న రిపోర్టులు ఉండటం వల్లనే ఇలా చెబుతున్నారన్న అభిప్రాయానికి రావడాని ఇలాంటి వ్యాఖ్యలు కారణం అవుతున్నాయని అంటున్నారు. ఈ అన్నిటినీ మించి, పార్టీ అభ్యర్ధి నామినేషన్ అయినా వేయక ముందే, మంత్రులు ఒకరి వెంట ఒకరు, పోటీ పడి మరీ పోటీ నుంచి తప్పుకుంటామని చేస్తున్న ప్రకటనలు క్యాడర్ కే కాదు,. కాండిడేట్ (కూసుకుంట్ల)కు కూడా మింగుడు పడడం లేదని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న గుజరాత్ కు ప్రధాని మోడీ భారీగా కేంద్ర నిధులను కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్న మంత్రి కేటీఅర్, ప్రధాని మోడీ మునుగోడుకు రూ. పద్దెనిమిది వేల కోట్ల నిధులు ఇస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. అంతకు ముందే మునుగోడు మంత్రి జగదీష్ రెడ్డి అదే సవాల్ చేశారు. ఇక ఇప్పుడు ఎర్రబెల్లి ఇత్యాది మంత్రులంతా అదే పల్లవి ఎత్తుకున్నారు. అయితే, మంత్రులు పోటీ నుంచి తప్పుకుంటామని పదే పదే చెప్పడం వలన తెరాస నేతలకు ఓటమి భయం పట్టుకుందని అందుకే పలాయనవాదం జపిస్తున్నారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు.
ఒక విధంగా నెగిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ అవుతోందని పబ్లిక్ పల్స్ తెలిసిన విశ్లేషకులు బావిస్తున్నారు. ఓ వంక బీజేపీ అభ్యర్ధి రాజగోపాల రెడ్డి కేసీఆర్ వస్తారా? కేటీఆర్ వస్తారా? దమ్ముంటే పోటీకి రండని, సవాల్ విసురుతుంటే, కేటీఆర్ పలాయనవాదం చిత్తగించడం ఏమిటని, పార్టీ నాయకులే విస్తుపోతున్నారు. నిజానికి, రాజీనామాకు ముందే రాజగోపాల్ రెడ్డి తెరాస ప్రభుత్వానికి సిమిలర్ సవాల్ విసిరారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నియోజక వర్గాల్లో చేసిన అభివృద్ధి మునుగోడులో చేస్తే, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయనని, రాజగోపాల్ తెరాసకు సవాల్ చేశారు. తెరాస ప్రభుత్వం ఆ సవాలు స్వీకరించలేదు, కాబట్టే రాజగోపాల రెడ్డి రాజీనామా చేశారు. ఇప్పడు అదే సవాలును ఇటు నించి అటు తిప్పడంలో అర్థమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అంతిమ ఫలితం ఎలా ఉన్నా, తెరాసను మునుగోడులోనూ హుజురాబాద్ భయం వెంటాడుతోందని అనిపిస్తోందని, అంటున్నారు.