మహా రాజకీయంలో మరో మలుపు?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఉహించడం అంత తేలికైన వ్యవహారం కాదు. అంతవరకు ఉప్పు నిప్పులా ఉన్న పార్టీలు ఒక్కసారిగా చేతులు కలిపెసినా ఆశ్చర్య పోనవసరం ఉండదు. ఇప్పుడు మహా రాష్ట్రలో అదే జరిగింది. బీజేపీ, శివసేన ఒకప్పుడు, సహజ మిత్ర పక్షాలు. ఒక విధంగా ఆ రెండు పార్టీలది ఒకటే డిఎన్ఎ, ఒకటే రక్తం. అందుకే హిందుత్వ బంధంతో ముడి వేసుకున్న ఆ రెండు పార్టీలు, ఎప్పటికీ విడిపోవని, విడిపోయినా మళ్ళీ అదే హిదుత్వ బంధం ఆ రెండు పార్టీలను కలిపేస్తుందనే నమ్మకం రెండు పార్టీలలో బలంగా నాటుకు పోయింది.   అయితే  అటు శివసేన ఇటు బీజేపీ నాయకత్వంలో తరాల అంతరాలు రావడం రాజకీయ ఆకాంక్షలు పెరగడంతో పరిస్థితి క్రమక్రమంగా మారుతూ వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అయితే, ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో వివాదం రావడంతో రెండు పార్టీలు విడిపోయాయి.శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపారు. మూడు పార్టీలు కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.అంతర్గత వైరుధ్యాలతో ఎంవిఎ ప్రభుత్వం త్వరలోనే కులిపోతుందని అనుకున్నా, శరద్ పవార్ చలవతో  ఠాక్రే సర్కార్ మూడేళ్ళు పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలోనే శివసేనలో ముసలం పుట్టింది. పార్టీ రెండుగా చీలింది. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు జెండా ఎగరేశారు. బీజేపీ తెర వెనక చక్రం తిప్పింది. ఇంచుమించుగా నెలరోజుల పాటు సాగిన నాటకీయ పరిణామాలకు తెర దించుతూ జూన్ 30, 2022 న షిండేముఖ్యమంత్రిగా బీజేపీ, శివసేన ( షిండే) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపధ్యంలో శివసేన ఇరు వర్గాలు బాల్ ఠాక్రే హిందుత్వ వారసత్వం శివసేన పేరు, పార్టీ గుర్తు తమదంటే తమదని నిరూపించుకునేందుకు ఓ వంక రాజకీయ పోరాటాలు, మరో వంక న్యాయ పోరాటం సాగిస్తున్నాయి. ఈ పోరాటంలో  సహజంగానే, బీజేపీ షిండే వర్గానికి కొమ్ము కాస్తోంది. అయితే ఇప్పడు బీజేపీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక బరిలోంచి తమ అభ్యర్ధి ముర్జీ పటేల్‌ను ఉపసంహరించుకుంది. శివసేన (ఠాక్రే) వర్గం అభ్యర్ధి ఏకగ్రీవ ఎన్నికకు లైన్‌ క్లియర్ చేసింది. ఒక విధంగా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ముఖ్యమంత్రి షిండే వర్గానికి షాక్. అని చెప్పవచ్చని అంటున్నారు.  అయితే, బీజేపీ, మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న, సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో, దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఏకగ్రీవ ఎన్నికకు అనుకూలంగా ఇతర పార్టీలు తమ అభ్యర్ధులను బరిలో దించరాదనే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ అభ్యర్ధిని ఉపసంహరించుకున్నామని బీజేపీ ప్రకటించింది.  అయితే, ఈ నిర్ణయం వెనక వ్యూహాత్మక రాజకీయ కోణం దాగుందని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. బీజేపీ ముందుగానే. ఏకగ్రీవ సంప్రదాయాన్ని గౌరవిస్తూ నిర్ణయం తీసుకుంటే అది మరోలా ఉండేది. కానీ, శివసేన రెండువర్గాల మధ్య తలెత్తిన వివాదం కారణంగా పార్టీ పేరు, సింబల్ ను కేంద్ర ఎన్నికల సంఘం స్తంబింప చేసిన తర్వాత, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఉద్ధవ్  ఠాక్రే, అభ్యర్ధన మేరకు. అంటూ చివరి క్షణంలో అభ్యర్ధిని ఉప సంహరించుకోవడంతో కమల దళం వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మహా రాజకీయాలలో చర్చనీయాంశంగ మారిందని అంటున్నారు. అలాగే, దీర్ఘ కాలంలో హిందుత్వ ఓటు చీలకుండా చూసేందుకు,శివసేన రెండు వర్గాలను ఏకం చేసి అక్కున చేర్చుకునే వ్యూహంతో బీజేపీ కథ నడిపిందని అనుకోవచ్చని అంటున్నారు.  అందుకే  బీజేపీ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వెనక  ఇంకేదో రాజకీయం ఉండి మహరాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శివసేనలో చీలిక అనంతరం జరుగుతున్న అంధేరీ ఉప ఎన్నికను శివసేన రెండు వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యమంత్రి షిండే వర్గం పోటీలో లేకున్నా, మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధిని గెలిపించి, ఠాక్రే వర్గంఫై పైచేయి సాధించాలని వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించ లేదన్నట్లుగా, శివసేనను పూర్తిగా కబ్జా చేసేందుకు, షిండే వర్గం సిద్దం చేసుకున్న స్కెచ్ ని బీజేపీ మార్చేసిందని అంటున్నారు. అయితే అంధేరీ ఉప ఎన్నిక కంటే అత్యంత కీలకం అయిన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ వ్యుహతమక నిర్ణయం తీసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. మరోవంక,   శివసేన (ఠాక్రే) వర్గం రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ మాత్రం,అంధేరీ ఈస్ట్ నియోజక వర్గంలో బీజేపీ నిర్వహించిన సర్వేలో, తమ అభ్యర్ధి ముర్జి పటేల్ ఓటమి తధ్యమని తెలిసిన నేపధ్యంలోనే బీజేపీ రాజ్‌ ఠాక్రేను తెర మీదకు తెచ్చి పోటీ నుంచి తప్పు కుందని అన్నారు. ఏది ఏమైనా, శివసేనను సక్సెస్ ఫుల్ గా ముక్కలు చేసిన బీజేపీ, ఇప్పడు మళ్ళీ  అతుకులను కలిపి కుట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్య  పరుస్తోందని అంటున్నారు. అయితే, 2024 లోక్ సభ ఎన్నికల నాటికి తెగిన పాత బంధాన్ని మళ్ళీ ముడి వేసి, మహారాష్ట్రలో  హిందుత్వ శక్తులను ఏకం చేసే లక్ష్యంతోనే బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నారు. నిజానికి, అది భయమైనా, భక్తి అనుకున్నా మహారాష్ట్రంలో హిందుత్వ వాదానికి ప్రతీకగా నిలిచిన బాల్  ఠాక్రే వారసత్వాన్ని ముక్కలు చేయడం కమల దళం కోరుకోవడం లేదని బీజేపీ నాయకులు అంగీక రిస్తున్నారు.

జగన్ సర్కార్ కు సుప్రీంలో మరో ఎదురుదెబ్బ

కోర్టుల్లో చీవాట్లుతినడం, మొట్టికాయలు మెట్టించుకోవడం, అక్షింతలు వేయించుకోవడం ఏపీ సర్కార్ కు ఒక అలవాటుగా మారిపోయింది. జగన్ సర్కార్ కుఅడ్డగోలు నిర్ణయాలు తీసేసుకోవడం.. అవి న్యాయ పరీక్షకు నిలవకపోవడం ఒక పరిపాటిగా మారిపోయింది.   జగన్ సర్కార్ కు సుప్రీం మరోసారి గట్టిగా అక్షింతలు వేసింది. పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) సంయుక్త కమిటీ తీర్పు మేరకు పరిహారాన్ని వెంటనే జమ చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా ఎన్జీటీ తీర్పులో చెప్పిన ప్రతి అంశాన్నీ యథాతథంగా అమలు చేయాలని విస్పష్ట తీర్పు ఇచ్చింది. ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణఅనుమతుల ఉల్లంఘనకు ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి 250 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన సంగతీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్ ను విచారించిన  దేశ సర్వోన్నత న్యాయస్థానం నష్టపరిహారం వెంటనే జమ చేయాలని ఆదేశించింది. నష్టపరిహారం పై తాము తదుపరి విచారణ కొనసాగిస్తామని, అది మినహా ఎన్జీటీ తీర్పులోని అన్ని అంశాలనూ యథాతథంగా అమలు చేయాల్సిందేనని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

ఉండ‌డ‌మ్మా..వెళ్ల‌కండి అలా..! 

రెండు పిల్లి పిల్ల‌లు ఆడుతూ రోడ్డు మీద‌కి వెళిపోతోంటే కుక్క వ‌చ్చి అమాంతం నోటితో ప‌ట్టి ఇవ‌త‌ల‌కు తెచ్చి ప‌డేసింది. అపుడు నిజానికి వాటిని రోడ్డు మీద‌నే వ‌దిలేయాలి. కానీ అలా చేయ‌లేదు. దానిలో త‌ల్లి ప్రేమ అలా చేయ‌నీయ‌లేదు. వాటి ప‌రిస్థితి దానికి అర్ద‌మ‌యింది గ‌నుక తీసుకువ‌చ్చి ఓ గోడ ద‌గ్గ‌ర ప‌రిచిన దుప్ప‌టి మీద ప‌డేసి ద‌గ్గ‌రికి లాక్కుంది. అలా వెళ్ల‌కం డ‌మ్మా..చ‌నిపోతారు..అన్న‌ట్టు హెచ్చ‌రించింది. వాటి త‌ల్లి ఎటు వెళ్లిందో, చ‌నిపోయిందో తెలీదుగాని కుక్క‌కి మాత్రం అవి అనాథ‌ ల‌న్న‌ది అర్ధ‌మ‌యింది.  అనాధ‌పిల్ల‌ల్ని చూస్తే అయ్యో అనిపిస్తుంది. వీరి భ‌విష్య‌త్తు ఏమ‌వుతుంద‌ని అనుకుంటాం. చాలామంది త‌ల్లి మ‌న‌సు వ్య‌క్తం చేస్తారు. కొంద‌రే ముందుకు వ‌చ్చి సాయం చేస్తారు. పిల్ల‌ల విష‌యంలో సాధార‌ణంగా కుల‌,మ‌త ప్ర‌స‌క్తి లేకుండా ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిం చ‌డం ప‌రిపాటి. ఇది జంతువుల్లోనే ఎక్కువ‌. కొన్ని ప‌క్షులు వేరే ప‌క్షుల గూటిలో గుడ్లుపెట్ట‌డం గురించి విన్నాం. జంతువులు త‌మ‌కు అస్స‌లు ప‌డ‌ని జంతువుల పిల్ల‌ల్ని స‌మ‌స్య‌లో ఉండ‌గా చూస్తే వెంట‌నే ఆదుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాయి. ఇద ప్ర‌కృతి విచిత్రం. పిల్లంటే కుక్క‌కి అస్స‌లు ప‌డ‌క‌పోవ‌చ్చు. కానీ పిల్లి పిల్ల‌లు అనాధ‌గా ప‌డి ఉంటే కుక్క వాటిని జాగ్ర‌త్త‌గా చూసుకుంటూం టుంది. ఆఖ‌రికి పెద్ద పిల్లి వ‌చ్చినా వాటిని వ‌ద‌ల‌దేమోన‌న్నంత‌గా ప్రేమిస్తాయి, తన పిల్ల‌లంత ప్రేమ‌గా చూసుకుంటాయి.  దీన్ని భార‌త్ మాజీ క్రికెట్ స్టార్ వివి ఎస్ ల‌క్ష్మ‌ణ్ త‌న ట్విట‌ర్‌లో పోస్టు చేశాడు. తన మనోహరమైన స్ట్రోక్ ఆటకు ప్రసిద్ధి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో హత్తుకునే వీడియోను పంచుకున్నారు. తల్లి పిల్లి మరణించిన తర్వాత కుక్క పిల్లి పిల్లలను చూసుకుంటున్నట్లు వీడియో చూపిస్తుంది.  పిల్లి తల్లి మరణించిన తర్వాత పిల్లి పిల్లలను చూసుకునే కుక్క తల్లి. మాతృత్వం అనేది మరొక వ్యక్తికి సర్వస్వం కావడంలో ఉన్న సున్నితమైన అసౌకర్యం అనే క్యాప్షన్‌తో ల‌క్ష్మ‌ణ్‌ వీడియోలను షేర్ చేశాడు.  సమస్త జీవరాశుల తల్లులందరికీ కృతజ్ఞతలు.

ఓబులాపురం మైనింగ్ కేసు.. డిశ్చార్జ్ పిటిషన్ల కొట్టివేత

గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, పదవీ విరమణ చేసిన అధికారులు కృపానందం, రాజగోపాల్, అలాగే గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి అలీఖాన్ లు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లన సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం(అక్టోబర్ 17) కొట్టివేసింది. అక్రమ పద్ధతుల్లో గనుల కేటాయింపు వ్యవహారంలో వీరందరి పాత్రపై ఆధారాలున్నాయన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు వీరందరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గాలి జనార్దన్ రెడ్డి ఇప్పటికే తన డిశ్చార్జ్ పిటిషన్ ను ఉపసంహరించుకున్ సంగతి విదతమే. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఒబులాపురం అక్రమ మైనింగ్ కేసులో అభియోగాల నమోదులో తీవ్ర జాప్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ వేగవంతమైన సంగతి విదితమే. 

కారులో కోటి.. మునుగోడుకు తరలిస్తుండగా పట్టివేత

ఎన్నికల ఖర్చు విషయంలో మునుగోడు ఉప ఎన్నిక మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్న అనుమానాలు ముందు నుంచీ ఉన్నాయి. మనుగోడు మరో చరిత్ర సృష్టిస్తుందా? అన్న శీర్షికన తెలుగువన్ గత నెల 4వ తేదీనే మునుగోడులో డబ్బు ప్రవాహంపై వార్త ప్రచురించింది. ఎన్నికల చరిత్రలో, ఓటర్లను ప్రలోభ పెట్టడంలో ఇప్పటికే కొత్త చరిత్రను సృష్టించిన హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును మునుగోడు చెరిపేస్తుందని తెలుగువన్ ముందే అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే హుజూరాబాద్ ను మించి మునుగోడులో డబ్బు మద్యం ప్రవాహాలు జోరందుకున్నాయి.    నియోజక వర్గం పరిధిలో, మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నియోజకవర్గానికి సమీప మండలాల్లోనూ మద్యం విక్రయాలు రెట్టింపయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అని తెలిసినప్పటి నుంచీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి అన్ని పార్టీలూ పోటీలు పడుతూ వస్తున్నాయి. అంతెందుకు ఆగస్టు 1 నుంచి 29వ తేదీ వరకు చండూరు, నాంపల్లి, రామన్నపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో 1,11,279 పెట్టెల మద్యం విక్రయాలు జరిగాయి. ప్రభుత్వానికి రూ.43.19 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన రాజకీయ పార్టీలు   ఫంక్షన్‌ హాళ్లను తీసుకుని సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిరోజూ గ్రామాల్లో పార్టీల ఫిరాయింపు బేరసారాలతో రాత్రివేళ అధిక సంఖ్యలో మద్యం సిట్టింగ్‌లు జరుగుతున్నాయి. దీంతో మద్యం విక్రయాలు మరింత పెరుగుతున్నాయి.  మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బును మునుగోడుకు తరలిస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి.  తాజాగా చల్మడ చెక్ పోస్ట్ దగ్గర సోమవారం (అక్టోబర్ 17)పోలీసులు జరిపిన తనిఖీల్లో ఓ కారులో కోటి రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు కారును కూడా సీజ్ చేశారు పోలీసులు. డబ్బు తరలిస్తున్న వాహనం కరీంనగర్ కు చెందిన బీజేపీ నేత సొప్పరి వేణుకి చెందినదిగా గుర్తించారు. ఆయన భార్య కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్. మునుగోడుకే కోటి రూపాయల నగదు తరలిస్తున్నట్లుగా విచారణలో వేణు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. మాజీ ఎంపీ వివేక్ ఆదేశాలతో విజయవాడకు చెందిన రాము దగ్గరి నుంచి కోటి రూపాయలు తీసుకుని మునుగోడు వెళ్తున్నట్లు వేణు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన డబ్బుని ఐటీ అధికారులకు అప్పగించారు పోలీసు. తెరాస, బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా పోటీలో ఉన్న నేపధ్యంలో ఓటు రేటు భారీగా పెరుగుతున్నదని, ఓటర్లు లెక్కలు వేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల దాకా ఇస్తున్నదన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకు అందుతాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు చేసే వ్యయం, పంచే సొమ్ము మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు పరిశీలకులు. అయితే, హుజురాబాద్ తో మునుగోడు పోటీ పడుతుందా? హుజూరాబాద్ మలిన చరిత్రను మునుగోడు చెరిపేస్తుందా? ఇంకా ఎక్కువ చేస్తుందా, అంటే,    చూడాలి మరి ..అంటున్నారు.

ఎన్నాళ్లీ ఆర్ధిక అస‌మాన‌త‌?

అసమానత అనేది వివక్ష కు అవసరమైనది కాదు లేదా సరిపోదు. స్కాండి నేవియాలోని దేశాలు చాలా వివక్ష లేకుండా అధిక-ఆదాయ అసమాన తను కలిగి ఉన్నాయి. దీనికి విరుద్ధంగా, తూర్పు యూరప్‌లోని కొన్ని దేశాలు పురుషులు, స్త్రీల మధ్య సంపాదన అంత రాన్ని నమోదు చేయ లేదు, అయితే గుర్తించ దగిన లింగ వివక్ష ఉంది, దీని ఫలితంగా స్త్రీలు పురు షులతో సమానంగా వేత నాలు పొందుతున్నారు, మాజీ సామర్థ్యాల పరంగా మెరుగైన దానం చేసిన ప్పటికీ. లేబర్ మార్కెట్‌లో వివక్ష అనేది సాధారణంగా ఒకే విధమైన సామర్థ్యాలు కలిగిన వ్యక్తులు భిన్నంగా వ్యవహరించే పరిస్థితిగా నిర్వచించబడుతుంది.  ప్రస్తుతచట్టాలు, దేశం సాధారణంగా ఆమోదయోగ్యమైన విలువ వ్యవస్థ లేదా సమాజంలో పనితీరు ఆమోద యోగ్యమైన నిబంధనల ప్రకారం అన్యాయమైన పరిశీలనల కారణంగా ఇది అసమానతలో భాగం. లేబర్ మార్కెట్, ఫ్యాక్టర్ మార్కెట్, ఇన్‌స్టిట్యూ షన్స్‌లో వివక్ష చూపకపోవడం అంటే ఎండోమెంట్‌లు లేదా సామర్థ్యాలను సృష్టించడం అంటే, ప్రతి వృత్తిలో అన్ని సామాజిక-మత సమూహాలకు సమాన ప్రాతినిధ్యం లేదా అందరికీ సమాన సంపాదన అని అర్థం కాదు. సామాజిక పక్ష పాతాలు లేదా వ్యక్తుల సామాజిక-మతపరమైన గుర్తింపుల కారణంగా, సామర్థ్యాలకు అనుగుణంగా వేతనాలు లేదా ప్రయోజ నాలను యాక్సెస్ చేయడం లేదా పొందడం లేదని ఇది సూచిస్తుంది. లాటిన్ అమెరికా, యూరప్, యుఎస్ ఏ లలో లెక్క‌ల‌ నమూనాను ఉపయోగించడం అనేది ఎండోమెంట్‌లలో తేడాలు సామా జిక గుర్తింపులకు ఆపాదించబడిన కారణంగా వివక్షత అధ్యయనాలు ఒక విశేష, హాని కలిగించే సమూహాన్ని భాగాలుగా విభజించా యి. దురదృష్టవశాత్తూ, సామాజిక-ఆర్థిక పరిస్థితులలో తేడాలు, విడదీయబడిన సమాచారం అందుబాటులో లేనందున ఇవి భారతదేశానికి వర్తించవు. పర్యవసానంగా, జనాభా గణన, జాతీయ నమూనా సర్వే, ఇతర ప్రభుత్వ నివేదికల నుండి బాగా స్థిర పడిన ద్వితీయ డేటా ఆధారంగా, ఆక్స్‌ఫామ్ ఇండియా పరిశోధనా బృందం పోకడలు, వివక్ష నమూ నాను ప్రదర్శించడానికి చేపట్టిన పని సవాలుగా ఉంది. పరిధి, కవరేజీని పరిమితం చేస్తూ, మోడల్‌ను సము చితంగా సవరించాలని, వివక్షను అసమానత లేదా అసమానతలో భాగంగా నిర్వచించాలని నిర్ణయించింది, ఇది ప్రస్తుత మున్న నైతిక, నైతిక, చట్టపరమైన వ్యవస్థ ప్రకా రం ఆమోదయోగ్యం కాదని భావించిన లింగం, కులాలు, మతంలోని వ్యత్యా సాలకు ఆపాదించవచ్చు, మనదేశంలో. 2004-05 సాధారణ ఎన్ ఎస్ ఎస్ ఓ ఉపాధి సర్వే, 2019-20 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నుండి డేటాను ఉపయోగిం చి పోల్చ దగిన సమాచారాన్ని రూపొందించడానికి రెండు పాయింట్ల వద్ద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పరిస్థితిని నివేదికలు వేర్వేరుగా విశ్లేషి స్తాయి. వివిధ కులాలు, గిరిజన, మతపరమైన గుర్తింపులు, లింగం అంతటా ఉపాధి, వేతనాలు, క్రెడిట్, ఆరోగ్య సౌకర్యాలలో ఉన్న అంతరాలను వివరిస్తూ, గుర్తింపు-ఆధారిత వివక్ష  పరిధిని సంగ్రహించడానికి ఈ అధ్యయనం ప్రయత్నిస్తుంది. లేబర్ మార్కెట్ విశ్లేషణ వివిధ రకాల ఉద్యోగాలను కవర్ చేస్తుంది. వ్యక్తుల గుర్తింపులు తరచుగా పని చేయడానికి, న్యాయంగా సంపాదించడానికి, ఆస్తులు,సామర్థ్యాలను సంపాదించడానికి , మెరుగైన జీవితాలను గడపడానికి వ్యక్తుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి. సంక్షోభ సమయాల్లో ఇది మరింత సవాలుగా మారుతుంది. సాధారణ పరిస్థితులలో, మహమ్మారి సమయంలో వివిధ అట్టడుగు సామాజిక సమూహాలలో వేతనాలు, కార్మి కుల సంపాదన చెల్లింపులో వివక్షను అధ్యయనం పరిశీలిస్తుంది. ఇది ముఖ్యమైనది ఎందుకంటే, ఎండోమెంట్స్ , ఉద్యోగ స్వ భావం, సంక్షేమం, ప్రభుత్వ సంస్థల ద్వారా కార్మికుల రక్షణ, అంతర్ సమాజ సంబంధాలు, సామాజిక పక్షపాతాలు మొదలై నవి వివిధ సామాజిక-మత సమూహాలకు చెందిన వ్యక్తుల శ్రేయస్సును నిర్ణయించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భారతదేశ వివక్ష నివేదిక 2022 నుండి వెలువడిన మొత్తం ముగింపు ఏమిటంటే, భారతదేశంలో గత దశాబ్దన్నర కాలంగా కార్మిక మార్కె ట్లో వివక్ష తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇది అధిక లింగ అసమానతతో వర్ణించబడింది, తద్వారా స్త్రీ సంభావ్యత ఎక్కువగా ఉంటుంది. మంచి ఉద్యోగాలలో ఉద్యోగం చేయడం వలన ఆమె ఎండోమెంట్‌లపై ఎటువంటి ప్రభావం ఉండదు. సర ళంగా చెప్పాలంటే, మహిళల వర్కర్ కాని వర్కర్ స్థితి ఆమె విద్యార్హతలపై ఆధారపడి ఉండదు. ఇది దేశంలో లింగ వివక్ష దాదా పు పూర్తి స్థాయిలో ఉందనే మోడల్ నుండి భయంకరమైన ఫలితం వెలువడటానికి దారితీస్తుంది. పురుషుల సంపాదన స్త్రీల కంటే 20,60 శాతం ఎక్కువగా ఉండటంతో సాధారణ కార్మికులకు సంపాదన అంతరం తక్కువగా ఉంది. స్వయం ఉపాధి పొందే వారి విషయం లో, స్త్రీల కంటే పురుషులు 4 నుండి 5 రెట్లు సంపాదిస్తూ ఉండటంతో, అసమానత చాలా ఎక్కువగా ఉంది.    కుల ఆధారిత వివక్ష చాలా ముఖ్యమైనదిగా ఉద్భవించింది, అయితే మతం ఆధారిత వివక్ష తక్కువగా ఉంది, ఎందుకంటే ముస్లింలు తక్కువ-విలువైన కుటుంబ-ఆధారిత వృత్తులలో మునిగిపోతారు, అందులో వారు తక్కువ పోటీని ఎదుర్కొంటారు. అలాగే, వారు రిపేర్/మెయింటెనెన్స్, వడ్రంగి, నిర్మాణం మొదలైనవాటిలో కుటుంబం మరియు పీర్ గ్రూప్ ద్వారా పొందిన కొన్ని వృత్తిపరమైన నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఇవి అధికారిక నమూనాలో సంగ్రహించబడనందున, ఉపాధి, సంపాదన అంతరాలు వారి ఎండోమెంట్‌లలోని లోటుల పరంగా వివరించబడతాయి. లింగ ఆధారిత వివక్ష అన్ని వర్గాల ఉద్యోగాలలో,  గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో చాలా ఎక్కువగా ఉన్నట్లు కనుగొన బడింది. గృహ బాధ్యతలు లేదా సంఘంలోని సామాజిక స్థితి (ఇందులో నియ మాలు కార్మిక శక్తిలో వారి క్రియాశీల  భాగస్వామ్యాన్ని నిరోధిం చేవి) కారణంగా అధిక అర్హత కలిగిన స్త్రీల పెద్ద భాగం లేబర్ మార్కెట్‌లో చేరడం కోరలేదు లేదా కుల శ్రేణిలో. పితృస్వామ్యమే ఎక్కువ మంది స్త్రీలు, అదే లేదా అంతకంటే ఎక్కువ అర్హతలు కలిగి ఉన్నవారిని ఉపాధి మార్కెట్ వెలుపల కూర్చోబెట్టింది, ఇది కాలక్రమేణా ఎటువంటి అభివృద్ధిని చూపలేదు. మహమ్మారి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2020) లేబర్ మార్కెట్‌పై జాతీయ లాక్‌డౌన్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో ప్రభావం తీవ్రంగా ఉందని, ఇది నేరుగా పట్టణ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని అధ్యయనం వెల్లడించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ముస్లిం ల శాతం పరంగా నిరుద్యోగంలో తీవ్ర పెరుగుదల గమనించబడింది. పట్టణ ప్రాంతాల విషయంలో నిరుద్యోగం పెరుగుదల అన్ని సామాజిక-మత సమూహాలకు ఆందోళన కలిగిస్తుంది, అయితే వర్గాలలో తేడాలు అంతంత మాత్రమే. అయితే లింగ వివక్ష అనేది నిర్మాణాత్మకమైనది, దీని ఫలితంగా సాధారణ పరిస్థితుల్లో పురుషులు, స్త్రీల సంపాద నల మధ్య చాలా అస మానతలు ఏర్పడతాయి.

వివేకా హత్య కేసులో నిందితులు పోలీసులు కుమ్మక్కు!

మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై మూడున్నరేళ్లు అవుతోంది. వైఎస్ వివేకా సామాన్యుడు కాదు.. ఆషామాషీ వ్యక్తి అసలే కాదు.. ఒక దివంగత సీఎంకు తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రికి స్వయానా సొంత బాబాయ్. అయినప్పటికీ వివేకా హత్య కేసు కొలిక్కి రాకపోవడం గమనార్హం. అయితే.. వివేకా హత్య కేసు విచారణ ముందుక సాగకపోవడానికి ముఖ్య కారణాన్ని సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన ఒక పిటిషన్ ద్వారా స్పష్టం చేసింది. వివేకా హత్య కేసులో నిందితులు,స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, అందువల్లే విచారణ సాఫీగా సాగడం లేదని సీబీఐ సంచలన ఆరోపణలు చేసింది. వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరింది. ఈ మేరకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే ఈ కేసులో సాక్షులకు ప్రాణ భయం ఉంటుందని సీబీఐ పేర్కొనడం గమనార్హం. వివేకా హత్య కేసులో సాక్షులను రక్షించుకోవాలంటే గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాల్సిందే అని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేశ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. గంగిరెడ్డికి నోలీసులు జారీ చేసింది. సీబీఐ అభియోగాలపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని గంగిరెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 14కు వాయిదా వేసింది. కాగా.. నిందితులు- స్థానిక పోలీసులు కుమ్మక్కయ్యారని, వారు మూకుమ్మడిగా విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారని ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు దోషులెవరో తెలియకపోవడంపై ఆయన కుమార్తె సునీతారెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్రమంలోనే వివేకా హత్య కేసు విచారణను ఏపీ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ కూడా స్థానికంగా నిందితులు,  పోలీసులు కుమ్మక్కయ్యారంటూ తీవ్ర అభియోగం మోపడం గమనార్హం.

టీఆర్ ఎస్ కు  ఎన్నిక‌ల విరాళం రూ.153కోట్లు

భార‌తీయ రాష్ట్ర స‌మితి(బీఆర్ ఎస్‌)గా పేరు మార్చుకున్న టీఆర్ ఎస్‌కు 2021-22  సంవ‌త్స‌రానికి రూ.193. 3  కోట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార పార్టీకి రూ.60 కోట్లు ఎన్నిక‌ల విరాళాలు జ‌మ అయింది. అయితే టీఆర్ఎస్ మాత్రం రూ.153 కోట్ల మేర‌కు వ‌చ్చాయ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఇచ్చిన నివేదిక‌లో  ప్ర‌క‌టిం చుకుంది.   ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు  ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌చ్చిన నిధుల గురించిన నివేదిక‌లు స‌మ‌ర్పించిన ఇత‌ర పార్టీల్లో వైసీపీ, శిరోమ‌ణి అకాలీద‌ళ్‌(రూ.50ల‌క్ష‌లు), స‌మాజ్‌వాది పార్టీ(రూ.3.21 ల‌క్ష‌లు) ఉన్నాయి. 2020-21లో వైసిపికి రూ.96.25 కోట్లు ఎల‌క్టొర‌ల్ బాండ్స్ రూపంలో వ‌చ్చాయ‌ని ప్ర‌క‌టించ‌గా, ఎస్ ఏ డి, ఎస్‌.పీ పార్టీలు త‌మ‌కు ఆ రూపంలో ఏమీ రాన‌ట్టే ప్ర‌క‌టించుకున్నాయి. 2019-20లో సాధార‌ణ ఎన్నిక‌ల సంవ‌త్సరంలో, ఎస్‌.పీకి రూ.108 కోట్లు బాండ్స్రూపంలో రాగా, టీఆర్ ఎస్‌కు రూ.98.15 కోట్లు వ‌చ్చాయి.  కాగా, 2021-22 సంవ‌త్స‌రానికిగాను త‌మ పార్టీల‌కు అందిన విరాళాల‌ గురించి వివ‌రాల‌ను కేవ‌లం మూడు పార్టీలే తెలియ‌జేశాయి. బీఎస్‌పీ మాత్రం ఇంకా ఏమీ అందుకోలేద‌ని పేర్కొన్న‌ది. అయితే ఎన్ సీ పీ మాత్రం రూ.57.9 కోట్లు, ఎన్‌పిపి రూ.34.5ల‌క్ష‌లు విరాళాలు అందుకున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. అయితే 16 ప్రాంతీ య పార్టీలు  ఈ ఏడాదికి  ఎన్నిక‌ల క‌మిష‌న్ వెబ్‌సైట్ పేర్కొన్న వివ‌రాల్లో మ‌రింత ఎక్కువే ఉండ వ‌చ్చు. అత్య ధిక స్థాయిలో కార్పోరేట్ నిధులు వ‌చ్చే ప్రూడెంట్ ఎల‌క్టోర‌ల్ ట్ర‌స్ట్ నుంచి అనేక ప్రాంతీయ పార్టీల‌కు 2021- 22 సంవ‌త్స‌రానికి గాను చెప్పుకోద‌గ్గ నిధులు వ‌చ్చాయి. వివ‌రాల్లోకి వెళితే, టిఆర్ ఎస్‌కు రూ.40 కోట్లు, వైసీపీకి రూ.20కోట్లు, స‌మాజ్‌వాదీ పార్టీకి రూ.27కోట్లు, శిరోమ‌ణీ అకాలీద‌ళ్కు రూ.7 కోట్లు విరా ళాలు అందాయి.  2021-22లో  వివిధ పార్టీలు అందుకున్న విరాళాల వివ‌రాలు ఇలా ఉన్నాయి..స‌మాజ్‌వాది పార్టీ  రూ. 13.76 కోట్లు, తెలుగుదేశంపార్టీ రూ. 62.9 లక్షలు, వై ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూ. 80.01 కోట్లు, మహా రాష్ట్రవాది గోమంతక్ రూ. 1.86 కోట్లు, మహారాష్ట్ర నవ నిర్మా ణ సేన (ఎంఎన్‌ఎస్) రూ. 1.43 కోట్లు, జననాయక్ జనతా పార్టీ రూ. 5 లక్షలు, 13. జార్ఖండ్ ముక్తి మోర్చా రూ.1లక్ష, రాష్ట్రీయ లోక్ దళ్ రూ.50.76 లక్షలు, కేరళ కాంగ్రెస్ రూ.26.62 లక్షలు, గోవా ఫార్వర్డ్ పార్టీ రూ.25 లక్షలు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) రూ.7.3 లక్షలు. బీజెడీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ,  ఏఐఏడీఎంకే ఒకే సంవ త్సరంలో రూ. 20,000 కంటే ఎక్కువ విరాళాలను ప్రకటించాయి.

నగరి వైసీపీలో రోడ్డెక్కిన అంతర్గత విభేదాలు

వైసీపీలో అంతర్గత విభేదాలు లేని నియోజకవర్గం లేదంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది.. ఆ పార్టీ నేతల్లో ఉన్న వైషమ్యలు చూస్తుంటే. తాజాగా నగరి నియోజవర్గంలో పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గు మన్నాయి. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు వ్యతిరేకంగా పార్టీలో జరుగుతున్న గ్రూపు రాజకీయాలపై రోజా ఈ సారి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమెకు ఆహ్వానం లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా  నియోజకవర్గ పరిధిలోని కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ జరిగింది. ఈ విషయంపై రోజా ఫైర్ అయ్యారు. పార్టీ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా.. ప్రత్యర్థుల దృష్టిలో పార్టీనీ, తననూ చులకన చేసే విధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల పార్టీ సీరియస్ గా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ కార్యక్రమాన్ని శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతి హాజరయ్యారు.   తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కొందరు తన వ్యతిరేకులు పార్టీ ముసుగులో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిండం మంత్రిగా ఉన్న తనను  బలహీన పరిచే కుట్రేనని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  పరిస్థితి ఇలాగే కొనసాగితే  రాజకీయాలు చేయడం కష్టమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ మేరకు ఆమె ఒక ఆడియో విడుదల చేశారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విపక్షాలైన తెలుగుదేశం, జనసేనలకు పార్టీ చులకన అవుతుందని అన్నారు. పార్టీ పెద్దలు ఇప్పటికైనా ఇటువంటి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్న వారి పట్ల దృష్టి సారించి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి వారికి ప్రోత్సాహం లభించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  

విశాఖ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు మారిన సీన్.. టెన్షన్ టెన్షన్

ఎవరి వెంట ఎవరు పడుతున్నారు. జనసేన ఎక్కడకి వెడితే అక్కడ ఉద్రిక్తత నెలకొనడానికికారణం ఎవరు? జనసేన అధినేత పవన్ ను అడుగడుగునా అడ్డుకోవడమే వైసీపీ సర్కార్ లక్ష్యామాఅనిపించేలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. విశాఖ గర్జన పేరిట వైసీపీ నిర్వహించిన కార్యక్రమంతో విశాఖపట్నం రెండు రోజులు అట్టుడికినట్లు ఉడికింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ మధ్య విశాఖ వాసులు క్షణమొక గండంగా గడిపారు. ఏంతో ముందుగా నిర్ణయించిన జనసేన జనవాణి కార్యక్రమం ఆపడమే ఏకైక లక్ష్యమన్నట్లు వైసీసీ, పోలీసులు వ్యవహరించారు. నోవాటెల్ హోటల్ ను దిగ్బంధించారు. జనసేనానిని అడుగు బయటపెట్టనియ్యకుండా అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద మంత్రులపై జరిగిన దాడి   నెపంగా తీసుకుని పలువురు జనసైనికులపై కేసులు పెట్టారు. అరెస్టులు చేశారు. చివరాఖరికి జనసేనాని విశాఖ వీడి విజయవాడ చేరుకోవడానికి నిర్ణయించుకోగానే...ఆ  టెన్షన్ సీన్ గన్నవరం విమానాశ్రయానికి మారింది. ఎందుకంటే సరిగ్గా జనసేనాని గవన్నవరం విమానాశ్రయానికి చేరుకునే సమయానికే జగన్ కూడా విమానాశ్రయానికి రానున్నారు.   విశాఖ నుంచి బయలు దేరిన జనసేనాని,   వేరే పర్యటనలో ఉన్నజగన్ దాదాపు ఒకే సమయానికి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు.   దీంతో విశాఖ విమానాశ్రయం వద్ద సీన్ రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే గన్నవరం విమానాశ్రయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. పవన్ కల్యాణ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న ఆయన అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈనేపథ్యంలో పలువురు జనసైనికులను పోలీసులు అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 

జ‌య‌హో ష‌మీ..4 ప‌రుగులు 4 వికెట్లు..!

సినిమాల‌కు మించిన ట్విస్టులు రాజ‌కీయాల‌కు మంచిన ప్ర‌క‌ట‌న‌లు క్రికెట్‌లో జ‌రిగిపోతున్నాయి. భార‌త్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఫిట్నెస్ కార‌ణంగా జ‌ట్టులో ఉంటాడా ఉండ‌డా అన్న సందేహాలు పెరిగిపోయా యి. అత‌ని స్థానంలో మ‌రో యువ పేస‌ర్‌కి ఛాన్స్ ఇవ్వాల‌నే జ‌ట్టు కెప్టెన్‌తో స‌హా అంటూ వ‌చ్చారు. అందు కు బోర్డు నిర్ణ‌యం కూడా జోడ‌యింది. కానీ ఎట్ట‌కేల‌కు ష‌మ్మీని టీ.20 ప్ర‌పంచ‌క‌ప్‌కి ఆస్ట్రేలియాకి పంపారు. అయినా చాల‌మంది అత‌ని ఫిట్నెస్ మీద అనుమానం వ్య‌క్తం చేస్తూనే ఉన్నా రు. వీట‌న్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాడు ష‌మీ. సోమ‌వారం ఆసీస్‌తో త‌ల‌ప‌డిన వామ‌ప్ మ్యాచ్‌లో చివ‌రి 20వ ఓవ‌ర్లో వ‌చ్చి ఏకంగా నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్‌ని, భార‌త్ క్రికెట్ వీరాభిమానుల‌ను ఎంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.  ఎలా సాధ్యం.. ఏద‌యినా ఏ క్ష‌ణాన్నయినా జ‌ర‌గ‌వ‌చ్చ‌న‌డానికి ఇదో పెద్ద ఉదాహ‌ర‌ణ‌. కె.ఎల్. రాహుల్ (57), సూర్యకుమార్ యాద‌వ్ (50) ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేసి అర్ధ‌సెంచ‌రీల‌తో ఆసీస్‌కి చుక్క‌లు చూపించా రు. వారి బ్యాటింగ్ ధాటితో భార‌త్ 7 వికెట్ల న‌ష్టానికి 186 ప‌రుగులు చేసింది. ఆసీస్ కూడా బాగానే ఆడింది. కానీ వారి ఆశ‌లు చివ‌రి ఓవ‌ర్లోనే దెబ్బ‌తిన్నాయి. అదీ ష‌మీ రాక‌తో. అప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం ఫీల్డ‌ర్‌గానే క‌న‌ప‌డు తున్న ష‌మీకి బంతి ఎప్పుడిస్తాడ‌ని అంద‌రూ కెప్టెన్ని తిట్టుకునే ఉంటారు. కానీ ఊహించ‌ని విధంగా ప‌రి స్థితులు బేరీజు వేసి లాభంలేద‌నుకున్నాడో ఏమో చివ‌రి 20వ ఓవ‌ర్లో ష‌మీకి బంతి ఇచ్చారు.   జులై త‌ర్వాత మ‌ళ్లీ టీమ్ ఇండియాకి ఆడ‌టం ఇదే మొద‌లు. కోవిడ్‌తోనూ, ఫిట్నెస్ స‌మ‌స్య‌ల‌తోనూ జ‌ట్టు కు ష‌మీ దూర‌మ‌య్యాడు. కానీ వాటిని అధిగ‌మించి జ‌ట్టులోకి వ‌చ్చినా అంత ప్ర‌తిభ‌ను తిరిగి ప్ర‌ద‌ర్శి స్తాడా అన్న అనుమానం అంద‌రికీ ఉంది.  కానీ ఇక్క‌డ ఈ వామప్ మ్యాచ్‌లో అత‌ని సామ‌ర్ధ్యం అనుమానా ల‌ను ప‌టాపంచ‌లు చేసింది. యార్క‌ర్ల‌తో ఆసీస్ బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ దారి ప‌ట్టించ‌డంలో గొప్ప నైపు ణ్య‌మే ప్ర‌ద‌ర్శించాడు. మొద‌టి రెండు బంతుల‌కీ రెండేసి పరుగులు ఇచ్చి త‌ర్వాత నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు.  ఈ మ్యాచ్‌లో మ‌రో అద్భుతం కింగ్ కోహ్లీ సూప‌ర్ క్యాచ్‌. పాట్ క‌మిన్స్ సిక్స్ కొట్టాన‌ని తెగ సంతోష‌ప‌డు తు న్న త‌రుణంలోనే ఆ సంతోషం ఆ క్షణంలోనే తొల‌గిపోయింది. కింగ్ బౌండ‌రీ లైన్లో గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ప‌ట్టి క‌మిన్స్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. అత‌ని ఆ ఫీట్ కి కెప్టెన్ తో పాటు ప్రేక్ష‌కులూ ఫిదా అయ్యారు. మ‌రి కింగ్ కోహ్లీనా మ‌జాకా.. అన్నారంతా!  టోర్నీలో ఆరంభ‌మ్య‌చ్ ఈ నెల 23న భార‌త్ పాకిస్తాన్ త‌ల‌ప‌డ‌తాయి.

గంగూలీని ఐసీసీకి పంపిద్దాం మోదీజీ...మ‌మ‌తా బెన‌ర్జీ

భార‌త క్రికెట కంట్రోల్ బోర్డు అధ్య‌క్ష స్థానంలోకి మాజీ ప్లేయ‌ర్ రోజ‌ర్ బిన్నీ వెళ్ల‌వ‌చ్చ‌. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ బీసీసీఐ అధ్య‌క్షునిగా ఉన్న సౌర‌వ్ గంగూలీని వంచించార‌ని, అవ‌మాన‌క‌రంగా  ప‌దవి నుంచి దించేశార‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. గంగూలీని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీ సీ) కి పంపించాల‌ని ఆమె ప్ర‌ధాని మోదీని కోరారు.  అత‌ని త‌ప్పు లేకుండానే అత‌న్ని వంచించార‌ని మ‌మ‌తా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  మ‌మ‌త సోమ‌వారం మీడియాతో మాట్లాడుతూ, సౌర‌వ్‌ను బీసీసీఐ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం స‌మాచారం విని ఎంతో ఆశ్చ‌ర్య ప‌డ్డాన‌న్నారు. భార‌త క్రికెట్‌కి ప్లేయ‌ర్‌గా, కెప్టెన్ గా ఎంతో సేవ‌చేసిన వ్య‌క్తిని అవ‌మాన‌క‌రంగా ప‌ద‌వి నుంచి దించేయ‌డం దారుణ‌మని అన్నారు. ఐసీసీ ప‌ద‌వికి అర్హుడ‌ని, ఆ ప‌ద‌వికి పోటీ చేయ‌డానికి అనుమతించాల‌ని ఆమె ప్ర‌ధానిని కోరారు. ఐసీసీ ప‌ద‌వికి  గంగూలీ ఈ నెల 20వ తేదీన నామినేష‌న్  దాఖ‌లు చేయ‌నున్నాడు.  సౌర‌వ్ గంగూలీ బీసీసీఐ అధ్య‌క్ష‌ప‌ద‌విలోనే కొన‌సాగాల‌ని అనుకున్నాడు. త‌న‌కు ఐసీసీ ప‌ద‌వి మీద పెద్ద‌గా ఆస‌క్తి లేద‌న్నాడు. కానీ బోర్డు ఇత‌ర స‌భ్యులు ఎవ్వ‌రూ గంగూలీకి మ‌ద్ద‌తుగా నిల‌వ‌క‌పోవ‌డంతో ఆ ప‌ద‌వి నుంచి గంగూలీ దిగిపోవాల్సి వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఎన్నిల ప్ర‌క్రియ ఆరంభం కాగానే చివ‌రి నిమిషంలో భార‌త్ మాజీ స్టార్ బిన్నీ పేరు తెర‌మీద‌కి వ‌చ్చింది. కాగా బోర్డు కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా కొన‌సాగుతారు. జై షా, గంగూలీలు రెండో విడ‌త త‌మ ప‌ద‌వుల్లో కొన‌సాగ‌వ‌చ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింద‌ని అయినా జై షా ప‌ద‌విలో కొన‌సాగుతుండ‌గా గంగూలీని ఏ కార‌ణం చేత‌నో ప‌ద‌వి వ‌ద‌ల‌వ‌ల‌సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. అత‌నికి బోర్డు ఎంతో అన్యాయం చేసింద‌ని, అవ‌మానించింద‌ని ఆమె అభి ప్రాయ‌ప‌డ్డారు. ఈ కార‌ణంగానే గంగూలీని ఐసీసీ ప‌ద‌వికి వెళ్లేలా,  మోదీ రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలో చించి క్రీడారంగ ప్ర‌గ‌తిని దృష్టిలో పెట్టుకుని అనుమ‌తించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌ధానిని కోరారు. ఇదిలా ఉండ‌గా, తాను ఐసిసికి వెళ్ల‌డానికి ఇక్క‌డ మ‌న బోర్డు మ‌ద్ద‌తు ఉండాల‌ని, అయితే ఇక్క‌డి బోర్డు స‌భ్యుల నుంచి త‌న‌కు అంత మ‌ద్ద‌తు వ‌స్తుంద‌న్న ఆశా లేద‌ని గంగూలీ అన్నారు. ప‌శ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి తానూ పోటీప‌డ‌తాన‌ని సౌర‌వ్ అన్నారు.

అయ్యయ్యో... రోజా ఏమిటిది? ఇదేం సంస్కారం!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి   రోజా.. వ్యవహార శైలి పట్ల ప్రజలే కాదు.. ఆమె సొంత పార్టీలోని కీలక నేతల నుంచి క్యాడర్ వరకు అంతా... అయ్యయ్యో ఇదేంటి.. ఇలా చేస్తోందేంటి... అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు.   మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో  వైసీపీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన విశాఖ గర్జనలో మంత్రులు, పలువురు కీలక నేతలు ప్రసంచిన సంగతి తెలిసిందే. గర్జన అనంతరం  రోజాతోపాటు పలువురు కీలక నేతలు తిరుగు ప్రయాణం కోసం విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఎయిర్ పోర్ట్ వద్ద   రోజా   చేష్టల పట్ల.. ఎయిర్ పోర్టు సిబ్బందే కాదు.. ఆ పరిసర ప్రాంతాల్లోని ప్రజలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.  మంత్రి ఆర్కే రోజా వెకిలి చేష్టలకు సంబంధించిన  ఓ వీడియో సామాజిక మాధ్యమంలో  హల్‌చల్ చేస్తోంది. మంత్రి రోజా ఏమిటీ.. ఇలా చేయడం ఏమిటి.. బూతూ... బూతూ అంటూ ఓ వైపు,   రోజా అడ్డంగా దొరికిపోయిందంటూ మరోవైపు నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఉండాలంటూ ఇటీవల అధికార ఫ్యాన్ పార్టీ నేతలు విశాఖ గర్జన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ముగించుకొని.. మంత్రులు, పలువురు కీలక నేతలు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే అదే రోజు.. విశాఖలో జనవాణి కార్యక్రమం కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. విశాఖకు చేరుకొన్నున్నారు. ఆ క్రమంలో ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాలు జనసైనికులు, పవన్ కల్యాణ్‌ ఫ్యాన్‌తో నిండిపోయింది. దీంతో ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలు  ఉద్రిక్తంగా మారాయి.  పవన్‌కు అనుకూలంగా.. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారంత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సందర్భంగా.. పర్యాటక శాఖ మంత్రి   రోజా  వేలు ఎత్తి చూపించడం పట్ల.. సొంత పార్టీలోని వారే అసహ్యించుకోవడం గమనార్హం.

టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ షాక్.. 96.21 కోట్ల ఆస్తులు జప్తు

తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామానాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు 96.21 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ సోమవారం (అక్టోబర్ 17) జప్తు చేసింది. నామానాగేశ్వరరావు, నామా సీతయ్యల అధీనంలో ఉన్న ఈ ఆస్తులను ఈడీ జప్తు చేసింద. రాంచీ-జంషడ్ పూర్ హైవే నిర్మాణం పేరిట బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మధుకాన్ గ్రూప్ కంపెనీ దారి మళ్లించిందన్న అభియోగాలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి విదితమే. ఈడీ దర్యాప్తులో డొల్ల కంపెనీల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగినట్లు గుర్తించింది.   దీంతో హైదరాబాద్, బెంగాల్, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఈ కంపెనీ పేరున ఉన్న 88.85 కోట్ల విలువైన భూములు, అలాగే 7.36 లక్షల విలువైన చరాస్థులను ఈడీ జప్తు చేసింది.  కాగా ఇదే కేసులు సంబంధించి గత ఏడాది జూన్ లో నామా నాగేశ్వరరావు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే.

జ‌గ‌న్ అడ్డుకోలు ఆట‌!

హీరోయిన్‌ని తీసికెళుతోన్న హీరోగారు, ఆయ‌న స్నేహ‌బృందాన్ని విల‌న్ అడ్డుకోవ‌డానికి అనేక మార్గాల్లో అడ్డంకులు క‌ల్పించ‌డం, ఒక‌టి రెండు దాడులు చేయుట‌..తీరిగ్గా త‌న్నులు తిని సుఖంగా హీరోహీరోయి న్లు వెళ్ల‌డానికి అడ్డంకులు తొల‌గించేయ‌డం..ఇదంతా సినీసీన్లు. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రైతుల పాద‌ యాత్ర ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించే య‌త్నం చేయ‌డం, యాత్ర‌కు మ‌ద్ద‌తుగా విప‌క్షాల మ‌ద్ద‌తును అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం  పోలీసుల‌తో అడ్డంకులు సృష్టిం చ‌డం, క‌ద‌ల‌నీయ‌కుండా చేసి వారితో వ‌చ్చి న వారిపై దాడులు చేయించి మ‌రీ భ‌య‌పెట్ట‌డం లాంటివి ఈమ‌ధ్య జ‌గ‌న్ స‌ర్కారుకి దిన‌చ‌ర్య‌గా మారింది. ఎవ‌ర‌న్నా ప్ర‌జోపయోగ ప‌నుల్లో బిజీగా ఉంటారు. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ మాత్రం విప‌క్షాల‌వారు వీధి చివ రికి వెళుతు న్నార‌ని తెలిసినా ఒక్క‌రిద్ద‌రు పోలీసుల‌నైనా పంపి వెన‌క్కి పంపే య‌త్నాలే చేస్తున్నారు. ఇది  పిరికి త‌నంతో కూడిన భ‌య‌మ‌నే అనుకోవాలి.  ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ కోల్పోయిన మ‌న‌స్తాపం ఈవిధంగా తీర్చుకుంటున్నార‌నే అనుకోవాలి. ఎందుకంటే మ‌హాపాద‌ యాత్ర చేస్తున్న రైతాంగానికి మద్ద‌తునివ్వ‌డానికి టీడీపీ యువ‌నాయ‌కులు ప‌రిటాల శ్రీ‌రామ్(అనంత‌ పురం), వంగ‌వీటి రాధా(విజ‌ య‌వాడ‌), గంటీ హ‌రీష్ (అమ‌లా పురం) వంటివారు ఆదివార‌మే రాజ‌మండ్రి చేరుకున్నారు. కాగా సోమ‌వారం ఉద‌యం పాద యాత్ర‌లో పాల్గొన‌డానికి బ‌య‌టికి  రాగానే వీరితో పాటు టీవీ5 చైర్మ‌న్ బీ.ఆర్‌.నాయుడిని కూడా పోలీసులు ఊహించ ని విధంగా చుట్టుముట్టి అడుగు ముందుకు వేయ‌ నీయ‌లేదు.  ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో రైతుల మ‌హాపాద‌యాత్ర రాజ‌మండ్రికి చేరుకోవ‌డాన్ని ప్రభుత్వం అడ్డు కునే య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. ప్ర‌శాంతంగా పాద‌యాత్ర చేస్తున్న రైతాంగాన్ని నిలువ‌రిం చేందు కు రాజ‌మండ్రి రోడ్డు క‌మ్ రైలు బ్రిడ్జి మీద రాక‌పోక‌లు నిషేధించారు. రిపేరు పేరుతో వారం రోజులు తిర‌గ రాద‌ని నిషేధా జ్ఞ‌లు అమ‌లుచేస్తున్నారు. అయినా త‌మ పాద‌యాత్ర ఆగే ప్ర‌సక్తి లేద‌ని రైత‌లు అంత‌కు మించి ధీటుగా స‌మాధానం ఇచ్చారు. వారికి సంఘీభావం తెలియ‌జేస్తూ పాద‌యాత్ర‌లో అడుగు క‌లిపేం దుకు, వారిని ఉత్సాహ‌ప‌రిచేందుకు టిడిపీ నాయ‌కులు రాజ‌మండ్రి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుని అడుగు ముందుకు వేయ‌నీయ‌క‌పోవ‌డంతో అక్క‌డ ఉద్రిక్త‌త చోటు చేసుకుంది.  పాదయాత్రకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్ర‌మంలో పోలీసుల  అడ్డును త‌ప్పించుకుని ముందుకు సాగేందుకు ప్ర‌య‌త్నించిన బీఆర్ నాయుడు కారుకు అడ్డుగా నిలిచిన పోలీ సులు అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. టీడీపీ నాయ‌కుడు కోనేరు మురళి ఇంటి వ‌ద్ద నుంచి బ‌య లు దేరిన వంగ‌వీటి రాధాను కూడా అడ్డుకున్నారు. దీంతో స్థానిక టీడీపీ కార్య‌క‌ర్త‌లు సైతం.. భారీ ఎత్తున అక్కడకు చేరుకున్నారు. దీంతో కోనేరు మురళి నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు త‌మ‌కు స‌హ‌క రించి వెళ్లిపోవాల‌ని లేకుంటే  అరెస్టులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. దీంతో రాజ‌మండ్రి రాజ‌కీయం ఒక్క సారిగా వేడెక్కింది.  ప్ర‌జానిర‌స‌న‌ను అడ్డుకోవ‌డానికి ప్ర‌భుత్వం విశ్వ‌య‌త్నాలు చేస్తోందే గాని, ప్ర‌జ‌ల నిర‌స‌న‌కు కార‌ణ‌మైన పాల‌నా విధానాల్లో మార్పులు చేర్పుల‌కు మాత్రం స‌సెమిరా అంగీక‌రించ‌డం లేదు. మూడేళ్లపాల‌న‌లో ప్ర‌జాహితంగా చేస్తున్నామ‌ని ప్ర‌చారం చేసుకున్న ఏ ఒక్క కార్య‌క్ర‌మం ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోలేదు. పైగా తీవ్ర నిర‌స‌న వెల్లువెత్తుతోంది. దీన్ని భ‌రించ‌లేక‌నే జ‌గ‌న్ స‌ర్కార్   రైతుల మ‌హాపాద‌యాత్ర‌ను నిలువ‌ రించడంలో విప‌క్షాలమీద దుమ్మెత్తిపోయ‌డం, వారిని మాట్లాడ‌నీయ‌కుండా చేయ‌డం, అడ్డుకోవ‌ డం, అరెస్టుల భ‌య‌పెట్ట‌డాలు చేయ‌డం విప‌క్ష‌పార్టీల కార్య‌క‌ర్త‌లపై లాఠీ ఝుళిపించి అరెస్టులు చేయ‌డా ల‌కు పూనుకుం టోంది.  అమ‌రావ‌తి రాజ‌ధానిని చేయ‌కుండా మూడు రాజ‌ధానుల అంశాన్ని తెర‌మీద‌కి తేవ‌డంతోనే విప‌క్షాలు మండిప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అమ‌రావ‌తి రైతులు చేప‌ట్టిన పాద‌యాత్ర కు టీడీపీ తో పాటు విప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు నీయ‌డంతో అది మ‌రింత ఊపందుకుంది. దానికి కౌంట‌ర్‌గా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు వైసీపీ తెర‌లేపింది. అది గాలివాన‌గా మారింది. హైకోర్టులో తీర్పుపై అస్పీలు చేసి స‌రిపెట్టుకోవ‌ల‌సి  వ చ్చింది.  కానీ అమ‌రావ‌తి రైతులు మాత్రం పాద‌యాత్ర‌ను మహాపాద యాత్ర‌గా మార్చి క‌దం తొక్కారు. వారికి సంఘీ భావం ప్ర‌క‌టించిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ కూడా  గ‌ట్టి మ‌ద్ద‌తే ఇ చ్చింది. ఈ నేప థ్యంలో వారి మ‌ద్ద‌తు యాత్ర‌ను కూడా  జ‌గ‌న్ సర్కార్ తీవ్రంగా అడ్డుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు ఆయ‌న పార్టీ నాయ కులు, అభిమానుల‌ను తిరిగి వెళిపోవాల ని పోలీసుల‌తోనే ప్ర‌తిఘ‌టించేలా చేసి దాడుల‌కు పాల్ప‌డ్డారు. ప‌వ‌న్ బ‌స చేసిన హోట‌ల్‌కి వెళ్లి మ‌రీ అక్క‌డ ఉన్న ఇత‌ర జ‌న‌సేన నాయ‌కుల‌ను బ‌య‌టికి తీసుకు వ‌చ్చి మీకు అనుమ‌తి లేద‌ని అంటూ వారి ని వెన‌క్కి పంపిం చ డం జ‌గ‌న్ స‌ర్కార్ ప‌రిస్థితిని స్ప‌ష్టం చేస్తుంది.  జ‌గ‌న్‌కి తిండి తినే కంటే విప‌క్షాలను క‌ద‌ల‌కుండా ఎలాచేయాల‌న్న ఆలోచ‌నే ఎక్కువ యిం ద‌న డానికి ఈ సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం.  స‌రిగా చ‌ద‌వ‌కుంటే పిల్ల‌ల్ని తండ్రి తిడ‌తాడు, ఆడ‌కుంటే కోచ్ తిడ‌తాడు, స‌రిగా పాల‌న చేయ‌కుంటే ప్ర‌జలు తిర‌గ‌బ‌డ‌తారు. కాదు పొమ్మంటే విప‌క్షాలు ఛ‌స్తే ఊరుకోవు. ప్ర‌తిఘ‌టిస్తాయి, ఉద్య‌మిస్తాయి కాద‌ని అడ్డుకునే వ్యూహాలు ఎన్ని పారించే య‌త్నాలు చేసినా ఫ‌లితం శూన్య‌మే. జ‌గ‌న్ ఎంత ఆలోచిం చినా అడ్డు కోవ‌డాలు, పోలీసుల మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ప్ర‌జాభీష్టంగా ముంద‌డుగు వేయ‌డం దుర్ల‌భం.

ఆకలి చుట్టూ అ...రాజకీయ దుమారం !

ఎవరో కవి, ఆకలికి అన్ని భాషలు వచ్చన్నారు. నిజం. ఆకలికి అన్నిభాషలు వచ్చును. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఆకలి మాట్లాడుతుంది. అలాగే,బెంగాలీ, పంజాబీ మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఉర్దూ, హిందీ ఇలా ఉత్తర దక్షణాది భాషలు అన్నిటిలో, ఆకలి మాట్లాడుతుంది. భారతీయ భాషలే కాదు, ప్రపంచ భాష ఇంగ్లీష్’ లోనూ ఆకలి అనర్గళంగా మాట్లాడ గలదు. అలాగే, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్ ఇలా మొత్తంగా  ఏడువేలకు పైగా ఉన్న ప్రపంచ భాషలు అన్నిటిలో ఆకలి మాట్లాడుతుంది.మాట్లాడుతూనే వుంది. ఆకలి కేవలం మాట్లాడమే కాదు, మాట్లాడిస్తుంది.పోట్లాడుతుంది. కేకలు పెడుతుంది. కేకలు పెట్టిస్తుంది. అంతే కాదు, రాజకీయ గర్జనలు చేస్తుంది. అయితే, రాజకీయ ఆకలి కేకలు ఎంతవరకు నిజం అంటే, బొమ్మా బొరుసు రెండూ నిజమే, రెండు కాదు.  ప్రపంచంలో ఆకలి ఉన్నది ఎంత నిజమో, ఆకలి రాజకీయమూ అంతే నిజం. ఆకలిని రాజకీయ అస్త్రంగా మలచుకునే  ప్రయత్నాలు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగాను జరుగుతున్నాయి. ఇందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 (జిహెచ్‌ఐ-2022) పేరిట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక  ఒక తాజా ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచిలో భారత దేశం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఆరు మెట్లు దిగజారి 121 దేశాల్లో 107 స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 116 దేశాల్లో 101 స్థానంలో వుంది.  అయితే, ఈ నివేదిక ఎంతవరకు ప్రామాణికం, నివేదిక తయారు చేసిన ఐఎఫ్ఆర్ఐకు ఉన్న విశ్వసనీయత ఎంత అనే విషయంలో ఎవరి అనుమనాలు వారికున్నాయి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం జిహెచ్‌ఐ-2022 నివేదికను తిరస్కరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు, జిహెచ్‌ఐ-2022ను బోగస్ నివేదిక అని కొట్టి వేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగతున్నకుట్రగా పేర్కొంటున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ  స్వదేశి జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతో, బాధ్యతారహితంగా జిహెచ్‌ఐ-2022 నివేదికను రూపొందించి/ప్రచురించి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ, ‘వెల్ట్ హుంగర్ హిల్ఫే పై విచారణ జరిపించి  చర్యలు తీసుకోవాలని జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. నిజానికి గత సంవత్సరం ఇదే సంస్థ ఇదే తప్పుడు గణాంకాల ఆధారంగా తప్పుడు  ఆరోపణలు చేసినప్పుడ, ప్రపంచ ఆహారసంస్థ (ఎఫ్ఏఓ) తప్పును ఒప్పుకుని సరిదిద్దుతామని మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసిందని స్వదేశి జాగరణ మంచ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారత దేశం ఆర్థిక, ఆహార, ఔషద సహాయం అందుకుంటున్నఇరుగు పొరుగు దేశాలు పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంకల కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొనడం అసత్యం మాత్రమే కాదు హాస్యస్పదంగానూ ఉందని స్వదేశీ జాగరణ్  మంచ్   పేర్కొంది.   నిజానికి, కొన్ని విదేశీ సంస్థలు భారత దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు సంబందించిన నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో  ఒక్క ఆకలి విషయంలోనే కాదు  ఇంకా అనేక విధాల దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ మరణాల విషయంలో  భారత దేశ జనాభాలో కనీసం  మూడో వంతు  జనాభా ఉన్నా అమెరికా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి దేశంలో హాహాకారాలు సృష్టించే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.     మరోవంక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఐఎఫ్ఆర్ఐ నివేదికకు, ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. హరతులిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇది నిదర్శనమని అంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇదే అదనుగా తీసుకుని  ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ గా వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్య ప్రచారంతో దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రధాని మోడీని విమర్శించడంలో ముందుండే  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తమదైన స్టైల్లో  మోడీ పాలనలో  కొద్ది మంది అస్మదీయులకు మాత్రమే అచ్చే దిన్, అమృత కాల్  దేశానికి మాత్రం డబుల్ ఇంజిన్ విధ్వంశం” అని ట్వీట్ చేశారు.       అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 3000 మంది అభిప్రాయలు సేకరించి, చిత్రించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 విశ్వసనీయత విషయంలో అధికార పార్టీకే కాదు, సామాన్యులకు కూడా సందేహాలున్నాయని అంటున్నారు.  కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి  పేద ప్రజలను కాపాడేందుకు, 2020 నుంచి  కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మంది  పేద ప్రజలకు నెలకు ఐదుకిలోల వంతును ఉచితంగా గోధుమలు/ బియ్యం సరఫరా చేస్తోంది. మరో వంక  శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల ఆకలి కేకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగని భారత దేశంలో ఆకలి లేదని కాదు. అంతా బాగుందని అసలే కాదు. కానీ, జిహెచ్‌ఐ-2022 నివేదిక పేర్కొన్నట్లుగా  పాక్, బంగ్లా, శ్రీలంక కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా అయితే లేదు. ఇక్కడే  జిహెచ్‌ఐ-2022 నివేదిక ‘సృష్టి’ కర్తలు తప్పులో కాలేశారని అంటున్నారు. అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి,  కానీ, జిహెచ్‌ఐ-2022 వివేదిక నిండా బొక్కలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.  నిజానికి   దక్షిణ ఆసియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మసక బారుతున్న ఆర్థిక వ్యవస్థకు వెలుగు కిరణం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే  అని ఇటీవలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. అయితే, అది సంపూర్ణ సత్యమా, అంటే కాకపోవచ్చును కానీ, జిహెచ్‌ఐ-2022 మాత్రం సంపూర్ణ అసత్యం, అని నిపుణులు అంటున్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ షురూ!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు మూడేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్ష ఎన్నిక సోమవారం (అక్టోబర్ 17)న పోలింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 19 ( బుధవారం) జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికలలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్న విషయంపై పెద్దగా ఎవరిలోనూ ఉత్కంఠ లేదు. ఫలితం నామినేషన్ల రోజునే తేలిపోయింది. అధిష్ఠానం ఆశీస్సులున్న ఖర్గే విజయం దాదాపు ఖాయమన్న భావన అయితే అందరిలో నెలకొని ఉంది. మరో అభ్యర్థి శశిథరూర్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పేయడమే కాకుండా ఖర్గేకు అభినందనలు కూడా తెలియజేశారు. అయితే దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మంది పీసీసీ ప్రతినిథులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును బెంగళూరులో వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జైరాం రమేష్ భారత్ జోడో యాత్ర క్యాంపులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఏఐసీసీ కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఅన్ని పీసీసీ కార్యాలయాలలోనూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.  

మెట్రో  వెయ్యి  ట్రిప్పులు  ఏ మూల‌కి?

ఇంటిల్ల‌పాదీ చిన్నా చిత‌కో ఉద్యోగ‌మో, వ్యాపార‌మో చేస్తేగాని ఇల్లుగ‌డిచే ప‌రిస్థితి లేదు. కాలం ఎంతో మారిపోయింది. పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ అయింది. ఏది కొన్నా కొండ‌చిలువ‌లా లాగేసుకుంటోంది గాని ఫ‌ర‌వాలేదు అనుకున్న ధ‌ర‌కు వ‌చ్చింద‌నేది లేదు. ఉద్యోగాల‌కోస‌మో, ప‌నికోస‌మో బ‌స్సులు, మెట్రో రైళ్ల ప్ర‌యాణాలు త‌ప్ప‌డం లేదు..ప్ర‌తీ ఏడూ ప్ర‌యాణీకుల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో ప్ర‌యాణీకులు స‌మ‌ యానికి గ‌మ్యాన్ని చేర‌లేక‌పోతున్నారు. బ‌స్స‌ల్లో వెళ్ల‌లేకపోతు న్నామ ని మెట్రో రైళ‌ల‌ను ఆశ్ర‌యించినా అంత‌గా పెద్ద ప్ర‌యోజ‌నం లేక‌పోతోంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తు న్నాయి. మెట్రో రైళ్ల ట్రిప్పులు పెరిగినా అంత‌గా ప్ర‌యోజ‌నం లేక‌పోతోంది. బోగీలు ఎక్కువ లేక‌ పోవ‌డం ఒక్క‌సారిగా ఒక్క బోగీలో రెండు బ‌స్సుల జనం ఎక్కుతుండ‌డంతో ప్ర‌యాణీకుల క‌ష్టాలు బ‌స్సు క‌ష్టాల్ని త‌ల‌పిస్తున్నాయి! ప్ర‌స్తుతం వెయ్యి ట్రిప్పులు తిరుగుతున్నాయి, మూడు బోగీల్లో ప్ర‌యా ణీకు ల‌ను గ‌మ్యాల‌కు చేరుస్తున్నాయి. కానీ ఇది ఏమాత్రం ఉప‌యోగ‌క‌రంగా లేద‌న్న‌దే ప్ర‌యాణీకుల గోడు. బోగీల‌ను మ‌రిన్నిపెంచితేనే ప్ర‌యాణీకుల స‌మ‌యాన్ని ఆదా చేసిన‌వార‌వుతారు. ఇది మెట్రో రైల్వేవారు  దృష్టిలో పెట్టుకుని చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయాలే వ్య‌క్త‌మ‌వు తున్నాయి.  ఎలాంటి అడ్డంకులు, స్టేజీల బెడ‌దా లేకుండా వీల‌యినంత త్వ‌ర‌లోనే గ‌మ్యానికి చేర‌డానికి చాలా మంది ఉద్యోగులు, ప‌నుల‌కు వెళ్లేవారు మెట్రోనే ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో ఈ మెట్రో ప్ర యాణీకుల సంఖ్యా పెరిగింది. న‌గ‌రంలో ఏద‌న్నా పండ‌గో,  పార్టీల హ‌డావుడి  జ‌రిగితే  ట్రాఫిక్  ఇబ్బందు ల‌తో బ‌స్సుల్లో ప‌డి వెళ్ల‌లేక‌నే మెట్రోని న‌మ్ముకుంటున్నారు. టికెట్ ధ‌ర ఎంత‌య‌నప్ప‌టికీ  వీల‌యినంత త్వ‌ర గా చేరిపోవ‌చ్చ‌న్న ఉద్దేశంతోనే బస్సుల‌ను వ‌దిలేసి మెట్రోల్లో వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. టికెట్ ఎక్కువా త‌క్కువా అన్న‌ది కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే, ఈ ఒత్తిడిని త‌గ్గించుకోవ‌డానికి మెట్రో రైల్వేవారు ట్రిప్పుల సంఖ్య పెంచామ‌ని అంటున్నారు. దాని వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యాణీకుల‌కు క‌లిగే ప్ర‌యో జ‌నం లేద‌నే అనాలి. ట్రిప్పుల కంటే బోగీల సంఖ్య కూడా పెంచే ఆలోచ‌న చేయాలి. అదీ వీలు వెంట‌నే చేయ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. రైళ్లు వెంట వెంట‌నే ఉంటున్న‌ప్ప‌టికీ ఆఫీసులు, ప‌ను ల‌కు వెళ్లే సమ‌యంలో ఒక్క‌సారిగ ప్ర‌యాణీకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది క‌నుక ట్రిప్పుల‌తో పాటు బోగీల సంఖ్య పెంచితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్న‌ది ప్ర‌యాణీకుల మాట‌. సౌక‌ర్యం కంటే త్వ‌ర‌గా వెళ్ల‌డానికి ప్ర‌యాణీకులు ఇష్ట‌ప‌డుతున్న‌పుడు బోగీల సంఖ్య పెంచ‌డ‌మే ధ‌ర్మ‌మ‌వుతుంది. 

యాక్టివ్ అవుతున్న టీడీపీ యువతరం వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీ

తెలుగుదేశం పార్టీలో యువ తరంగం మరింత యాక్టివ్ అవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీకి వైసీపీ గ్రహణం నుంచి విముక్తి కలిగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి ఆ పార్టీలోని డైనమిక్ యువ నేతలు మరింత ఉత్సాహంగా ప్రోత్సాహం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఆ క్రమంలోనే ఏపీ టీడీపీ రాజకీయాల్లో తాజాగా అత్యంత అరుదైన ఘటన జరిగింది. అమరావతినే ఏపీకి ఏకైక రాజధానిగా ఉంచాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న అమరావతి టూ అరసవిల్లి పాదయాత్రకు మద్దతుగా పాల్గొనేందుకు వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్ రాజమండ్రి వచ్చారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ రాజమండ్రిలో ఓ రహస్య ప్రాంతంలో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీకి సంబంధించిన విజువల్స్ ను పరిటాల శ్రీరామ్ తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు. రాధా, శ్రీరామ్ తో పాటు తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు క్రియాశీల నేత,  లోక్ సభ స్పీకర్ దివంగత  జీఎంసీ బాలయోగి కుమారుడు హరీశ్ కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు యువనేతల అపూర్వ కలయికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందులోనూ ఇరు ప్రాధాన్యతా కుటుంబాల వారసులు రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ ఇద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినవారే. వంగవీటి రాధాకృష్ణ కుటుంబానికి కోస్తాంధ్రలోను మరీ ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అంతకు మించి విజయవాడలో బలమైన రాజకీయ నేపథ్యం ఉంది.  అలాగే.. పరిటా శ్రీరామ్ కుటుంబానికి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. తాడిత పీడిత, పేద ప్రజలకు అండగా నిలిచిన చరిత్ర ఉన్న కుటుంబాలకు వారసులు రాధా- శ్రీరామ్. పేదలకు అండగా ఉన్న క్రమంలోనే వంగవీటి రంగా, పరిటాల రవి అసువులు బాసారు. ఈ రెండు కుటుంబాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ రాజమండ్రిలో భేటి అవడం, వారితో మరో యువనేత గంటి హరీశ్ కూడా జత కలవడం చర్చనీయాంశంగా మారింది. వీరి అపూర్వ సమావేశం  రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ ముగ్గురూ కూడా మూడు వేర్వేరు బలమైన సామాజికవర్గాలకు చెందినవారే కావడం గమనార్హం. గతంలో వంగవీటి రాధాపై రెక్కీ ఘటన సందర్భంగా పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. వంగవీటి రాధా తెలుగుదేశం కుటుంబ సభ్యుడని, రాధాను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ సందర్భంగా శ్రీరామ్ హెచ్చరించారు. వంగవీటి కుటుంబం అంటే మామూలు కుటుంబం అనుకుంటున్నారా? అని శ్రీరామ్ ఘాటుగా ప్రశ్నించారు. అప్పటికి ఈ యువనేతలిద్దరూ ప్రత్యక్షంగా కలుసుకున్నది లేదు. ఇరువురూ టీడీపీలో డైనమిక్ లీడర్లే. అలాంటి యువ నేతలు ఇప్పుడు తొలిసారిగా రాజమండ్రిలో సమావేశమై ఏ విషయాలు చర్చించారనే దానిపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ అక్కసుతోనే అధికార వైసీపీ వీరిరువురినీ ఇబ్బందులు పెట్టేందుకు యత్నాలు చేస్తోంది. ఆ క్రమంలోనే వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగింది. రాధాపై రెక్కీ నిర్వహించడంపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రాధాను నిర్మూలించాలనే కుట్ర ఈ రెక్కీ వెనుక ఉన్నట్లు తర్వాత బయటపడింది. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ భేటీపై సోషల్ మీడియాలో పలువురు విశేషంగా స్పందిస్తున్నారు. ఇద్దరు పులి బిడ్డలు కలిశారంటే చరిత్ర తిరగరాసినట్లే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పరిటాల రవి, వంగవీటి రంగా ఇద్దరూ సింహాలని, ఆ సింహాల కొడుకులు రాధా, శ్రీరామ్ తొలిసారి భేటీ అవడాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్ సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు భేటీ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో యువతకు 40 శాతం టికెట్లు కేటాయిస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రాధా- పరిటాల శ్రీరామ్- గంటి హరీశ్ భేటీ అవడం కూడా టీడీపీలో యువతలో మరింత చైతన్యం తీసుకొచ్చే వ్యూహాల గురించి వీరు చర్చించి ఉండొచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే వీరి మధ్య ఏవో కీలకమైన అంశాల మీదే ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగి ఉండొచ్చాని భావిస్తున్నారు.  మొత్తానికి రాధా- శ్రీరామ్ తొలిసారిగా భేటీ అవడమే ఆశ్చర్యకరమైతే.. వారితో బాలయోగి కుమారుడు హరీశ్ జత కలవడం అపురూపమైన, అరుదైన ఘటనగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రాజకీయంగా వీరి కలయిక సంచలనం సృష్టిస్తోంది. ఈ ముగ్గురు యువనేతల కలయిక ప్రత్యర్థి పార్టీల నేతలు ముఖ్యంగా పెచ్చుమీరిన నియంతృత్వ వైఖరితో ఉన్న వైసీపీ నేతల్లో కలవరం సృష్టించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.