ఖర్గే కొత్త టీమ్... సీసా పాతదే.. సారా పాతదే..!..ప్చ్

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చినా.. పాత సంప్రదాయం మారే పరిస్థితి లేదు. సేమ్ ఓల్డ్ టీమ్.. సేమ్ ఓల్డ్ డైనాస్టీ. కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపి పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే తన లక్ష్యం అన్న ఖర్గే తన కొత్త టీమ్ లో స్థానం కల్పించిన వారి పేర్లు చూస్తే పార్టీకి పునర్వైభవం వస్తుందని అనిపించే పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన వయో వృద్ధుడు మల్లిఖార్జున్ ఖర్గే.. వెంటనే పనిలోకి దిగిపోయారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడ్బ్లూసీ స్థానంలో కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 47 మంది సీనియర్లతో  ఏర్పాటు చేసిన ఈ కమిటీలో సోనియా కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ మినహా మిగిలిన అందరూ 60 ఏళ్లకు పైబడిన వారే! వృద్ధులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన ఖర్గే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీ టికెట్లలో 50% యువతకే టికెట్లు ఇస్తామని ప్రకటించడం విశేషం. కాగా ఖర్గే ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీపై సామాజిక మాధ్యమం వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఎనిమిదిపదులు పైబడిన మల్లిఖార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పార్టీకి యువరక్తం ఎక్కిస్తానంటూ చెప్పడం..బాధ్యతలు చేపట్టిన వెంటనే సీబ్ల్యూసీ స్థానంలో47 మందితో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ఆరు పదులు నిండిన వారే కావడంతో ఖర్గే  టీమ్ ను కొత్త సీసాలో పాత సారా అనడానికి కూడాలేకుండా పోయిందనీ, పాత సీసాలో పాత సారా చందంగా నే ఖర్గే టీమ్ ఉందని నెటిజన్లు సెటెర్లు వెస్తున్నారు.   ఖర్గే టీమ్ లో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ ,మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా మాజీ మంత్రులు ఏకే ఆంటోనీ అజయ్ మకేన్, అంబికా సోని ఆనందశర్మ , జైరాం రమేష్, పి.చిదంబరం,కేసీ వేణుగోపాల్,  దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్, రాజీవ్ శుక్లా ఉన్నారు.  వీరంతా ఇప్పటి వరకూ సీబ్ల్యూసీలో ఉన్న వారే. కాంగ్రరెస్ వైఫల్యాలకు బాధ్యత వహించాల్సినవారే. మళ్లీ వీరితోనూ ఖర్గే తన  కొత్త టీమ్ ను ఏర్పాటు చేయడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహంవ్యక్తమౌతోంది.   మాజీ సీబ్ల్యూసీ నేతలు, జీ-23 సభ్యులకు కూడా ఖర్గే టీమ్ లో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాకు సంబంధించి ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డికి ఖర్గే జట్టులో స్థానం లభించింది. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ కు కూడా ఖర్గే టీమ్ లో చోటు దర్కింది. దీంతో మాణిక్కం ఠాకూర్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మాణిక్కం ఠాకూర్ వల్ల నష్టమే జరిగిందన్న భావన కాంగ్రెస్ శ్రేణుల్లో బలంగా ఉంది. అటువంటి వ్యక్తికి ఖర్గే తన కొత్త టీమ్ లో స్థానం కల్పించడం వల్ల ఏం సాధిస్తారో అర్ధం కాదని పార్టీ వర్గాలే అంటున్నాయి. అలాగే టీ.సుబ్బిరామిరెడ్డి కూడా.. ప్రజా బలం ఇసుమంతైనా లేని ఆయనకు తన జట్టులో స్థానం కల్పించడం వల్ల ప్రయోజనం ఏమిటన్నది ఖర్గేకే తెలియాలని అంటున్నారు. ఇలా ఎంచుకుంటూ పోతే ఖర్గే కొత్త టీమ్ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదన్న భావనే కాంగ్రెస్ క్యాడర్ లో వ్యక్తం అవుతుంది.  

ఆర్జీవీ..జగన్.. ఒక భేటీ వంద సందేహాలు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్‌తో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకస్మాత్తగా భేటీ కావడం.. అదీ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాలు పాటు వీరు సమావేశం కావడం సినీ రాజకీయవర్గాలలోనే కాకుండా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరు అంత అకస్మాత్తగా భేటీ కావడం వెనుక ఉన్న అసలు సిసలు అంతర్యం ఏమిటి ?.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి... అలాంటి వేళ వీరిద్దరు భేటీ కావడం పట్ల  హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక్కసారిగా కమాన్ గుసగుస అన్నట్లుగా గుసగుసలు మొదలైనాయి.  కేంద్రంలోని బీజేపీ .. జనసేన పార్టీతో జత కట్టేందుకు ఊపు ఉత్సాహం చూపిస్తోంది. మరోవైపు మూడు రాజధానుల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మద్దతుగా విశాఖపట్నంలో అధికార జగన్ పార్టీ విశాఖ గర్జన సభ నిర్వహించింది. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వేదికగా చెప్పు చూపిస్తూ.. చేసిన వ్యాఖ్యలపై వైసీపీఅధినేత వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా సినిమాలు తెరకెక్కించేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.  ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌పై నెగటివ్‌ యాంగిల్‌లో సినిమా లేదా సినిమాలు తెరకెక్కించే బాధ్యత రామ్ గోపాల్ వర్మపై జగన్ ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 25వ తేదీ.. సీఎం  జగన్‌తో నందమూరి లక్ష్మీ పార్వతీ భేటీ కావడం..  ఆ మరునాడే రామ్ గోపాల్ వర్మ కూడా ఫ్యాన్ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారని... దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై కూడా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పిలింనగర్ వీధుల్లో చక్కెర్లు కొడుతోంది.    అంతేకాదు.. ఈ సినిమాల స్క్రిప్ట్.. అంతా హైదరాబాద్‌లోనే జరగాలని.. అదీకూడా సూపర్ ఫాస్ట్‌గా తయారు కావాలని... వర్మకు సీఎం జగన్ సూచించారని... ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఓ ఖరీదైన ఇంటిని సైతం వర్మకు సీఎం జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.  జగన్, వర్మ మధ్య జరిగిన భేటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు చక చకా అనుమతులు లభించేలా చర్యలు తీసుకునే బాధ్యతను  నగరి ఎమ్మెల్యేకు సీఎం జగన్ కట్టబెట్టారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ తేదీలు విడుదలయ్యే రెండు లేదా మూడు నెలలకు ముందే ఈ సినిమాలు.. వరుసగా విడుదలయ్యేలా ఉండాలని.. రామ్ గోపాల్ వర్మకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఖర్చుకు మాత్రం ఏ మాత్రం వెనుకాడవద్దంటూ వర్మకు జగన్ భరోసా కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇక సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్‌కి అందరూ వెళ్లే మార్గంలో కాకుండా మరో మార్గం నుంచి రామ్ గోపాల్ వర్మ వెళ్లడం పట్ల అక్కడి మీడియా ప్రతినిధులు సైతం చర్చించుకున్నారని తెలుస్తోంది. అలాగే సీఎం  జగన్‌తో వర్మ భేటికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. కర్మ... కర్త... క్రియగా వ్యవహరించారనే ఓ టాక్ అయితే  ఫిలింనగర్‌లో నడుస్తోంది. అలాగే హైదరాబాద్‌లో వర్మకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం మిధున్ రెడ్డే  చూసుకోనేలా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.  గత ఎన్నికలకు ముందు.. వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి... విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అలాగే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సైతం వర్మ దర్వకత్వం వహించి విడుదల చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. అలాంటి వేళ.. గతంలో చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని.. సినిమాలు తెరకెక్కించినట్లు.. ఈ సారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేసుకుని సీనిమా లేదా సినిమాలు తీసే అవకాశం లేకపోలేదనే ఓ టాక్ అయితే ఫిలింనగర్ వర్గాల్లో ఫిలిం రీల్ తిరిగినట్లు తిరుగుతోంది.

కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. బిత్తర పోయిన బీజేపీ

మాటల మాంత్రికుడే కాదు.. మాయల మరాఠీ కూడా.. ఇదీ ప్రత్యర్థులు కేసీఆర్ గురించి చెప్పే మాట. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. వారి వ్యూహాలను చిత్తు చేయడం కేసీఆర్ కు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ ఆయనీ వ్యూహాలను, ఎత్తులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. గురి చూసి ప్రత్యర్థని లక్ష్యం చేసి ఆయన వ్యూహ రచన చేస్తే..ఇక అంతే. యుద్ధం లేదు.. గిద్ధం లేదు. తెలంగాణలో అత్యంత బలంగా ఉండే తెలుగుదేశం పార్టీని ఓటుకు నోటు కేసులో ట్రాప్ చేసి ఉనికినే ప్రశ్నార్థకం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి వ్యూహంతోనే బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వ్యూహ రచన దగ్గర నుంచి ఆ వ్యూహాలను అమలు చేయడం వరకూ కేసీఆర్ ప్రతిదీ పకడ్బందీగా చేస్తారనడానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సొమ్ములతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తాజా ఉదాహరణ మాత్రమే.గతంలో ఆయన ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో వేశారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కమలం కండువా కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతిని పసిగట్టిన కేసీఆర్ తెలంగాణలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఆ పార్టీ మూడు ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండటం ఆ పార్టీకి ఉన్న బలం. అయితే కేసీఆర్ వ్యూహాల కారణంగా తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదనడానికి మొయినాబాద్ ఫాం హౌస్ లో నోట్ల కట్టలతో దొరికి పోయిన ఆ పార్టీ దూతలే సాక్ష్యం అని పరిశీలకులు అంటున్నారు. టీఆర్ఎస్ లో షిండేలున్నారని చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమనీ జోస్యం చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలువురు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకుని బీజేపీ గూటికి చేరారు. ఉద్యమ నేతలంగా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారంటూ తెలంగాణ సాధన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది కూడా. అయితే ఉద్యమ పార్టీ మాదేనంటూ బీజేపీ చెప్పిన రోజుల వ్యవధిలోనే కేసీఆర్ చక్రం తిప్పారు. కమలం గూటికి చేరిన ఉద్యమ నేతలలో కొందరిని  కారెక్కించుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారానికీ పక్కా వ్యూహంతో చెక్ పెట్టారు. ఒక రకంగా బీజేపీని మౌస్ ట్రాప్ లో ఇరికించేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనగోలుకు బీజేపీ ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారని అంటున్నా.. నాడు రేవంత్, నేడు బీజేపీలను ఢిఫెన్స్ లో పడేయడం వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ మాత్రం కేసీఆర్ దేనని పరిశీలకులు అంటున్నారు. మొయినా బాద్ సంఘటనలో బీజేపీకి కేసీఆర్ స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఎరగా వేసి బుక్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత మీద ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పీకల్లోతు ములిగిపోయి.. వివరణలు ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడేలా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఈ వ్యవహారంలో కేసీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా.. ఇదంతా ఆయన కుట్రేననీ, టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ ఆరోపణలు గుప్పించినా.. కోట్ల రూపాయల సొమ్ముతో పట్టుబడిన తీరు మాత్రం బీజేపీని డిఫెన్స్ లో పడేశాయనడంలో సందేహం లేదు. మొయినాబాద్ సంఘటనలో దొరికిపోయిన వారికి బీజేపీతో సంబంధం లేదని చెప్పుకోవడానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా ప్రజలను నమ్మించడం అంత సులభం కాదు. హస్తిన నుంచి వచ్చి ఇక్కడ దొరికిపోయిన  రామచంద్రభారతి కానీ, తిరుపతికి చెందిన సోమయాజులు స్వామి కానీ,  హైదరాబాద్ కు నందకుమార్ కు కానీ బీజేపీతో సంబంధాలు లేవని ఎంత చెప్పుకుందామనుకున్నా.. సామాజిక మాధ్యమాలలో వారికి కమలం పార్టీతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఫొటోలు విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడన్న సంగతి బీజేపీని కచ్చితంగా ఇరుకున పెడుతోంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీకి ఈ వ్యవహారం గట్టి ఎదురు దెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు.  

కొత్త పార్టీలతో తెలుగుదేశం, జనసేనలకు చెక్.. జగన్ కొత్త స్కెచ్

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఆ క్రమంలో రాజకీయ పార్టీల అధినేతలు.. అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం.. ఆస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఓట్లర్ల ఓట్లు కొల్లగొట్టేందుకు ఎంత చేయాలో.. ఎలా చేయాలో.. ఏమి చేయాల్లో.. ఆలోచిస్తూ.. అందుకు అనుగుణంగా వ్యూహా రచనకు శ్రీకారం చుడుతున్నారు.   ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ మళ్లీ అధికారాన్ని అందుకోనేందుకు.. అదీ కూడా 175కి 175 సీట్లు కైవసం చేసుకోవడం కోసం.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కొత్తకొత్త స్కెచ్ లకు శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు.. అదీ విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇటీవల జగన్ పార్టీ.. విశాఖ గర్జన పేరిట భారీ బహిరంగ సభను   నిర్వహించింది. అదే రోజు విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు అయితేనేమి.. ఆ తర్వాత కొద్ది రోజులకే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చేసిన హాట్ కామెంట్స్ అయితేనేమి.. అదే రోజు.. సాయంత్రం విజయవాడలో పవన్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం అయితేనేమి.. ఆ కొద్ది సేపటికే చంద్రబాబుతో కలిసి పవన్ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అయితేనేమి.. ఈ మొత్తం ఎపిసోడ్‌తో మళ్లీ చంద్రబాబు, పవన్‌ జత కట్టి వచ్చే ఎన్నికల్లో పోటీకి వెళ్తున్నారంటూ..  జగన్ ఓ నిర్ణయానికి వచ్చేశారంటున్నారు. దీంతో   జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తే.. తాము లక్ష్యంగా పెట్టుకున్న.. 175 సీట్లలో భారీగా కోత పడే అవకాశం ఉందని   జగన్..   ఫిక్స్ అయిపోయినట్లు వారు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓట్లు భారీగా చీల్చే ప్రక్రియకు సీఎం జగన్  పథక రచన చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మరిన్ని కొత్త రాజకీయ పార్టీలను  తెరపైకి తీసుకు వచ్చి..  వాటి ద్వారా ఓట్లను చీల్చి    ప్రత్యర్థులను దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో సీఎం జగన్ వ్యూహరచన చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. తన పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చేశారు. ఈ పార్టీ సైతం వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేయనుందని... అందుకోసం ఇప్పటికే కేసీఆర్... ఏపీలో తన పాత స్నేహితులతో టచ్‌లోకి వెళ్లి.. అడపా దడపా వాళ్లతో చిట్ చాట్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. మునుగోడు ఉప ఎన్నిక  తర్వాత..   సీఎం కేసీఆర్.. ఏపీలో పర్యటించేందుకు ప్రణాళికలు సైతం సిద్దం చేసుకొంటున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఏపీలోని వివిధ రాజకీయ పార్టీల్లోని పలువురు అసంతృప్తులను తన వైపునకు తిప్పుకునేందుకు కేసీఆర్.. ఓ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దాంతో వివిధ పార్టీల్లోని కీలక నాయకులు కేసీఆర్..కారెక్కినా ఆశ్చర్య పోనక్కర్లేదని రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తోంది.  మరోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు  షర్మిల భర్త, సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్‌తో కూడా ఏపీలో పార్టీ స్థాపిస్తే.... తమ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే ఓ ఆలోచనలో రాజన్న ముద్దు బిడ్డ..జగన్ ఉన్నట్లు తెలుస్తోందని వారు అంటున్నారు. ఇంకో వైపు.. మూడు రాజధానుల ఆస్త్రం ఉండనే ఉంది.. దీంతో ఆయా ప్రాంతాల మధ్య చిచ్చు రగిల్చిన చిచ్చు.. ప్రస్తుతం మిణుకు మిణుకు మంటోంది. దీనిని కొద్దిగా కదిలిస్తే.. చాలు.. ప్రజలు ఎలాంటి.. ఎవరి ప్రమేయం లేకుండానే.. రగిలిపోతారని... దీంతో ఓట్లు ఆటోమెటిక్‌గా చీలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే.. పుట్టగొడుగుల్లాగా రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యేలా చేసి.. వాటి ద్వారా... వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను దెబ్బ కొట్టేందుకు   జగన్   పక్కా ప్రణాళికలతో ముందుకు వెల్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా.. బండి సంజయ్

టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ బండి సంజయ్ ఆరోపించారు. తాజాగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ విమర్శించారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ కోనుగోలు బేరసారాల డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రగతి భవన్ దేనని అన్నారు. అసలు మోయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారి నిలదీశారు. ఆ ఫాం హౌస్ టీఆర్ఎస్ వాళ్లదేననీ, ఫిర్యాదు చేసిందీ టీఆర్ఎస్ వాళ్లేననీ.. అంటే ఈ కొనుగోలు బేరసారాల డ్రామాలో నిందితులూ, బాధితులూ, ఫిర్యాదు చేసిన వారూ కూడా టీఆర్ఎస్ వాళ్లేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కు ఇలాంటి డ్రామాలు బాగా అలవాటని దుయ్యబట్టారు. గతంలో మంతిపై హత్యాయత్నం డ్రామాను రక్తిగట్టించిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు.  బేరసారాలు అంటున్నారు.. మరి ఎమ్మెల్యేలనూ పీఎస్ కు ఎందుకు తరలించలేదు.. వారు నేరుగా ప్రగతి భవన్ కు ఎలా వెళ్లారని నిలదీశారు. ఈ డ్రామాలో పోలీసులూ పాత్రధారులేనని విమర్శించారు.    ఆ నలుగురు ఎమ్మెల్యేలూ పనికి మాలిన వారనీ, వారినెవరూ కొనరనీ తీవ్ర స్థాయిలో విమర్శించారు తన పార్టీలో కట్టు తప్పుతున్న వారిని బెదరించడానికే కేసీఆర్ ఈ డ్రామా ఆడారన్నారు. ఈ ఎమ్మెల్యేల బేరసారాల బండారం త్వరలో బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. అయినా ప్రభుత్వానికి ధైర్యముంటే ఆ ఫామ్‌హౌజ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సీఎం కేసీఆర్ యాదాద్రిలో  ప్రమాణం చేసేందుకు సిద్ధమా ? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడమే ఇదంతా కేసీఆర్ ఆడించిన నాటకమనడానికి నిదర్శనమన్నారు.   అసలు పోలీసులు వారిని  ఎలా విడిచిపెట్టారని.. వారి స్టేట్‌మెంట్ అయినా రికార్డ్ చేశారా ? అని ప్రశ్నించారు. అ ప్రగతి భవన్‌కు సంబంధించిన మూడు రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.   ఏడాదిలో పడిపోయే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనేందుకు తాము వంద కోట్లు ఖర్చు పెడితే.. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ఎంత ఖర్చు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి 9 రోజుల పాటు అక్కడే బస చేసిన కేసీఆర్ ఎవరెవరిని కలిశారు? అన్నది గోప్యంగా ఉంచారనీ, హస్తినలో స్వామీజీలను కేసీఆర్ కలిశారా అని నిలదీశారు. గతంలో రేవంత్ రెడ్డి పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చిన సంగతిని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.    ఢిల్లీలోనే ఈ డ్రామాకు రూపకల్పన జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.తమకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.

తెరాస ఎమ్మెల్యేల కోనుగోలుకు బేరసారాలు... అడ్డంగా బుక్కైన బీజేపీ!

మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీ అడ్డంగా బుక్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ పేర బీజేపీ నుంచి నాయకుల వలసలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే తెరాసకు షాక్ ఇచ్చి.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కమలం గూటికి చేర్చి  లెక్క సమం చేయాలని బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. తెరాస ఎమ్మెల్యేలను కమలం గూటికి లాగేసేందుకు హస్తిన నుంచే బీజేపీ పావులు కదిపిందని చెబుతున్నారు. ఇందు కోసం బీజేపీ మఠాధిపతులను రంగంలోనికి దింపింది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాం హౌస్ లో  రామచంద్రభారతి, సోమయాజులు స్వామి,   నందకుమార్ అనే వ్యక్తులు తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతుండగా  పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు 15 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.    హైదరాబాద్   శివారులోని  మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో నలుగురు తెరాస ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి లతో బేరసారాలు ఆడుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించిన వారిలో రామచంద్రభారతి హస్తిన నుంచి రాగా, సోమయాజులు స్వామి తిరుపతికి చెందిన వారు. ఇక నందకుమార్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తి.  ఇలా ఉండగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విలేకరులతో మాట్లాడుతూ.. తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము వారిని ప్రలోభాలకు గురి చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నామని చెప్పారు. దీనిపై పూర్తి దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపారు. కాగా పోలీసులకు దొరికిన వారిలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని చెబుతున్నారు. ఇక స్వామి రామచంద్రభారతి తిరుపతి నుంచి వచ్చారనీ, స్వామి సింహయాజులు తిరుపతికి చెందిన వారనీ అంటున్నారు.  

మోదీజీ అమరావతి సంగతేమిటి?

ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ పర్యటించనున్నారు.  ప్రధాని రాక కోసం ముఖ్య మంత్రి జగన్ కంటే ప్రజలే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారనాలి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ అప్పటి  హామీలను కేంద్రం  నాన్చుతూనే ఉంది.  రాష్ట్రానికి  ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, భోగాపురం విమానాశ్రయం వంటివి తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన ప్రధాని పర్యటనలో కీలకంగా పేర్కొ న్నారు. అయితే రాష్ట్రప్రజలు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఈ అవకాశాన్ని ఎంతవరకూ ఉపయోగిం చుకుని రాష్ట్రానికి మేలు చేస్తారన్నది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయన సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలపై ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన ఇప్పుడు జగన్ సర్కార్ మూడు రాజధానులంటూ చేస్తున్న హడావుడినీ, సృష్టిస్తున్న అరాచకాన్ని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారన్న విషయంపై ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మూడు రాజధానులపై రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలై.. అసలు మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఏమిటన్నది స్పష్టం చేసిన తరువాతనే ఆయన ఏపీ పర్యటనకు రావాలని ఏపీ జనం డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ కు తెలియజేశారు. మూడేళ్ల పాలన తర్వాత ఆయన్ను వద్దనే అంటున్నారు. పాలనాపర నిర్ణయాలంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ప్రత్యేకించి చేసిందేమీ లేదన్నది ప్రజల నుంచి వస్తున్న మాట. పైగా రాజధాని విషయంలోనూ ప్రజలు, రైతులు తిరగబడుతున్నారు. ప్రధాని మోదీ వద్దకు అనేక పర్యటనలు చేసిన జగన్ సాధించిందీ, తెచ్చిందీ ఏమీ లేదు. ఆఖరికి విశాఖ రైల్వేజోన్, విషయం తేల్చలేకపోయారు. కేవలం సమావేశాలతోనే కాలం గడిచిపోయింది. మంచి  అవకాశాల్ని దుర్వినియోగం చేసుకు న్నారని కేవలం ఫోటోలకే సమావేశాలను ముగించేశారన్న అపవాదు జగన్ మూటగట్టుకున్నారు. అవన్నీఅయిపోయా యి. గతం గత: అనుకున్నప్పటికీ,  ఇప్పుడు మరో మంచి అవకాశం వచ్చింది. వైజాగ్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ శంఖుస్థాపనకు ప్రదాని మోదీ వస్తున్నారు.  సుమారు 400 కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించను న్నారు. ఈ  పని 2024 సంవత్సరానికి పూర్తి అవుతుంది.      ఇది వదులుకోవడానికి వీలులేని అవకాశం. ప్రధానితో రాష్ఠ్ర సమస్యలు చర్చించి పరిష్కరించు కోవాల్సిన సమయం. దీన్ని అందిపుచ్చుకుని ప్రజల ఆశలు ఫలించేట్టు చేయాల్సిన బాధ్యత సీఎం జగన్ చేపట్టాలి. పైగా విశాఖలో బీజేపీ పార్టీ నూతన కార్యాలయానికి కూడా ప్రధాని శంఖుస్థాపన చేస్తారు.  అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన  భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆ ఆనంద సమయంలోనే రైల్వేజోన్ విషయంలో చర్చించి స్పష్టత సాధిస్తారని ప్రజలు ఎంతగానో ఆశిస్తున్నారు.  చాలాకాలంనుంచీ నానుతున్న రైల్వేజోన్ అంశంతోపాటు భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణపనులకు ప్రధానితో శంఖుస్థాపన చేయించేలా రాష్ర్ట  ప్రభత్వం గట్టి ప్రయత్నం చేయాలి. కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు కాకుండా రాష్ట్ర ప్రగతికి ఉపకరించే పనుల గురించి కూడా ప్రధానిని పట్టుబట్టి అంగీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీని పలుమార్లు కలిసినా సాధించలేని పనులు  గురించి ప్రజల నుంచి వచ్చిన విరక్లి, వ్యతిరేకతల నుంచీ బయటపడాలంటే మోదీ చేత రాష్ట్రానికి రావలసిన వన్నీ సాధించాలి. అయితే మోదీ మరి జగన్ మాట విని  అన్నింటికీ అంగీకరిస్తారా అన్నది అనుమానమే. రాజకీయ వ్యూహాల ప్రకారం వ్యవహరిస్తూ, బీజేపీ ని దేశంలో తిరుగులేని పాలనాధికారం గల పార్టీగా విస్తరించడంలో నిమగ్నమయిన బీజేపీ సీనియర్లు, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ అవసరాలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వెంటనే అంగీకరించి నెరవేరేందుకు పూర్తిస్తాయిలో సహాయపడగలరన్నదీ అనుమానమే. అన్నింటినీ రాజకీయ కోణంలోనే ాలోచించే కేంద్ర నాయకులు జగన్ కోరికను అంగీకరించి సానుకూలంగా స్పందించినంత మాత్రాన అన్ని జరిగిపోతా యనుకోవడమూ పొరపాటే. అయితే ఇప్పుడీ అవకాశాన్ని, ప్రధానిని బతిమిలాడి బామాడి సాధించుకోవా ల్సిన అంశా ల్లో ఏమాత్రం విఫలమయినా తెలుగు ప్రజలు జగన్ ను పూర్తిగా విస్మరించి అధికారాన్నించి దించే  అవకాశాలే  ఉన్నాయి.  ఇఫ్పటివరకూ కేంద్రంతో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వైసీపీ నేతలు, ముఖ్య మంత్రి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్నేహసంబంధం విషయంలో అసలు రంగు బయటపడుతుంది.  ఏపీకి కేంద్రం ఇస్తామని చెప్పిన రైల్వే జోన్ పై కేంద్రం దోబూచులాడుతోంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒకసారి కొత్త రైల్వేజోన్ లేదని చెబుతూనే మరోవైపు ఏపీకి  రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటవుతుంది అని చెబుతూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయం లో మాత్రం ఎటువంటి ముందడుగు వేయడం లేదు. దానితో స్వయంగా ప్రధాని మోదీనే విశాఖకు వస్తున్న సమయంలో, అదీ కూడా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కు సంబంధిం చిన విషయంలో కనుక ఆయన రైల్వే జోన్ పై కూడా స్పష్టత ఇస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రజలలో ఉత్కంఠ నెలకొంది.  విశాఖ ప్రజల సెంటిమెంట్ వైజాగ్  స్టీల్ ప్లాంట్ను ప్రేవేటీకరణ చెయ్యొద్దు అంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖలో ప్రధాని మోదీ అడుగుపెడుతున్న వేళ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు పై అనుకూలంగా స్పందిస్తారా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ దిశగా మోదీ ఏమైనా స్పందిస్తారేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

సీఎం జగన్ తో రామ్ గోపాల్ వర్మ భేటీ.. మరో పొలిటికల్ మూవీ పక్కా?!

వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో పోలిటికల్ మూవీకి రంగం సిద్ధం చేశారా? గత ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా సినిమాలు తీసిన ఆర్జీవీ మరో సారి అదే దారిలో నడుస్తున్నారా? ఏపీ సీఎం జగన్ తో భేటీ వెనుక కారణం అదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వైసీపీకి ప్రయోజనం కలిగే విధంగా ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్,  కమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమాలు తీశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ ఆర్ పాదయాత్ర నేపథ్యంలో  యాత్ర అనే సినిమా కూడా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమాకు మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు అదే రీతిలో సినిమాలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి వెళ్లి జగన్ తో బేటీ కావడానికి కారణం కూడా ఇదే అని సినీ,రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. బుధవారం(అక్టోబర్26) హైదరాబాద్ నుంచి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ, అక్కడ జగన్ తో దాదాపు 40 నిముషాలు బేటీ అయ్యారు. అనంతరం జగన్ తో కలిసి లంచ్ చేశారు. సినిమా టికెట్ల పెంపు విషయంలో గతంలో ఒక సారి అప్పటి మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు.   అంతే ఆ తరువాత ఇప్పటి వరకూ రామగోపాల్ వర్మ ప్రభుత్వంతో ఎటువంటి చర్చలూ జరిపిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి వెళ్లి జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ఈ భేటీతో రామగోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా ఖాయమని అంటున్నారు. ఇలా ఉండగా గత ఎన్నికల ముందు యాత్ర సినిమా తీసిన దర్శకుడే ఈ సారి జగన్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర-2 సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ కు సినీ రంగం నుంచి ఎటువంటి మద్దతూ లేదనుకుంటున్న తరుణంలో రామగోపాల వర్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నగరిలో రోజా సినిమా అయిపోయిందా?

 రోజా.. వెటరన్ సినీ నటి. ఇప్పుడు ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె టీడీపీలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.  విశాఖ విమానాశ్రయంలో   మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు తన నియోజకవర్గంలోనే సినిమా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయం ఆమే స్వయంగా బయటపెట్టుకున్నారు. ‘మినిష్టరైన నన్ను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా.. విపక్ష తెలుగుదేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ.. నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ, వీళ్లు భూమిపూజ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే.. మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేం ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే.. ప్రతిరోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ.. అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగూ ఉంటే.. వీళ్లు పార్టీ నాయకులని చెబుతూ ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తోంది’ అంటూ కన్నీటి పర్యంతమై రోజా మాట్లాడిన ఆడియో మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. అంటే.. రోజా సొంత నియోజకవర్గం నగరిలో సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయని ఆమె మాటల ద్వారానే స్పష్టమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచే రోజాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయనేది ఆమె మాటలను బట్టే తేటతెల్లమౌతోందని అంటున్నారు.   దీంతో రోజా వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల సంగతి పక్కనపెట్టి సొంత పార్టీతోనే పోరాటం చేసే పరిస్థితి ఎదురవుతుందంటున్నారు. నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులను చూసి తట్టుకోలేకే రోజా ఇలా ఆవేదనతో ఎవరితోనో చెప్పుకోవడం ఆ ఆడియోలో వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. అంటే.. రోజాకు బయట పల్లకీల మోత ఎలాగూ లేదు.. ఇంట్లో కూడా ఈగల మోత ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి రోజా 2014లో తొలిసారి,   2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి నగరి నుంచి స్వల్ప మెజారిటీలతో విజయం సాధించారు. 2019లోనే రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసిందంటారు. ఆ వ్యతిరేక వర్గం ఇప్పుడు మరింతగా బలపడిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఆ వర్గం వారు రోజా సొంత నియోజకవర్గం నగరిలో,  అందులోనూ మంత్రిగా ఉన్న రోజాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఒక భూమిపూజ చేసింది. దీంతో తన వ్యతిరేకవర్గం పైచేయి సాధించడాన్ని జీర్ణించుకోలేక, రోజా ఇలా తన బాధను వెళ్లగక్కుకున్నట్లు చెబుతున్నారు. నగరి నియోజకవర్గం నుంచి రోజా రెండోసారి గెలిచినప్పటి నుంచీ అక్కడ ఆమె వ్యతిరేకవర్గం బలం పెంచుకునే యత్నాలు చేస్తోందంటున్నారు. వైసీపీలోని కొందరు ముఖ్య నేతల మద్దతు రోజా వ్యతిరేకవర్గానికి పుష్కలంగా ఉందంటారు. ఈ విషయం రోజా వర్గీయులే బాహాటంగా చెబుతుంటారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డికి వైసీపీలో మంచి పట్టు ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో రోజా 2024 ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దిగితే..  సొంత పార్టీలోని ఆమె వ్యతిరేకవర్గం సహకరించే ప్రసక్తే ఉండదని తెలుస్తోంది. ఒకవేళ రోజాకు సహకరించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా.. ఆమెపై ఉన్న వ్యతిరేకతతో వారు సానుకూలంగా వ్యవహరిస్తారా? అంటే అనుమానమే అని స్థానికంగా వినిపిస్తున్న మాట. నగరి నియోజకవర్గంపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసే సందర్భంగా తన అసమ్మతి వర్గంపై ఏమి చెబుతారో అనేది వేచి చూడాల్సిన విషయం. ఈసారి ఎన్నికల్లో రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదనే పట్టుదలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  ఉన్నారు. నగరి టీడీపీ బాధ్యతలను మాజీమంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు భాను ప్రకాశ్ కు  అప్పగించారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పై పోటీచేసి రోజా చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో భాను ప్రకాశ్ మళ్లీ టీడీపీ టికెట్ పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో కచ్చితంగా సానుభూతి ఉంటుందంటున్నారు. అయితే.. భాను ప్రకాశ్ బరిలో దిగితే ఆయన సోదరుడు జగదీశ్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్దేశించారు. నగరిలో రోజాకు వ్యతిరేకంగా బలమైన వైసీపీ నేతలు ఏకమవుతున్న దాఖలాలు కనిపిస్తుండడం గమనార్హం. మంత్రి రోజా తమను పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రోజాకు నిండ్ర, విజయపురం మండలాల్లో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. రెండు ప్రధాన పార్టీల్లో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన రోజాకు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిపడిందంటూ పలువురి నుంచి సెటైర్లు పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రోజాకు సొంత నియోజకవర్గంలో భంగపాటు తప్పకపోవచ్చని అంటున్నారు.

వర్షం సాక్షిగా ఐర్లాండ్ చేతిలో ఓడిన ఇంగ్లాండ్

మెల్బోర్న్ లో బుధవారం జరిగిన సూపర్ 12 విభాగం మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడిన ఐర్లాండ్  ఆట మొత్తం ఆధి పత్యం చెలాయించింది. ఐర్లాండ్ తమ ఇన్నింగ్స్ లో 157 పరుగులు చేసింది. బాల్బ్రీని రెచ్చిపోయాడు. చాలా కాలం తర్వాత ఐర్లాండ్ మంచి బ్యాటర్ పొందిందని ప్రశంసించారు. చాలాకాలం క్రితం బెంగుళూరులో భారత్ మీద ఐర్లాండ్ సూపర్ స్టార్ కెవిన్  ఒ బ్రెయిన్ అద్బుత ప్రదర్శన తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు టీ2 ప్రపంచ కప్ లో బాల్బ్రీన్ రూపంలో మరో బ్రహ్మాండమైన బ్యాటర్ లభించాడు. అతను అత్యధికంగా 62 పరుగులు, చేసి జట్టు విజయాన్ని అందించాడు.  ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 14.3 ఓవర్లలో 105 పరుగులే చేసింది. మలాన్ 35 పరుగులు చేశాడు. అయితే డి ఎల్ ఎస్ విధానంలో ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు.  వాస్తవానికి మ్యాచ్ చాలా భాగం ఐర్లాండ్ ధాటికి అంత పెద్ద ఇంగ్లండ్ ఒణికిందనాలి. జోష్ లిటిల్ కొత్త బంతితో స్వింగ్ చేస్తుంటే ఇంగ్లండ్ బ్యాటర్లు తమ మెల్బోర్న్పిచ్ మీదనే ఎదుర్కొనలేక భయపడ్డా రనాలి. అలాగే బెన్ స్టోక్స్ ను అరికట్టడంలో కొత్త కుర్రాడు ఫియాన్ హాండ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శిం చాడు. మరో వంక లెగ్ స్పిన్నర్ గరెట్ డాలానీ ఇంగ్లండ్ రన్ రేట్ ను దెబ్బతీశాడు. అయితే మోయిన్ ఆలీ 15వ ఓవర్లో కొట్టిన సిక్స్ తో ఇంగ్లండ్ కి ఆశలు కలిగించాడు. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి కేవలం 5 పరుగుల దూరంలో ఉన్నారు. అప్పుడే వర్షం పడి వారి ఆశలను దెబ్బతీసింది.  వర్షం తగ్గడం, రావడం.. ఈ దోబూచులాటల మధ్యలో స్టిర్లింగ్, క్రిస్ ఓక్స్ బాగా ఆడారు.  కానీ లొర్కాన్ టకర్ స్పిన్నర్లనే కాదు పేసర్లను కూడా బాగా ఎదుర్కొగలనని నిరూపించాడు. అతను 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. 16వ ఓవర్ లో బాల్బ్రీనీ వెనుదిరిగే సమయానికి  ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.  ఆ తర్వాత 157 పరుగులకు ఇన్నింగ్స్ ముగించింది.  పదే పదే వర్షం అడ్డుపడి  ఆట ఫలితాన్ని డెక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఐర్లాండ్ ను విజేతగా ప్రకటించారు. 

భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదీ.. బ్రిటన్ నుంచి నేర్చుకోండి.. బీజేపీకి కాంగ్రెస్ హితవు

బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునాక్ బాధ్యతలు చేపట్టడంపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో భారత్ బ్రిటన్ ను చూసి ఓంతో నేర్చుకోవాలంటూ హితవులూ వినవస్తున్నాయి.  విదేశీ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించినందుకు ఆనందంతో పొంగిపోతున్న ఈ నేతలే గతంలో సోనియా గాంధీ  భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన సమయంలో ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్న సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. విదేశీ వనిత అంటూ.. అప్పట్లో బీజేపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు.. ఆమె ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడితే గుండు చేయించుకుంటానంటూ సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి. భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే హర్షాతి రేకలు వ్యక్తం చేస్తూ ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ఆకాంక్షించారు.  అయితే అప్పట్లో విదేశీ వనిత అంటూ సోనియా గాంధీ  అత్యున్నత పీఠం అధిష్టించకుండా బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని కాంగ్రెస్ ఇప్పుడు నిలదీస్తోంది. అలాగే విదేశీ మూలాలున్న సోనియా ప్రధాని పదవికి అనర్హురాలంటూ అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి శరద్ యాదవ్ సొంత కుంపటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ప్రారంభించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే విదేశీ మూలాలున్నరుషి సునక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించిన ఎంఐఎం.. భారత్ కు హిజాబ్ ధరించిన మహిళను ప్రధానిగా చూడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. కర్నాటకలో త్వరలో జరగనున్నముసినిపల్ ఎన్నికల కోసం బీజాపూర్ లో నిర్వహించిన ప్రచార సభ  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కూడా దీటుగా స్పందించి తాము హిజాబ్ ధరించిన మహిళను ఎంఐఎం అధినేత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది.    ఇక ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి  మెహబూబా ముఫ్తి   బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునక్ అభినంద‌న‌లు తెలుపుతూనే..  బీజేపీపై విమ‌ర్శ‌ల వర్షం కురిపించారు.   బ్రిట‌న్ ఒక  మైనారిటీ స‌భ్యుడిని ప్ర‌ధాని మంత్రిగా అంగీక‌రించింద‌నే విష‌యాన్ని బీజేపీ గుర్తించాలని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్  భార‌త్ లో   ఎన్నార్సీ, సీఏఏ వంటి విభ‌జ‌న‌, వివ‌క్షాపూరిత  చట్టాల‌తో ప్రజలకు సంకెళ్లు వేసి మరీ విద్వేషాన్ని నింపుతోందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అయితే సునాక్ కు అభినందనలు తెలుపుతూనే బీజేపీపై విమర్శల తూటాలు పేల్చింది. మొదట కమలా హ్యారిస్‌, ఇప్పుడు రిషి సునాక్‌.. యూఎస్‌, యూకేలోని ప్రజలు నాన్‌ మెజార్జీ పౌరుల్ని అక్కున్న చేర్చుకుని.. ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు.   ఈ పరిణామం నుంచి భారత్‌.. ప్రత్యేకించి అత్యధిక జనాభా సిద్ధాంతాన్ని అవలంబించే పార్టీలు.. పాఠం నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానిస్తే.. పార్టీ  అధికార ప్రతినిథి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఒక అడుగు ముందుకు వేసి భిన్నత్వంలో ఏకత్వం మన డీఎన్ఏలోనే ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో బ్రిటన్ ను చూసి భారత్ నేర్చుకోవాల్సి ఉందని బీజేపీకి చురకలు వేశారు. ఇక మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం యూకేలో జరిగినది అరుదైన పరిణామమన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యున్నత, అత్యంతశక్తిమంతమైన పదవిలో కూర్చోబెట్టారనీ, భారత్ లో అలా ఎన్నటికీ జరిగే అవకాశం లేదనీ పేర్కొన్నారు.  

కేజ్రీ, మీ అమాయకత్వానికి జోహార్లు!

దేవుడంటే భయభక్తులు ఉండాలి. అన్నీ దేవుడే చేసేస్తాడు మనం పెద్దగా కష్టపడక్కర్లేదనుకుంటేనే సమస్య. అంద రికీ మతపిచ్చి పట్టించి తీరిగ్గా సంప్రదాయాలు, గ్రంథాలు ఇలా చెప్పాయంటూ జనాన్ని వెర్రాళ్లను చేసి ఓటర్లుగా మార్చుకుని రాజకీయ లబ్ధి చేకూర్చుకునే అతి తెలివి మాత్రం ఒక్క బీజేపీ వారికే సాధ్యం. అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దేశంలో మతమౌఢ్యం పెచ్చుమీరుతోందనే వాదనా  ఉంది. ప్రతీదాన్ని మతపరంగా  ఆలోచించి చిన్న సమస్యను కూడా పరిష్కారానికి అనేక సం త్సరాలు పట్టేంతగా లాగే యుక్తి కేవలం బీజేపీ వారి సొత్తు. ప్రతీ రాజకీయ ఆలోచన వెనుక మతప రమైన రంగుతో మేళవించి జనాల్లోకి వదిలి గందరగోళం కలిగించి ఆనందించడం మోడీ అండ్ కో వారి ప్రత్యేకత. ప్రశాంతంగా ఉంటే వారికి చాలా ఇబ్బంది. నిద్రపట్టదు.  వారికి కొత్త  ఆాలోచన కలిగించారు ఆప్ అధినేత కేజ్రీవాల్.  నోట్ల మీద గాంధీ గారి బొమ్మ ఎలాగూ ఉంటుంది, ఉండాలి. నోటుకి రెండో వేపు గణేషుడు, లక్ష్మీ దేవి బొమ్మలు కూడా ఉంటే బావుంటుంది అని కేజ్రీవాల్ సూచించారు. గణేషుడు శుభాలను కలిగిస్తాడు, లక్షీ దేవి ధనప్రాప్తి కలిగిస్తుంది. అందువల్ల వారిద్దరి బొమ్మలు ప్రచురించాలన్నారు. అయితే దీని కోసమని ఇప్పటిదాకా  ఉన్న నోట్లను తీసేయమన లేదు. జనాలు మళ్లీ ఇబ్బందుల పాలయ్యేవారు. డీమానిటైజే షన్ పేరుతో మధ్య తరగతి, పేదలను జేబులు ఖాళీ చేయించి నానా అవస్థలకు గురిచేసి బీజేపీ సర్కార్ ఆనందించిన సంగతి తెలిసిందే. పైగా విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించి అందరికీ పంచుతామ న్నారు, సినిమాలో పేద్ద హీరో వాగ్దానంలా.  ఏదీ జరగలేదు. బ్లాక్ మనీతో ఉడాయించిన ఘనులు విదేశా ల్లో చాలా ప్రశాంతంగా, సుఖంగానే ఉన్నారు. కష్టాలు మనకే పట్టించారు ప్రభువుల వారు.  కేజ్రీవాల్ బీజేపీవారి భక్తిపారవశ్యాన్ని, దేశంలో ఎవరికీ లేని మత ప్రభావాన్ని గురించి సరదాగా అలా సూచించారేమోగాని, వాస్తవానికి గాంధీగారి బొమ్మే తీసేసి తమ బొమ్మ పెట్టేసుకున్నా పెద్దగా ఆశ్చర్య పడనవసరం లేదు. ఎందుకంటే బీజేపీ వారి దృష్టిలో గాంధీ కంటే, పటేల్ సమానుడు మోదీ. ఆయన తోనే సమస్త భారతావని అభివృద్ధిపథంలో ముందడుగు వేస్తోందనే అభిప్రాయాలు, నమ్మకాలు ముమ్మ రంగా ప్రచారంచేస్తూ సామాన్య జనాన్ని, ముఖ్యంగా ోటర్ని జేబులో వేసేసుకుంటున్నారు. ప్రతీ ప్రాంతంలోనూ ప్రధాని, హోం మంత్రి షా గారి అదేశాలు తూ.చ తప్పకుండా అమలు చేయడంలోనో, ప్రచారం చేయడలోనో కాస్లంత కఠినంగానే నవ్వుతూ జనాన్ని పనిగట్టుకుని ఆనందంగా ఉండాలన్న ఆదేశాలూ జారీ చేస్తున్నారు. ఇంతగా గతంలో ఎన్నడూ బలవంతపు నవ్వులు ప్రజలు చిందించ లేద న్నది రాజకీయపరిశీలకుల మాట.  ప్రతీ ప్రాంతంలో రాజకీయాలతో పాటు మతపరమైన ఆాలోచనను కలగలిపి వ్యూహరచన చేసి తమవారిని రెచ్చగొట్టి ప్రచారం చేయించి గొడవలు తేవడం, టీవీల్లో, వీధుల్లో, కార్యాలయాల్లో చర్చలకు దారితీసేట్టు చేయడం బీజేపీకి మహా సరదా. మహానగరాలకు పేర్లు మార్చడం, చారిత్రక  కట్టడాల పేర్లు మార్చడంతో బీజేపీ వారి అసలు అజెండాను దేశ వ్యాప్తంగా విస్తిరించారు. దీన్ని గురించి ప్రజలు తెలుసుకుని, విని, చదివి చర్చించుకోవాలని, విభేదించుకోవాలని, అలా తమకు ఆనందం కలిగించా లని ప్రభువుల ఆలోచన. ప్రభువుల మనసు రాజమందిరం. దేనికయినా దేన్నయినా తమ రాజకీయ లబ్దికి తిప్పేసుకోగల చతురత కలిగినవారు, చదరంగం బాగా నేర్చినవారు. ఇప్పుడు కేజ్రీవాల్ సరదాగా చేసిన సూచన సరదాగానే తీసుకోకున్నా.. ఇటువంటి గొప్ప ఆలోచన కమలనాథులకు రాలేదను కోవడమే కేజ్రీవాల్ అమాయకత్వం. 

జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటి అక్రమాలపై ఈడీ నోటీసులు

జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అవకతవకల ఆరోపణలపై ఈడీ విచారణ చేపట్టింది. ఈ భూ లావాదేవీల్లో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై   దర్యాప్తు లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించిన ఈడీ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటి లిమిటెడ్ ప్రస్తుత అధ్యక్షుడు, ఒక ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ సహా పలువురికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. వచ్చే నెల 7న ఉదయం 10.30 గంటలకు ఈడీ కార్యాలయంలో హాజరు కావాలని మీడియా సంస్థ చైర్మన్ కు సమన్లు జారీ చేసిన ఈడీ 15 ప్రశ్నలతో కూడిన నోటీసు పంపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ హోదాలో ఈ మీడియా సంస్థ అధినేత   మనీలాండరింగ్ కు పాల్పడినట్టు గతంలోనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఈయన అవకతవకలకు పాల్పడ్డారని పలు ఫిర్యాదులు వెల్లువెత్తిన క్రమంలోనే మనీలాండరింగ్ పై ఈడీ రంగంలోకి దిగి విచారణ జరి  నోటీసులు జారీ చేసింది.

మునుగోడులో ఇప్పటికి ఓటరే రాజు

వేగంగా మారిపోతున్న రాజకీయ పరిస్థితులు రాజకీయపార్టీల్లోని చిన్న నాయకులకు, ఇటు ఓటరుకిలానే సందిగ్ధంలో పడేస్తున్నాయి. పార్టీ అధినేత మాటే వేదంగా అనుసరించి అడుగు ముందుకెయ్యాలి. జెండాలు పట్టుకుతిరగాలి, భారీ ప్రచారాల్లో పాల్గొనాలి, నాయకునితో శభాష్ అనిపించుకోవాలి. తన ప్రాంతంలో ఓటర్లను తన పార్టీకే వేసేలే చేయాలి, వారి మనోగతం తెలుసుకుని వారి సమస్యల్ని పెద్ద నాయకుల చెవికి చేరవేసి వాటిలో కనీసం ఓకటి  రెండింటిని పరిష్కరించే మార్గాలు ఆలోచించాలి. మధ్యాన్నం తిండిమాట ఎలా ఉన్నా, ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుంటూ నాయకుని వెంటే తిరుగుతూ ఉత్సాహంగానే ఉండితీరాలి.  ఏమాత్రం నీరసించినా నాయకుడు అంగీకరించడదు.  తన ప్రాంతీ యులకు తాను పెద్ద పెద్ద నాయకులతో చేతులు కలిపి నవ్వుతూ కనపడాలి, పాదయాత్రలు, రోడ్డుషో ల్లో హడావుడి చేయాలి అప్పుడే తనకూ కాస్తంత పరువు నిలబడుతుంది. వీటితో పాటు వారిని బూత్ వరకూ లాక్కురావడం, ఓటు తన పార్టీ గుర్తుకే వేసేట్టు చేయడంలో కాయకష్టం చేయాల్సిందే.  ప్రస్తుతం మునుగోడు ఎన్నికలకు ప్రతీ పార్టీ  వీరాభి మాని, పార్టీ అధినేత ఆదేశాలమేరకే ఏది చేసినా.  అయితే ఓటరు తన మాట వింటాడన్న నమ్మకం లేదు. ప్రస్తుతం పార్టీల నాయకులు, తమ సీనియర్లను, ఇతర ప్రాంతాల నుంచి సీనియర్లను కూడా మునుగోడుకి దింపి ప్రచారం మరింత ముమ్మరం చేస్తున్నపుడు, ఓటరుకు బహిర్గతంగా, రహస్యంగానూ బహుమతుల పేరుతో అనేకా కానుకలు, డబ్బు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ప్రాంతీయ చిన్న నాయకుల మాట వినాలని లేదు. పెద్ద నాయకులే, పెద్ద పెద్ద కార్లలో వచ్చి తన చిన్న యింటి ముందు దిగి మరీ తన పేరు తెలుసుకుని పిలిచి పలకరిస్తున్నారు. అలాంటపుడు ఓటరే రాజు అనే భావన కొండంత గర్వాన్నీ ఇస్తుందిగదా.  పార్టీలన్నీ ఇలా సినిమాటిక్ గా తమను ప్రేమిస్తున్న తరుణంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఓటరు ఎందుకు ఉంటారు? ఓటరు మీద పెద్ద స్టడీ చేయాల్సిన పనిని కేవలం నోటుతో, నోటి మాటతోనే అవ్వగొట్టే యత్నాలు పార్టీల నాయకులు చేస్తున్నారు. దేనికయినా ఖర్చులుంటాయి, ఖర్చులో ఖర్చు ఇదొకటి అనుకుంటున్నారు. కానీ  ఓటరు అలా అలా ఆలోచించడం లేదు. తమకు పనీ పాట లేని సమయంలోనూ నెలంతా కష్టపడినా సంపాదించేదానికంటే కూడా ఎక్కువ సొమ్ము ఓకే అనే మాటతో, ప్రామిస్తో వచ్చి పడుతుంటే కాదనలేరు. పైగా వచ్చిన వారికి అవసరం, తనకు కాదు, తాను డిమాండ్ చేయవచ్చు. పరిస్థితులు తర్వాత ఎలా ఉన్నా ప్రస్తుతం పై చేయిగానే వ్యవహరించాలన్న సూత్రాన్ని ఓటర్లు బాగా అలవర్చుకున్నారు. కట్టలు కట్టలు కార్లలో, టూవీలర్లలో వెళ్లేవారి దగ్గర పట్టుకుంటున్నామని పోలీసులు తెగ సంబరపడుతున్నారేగాని మునుగోడులో ఓటరు, పార్టీ ప్రాంతీయ నాయకుల మధ్య లోపాయకారి ఒప్పందాలు జరిగిపోతున్నాయి.  ఓటరుకి ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, టీ ఆర్ ఎస్.. ఏదయినా ఒకటే. వారికి  ఓటు కావాలి... వీరికి వాహన సౌకర్యం, డబ్బు కావాలి. ఇద్దరి మధ్య సఖ్యత కుదరాలే గాని ఓట్లు వద్దన్నకొద్దీ పడతాయి.. వారికి వద్దన్నకొద్దీ డబ్బు మూటలు అందుతాయి. ఎవరు ఎన్ని లెక్కలు కట్టినా, ఓటరు తన మనసులో మాట మూటల మాటున దాచే ఉంచాడు. బ్యాలెట్ బాక్స్ దగ్గరికి వెళ్లేంతవరకూ ఈ వైభోగం  పార్టీలవారు అందించకా తప్పదు. ఆనక ఎవరు దేనికి వేసిందీ దేవుడెరుక.  అసలు గుట్టు ఓటరు ఛస్తే చెప్పడు. కొందరి విషయంలో నమ్మకంగా పార్టీల వారు నిర్ధారించుకోవడమే తప్ప అందరి విషయంలో బహుకష్ట్ హై. మరి పార్టీల సిద్ధాంతాలు, ప్రచారాలు, వ్యాఖ్యానాల ప్రభావం పరిస్థితి ఏమిటన్నదానికి సమాధానం శూన్యమే అవుతుంది. అంతా నటన. ఎన్నికల నటన. కేవలం ఓటరును ఆకట్టకోవడానికి అనేకానేక వేష ధారణలు తప్పని నటన. కేవలం అభ్యర్ధి నిలువెత్తు బొమ్మను అడ్డుపెట్టుకుని రంగంలోకి దిగడమే పార్టీల పని.. గెలిపించడం, ఓడించడం, తటస్థంగా ఉండాలని ఆలోచించి వంటింట్లోనే ఉండిపోవడం అంతా ఓటరు మాయా జాలం. చివరికి అలసిసొలసి, నిమ్మరసంతో  జెండాలు మూల పడేసి ప్రాంతీయ నాయకులు సేద తీరడం తప్ప వారికి ప్రత్యేకించి ఒరిగేది ఎప్పుడూ ఏమీ ఉండదు. కానీ పార్టీ  సీనియర్లు, ప్రచార ఆార్భాటాలు మళ్లీ మళ్లీ  ఆకట్టుకుంటూనే ఉంటాయి..2024 వరకూ. 

ఏపీలో నడకే నేరమా? జగన్ హయాంలో ప్రజాస్వామ్యం బందీ!

ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదొక దారి అన్నది సామెత.. అలాగే దేశమంతా ఒక దారి అయితే జగన్  అధికారంలో ఉన్న ఏపీది ఒక్కటీ ఒక దారి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. అమరావతి రైతుల మహాపాదయాత్రను నిలువరించడానికి జగన్ సర్కార్ చేయని ప్రయత్నం లేదు. అయితే దేశంలో ఇదే సమయంలో ఎన్నో పాదయాత్రలు జరుగుతున్నాయి. జగన్ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాంగ్రస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే ఏపీలో నిరాటంకంగా పూర్తి చేసుకుని తెలంగాణలో ప్రవేశించింది. ఇక జగన్ కు స్వయాన సోదరి.. వెసీపీ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధినేత్రి షర్మిల తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వీరెవరికీ ఎలాంటి అభ్యంతరాలు, అడ్డంకులూ లేవు. కానీ ఏపీలో రైతుల పాదయాత్రకు మాత్రం అడుగడుగునా అడ్డంకులు. ప్రభుత్వం, పోలీసులు, అధికారులు, వైసీపీ నేతలు ఇలా ప్రభుత్వం చెప్పుచేతల్లో, కనుసన్నలలో మెలగడమే తమకు రక్ష  అని భావించే వారంతా పాదయాత్రను అడ్డుకోవడమే ఏకైక అజెండా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల పాదయాత్ర ఒక్కటే సమస్య అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్ అయిన మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి మార్చేందుకు సుప్రీం కోర్టు అంగీకరించడం జగన్ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదే అయినా.. దాని గురించిన పట్టింపే లేకుండా సర్కార్ వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతులపైనే కాదు.. వారి పాదయాత్రకు మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలపైనా, ప్రజా సంఘాలపైనా కూడా ఆంక్షలు విధించడం ద్వారా రైతులే కాదు.. వారి మద్దతు దారులెవరూ రోడ్లపై నడవడానికి వీల్లేదన్న ఒక వింత, కొత్త నిబంధనలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా విమర్శలు, కోర్టు మొట్టికాయలకు అలవాటు పడిపోయిన జగన్ సర్కార్ వాటిని వేటినీ ఖాతరు చేయడం లేదు. దేశంలో రైతుల పాదయాత్రకు తప్ప మరే పాదయాత్రలోనూ అందులో పాల్గొన్న వారి గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులూ అడగడం లేదు. కానీ రాష్ట్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు న్యాయం కోసం రోడ్డెక్కి యాత్ర చేస్తుంటే మాత్రం వారి గుర్తింపు చూపించిన తరువాతే అడుగు కదపాలంటూ నియంత్రిస్తున్నారు. నిజమే  కోర్టు ఆరువందల మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆ కోర్టు తీర్పు కాపీ ఇంకా అందనే లేదు.. కానీ పోలీసులు మాత్రం ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు చేపించిన తరువాతే అడుగు ముందుకు వేయాలంటూ అమరావతి రైతులను నిలువరించారు. అమరావతి రైతులకు మద్దతుగా వచ్చిన వారినీ ఆపేశారు. దీంతో రైతులు కోర్టులోనే తెల్చుకుంటామంటూ పాదయాత్రకు విరామం ప్రకటించారు. తాము తీసుకున్నది విరామమే కానీ.. యాత్రను ఆపేయలేదని వారు స్పష్టం చేశారు. అయితే బొత్స వంటి మంత్రులు.. ఇతర ఘనత వహించిన వైసీపీ నేతలూ మాత్రం రైతుల యాత్ర ఆగిపోయినట్లేననీ, మహాపాదయాత్ర పేరిట నడుస్తున్న వారెవరూ రైతులే కాదంటూ తమ వాచాలతకు పదును పెట్టారు. వాస్తవానికి రైతుల మహాపాదయాత్రకు అధికార వైసీపీ వినా.. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలూ, ప్రజలూ మద్దతు ఇస్తున్నారు. ఆఖరికి మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ సర్కార్ వ్యూహాత్మకంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులూ, విశాఖ గర్జనలూ కూడా ప్రజాదరణ ముందు విఫలమయ్యాయి. విశాఖ వాసులు కూడా అమరావతికే జై కొడుతున్నారనడానికి విశాఖ గర్జన్ తుస్సు మనడమే నిదర్శనమని పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. స్వయంగా మంత్రి ధర్మానే పలు సందర్భాలలో విశాఖ వాసులే మూడురాజధానుల అంశానికి మద్దతు ఇవ్వడం  లేదంటూ చిర్రుబుర్రులాడారు. కానీ జగన్ సర్కార్ మాత్రం రైతుల మహాపాదయాత్ర తన రాజకీయ అస్థిత్వానికే సవాల్ గా భావిస్తున్నది. విపక్ష నేతగా స్వయంగా జగన్ సైతం రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సంగతి అందరికీ తెలిసిందే. నాడు ఆ పాదయాత్రను ఇలాగే అడ్డుకుని ఉంటే వైసీపీ నేడు అధికారంలో ఉండి ఉండేదా అని సామాన్యులు సైతం ప్రశ్రిస్తున్న పరిస్థితి నేడు ఏపీలో నెలకొని ఉంది. అయినా దమనకాండతో.. పోలీసులను ప్రయోగించి సర్వ హక్కులనూ కాలరాయడానికి జగన్ సర్కార్ వెనుకాడటం లేదు. 

తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర.. మునుగోడు కాంగ్రెస్ ప్రచారం వెలవెల

దీపావళి సెలవుల తరువాత మళ్లీ గురువారం (అక్టోబర్27) నుంచి తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 27 నుంచి నవంబరు 7 వరకు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపుతుందా లేదా అన్నది పక్కన పెడితే మునుగోడులో కాంగ్రెస్ ప్రచారంపై మాత్రం కచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీ, తెరాసలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఇప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా ఈ ప్రచారం మరింత పేలవం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీసీసీ ప్రముఖులు, స్టార్‌ క్యాంపెయినర్లంతా  రాహుల్ తో కలిసి భారత్ జోడో యాత్రలో అడుగు కలిపేందుకు తరలి వెళుతున్నారు. దీనితో మునుగోడులో కాంగ్రెస్‌ ప్రచారానికి ప్రముఖులు కరవయ్యే పరిస్థితి తప్పదని అంటున్నారు.   ఆర్ధికవనరుల లేమితో  అల్లాడుతున్న స్థానిక కాంగ్రెస్‌ శ్రేణులు తాజా పరిణామంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్ర దిపావళికి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించింది. అయితే దీపావళి పండుగ, ఖర్గే పార్టీ సారథ్య బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో రాహుల్ యాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీ వెళ్లారు. తిరిగి ఈ నెల 27 అంటు గురువారం నుంచి రాష్ట్రంలో యాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో ఉన్నంతవరకూ  పీసీసీ చీఫ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేత, పీసీసీ ప్రముఖులు, పాదయాత్ర కమిటీలో ఉన్న పార్టీ నేతలంతా ఆయన వెంటే ఉంటారు. వీరే కాకుండా పలువురు  సీనియర్‌ నేతలు కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపుతూ మునుగోడును గాలికొదిలేశారు.  ఫలితంగా మునుగోడులో కాంగ్రెస్‌ ప్రచారం మరింత బలహీనపడటం ఖాయమన్న భావన పార్టీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. ఓవైపు టీఆర్‌ఎస్‌-బీజేపీ లు పోటీపడి మరీ ప్రచారాన్ని సాగిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం డీలా పడిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.

కాశ్మీర్ వద్దు కోహ్లీని ఇచ్చేయండి చాలు.. సామాజిక మాద్యమంలో వైరల్ అవుతున్న పోస్టు

భాతర్, పాకిస్థాన్ ల మధ్య వైరుద్ధ్యాలకూ, నిత్య ఘర్షణలకూ, దౌత్య సంబంధాలే కాదు, క్రీడా సంబంధాలూ తెగిపోవడానికి ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్. ఇరు దేశాల మధ్యా దేశ విభజన నాటి నుంచీ జమ్మూ కాశ్మీర్ అంశం ఒక్కటే పెద్ద సమస్యగా ఉన్న సంగతి విదితమే. ఇరు దేశాల మధ్యా కాశ్మీర్ కోసమే ఇరు దేశాల మధ్యా కార్గిల్ సహా మూడు యుద్ధాలు జరిగాయి.  ఇప్పటికీ సరిహద్దుల్లో నిత్యం కాల్పుల ఉల్లంఘనకు పాకిస్థాన్ పాల్పడుతోందంటే అందుకు కారణం కాశ్మీరే. నిత్యం కాశ్మీర్ కోసం పోరాడే పాకిస్థాన్ నుంచి ఇప్పుడు కొందరు మాకు కాశ్మీర్ అవసరం లేదంటున్నారు. కాశ్మీర్ కు బదులుగా విరాట్ కోహ్లీని ఇచ్చేయండి చాలు అంటూ ప్రతిపాదిస్తున్నారు. విషయమేమిటో అర్ధమైపోయింది కదా.. కింగ్ కోహ్లీకి భారత్ లోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ లోనూ కోహ్లీని అభిమానించే వారి సంఖ్య చాలా ఎక్కువే. టి20 ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం(అక్టోబర్23) జరిగిన మ్యాచ్ లో కోహ్లీ వీరవిహారం క్రికెట్ అభిమానులందరినీ ఎంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో   160 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (82 నాటౌట్‌; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు.  31 పరుగులకే  నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి ఓటమి అంచున నిలిచిన  టీమ్ ఇండియాను విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో ఆదుకుని గెలిపించాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ.. ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో దేశంలోనే కాదు ప్రపంచ మంతటా క్రికెట్ అభిమానులు కోహ్లీకి నిరాజనాలు పట్టారు. పాకిస్థాన్ లో సైతం కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.   పాకిస్థాన్ లో   కోహ్లీపై అభిమానం వారి దేశ భక్తిని సైతం మించి పోయింది. అందుకే కోహ్లీ ఉంటే చాలు.. కాశ్మీర్ ఎందుకు మాకు అంటున్నారు. అంది ఎంత వరకూ వెళ్లిందంటే.. కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి అంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయిన ఓ బ్యానర్ ఇప్పుడు వైరల్ అయ్యింది. వాస్తవానికి ఈ బ్యానర్ ఇప్పటిది కాదు.. కానీ టైమ్లీగా కోహ్లీ ఫ్యాన్స్ నాటి బ్యానర్ ను ఇప్పుడు మరో సారి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అంతే కాదు.. ఇది జరిగే పని కాదు.. విరాట్ ను ఇవ్వడం జరిగే పని కాదంటూ కౌంటర్ కూడా సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది.  

కాంగ్రెస్ కోటను ఖర్గే కాచుకుంటారా?

గెలవంగానే సరిపోదు ముందుంది ముసళ్ల పండగ అన్నాడు పూర్వం ఒక పంచాయితీ ఎన్నికల్లో ఓడినాయన.  కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికయినంత మాత్రాన పార్టీలో అన్నీ తానై చేసేదాని కంటే మేడమ్ గారి మాట వింటూ  వ్యూహాత్మకంగా ముందడుగు వేయాల్సి వస్తుందేగాని తన బుర్రపెట్టి అడుగు ముందుకు వేయడానికి అంతగా అవకాశం ఉండదని ఖర్గే గెలిచిన తర్వాత రాజకీయ విశ్లేషకులు అన్నారు. ఇందులో నిజానిజాలు, వాస్తవాలు ఎంత ఉన్నప్పటికీ, త్వరలో రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్ని కల్లో పార్టీని గెలిపించాల్సిన అత్యవసర బాద్యత ఖర్గే నెత్తిన పడింది. పదవిలోకి రాగానే కాస్తంత విశ్రాం తికి తావు లేకుండా ముంచుకువస్తున్న ఎన్నికలు ఖర్గే నాయకత్వ పటిమను  పరీక్షిస్తాయన్నది వాస్తవం. వీటి కంటే  ఆ తర్వాత 2024 ఎన్నికలు పార్టీకి దేశంలో ప్రతిష్టను నిలబెట్టే పని మాత్రం పూర్తిగా బాధ్యతవహించాల్సి వస్తుంది. ఏది ఎటువచ్చినా రాయి పడేది మాత్రం పార్టీ అధ్యక్షునిగా ఖర్గే మీదే మరి.  గతవారం పార్టీ ఎన్నికలో గెలిచి సోనియా నుంచి సర్టిఫికెట్ తీసుకోవడంతో పూర్తి బాధ్యతలు స్వీకరిం చినట్లయింది. ఇక 80 ఏళ్ల కర్ణాటకా కి చెందిన ఈ సీనియర్ నాయకుడికి పరీక్షలు చాలానే ఉన్నాయి. వాటిలో తన పంథాలో ముందుకు నడుస్తారో, అనాదిగా వస్తున్న రబ్బర్ స్టాంప్ పరంపరనే అనుసరిస్తారో చూడాలి. కానీ గాంధీ కుటుంబేతర వ్యక్తి గా పార్టీ పగ్గాలు చేపట్టినందుకు దాదాపు పార్టీలో సీనియర్లు, యువ నాయకుల మద్దతు ఉంటుంది. అయితే ఆ పదవి ఆయన్ను వెదుక్కుంటూ వచ్చిం దని, తన సత్తాతో ఖర్గే నిరూపించుకోవాల్సి ఉంది.  ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో ఓటర్లను పూర్తిగా తమ పార్టీ వేపు మొగ్గుచూపేలా చేయడం అన్నది చిన్నపాటి టాస్క్ కాదు. నవంబర్ 12న జరిగే ఎన్నికల్లో ఆయన సత్తాను హిమాచల్ ఓటరు కాంగ్రెస్ నుంచి దూరం కాకుండా చూసుకోవాలి. నిన్నటి వరకూ సోనియా గాంధీని అభిమానించి ఓటువేస్తు న్నవారు ఇపుడు ఖర్గేను చూసి వేస్తారా అనేది కొంత అనుమానం. ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో గాంధీ కుటుంబం మీదనే పార్టీ నడుస్తున్నది. అదే భావన ప్రజల్లో కొనసాగుతోంది. కనుక ఆ కుటుంబేతరులు పార్టీ పగ్గాలు పట్టగానే వారు వెంటనే సరేననే స్తారనీ అనుకోలేము. ఇలాగే గుజరాత్ కూడా ఎన్నికలకు సిద్ధపడుతోంది. ఇది ప్రధాని మోదీ స్వరాష్ట్రం.  ఇక్కడ కాంగ్రెస్ ను గెలిపించుకోగలగితే ఖర్గే మొనగా డనే అనిపించుకుంటారు. ఇక్కడ బీజేపీకి బలం తగ్గిందనే అభిప్రా యాలూ ఉన్నాయి గనుక కాంగ్రెస్కు అవకాశాలు ఉండవచ్చు. డిసెంబర్లో ఫలితాలు వచ్చేవరకూ ఓటరు మనసులో మాట తెలియదు. ఇక 2023లో ఖర్గేకు అసలు సిసలు పరీక్ష ఉంది. అప్పుడు ఏకంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కూడా ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది.  మరోవంక ఈ కీలక ఎన్నికలు లెక్కలోకి తీసుకునే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారన్న అభి ప్రాయాలూ ఉన్నాయి. పార్టీ పగ్గాలు ఖర్గే పట్టినప్పటికీ తొమ్మిది రాష్ట్రాల్లో పార్టీ గెలిచేందుకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతో ఉపయోగపడు తుందన్న అభిప్రాయాలే వినపడుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతరుల్లో ముందుగా సీతారామ్ కేసరి ఉన్నారు. 1998లో పదవి నుంచి ఆయన్ను  తొలగించి సోనియా గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్నారు.  ఇక ఇప్పుడు ఖర్గే చేపట్టారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెగడంతో కాంగ్రెస్ పట్టు తప్పుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఇఫుడు ఖర్గే తలకు ఆ సమస్యను పరిష్కరించుకోవడం కూడా పట్టుకుంది. గాంధీ కుటుం బేతరునిగా ఆయన పార్టీ పగ్గాలు పట్టుకున్నంత మాత్రాన అంత సులువుగా జరిగిపోతాయన్నది ఊహించడమూ కష్టమే.

సునీతకు టీడీపీ నుంచి మద్దతు

డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి.. పులివెందులలోని తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె.  మాజీ ముఖ్యమంత్రి, దివంగత   వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకా హత్య జరిగి మూడున్నరేళ్లు ముగిసిపోయింది. అయినప్పటికీ వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టడంలో ఏపీ పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సీబీఐకి కేసు అప్పగిస్తే.. ఆ సీబీఐ విచారణ అధికారులకు బెదిరింపులే కాకుండా తిరిగి అధికారుల పైనే కేసులు పెడుతున్నపరిస్థితి. ఒక పక్కన తండ్రి హంతకులకు, వారిని పురిగొల్పిన వారికి శిక్షలు పడలేదు. ఇంకో పక్కన సీఎంగా ఉన్న  జగన్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందని పరిస్థితి. దీంతో వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత స్వయంగా రంగంలో దిగారు. తండ్రి హత్య కేసు త్వరగా తేల్చేలా చూడమని ముఖ్యమంత్రి అన్నయ్యను అర్థించారు. ఫలితం లేకపోవడంతో కోర్టులను ఆశ్రయించారు. ఏదైతేనేం సీబీఐ విచారణ ముందుకు సాగేలా చేశారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి, ఇచ్చిన వాంగ్మూలంతో మరికొందరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఐ విచారణ ఏపీలో కొనసాగితే వివేకా హత్య కేసులో న్యాయం జరగదని, ఇంకా ఆలస్యం అవుతుందని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. దీంతో వివేకా కుమార్తె సునీతారెడ్డికి టీడీపీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన వెంటనే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తన తండ్రిని ఎవరు చంపారో కనీసం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని, కన్న కూతురిగా తన బాధ్యత అని వివేకా కుమార్తె సునీతారెడ్డి వీరోచితంగా పోరాడారు అని చంద్రబాబు నాయుడు అభినందించారు. తండ్రి వివేకా హత్య కేసును త్వరగా తేల్చాలని అన్న జగన్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదని, దాంతో సునీత హైకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ జరిగేలా కష్టపడ్డారన్నారు.  కానీ ఆ సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. చివరికి హైకోర్టుకు వెళ్లి సీబీఐ అధికారులే బెయిల్ తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను బెదించేదాకా పరిస్థితి వచ్చిందన్నారు. కడప జిల్లాకు చెందిన టీడీపీ  నేత బీటెక్ రవి కూడా సునీతకు మద్దతుగా నిలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడమంటే.. వైసీపీ సర్కార్ ను అభిశంసించినట్లే అన్నారు. వివేకా కేసులో నిందితులకు సీఎం జగన్ మద్దతుగా ఉండడం వల్లే మరో రాష్ట్రానికి సీబీఐ విచారణ బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. నిందితులకు శిక్ష పడాలని, సునీతకు న్యాయం జరగాలని అన్నారు. వివేకా హత్య ఎలా జరిగిందనేది సాక్ష్యాధారాలతో ఏడాదికో ఏడాదిన్నరకో సీబీఐ చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డికి హత్య జరిగిన రోజే ఎలా తెలిసిందని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకా హత్య ఎలా జరిగింది.. ఎలా చేశారు? ఎందుకు చేశారనే విషయాలు జగన్ కు తెలుసు అన్నారు. వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత ఒక్కరే పోరాడుతున్నారంటూ విజయవాడకు చెందిన టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆమె పట్ల సానుభూతి చూపించారు. జగన్ రెడ్డి స్వార్థం కోసం వివేకా హత్య జరిగిందని జలీల్ ఖాన్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. అడ్డు తొలగించుకోవడం కోసం తన ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డి హత్య చేశారని స్పష్టంగా పేర్కొనడంతో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసుపై జగన్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. సీఎం స్థానంలో ఉన్న జగన్.. అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిమ్మల ప్రశ్నించారు. ప్రధాన నిందితుడిని జగన్ రెడ్డి తన అధికారాన్ని వినియోగించి రక్షించేందుకు చేసిన బాగోతం సీబీఐ చార్జిషీట్ ద్వారా వెలుగు చూసినందున సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.