సీఎం జగన్ తో రామ్ గోపాల్ వర్మ భేటీ.. మరో పొలిటికల్ మూవీ పక్కా?!
posted on Oct 26, 2022 @ 5:25PM
వివాదాస్పద దర్శకుడు రామగోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో పోలిటికల్ మూవీకి రంగం సిద్ధం చేశారా? గత ఎన్నికల సమయంలో వైసీపీకి ప్రయోజనం చేకూర్చే విధంగా సినిమాలు తీసిన ఆర్జీవీ మరో సారి అదే దారిలో నడుస్తున్నారా? ఏపీ సీఎం జగన్ తో భేటీ వెనుక కారణం అదేనా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
2019 ఎన్నికలకు ముందు రామ్ గోపాల్ వర్మ వైసీపీకి ప్రయోజనం కలిగే విధంగా ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడప రెడ్లు అన్న సినిమాలు తీశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ ఆర్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర అనే సినిమా కూడా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమాకు మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు ముందు అదే రీతిలో సినిమాలకు వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి వెళ్లి జగన్ తో బేటీ కావడానికి కారణం కూడా ఇదే అని సినీ,రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. బుధవారం(అక్టోబర్26) హైదరాబాద్ నుంచి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ, అక్కడ జగన్ తో దాదాపు 40 నిముషాలు బేటీ అయ్యారు. అనంతరం జగన్ తో కలిసి లంచ్ చేశారు. సినిమా టికెట్ల పెంపు విషయంలో గతంలో ఒక సారి అప్పటి మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు.
అంతే ఆ తరువాత ఇప్పటి వరకూ రామగోపాల్ వర్మ ప్రభుత్వంతో ఎటువంటి చర్చలూ జరిపిన దాఖలాలు లేవు. మళ్లీ ఇన్నాళ్లకు రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి వెళ్లి జగన్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరువురి మధ్యా ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు.
ఈ భేటీతో రామగోపాల్ వర్మ దర్శకత్వంలో ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా ఖాయమని అంటున్నారు. ఇలా ఉండగా గత ఎన్నికల ముందు యాత్ర సినిమా తీసిన దర్శకుడే ఈ సారి జగన్ పాదయాత్ర నేపథ్యంలో యాత్ర-2 సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ కు సినీ రంగం నుంచి ఎటువంటి మద్దతూ లేదనుకుంటున్న తరుణంలో రామగోపాల వర్మతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.