నగరిలో రోజా సినిమా అయిపోయిందా?
posted on Oct 26, 2022 @ 3:57PM
రోజా.. వెటరన్ సినీ నటి. ఇప్పుడు ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె టీడీపీలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట. విశాఖ విమానాశ్రయంలో మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు తన నియోజకవర్గంలోనే సినిమా అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయం ఆమే స్వయంగా బయటపెట్టుకున్నారు.
‘మినిష్టరైన నన్ను నియోజకవర్గంలో వీక్ చేసే విధంగా.. విపక్ష తెలుగుదేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. ఆ పార్టీకి సపోర్ట్ అవుతూ.. నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ, వీళ్లు భూమిపూజ చేయడం ఎంతవరకు కరెక్టు? మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే.. మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేం ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే.. ప్రతిరోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ.. అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగూ ఉంటే.. వీళ్లు పార్టీ నాయకులని చెబుతూ ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తోంది’ అంటూ కన్నీటి పర్యంతమై రోజా మాట్లాడిన ఆడియో మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
అంటే.. రోజా సొంత నియోజకవర్గం నగరిలో సమీకరణాలు రోజు రోజుకూ మారిపోతున్నాయని ఆమె మాటల ద్వారానే స్పష్టమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సొంత పార్టీకి చెందిన స్థానిక నేతల నుంచే రోజాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయనేది ఆమె మాటలను బట్టే తేటతెల్లమౌతోందని అంటున్నారు. దీంతో రోజా వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల సంగతి పక్కనపెట్టి సొంత పార్టీతోనే పోరాటం చేసే పరిస్థితి ఎదురవుతుందంటున్నారు. నగరి నియోజకవర్గంలో నెలకొన్న తాజా పరిస్థితులను చూసి తట్టుకోలేకే రోజా ఇలా ఆవేదనతో ఎవరితోనో చెప్పుకోవడం ఆ ఆడియోలో వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. అంటే.. రోజాకు బయట పల్లకీల మోత ఎలాగూ లేదు.. ఇంట్లో కూడా ఈగల మోత ఎక్కువైందని పరిశీలకులు అంటున్నారు.
నిజానికి రోజా 2014లో తొలిసారి, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి నగరి నుంచి స్వల్ప మెజారిటీలతో విజయం సాధించారు. 2019లోనే రోజాకు వ్యతిరేకంగా నగరి నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసిందంటారు. ఆ వ్యతిరేక వర్గం ఇప్పుడు మరింతగా బలపడిందని చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఆ వర్గం వారు రోజా సొంత నియోజకవర్గం నగరిలో, అందులోనూ మంత్రిగా ఉన్న రోజాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఒక భూమిపూజ చేసింది. దీంతో తన వ్యతిరేకవర్గం పైచేయి సాధించడాన్ని జీర్ణించుకోలేక, రోజా ఇలా తన బాధను వెళ్లగక్కుకున్నట్లు చెబుతున్నారు.
నగరి నియోజకవర్గం నుంచి రోజా రెండోసారి గెలిచినప్పటి నుంచీ అక్కడ ఆమె వ్యతిరేకవర్గం బలం పెంచుకునే యత్నాలు చేస్తోందంటున్నారు. వైసీపీలోని కొందరు ముఖ్య నేతల మద్దతు రోజా వ్యతిరేకవర్గానికి పుష్కలంగా ఉందంటారు. ఈ విషయం రోజా వర్గీయులే బాహాటంగా చెబుతుంటారు. నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డికి వైసీపీలో మంచి పట్టు ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో రోజా 2024 ఎన్నికల్లో నగరి నుంచి బరిలో దిగితే.. సొంత పార్టీలోని ఆమె వ్యతిరేకవర్గం సహకరించే ప్రసక్తే ఉండదని తెలుస్తోంది. ఒకవేళ రోజాకు సహకరించాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినా.. ఆమెపై ఉన్న వ్యతిరేకతతో వారు సానుకూలంగా వ్యవహరిస్తారా? అంటే అనుమానమే అని స్థానికంగా వినిపిస్తున్న మాట. నగరి నియోజకవర్గంపై వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసే సందర్భంగా తన అసమ్మతి వర్గంపై ఏమి చెబుతారో అనేది వేచి చూడాల్సిన విషయం.
ఈసారి ఎన్నికల్లో రోజా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదనే పట్టుదలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. నగరి టీడీపీ బాధ్యతలను మాజీమంత్రి దివంగత గాలి ముద్దుకృష్ణమ నాయుడి కుమారుడు భాను ప్రకాశ్ కు అప్పగించారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పై పోటీచేసి రోజా చేతిలో ఓడిపోయారు. ఈసారి ఎన్నికల్లో భాను ప్రకాశ్ మళ్లీ టీడీపీ టికెట్ పై పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో కచ్చితంగా సానుభూతి ఉంటుందంటున్నారు. అయితే.. భాను ప్రకాశ్ బరిలో దిగితే ఆయన సోదరుడు జగదీశ్ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావించిన చంద్రబాబు అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్దేశించారు.
నగరిలో రోజాకు వ్యతిరేకంగా బలమైన వైసీపీ నేతలు ఏకమవుతున్న దాఖలాలు కనిపిస్తుండడం గమనార్హం. మంత్రి రోజా తమను పట్టించుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ కు ఫిర్యాదు చేసేందుకు వారు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రోజాకు నిండ్ర, విజయపురం మండలాల్లో సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. రెండు ప్రధాన పార్టీల్లో మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన రోజాకు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిపడిందంటూ పలువురి నుంచి సెటైర్లు పడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో రోజాకు సొంత నియోజకవర్గంలో భంగపాటు తప్పకపోవచ్చని అంటున్నారు.