కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా.. బండి సంజయ్
posted on Oct 27, 2022 5:19AM
టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ బండి సంజయ్ ఆరోపించారు. తాజాగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఇదంతా కేసీఆర్ డ్రామా అంటూ విమర్శించారు. బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ ఈ కోనుగోలు బేరసారాల డ్రామాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా ప్రగతి భవన్ దేనని అన్నారు.
అసలు మోయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వాళ్లు బీజేపీ వాళ్లని ఎవరు చెప్పారి నిలదీశారు. ఆ ఫాం హౌస్ టీఆర్ఎస్ వాళ్లదేననీ, ఫిర్యాదు చేసిందీ టీఆర్ఎస్ వాళ్లేననీ.. అంటే ఈ కొనుగోలు బేరసారాల డ్రామాలో నిందితులూ, బాధితులూ, ఫిర్యాదు చేసిన వారూ కూడా టీఆర్ఎస్ వాళ్లేనని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కు ఇలాంటి డ్రామాలు బాగా అలవాటని దుయ్యబట్టారు. గతంలో మంతిపై హత్యాయత్నం డ్రామాను రక్తిగట్టించిన సంగతి అందరికీ తెలిసిందేనని అన్నారు.
బేరసారాలు అంటున్నారు.. మరి ఎమ్మెల్యేలనూ పీఎస్ కు ఎందుకు తరలించలేదు.. వారు నేరుగా ప్రగతి భవన్ కు ఎలా వెళ్లారని నిలదీశారు. ఈ డ్రామాలో పోలీసులూ పాత్రధారులేనని విమర్శించారు.
ఆ నలుగురు ఎమ్మెల్యేలూ పనికి మాలిన వారనీ, వారినెవరూ కొనరనీ తీవ్ర స్థాయిలో విమర్శించారు తన పార్టీలో కట్టు తప్పుతున్న వారిని బెదరించడానికే కేసీఆర్ ఈ డ్రామా ఆడారన్నారు. ఈ ఎమ్మెల్యేల బేరసారాల బండారం త్వరలో బయటపడుతుందని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేస్తామన్నారు. అయినా ప్రభుత్వానికి ధైర్యముంటే ఆ ఫామ్‌హౌజ్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సీఎం కేసీఆర్ యాదాద్రిలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా ? అని బండి సంజయ్ సవాల్ విసిరారు.ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడమే ఇదంతా కేసీఆర్ ఆడించిన నాటకమనడానికి నిదర్శనమన్నారు.
అసలు పోలీసులు వారిని ఎలా విడిచిపెట్టారని.. వారి స్టేట్‌మెంట్ అయినా రికార్డ్ చేశారా ? అని ప్రశ్నించారు. అ ప్రగతి భవన్‌కు సంబంధించిన మూడు రోజుల సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏడాదిలో పడిపోయే ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలను కొనేందుకు తాము వంద కోట్లు ఖర్చు పెడితే.. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ఎంత ఖర్చు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి 9 రోజుల పాటు అక్కడే బస చేసిన కేసీఆర్ ఎవరెవరిని కలిశారు? అన్నది గోప్యంగా ఉంచారనీ, హస్తినలో స్వామీజీలను కేసీఆర్ కలిశారా అని నిలదీశారు. గతంలో రేవంత్ రెడ్డి పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చిన సంగతిని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.
ఢిల్లీలోనే ఈ డ్రామాకు రూపకల్పన జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంతో బీజేపీకి సంబంధం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.తమకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్, కేసీఆర్ డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.