తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర.. మునుగోడు కాంగ్రెస్ ప్రచారం వెలవెల
posted on Oct 26, 2022 @ 12:01PM
దీపావళి సెలవుల తరువాత మళ్లీ గురువారం (అక్టోబర్27) నుంచి తెలంగాణలో రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. అక్టోబర్ 27 నుంచి నవంబరు 7 వరకు తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఈ పాదయాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ నింపుతుందా లేదా అన్నది పక్కన పెడితే మునుగోడులో కాంగ్రెస్ ప్రచారంపై మాత్రం కచ్చితంగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పరిశీలకులు అంటున్నారు.
బీజేపీ, తెరాసలతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వెనుకబడి ఉంది. ఇప్పుడు రాహుల్ భారత్ జోడో యాత్ర కారణంగా ఈ ప్రచారం మరింత పేలవం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పీసీసీ ప్రముఖులు, స్టార్ క్యాంపెయినర్లంతా రాహుల్ తో కలిసి భారత్ జోడో యాత్రలో అడుగు కలిపేందుకు తరలి వెళుతున్నారు. దీనితో మునుగోడులో కాంగ్రెస్ ప్రచారానికి ప్రముఖులు కరవయ్యే పరిస్థితి తప్పదని అంటున్నారు.
ఆర్ధికవనరుల లేమితో అల్లాడుతున్న స్థానిక కాంగ్రెస్ శ్రేణులు తాజా పరిణామంతో ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు. రాహుల్ భారత్ జోడో యాత్ర దిపావళికి ముందు రాష్ట్రంలోకి ప్రవేశించింది. అయితే దీపావళి పండుగ, ఖర్గే పార్టీ సారథ్య బాధ్యతల స్వీకరణ నేపథ్యంలో రాహుల్ యాత్రకు విరామం ఇచ్చి ఢిల్లీ వెళ్లారు. తిరిగి ఈ నెల 27 అంటు గురువారం నుంచి రాష్ట్రంలో యాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో ఉన్నంతవరకూ పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నేత, పీసీసీ ప్రముఖులు, పాదయాత్ర కమిటీలో ఉన్న పార్టీ నేతలంతా ఆయన వెంటే ఉంటారు.
వీరే కాకుండా పలువురు సీనియర్ నేతలు కూడా ఆయన వెంట నడవడానికి ఉత్సాహం చూపుతూ మునుగోడును గాలికొదిలేశారు. ఫలితంగా మునుగోడులో కాంగ్రెస్ ప్రచారం మరింత బలహీనపడటం ఖాయమన్న భావన పార్టీ క్యాడర్ లో వ్యక్తమౌతోంది. ఓవైపు టీఆర్‌ఎస్-బీజేపీ లు పోటీపడి మరీ ప్రచారాన్ని సాగిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం డీలా పడిందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.