సునీతకు టీడీపీ నుంచి మద్దతు
posted on Oct 26, 2022 @ 10:31AM
డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి.. పులివెందులలోని తన సొంత ఇంటిలో దారుణ హత్యకు గురైన మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె. మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకా హత్య జరిగి మూడున్నరేళ్లు ముగిసిపోయింది. అయినప్పటికీ వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు అన్న విషయాన్ని కనిపెట్టడంలో ఏపీ పోలీస్ వ్యవస్థ దారుణంగా విఫలమైంది. సీబీఐకి కేసు అప్పగిస్తే.. ఆ సీబీఐ విచారణ అధికారులకు బెదిరింపులే కాకుండా తిరిగి అధికారుల పైనే కేసులు పెడుతున్నపరిస్థితి. ఒక పక్కన తండ్రి హంతకులకు, వారిని పురిగొల్పిన వారికి శిక్షలు పడలేదు. ఇంకో పక్కన సీఎంగా ఉన్న జగన్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందని పరిస్థితి.
దీంతో వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత స్వయంగా రంగంలో దిగారు. తండ్రి హత్య కేసు త్వరగా తేల్చేలా చూడమని ముఖ్యమంత్రి అన్నయ్యను అర్థించారు. ఫలితం లేకపోవడంతో కోర్టులను ఆశ్రయించారు. ఏదైతేనేం సీబీఐ విచారణ ముందుకు సాగేలా చేశారు.
ఈ క్రమంలో నిందితుల్లో ఒకరు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారి, ఇచ్చిన వాంగ్మూలంతో మరికొందరు కీలక నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులు సాక్షులను బెదిరిస్తున్నారని, సాక్షుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని, విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని సునీత సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సీబీఐ విచారణ ఏపీలో కొనసాగితే వివేకా హత్య కేసులో న్యాయం జరగదని, ఇంకా ఆలస్యం అవుతుందని, విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత చేసిన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఓకే చెప్పింది.
దీంతో వివేకా కుమార్తె సునీతారెడ్డికి టీడీపీ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. వివేకా కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన వెంటనే ముందుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తన తండ్రిని ఎవరు చంపారో కనీసం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని, కన్న కూతురిగా తన బాధ్యత అని వివేకా కుమార్తె సునీతారెడ్డి వీరోచితంగా పోరాడారు అని చంద్రబాబు నాయుడు అభినందించారు.
తండ్రి వివేకా హత్య కేసును త్వరగా తేల్చాలని అన్న జగన్ దగ్గరికి వెళ్తే పట్టించుకోలేదని, దాంతో సునీత హైకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ జరిగేలా కష్టపడ్డారన్నారు. కానీ ఆ సీబీఐ అధికారులపైనే కేసులు పెట్టే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. చివరికి హైకోర్టుకు వెళ్లి సీబీఐ అధికారులే బెయిల్ తీసుకోవాల్సిన దుస్థితి ఎదురైందన్నారు. సీబీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను బెదించేదాకా పరిస్థితి వచ్చిందన్నారు.
కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి కూడా సునీతకు మద్దతుగా నిలిచారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడమంటే.. వైసీపీ సర్కార్ ను అభిశంసించినట్లే అన్నారు. వివేకా కేసులో నిందితులకు సీఎం జగన్ మద్దతుగా ఉండడం వల్లే మరో రాష్ట్రానికి సీబీఐ విచారణ బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణను త్వరగా పూర్తిచేయాలని బీటెక్ రవి డిమాండ్ చేశారు. నిందితులకు శిక్ష పడాలని, సునీతకు న్యాయం జరగాలని అన్నారు. వివేకా హత్య ఎలా జరిగిందనేది సాక్ష్యాధారాలతో ఏడాదికో ఏడాదిన్నరకో సీబీఐ చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డికి హత్య జరిగిన రోజే ఎలా తెలిసిందని బీటెక్ రవి ప్రశ్నించారు. వివేకా హత్య ఎలా జరిగింది.. ఎలా చేశారు? ఎందుకు చేశారనే విషయాలు జగన్ కు తెలుసు అన్నారు.
వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత ఒక్కరే పోరాడుతున్నారంటూ విజయవాడకు చెందిన టీడీపీ నేత జలీల్ ఖాన్ ఆమె పట్ల సానుభూతి చూపించారు.
జగన్ రెడ్డి స్వార్థం కోసం వివేకా హత్య జరిగిందని జలీల్ ఖాన్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ చార్జిషీట్లో పేర్కొనడాన్ని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రస్తావించారు. అడ్డు తొలగించుకోవడం కోసం తన ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి ద్వారా వివేకానందరెడ్డి హత్య చేశారని స్పష్టంగా పేర్కొనడంతో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసుపై జగన్ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. సీఎం స్థానంలో ఉన్న జగన్.. అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఎలా ఇస్తారని నిమ్మల ప్రశ్నించారు. ప్రధాన నిందితుడిని జగన్ రెడ్డి తన అధికారాన్ని వినియోగించి రక్షించేందుకు చేసిన బాగోతం సీబీఐ చార్జిషీట్ ద్వారా వెలుగు చూసినందున సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.