మోదీజీ అమరావతి సంగతేమిటి?
posted on Oct 26, 2022 @ 6:06PM
ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 11న ఆంధ్రప్రదేశ్ పర్యటించనున్నారు. ప్రధాని రాక కోసం ముఖ్య మంత్రి జగన్ కంటే ప్రజలే ఎక్కువ ఆసక్తితో ఎదురుచూస్తున్నారనాలి. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ అప్పటి హామీలను కేంద్రం నాన్చుతూనే ఉంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, భోగాపురం విమానాశ్రయం వంటివి తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు వైజాగ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల శంకుస్థాపన ప్రధాని పర్యటనలో కీలకంగా పేర్కొ న్నారు. అయితే రాష్ట్రప్రజలు మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఈ అవకాశాన్ని ఎంతవరకూ ఉపయోగిం చుకుని రాష్ట్రానికి మేలు చేస్తారన్నది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయన సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలపై ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నవ్యాంధ్ర రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేసిన ఆయన ఇప్పుడు జగన్ సర్కార్ మూడు రాజధానులంటూ చేస్తున్న హడావుడినీ, సృష్టిస్తున్న అరాచకాన్ని నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారన్న విషయంపై ఏపీ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మూడు రాజధానులపై రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వైసీపీ నేతలు, మంత్రుల ప్రకటనలై.. అసలు మూడు రాజధానులపై కేంద్రం వైఖరి ఏమిటన్నది స్పష్టం చేసిన తరువాతనే ఆయన ఏపీ పర్యటనకు రావాలని ఏపీ జనం డిమాండ్ చేస్తున్నారు.
అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతే జరిగే పరిణామం ఎలా ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ కు తెలియజేశారు. మూడేళ్ల పాలన తర్వాత ఆయన్ను వద్దనే అంటున్నారు. పాలనాపర నిర్ణయాలంటూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడం తప్ప ప్రత్యేకించి చేసిందేమీ లేదన్నది ప్రజల నుంచి వస్తున్న మాట. పైగా రాజధాని విషయంలోనూ ప్రజలు, రైతులు తిరగబడుతున్నారు. ప్రధాని మోదీ వద్దకు అనేక పర్యటనలు చేసిన జగన్ సాధించిందీ, తెచ్చిందీ ఏమీ లేదు. ఆఖరికి విశాఖ రైల్వేజోన్, విషయం తేల్చలేకపోయారు. కేవలం సమావేశాలతోనే కాలం గడిచిపోయింది. మంచి అవకాశాల్ని దుర్వినియోగం చేసుకు న్నారని కేవలం ఫోటోలకే సమావేశాలను ముగించేశారన్న అపవాదు జగన్ మూటగట్టుకున్నారు. అవన్నీఅయిపోయా యి. గతం గత: అనుకున్నప్పటికీ, ఇప్పుడు మరో మంచి అవకాశం వచ్చింది. వైజాగ్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ శంఖుస్థాపనకు ప్రదాని మోదీ వస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో వైజాగ్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించను న్నారు. ఈ పని 2024 సంవత్సరానికి పూర్తి అవుతుంది.
ఇది వదులుకోవడానికి వీలులేని అవకాశం. ప్రధానితో రాష్ఠ్ర సమస్యలు చర్చించి పరిష్కరించు కోవాల్సిన సమయం. దీన్ని అందిపుచ్చుకుని ప్రజల ఆశలు ఫలించేట్టు చేయాల్సిన బాధ్యత సీఎం జగన్ చేపట్టాలి. పైగా విశాఖలో బీజేపీ పార్టీ నూతన కార్యాలయానికి కూడా ప్రధాని శంఖుస్థాపన చేస్తారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆ ఆనంద సమయంలోనే రైల్వేజోన్ విషయంలో చర్చించి స్పష్టత సాధిస్తారని ప్రజలు ఎంతగానో ఆశిస్తున్నారు.
చాలాకాలంనుంచీ నానుతున్న రైల్వేజోన్ అంశంతోపాటు భోగాపురం విమానాశ్రయం, గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణపనులకు ప్రధానితో శంఖుస్థాపన చేయించేలా రాష్ర్ట ప్రభత్వం గట్టి ప్రయత్నం చేయాలి. కేవలం కేంద్ర ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు కాకుండా రాష్ట్ర ప్రగతికి ఉపకరించే పనుల గురించి కూడా ప్రధానిని పట్టుబట్టి అంగీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రధాని మోదీని పలుమార్లు కలిసినా సాధించలేని పనులు గురించి ప్రజల నుంచి వచ్చిన విరక్లి, వ్యతిరేకతల నుంచీ బయటపడాలంటే మోదీ చేత రాష్ట్రానికి రావలసిన వన్నీ సాధించాలి. అయితే మోదీ మరి జగన్ మాట విని అన్నింటికీ అంగీకరిస్తారా అన్నది అనుమానమే. రాజకీయ వ్యూహాల ప్రకారం వ్యవహరిస్తూ, బీజేపీ ని దేశంలో తిరుగులేని పాలనాధికారం గల పార్టీగా విస్తరించడంలో నిమగ్నమయిన బీజేపీ సీనియర్లు, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ అవసరాలను, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను వెంటనే అంగీకరించి నెరవేరేందుకు పూర్తిస్తాయిలో సహాయపడగలరన్నదీ అనుమానమే. అన్నింటినీ రాజకీయ కోణంలోనే ాలోచించే కేంద్ర నాయకులు జగన్ కోరికను అంగీకరించి సానుకూలంగా స్పందించినంత మాత్రాన అన్ని జరిగిపోతా యనుకోవడమూ పొరపాటే. అయితే ఇప్పుడీ అవకాశాన్ని, ప్రధానిని బతిమిలాడి బామాడి సాధించుకోవా ల్సిన అంశా ల్లో ఏమాత్రం విఫలమయినా తెలుగు ప్రజలు జగన్ ను పూర్తిగా విస్మరించి అధికారాన్నించి దించే అవకాశాలే ఉన్నాయి.
ఇఫ్పటివరకూ కేంద్రంతో తమకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వైసీపీ నేతలు, ముఖ్య మంత్రి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్నేహసంబంధం విషయంలో అసలు రంగు బయటపడుతుంది. ఏపీకి కేంద్రం ఇస్తామని చెప్పిన రైల్వే జోన్ పై కేంద్రం దోబూచులాడుతోంది అనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒకసారి కొత్త రైల్వేజోన్ లేదని చెబుతూనే మరోవైపు ఏపీకి రైల్వే జోన్ ఖచ్చితంగా ఏర్పాటవుతుంది అని చెబుతూ వస్తుంది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్ల విషయం లో మాత్రం ఎటువంటి ముందడుగు వేయడం లేదు. దానితో స్వయంగా ప్రధాని మోదీనే విశాఖకు వస్తున్న సమయంలో, అదీ కూడా రైల్వే స్టేషన్ ఆధునికీకరణ కు సంబంధిం చిన విషయంలో కనుక ఆయన రైల్వే జోన్ పై కూడా స్పష్టత ఇస్తారా అనే దానిపై రాష్ట్ర ప్రజలలో ఉత్కంఠ నెలకొంది.
విశాఖ ప్రజల సెంటిమెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రేవేటీకరణ చెయ్యొద్దు అంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో విశాఖలో ప్రధాని మోదీ అడుగుపెడుతున్న వేళ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ రద్దు పై అనుకూలంగా స్పందిస్తారా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఆ దిశగా మోదీ ఏమైనా స్పందిస్తారేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.