శివసేన వర్గాల ఎన్నికల గుర్తుల పేచీ
పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చంది అన్నట్లుగా మహారాష్ట్రలో రెండుగా చీలిన శివసేన విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం అదే చేసింది. శివసేన పార్టీ పేరును, పార్టీ గుర్తును ఇద్దరికి కాకుండా తాత్కాలికంగా సీజ్ చేసింది. అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3 వ తేదీన జరిగే ఉప ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న నేపధ్యంలో, కేంద్ర ఏన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 3 ఉప ఎన్నికలో ఏ పార్టీ పేరున, ఏ గుర్తు పై పోటీ చేయాలనుకుంటున్నాయో, ప్రాధాన్యత క్రమంలో సోమవారానికి (అక్టోబర్ 10) నాటికి తెలియచేయాలని ఎన్నికల సంఘం చీలిక వర్గాలు రెంటిని ఆదేశించింది.
కాగా, గత జూన్ లో శివసేన రెండుగా చీలి, షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటినుంచి, ఇటు మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే వర్గం, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వర్గం అసలు శివసేన తమదేనని, తమ వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పార్టీ గుర్తును తమకు కేటాయించాలని కోరుతున్నాయి. అయితే, ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కోరిన సమాచారం ఇచ్చేందుకు థాకరే వర్గం, పదే పదే గడవు పొడిగింపు కోరడంతో, ఎన్నికల సంఘం నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ వస్తోంది,ఈ నేపధ్యంలో అంధేరి ఈస్ట్- అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక రావడంతో ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల చిహ్నాని స్తంబింప చేసింది. రెండు వర్గాలకు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తాత్కాలికంగా పార్టీ పేరును, గుర్తును ప్రాధాన్యతా క్రమంలో కోరింది.
ఇదలా ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని,ముఖ్యమంత్రి షిండే వర్గం స్వాగతించింది. అయితే, మాజీ ముఖ్యమంత్రి థాకరే వర్గం మాత్రం ఎన్నికల సంఘం నిర్ణయాని తప్పు పట్టింది, అన్యాయంగా పేర్కొంది. అయినా చివరకు సత్యమే గెలుస్తుందని, థాకరే వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
అదలా ఉంటే, శివసేనలో చీలిక వచ్చిన అనంతరం జరుగతున్న తొలి ఎన్నిక కావడంతో, అంధేరీ ఈస్ట్ ఉపఎన్నిక ప్రాధాన్యతను సంతరించుకుంది. శివసేన సిటింగ్ ఎమ్మెల్యే రమేష్ లట్కే ఆకస్మిక మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అవసరమైంది. శివసేన థాకరే వర్గం అభ్యర్హ్దిగా ఆయన సతీమణిని రుజుత లట్కే’ను బరిలో దింపింది. మహా వికాస్ ఘటబంధన్’ భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ ఆమెకు మద్దతు ప్రకటించాయి. మరోవంక షిండే వర్గం తరపున, బీజేపీ కార్పొరేటర్ ముర్జి పటేల్,ను బరిలో దింపుతోంది. నవంబర్ 3 న పోలిగ్ జరుగుతుంది, నవంబర్ 6 న ఫలితం వెలువడుతుంది. ప్రజలు ఎటున్నారో తేలిపోతుంది.
అయితే ఇప్పుడు శివసేన వర్గాలకు ఈసీ కేటాయించిన గుర్తులపై పేచీ వచ్చి పడింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు కేటాయించిన గుర్తుపై సిక్కు మతస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే థాకరే వర్గానికి కేటాయించిన గుర్తుపైనా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో శివసేనలోని రెండు వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన చిహ్నాలపై వివాదాలు కొనసాగతున్నాయి.
ఏక్‌నాథ్ షిండేకు చెందిన బాలాసాహెబ్ శివసేనకు రెండు కత్తులు, డాలుతో కూడిన గుర్తును ఈసీ కేటాయించగా, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన శివసేనకు ఈసీ కాగడా గుర్తును కేటాయించింది. షిండే వర్గానికి కేటాయించిన రెండు కత్తులు డాలు గుర్తు ఖల్సా పంత్ కు సంబంధించిన మతపరమైన చిహ్నమని, ఆ గుర్తును ఎవరికీ కేటాయించడానికి వీల్లేదని సిక్కులు అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. తమ అభ్యంతరాన్ని పట్టించుకోకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతున్నారు. మరో వైపు ధాకరే వర్గానికి కేటాయించిన కాగడా గుర్తు విషయంలో సమతా పార్టీ అభ్యంతరం చెబుతోంది.