భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదీ.. బ్రిటన్ నుంచి నేర్చుకోండి.. బీజేపీకి కాంగ్రెస్ హితవు
posted on Oct 26, 2022 @ 3:18PM
బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రుషి సునాక్ బాధ్యతలు చేపట్టడంపై దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. అదే సమయంలో భారత్ బ్రిటన్ ను చూసి ఓంతో నేర్చుకోవాలంటూ హితవులూ వినవస్తున్నాయి. విదేశీ మూలాలున్న వ్యక్తి బ్రిటన్ ప్రధాని పదవిని అధిష్టించినందుకు ఆనందంతో పొంగిపోతున్న ఈ నేతలే గతంలో సోనియా గాంధీ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చిన సమయంలో ఎందుకు అడ్డుకున్నారన్న ప్రశ్న సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. విదేశీ వనిత అంటూ.. అప్పట్లో బీజేపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలు.. ఆమె ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడితే గుండు చేయించుకుంటానంటూ సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రముఖంగా చర్చకు వస్తున్నాయి.
భారత సంతతికి చెందిన రుషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయితే హర్షాతి రేకలు వ్యక్తం చేస్తూ ఆయనతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అయితే అప్పట్లో విదేశీ వనిత అంటూ సోనియా గాంధీ అత్యున్నత పీఠం అధిష్టించకుండా బీజేపీ నేతలు అడ్డుకోవడాన్ని ఎలా సమర్ధించుకుంటారని కాంగ్రెస్ ఇప్పుడు నిలదీస్తోంది. అలాగే విదేశీ మూలాలున్న సోనియా ప్రధాని పదవికి అనర్హురాలంటూ అప్పట్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి శరద్ యాదవ్ సొంత కుంపటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ని ప్రారంభించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అలాగే విదేశీ మూలాలున్నరుషి సునక్ బ్రిటన్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించడాన్ని స్వాగతించిన ఎంఐఎం.. భారత్ కు హిజాబ్ ధరించిన మహిళను ప్రధానిగా చూడాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
కర్నాటకలో త్వరలో జరగనున్నముసినిపల్ ఎన్నికల కోసం బీజాపూర్ లో నిర్వహించిన ప్రచార సభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగానే ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి బీజేపీ కూడా దీటుగా స్పందించి తాము హిజాబ్ ధరించిన మహిళను ఎంఐఎం అధినేత్రిగా చూడాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక ప్రొగ్రసివ్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన రిషి సునక్ అభినందనలు తెలుపుతూనే.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు.
బ్రిటన్ ఒక మైనారిటీ సభ్యుడిని ప్రధాని మంత్రిగా అంగీకరించిందనే విషయాన్ని బీజేపీ గుర్తించాలని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్ భారత్ లో ఎన్నార్సీ, సీఏఏ వంటి విభజన, వివక్షాపూరిత చట్టాలతో ప్రజలకు సంకెళ్లు వేసి మరీ విద్వేషాన్ని నింపుతోందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ అయితే సునాక్ కు అభినందనలు తెలుపుతూనే బీజేపీపై విమర్శల తూటాలు పేల్చింది. మొదట కమలా హ్యారిస్, ఇప్పుడు రిషి సునాక్.. యూఎస్, యూకేలోని ప్రజలు నాన్ మెజార్జీ పౌరుల్ని అక్కున్న చేర్చుకుని.. ప్రభుత్వంలోని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. ఈ పరిణామం నుంచి భారత్.. ప్రత్యేకించి అత్యధిక జనాభా సిద్ధాంతాన్ని అవలంబించే పార్టీలు.. పాఠం నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానిస్తే.. పార్టీ అధికార ప్రతినిథి, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఒక అడుగు ముందుకు వేసి భిన్నత్వంలో ఏకత్వం మన డీఎన్ఏలోనే ఉందని గొప్పలు చెప్పుకోవడం కాదు.. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమిటో బ్రిటన్ ను చూసి భారత్ నేర్చుకోవాల్సి ఉందని బీజేపీకి చురకలు వేశారు.
ఇక మరో కాంగ్రెస్ నేత శశిథరూర్ సైతం యూకేలో జరిగినది అరుదైన పరిణామమన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అత్యున్నత, అత్యంతశక్తిమంతమైన పదవిలో కూర్చోబెట్టారనీ, భారత్ లో అలా ఎన్నటికీ జరిగే అవకాశం లేదనీ పేర్కొన్నారు.