ఆర్జీవీ..జగన్.. ఒక భేటీ వంద సందేహాలు!
posted on Oct 27, 2022 @ 10:04AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆకస్మాత్తగా భేటీ కావడం.. అదీ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దాదాపు 40 నిమిషాలు పాటు వీరు సమావేశం కావడం సినీ రాజకీయవర్గాలలోనే కాకుండా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వీరిద్దరు అంత అకస్మాత్తగా భేటీ కావడం వెనుక ఉన్న అసలు సిసలు అంతర్యం ఏమిటి ?.. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి... అలాంటి వేళ వీరిద్దరు భేటీ కావడం పట్ల హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక్కసారిగా కమాన్ గుసగుస అన్నట్లుగా గుసగుసలు మొదలైనాయి.
కేంద్రంలోని బీజేపీ .. జనసేన పార్టీతో జత కట్టేందుకు ఊపు ఉత్సాహం చూపిస్తోంది. మరోవైపు మూడు రాజధానుల్లో విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు మద్దతుగా విశాఖపట్నంలో అధికార జగన్ పార్టీ విశాఖ గర్జన సభ నిర్వహించింది. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు.. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం వేదికగా చెప్పు చూపిస్తూ.. చేసిన వ్యాఖ్యలపై వైసీపీఅధినేత వైయస్ జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని.. ఆ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టార్గెట్‌గా సినిమాలు తెరకెక్కించేలా సీఎం జగన్ పావులు కదుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై నెగటివ్ యాంగిల్‌లో సినిమా లేదా సినిమాలు తెరకెక్కించే బాధ్యత రామ్ గోపాల్ వర్మపై జగన్ ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు అక్టోబర్ 25వ తేదీ.. సీఎం జగన్‌తో నందమూరి లక్ష్మీ పార్వతీ భేటీ కావడం.. ఆ మరునాడే రామ్ గోపాల్ వర్మ కూడా ఫ్యాన్ పార్టీ అధినేత జగన్‌తో సమావేశమయ్యారని... దీంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై కూడా ఓ సినిమా తెరకెక్కే అవకాశం ఉందనే ఓ చర్చ సైతం పిలింనగర్ వీధుల్లో చక్కెర్లు కొడుతోంది.
అంతేకాదు.. ఈ సినిమాల స్క్రిప్ట్.. అంతా హైదరాబాద్‌లోనే జరగాలని.. అదీకూడా సూపర్ ఫాస్ట్‌గా తయారు కావాలని... వర్మకు సీఎం జగన్ సూచించారని... ఈ నేపథ్యంలో మాదాపూర్‌లోని హైటెక్ సిటీకి సమీపంలో ఓ ఖరీదైన ఇంటిని సైతం వర్మకు సీఎం జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది.
జగన్, వర్మ మధ్య జరిగిన భేటీలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాతో పాటు ఆమె భర్త సెల్వమణి కూడా హాజరయ్యారని తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్‌కు చక చకా అనుమతులు లభించేలా చర్యలు తీసుకునే బాధ్యతను నగరి ఎమ్మెల్యేకు సీఎం జగన్ కట్టబెట్టారని సమాచారం. ఎన్నికల షెడ్యూల్ తేదీలు విడుదలయ్యే రెండు లేదా మూడు నెలలకు ముందే ఈ సినిమాలు.. వరుసగా విడుదలయ్యేలా ఉండాలని.. రామ్ గోపాల్ వర్మకు సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తోంది. ఖర్చుకు మాత్రం ఏ మాత్రం వెనుకాడవద్దంటూ వర్మకు జగన్ భరోసా కూడా ఇచ్చారని తెలుస్తోంది.
ఇక సీఎం క్యాంప్ కార్యాలయం తాడేపల్లి ఫ్యాలెస్‌కి అందరూ వెళ్లే మార్గంలో కాకుండా మరో మార్గం నుంచి రామ్ గోపాల్ వర్మ వెళ్లడం పట్ల అక్కడి మీడియా ప్రతినిధులు సైతం చర్చించుకున్నారని తెలుస్తోంది. అలాగే సీఎం జగన్‌తో వర్మ భేటికి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి.. కర్మ... కర్త... క్రియగా వ్యవహరించారనే ఓ టాక్ అయితే ఫిలింనగర్‌లో నడుస్తోంది. అలాగే హైదరాబాద్‌లో వర్మకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సైతం మిధున్ రెడ్డే చూసుకోనేలా సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
గత ఎన్నికలకు ముందు.. వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి... విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అలాగే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు సైతం వర్మ దర్వకత్వం వహించి విడుదల చేశారు. మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.. అలాంటి వేళ.. గతంలో చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని.. సినిమాలు తెరకెక్కించినట్లు.. ఈ సారి పవన్ కల్యాణ్ లక్ష్యంగా చేసుకుని సీనిమా లేదా సినిమాలు తీసే అవకాశం లేకపోలేదనే ఓ టాక్ అయితే ఫిలింనగర్ వర్గాల్లో ఫిలిం రీల్ తిరిగినట్లు తిరుగుతోంది.