కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్.. బిత్తర పోయిన బీజేపీ
posted on Oct 27, 2022 7:33AM
మాటల మాంత్రికుడే కాదు.. మాయల మరాఠీ కూడా.. ఇదీ ప్రత్యర్థులు కేసీఆర్ గురించి చెప్పే మాట. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం.. వారి వ్యూహాలను చిత్తు చేయడం కేసీఆర్ కు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచీ ఆయనీ వ్యూహాలను, ఎత్తులను నమ్ముకునే రాజకీయం చేస్తున్నారు. గురి చూసి ప్రత్యర్థని లక్ష్యం చేసి ఆయన వ్యూహ రచన చేస్తే..ఇక అంతే. యుద్ధం లేదు.. గిద్ధం లేదు. తెలంగాణలో అత్యంత బలంగా ఉండే తెలుగుదేశం పార్టీని ఓటుకు నోటు కేసులో ట్రాప్ చేసి ఉనికినే ప్రశ్నార్థకం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మళ్లీ దాదాపు అలాంటి వ్యూహంతోనే బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వ్యూహ రచన దగ్గర నుంచి ఆ వ్యూహాలను అమలు చేయడం వరకూ కేసీఆర్ ప్రతిదీ పకడ్బందీగా చేస్తారనడానికి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సొమ్ములతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిన ఉదంతం తాజా ఉదాహరణ మాత్రమే.గతంలో ఆయన ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో వేశారు. బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కమలం కండువా కప్పడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతిని పసిగట్టిన కేసీఆర్ తెలంగాణలో ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను ఆ పార్టీ మూడు ముప్పుతిప్పలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు కేంద్రంలో బీజేపీ సర్కార్ ఉండటం ఆ పార్టీకి ఉన్న బలం. అయితే కేసీఆర్ వ్యూహాల కారణంగా తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదనడానికి మొయినాబాద్ ఫాం హౌస్ లో నోట్ల కట్టలతో దొరికి పోయిన ఆ పార్టీ దూతలే సాక్ష్యం అని పరిశీలకులు అంటున్నారు.
టీఆర్ఎస్ లో షిండేలున్నారని చాలా రోజులుగా తెలంగాణ బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. త్వరలోనే రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ కుప్పకూలడం ఖాయమనీ జోస్యం చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పలువురు టీఆర్ఎస్ నేతలు కాషాయ కండువా కప్పుకుని బీజేపీ గూటికి చేరారు. ఉద్యమ నేతలంగా ఇప్పుడు బీజేపీలోనే ఉన్నారంటూ తెలంగాణ సాధన క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది కూడా. అయితే ఉద్యమ పార్టీ మాదేనంటూ బీజేపీ చెప్పిన రోజుల వ్యవధిలోనే కేసీఆర్ చక్రం తిప్పారు. కమలం గూటికి చేరిన ఉద్యమ నేతలలో కొందరిని కారెక్కించుకున్నారు. అదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారానికీ పక్కా వ్యూహంతో చెక్ పెట్టారు.
ఒక రకంగా బీజేపీని మౌస్ ట్రాప్ లో ఇరికించేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనగోలుకు బీజేపీ ప్రయత్నాన్ని పోలీసులు వమ్ము చేశారని అంటున్నా.. నాడు రేవంత్, నేడు బీజేపీలను ఢిఫెన్స్ లో పడేయడం వెనుక ఉన్న మాస్టర్ బ్రెయిన్ మాత్రం కేసీఆర్ దేనని పరిశీలకులు అంటున్నారు. మొయినా బాద్ సంఘటనలో బీజేపీకి కేసీఆర్ స్వయంగా తన పార్టీ ఎమ్మెల్యేలను ఎరగా వేసి బుక్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తన కుమార్తె కవిత మీద ఆరోపణలు చేసిన బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పీకల్లోతు ములిగిపోయి.. వివరణలు ఇచ్చుకోవలసిన దుస్థితిలో పడేలా చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఈ వ్యవహారంలో కేసీఆర్ పై ఎన్ని విమర్శలు చేసినా.. ఇదంతా ఆయన కుట్రేననీ, టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ.. ఆ కంపెనీ ఆడే డ్రామాలన్నిటికీ కథ, స్క్రీన్ ప్లే,డైరెక్షన్ అన్నీ కేసీఆరే అంటూ ఆరోపణలు గుప్పించినా.. కోట్ల రూపాయల సొమ్ముతో పట్టుబడిన తీరు మాత్రం బీజేపీని డిఫెన్స్ లో పడేశాయనడంలో సందేహం లేదు.
మొయినాబాద్ సంఘటనలో దొరికిపోయిన వారికి బీజేపీతో సంబంధం లేదని చెప్పుకోవడానికి బీజేపీ ఎంత ప్రయత్నించినా ప్రజలను నమ్మించడం అంత సులభం కాదు. హస్తిన నుంచి వచ్చి ఇక్కడ దొరికిపోయిన రామచంద్రభారతి కానీ, తిరుపతికి చెందిన సోమయాజులు స్వామి కానీ, హైదరాబాద్ కు నందకుమార్ కు కానీ బీజేపీతో సంబంధాలు లేవని ఎంత చెప్పుకుందామనుకున్నా.. సామాజిక మాధ్యమాలలో వారికి కమలం పార్టీతో ఉన్న సంబంధాలకు సంబంధించిన ఫొటోలు విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యంగా నందకుమార్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడన్న సంగతి బీజేపీని కచ్చితంగా ఇరుకున పెడుతోంది. ఏది ఏమైనా మునుగోడు ఉప ఎన్నిక ముంగిట బీజేపీకి ఈ వ్యవహారం గట్టి ఎదురు దెబ్బేనని పరిశీలకులు చెబుతున్నారు.