ఎమ్మెల్యేల బేరసారాల కేసు.. సమాధానం లేని ప్రశ్నలెన్నో..ఎన్నెన్నో!
posted on Oct 28, 2022 @ 11:19AM
కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తే ఒకలా మాట్లాడుతారు.. విఫలమైతే మరోలా మౌనమునిలా మాట్లాడుతారు. గతంలో ఇందుకు పలు ఉదాహరణలు ఉన్నాయి. తాజా ఉదాహరణ అయితే మొన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఉదంతం.
ఓ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కమలం పార్టీ హస్తిన నుంచి కుట్రలు చేస్తోందనీ, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం హస్తిన నుంచి వచ్చిన దూతలను తమ ఎమ్మెల్యేలు పట్టించారనీ ఊరూ వాడా అదిరిపోయేలా ప్రచారం చేసి హంగామా చేసిన టీఆర్ఎస్ హఠాత్తుగా సైలెంటైపోయింది. ఓ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు వ్యక్తులు మొయినాబాద్ ఫాం హౌస్ లో ఉన్న వీడియోలు చూపించి తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి హస్తిన దూతలు ప్రయత్నించారని హడావుడి చేసింది.
పైగా ఆ ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సన్నిహితుడని ప్రచారం చేసింది. భారీ కుట్రను భగ్నం చేసిన తెలంగాణ హీరోలుగా తమ ఎమ్మెల్యేలను కీర్తించేసింది. ఆ ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ మీడియాతో మాట్లాడుతారంటూ ప్రగతి భవన్ నుంచి సమాచారం కూడా వచ్చింది. అంతే బస్... ఇక ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల గురించి టీఆర్ఎస్ పన్నెత్తి మాట్లాడటం లేదు..పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించవద్దంటూ పార్టీ క్యాడర్ కు ఓ పిలుపునిచ్చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలు కేసీఆర్ డ్రామా అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. అంతే కాదు నేరుగా కేసీఆర్ కు యాదాద్రి లో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. శుక్రవారం ఉదయమే ఆయన యాదాద్రికి వెళ్లారు. కేసీఆర్ కూడా రావాలని మరో సారి సవాల్ చేశారు. అయినా కేసీఆర్ నుంచి, టీఆర్ఎస్ నుంచి మౌనమే సమాధానమైంది. ఈ లోగా పోలీసులు మాత్రం భారీ మొత్తానికి డీల్ కుదరబోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫామ్ హౌస్ లో ఎంత నగదు స్వాధీనం చేసుకున్నామన్న విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. నగదు ప్రస్తావన లేకుండా ఏసీబీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పట్టుకున్న ముగ్గురినీ 24 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆ తరువాత హడావుడిగా ఏసీబీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఆయన రిమాండ్ విధించేందుకు నో అని వారి ముగ్గురినీ విడుదల చేయాలని ఆదేశించారు.
బీజేపీతో సంబంధాలున్న సతీశ్ శర్మ, నంద కుమార్ అనే వ్యక్తులు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ.100 కోట్లు, సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ కాంట్రాక్టులతో పాటు కేంద్రంలో లాభదాయక పదవులు ఇస్తామని తనను ప్రలోభపెట్టారని తెరాస ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంత వరకూ బానే ఉంది కానీ.. ఆ తరువాత టీఆర్ఎస్ సైలెన్సే పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నిక ముందు కూడా ఇలాగే బీజేపీ అభ్యర్థి రఘునందనరావు బంధువుల నివాసంలో భారీగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు బిల్డప్ ఇచ్చిన పోలీసులు ఆ తరువాత ఆ కేసు విషయమే మరిచిపోయారు.
ఇప్పుడు మళ్లీ మునుగోడు ఉప ఎన్నిక ముంగిట తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందంటూ.. ఆ ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు. మరి దీని సంగతి ఏమౌతుందో అని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తం మీద ఎమ్యెల్యేల కొనుగోలు బేరాసారాల వ్యవహారం టీఆర్ఎస్ కే బూమరాంగ్ అయ్యిందా అన్న అనుమానాలను పరిశీలకుల వ్యక్తం చేస్తున్నారు. అసలు మొత్తంగా ఈ వ్యవహారంలో పోలీసుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫాం హౌస్‌లో నందకుమార్, ఆయనతో వచ్చిన సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులును ట్రాప్ చేసిన.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణల ఆడియో రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారా? అలాగే తాము బేరసారాలకు గురయ్యామని ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా, పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అలా స్వాధీనం చేసుకున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. కానీ గతంలో ఇంచుమించు ఇటువంటి కేసులోనే నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ఫోనును, ఫిర్యాదుదారుడయిన ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ ఫోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని కోర్టుకు సమర్పించారు. కానీ ఈ కేసులో మాత్రం.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పడం లేదు. అలాగే.. మొయినాబాద్ ఫాం హౌస్ సంఘటన తరువాత పోలీసులు నిందితులుగా పేర్కొన్న నందకుమార్, సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులును పోలీసులు అరెస్టు చేశారు.
కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసు స్టేషన్ కు తీసుకురాలేదు.. వారి వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదు..వారిని నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లడానికి ఎందుకు అనుమతించారు అన్న ప్రశ్నలు పరిశీలకుల నుంచి వస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో నిందితులు- ఫిర్యాదు దారులను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లి, వారితో వాంగ్మూలం తీసుకోవడం తప్పని సరి.. కానీ అటువంటి తప్పని సరి అయిన, అనివార్యమైన సంప్రదాయాలను పోలీసులు పాటించినట్లు కనిపించడం లేదు.