ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కర్త, కర్మ, క్రియ కేటీఆర్?
posted on Oct 28, 2022 @ 3:58PM
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ బూమరాంగ్ అయ్యిందా? ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఎపిసోడ్ వికటించిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. అసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కనుగోలు బేరసారాల ఎపిసోడ్ వెనుక ఉన్న వ్యూహ కర్త కేసీఆర్ కాదనీ, ఇదంతా ఆయన కుమారుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కనుసన్నలలో జరిగిందనీ అంటున్నారు. అందుకే పైకి ప్రణాళిక పక్కాగా ఉన్నట్లు కనిపించినా, చివరికి తుస్సు మని ఎదురు పార్టీ ప్రతిష్టే మసకబారే ముప్పు తెచ్చిందనీ చెబుతున్నారు.
అసలీ ఎపిసోడ్ మొత్తం అనుమానాల మయంగా, సందేహాల పుట్టగా ఉంది. సమాధానం దొరకని ప్రశ్నలెన్నో టీఆర్ఎస్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఒక వేళ ఇదే ఆపరేషన్ కేసీఆర్ ప్లాన్ చేసి ఉంటే.. బీజేపీ నాడు రేవంత్ ఇరుక్కున్న విధంగానే చిక్కుకుని ఉండేదని పరిశీలకులు అంటున్నారు. అయితే అత్యుత్సాహంతో కేటీఆర్ తన కనుసన్నలలో కేసీఆర్ కు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఆరంభించడం వల్లనే విఫలమైందన్న వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టాలన్న ఏకైక లక్ష్యంతో చేపట్టిన ఈ వ్యూహంలో టీఆర్ఎస్ విఫలమై నిండా మునిగిందని కూడా అంటున్నారు. దీంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెబుతున్నారు.
కేటీఆర్, కొనుగోలు వ్యవహారంలో పాత్రధారులుగా ఉన్న ఎమ్మెల్యేలకు కేసీఆర్ ప్రగతి భవన్ లో గట్టిగా క్లాస్ పీకారని అంటున్నారు. ఆ క్లాస్ తరువాతనే కేటీఆర్ ఇక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎవరూ స్పందించ వద్దంటూ పార్టీ నాయకులు, క్యాడర్ కు పిలుపు నిచ్చారంటున్నారు. దీనిని ఇంకా మోస్తే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్.. ఆదేశాల మేరకే గురువారం ఉవ్వెత్తున ఎగసిన టీఆర్ఎస్ ఆందోళనలు అదే రోజున చప్పున చల్లారిపోయాయని అంటున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే వ్యూహాలు రచించాలన్న కేసీఆర్ ఒకే ఒక్క సూచనతో కేటీఆర్ ముందు వెనుకలాలోచించకుండా ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ట్రాప్ డ్రామాకు తెరతీశారనీ, ఈ విషయంలో నాడు రేవంత్ రెడ్డి విషయంలో కేసీఆర్ ఏ వ్యూహం అవలంబించారో అదే వ్యూహాన్ని అంతే పక్కాగా ప్లాన్ చేశారనీ పరిశీలకులు అంటున్నారు.
అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఎక్కడొచ్చిందంటే.. ఫామ్ హౌస్ లో డ్రామా అంతా రక్తికట్టినా డబ్బులు అక్కడ లేకపోవడం బెడిసికొట్టిందన్నారు. కోట్ల రూపాయలు ఫామ్ హౌస్ కు తరలిస్తే ఈడీ రంగంలోకి దిగుతుందనీ, ఈడీ రంగంలోకి దిగితే కేసు తెలంగాణ పోలీసుల చేయి దాటిపోతుందన్న ఉద్దేశంతో డబ్బు చుట్టూనే డ్రామా నడిచినా ఆ డబ్బును ఫిజికల్ గా అక్కడకు చేర్చలేదని అంటున్నారు. అలాగే ఫామ్ హౌస్ నుంచి కేంద్ర హోమంత్రి అమిత్ షాకు ఫోన్ వెళ్లినా.. ఆ ఫోన్ ను స్వయంగా అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతో ఈ కేసులో బీజేపీని బలంగా ఇరికించే ప్రయత్నం ఫలించలేదంటున్నారు. ఎమ్మెల్యేలను బీజేపీ ట్రాప్ చేయలని భావించడం, ఇందుకు సంప్రదింపులు చేయడం అంతా వాస్తవమేనని అనుకున్నా.. దానిని ససాక్ష్యంగా బయటపెట్టే విషయంలో తెరాస విఫలమైందని అంటున్నారు.
ఈ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడం కోసమే బీజేపీని ఇరికించే బలమైన ఆధారాలున్నాయని ప్రజలను నమ్మించే యత్నాలలో భాగమే... గురువారం (అక్టోబర్ 27) ఉదయం నుంచీ కేసీఆర్ మీడియాతో మాట్లాడతారంటూ మీడియాకు సమాచారం ఇవ్వడం.. సాయంత్రమయ్యే సరికి ఇక్కడ కాదు.. హస్తినలో కేసీఆర్ బీజేపీ గుట్టు రట్టు చేస్తారంటూ మాటమార్చడం వంటి వ్యూహాలను టీఆర్ఎస్ అమలు చేస్తున్నదని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ హస్తిన పర్యటన ఖరారు కాలేదు. ఈ వ్యవహారం కోసమే అయితే కేసీఆర్ ఢిల్లీ వేళ్లే అవకాశమే లేదు.
ఇక బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్ చేయడం కోసం నియోగించిన నందకుమార్, ,సతీష్‌శర్మ అలియాస్ రామచంద్ర భారతి, సింహయాజులు విషయానికి వస్తే.. వీరిలో నంద కిషోర్ కు బీజేపీ, తెరాస నేతలతో సంబంధాలు ఉన్నాయి. పాన్ షాప్ నిర్వాహకుడిగా ఆరంభమై ప్రస్తుతం హైదరాబాద్ లోని పోష్ ప్రాంతంలో ఖరీదైన బార్ అండ్ రెస్టారెంట్ ను నడుపుతున్నారు. ఇక రామచంద్రభారతి విషయానికి వస్తే ఆయనకు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆయన బీజేపీ తరఫున ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వచ్చారని నిర్ధారించలేం. ఇక మూడో వ్యక్తి తిరుపతి సమీపంలోని చిన్నమండెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఆశ్రమం ఉన్నప్పటికీ ఏ రోజు భుక్తి ఆ రోజే అన్న పరిస్థితి ఆయనది. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు. కుమారుడు మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్నాడు. అటువంటి వ్యక్తి తనకు, తన కుమార్తెకు, కుమారుడికి హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లు కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ తరఫున దూతలుగా, ప్రతినిథులుగా వ్యవహరించారంటే నమ్మశక్యంగా లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయినా మునుగోడు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ గ్రామాల వారీగా ఎమ్మెల్యేలు, నాయకులకు ఇన్ చార్జీలుగా బాధ్యతలు అప్పగించారు. అనుక్షణం ఏ గ్రామంలో ప్రచారం తీరు ఎలా ఉందన్న సంగతిని కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. వారితో కేటీఆర్ నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఈ పరిస్థితిలో కేటీఆర్ కు తెలియకుండా వారు నియోజకవర్గం వదిలి హైదరాబాద్ కు వచ్చే అవకాశమే లేదు. అందుకే ఇదంతా కేటీఆర్ కనుసన్నలలోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.