ఇక సినిమాల్లో రాజకీయ యుద్ధాలు! వ్యూహం.. ప్రతి వ్యూహం వెండి తెర మీదే!
posted on Oct 28, 2022 @ 2:20PM
సినిమాలకూ, రాజకీయాలకూ అవినాభావ సంబంధం ఉంది. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే శక్తి సినిమాకుఉంది. మావో వంటి విప్లవ నాయకుడే ప్రపంచంలోకెల్లా శక్తిమంతమైన మాధ్యమంగా సినిమాను అభివర్ణించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు రాజకీయ రంగ ప్రవేశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎందరో నటులు రాజకీయ రంగ ప్రవేశం చేసినా ఎన్టీఆర్ స్థాయి విజయాలను అందుకోవడంలో విఫలమయ్యారు.
ఇక రాజకీయ ప్రవేశం కంటే.. రాజకీయ సినిమాల ద్వారా ‘సంపాదన’ బాగుంటుందని కొందరు సినీ జీవులు ఆ బాటపట్టారు. గతంలో కూడా రాజకీయాలు సెంటర్ సబ్జెక్ట్ గా సినిమాలు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి కానీ.. రాష్ట్ర విభజన తరువాత మాత్రం రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికన కాకుండా రాజకీయ నాయకుల ప్రచారమే ధ్యేయంగా సినిమాల నిర్మాణం ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా ఒక పార్టీ నేతను అన్ పాపులర్ చేయాలన్న లక్ష్యంతో సినిమా నిర్మాణానికి ముందుకు రావడమన్న ఒక కు సంస్కృతి మొదలైంది. అందుకు ఉదాహరణగా గత ఎన్నికలకు ముందు విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను చెప్పవచ్చు.
ఆ సినీమా ముఖ్య ఉద్దేశం అప్పటి ప్రతిపక్ష నేత జగన్ కు అనుకూలంగా ఉండేలా అప్పటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నష్టం చేకూర్చాలన్నదే ముఖ్య ఉద్దేశం. అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర అంటూ వైఎస్ఆర్ పాదయాత్రలపై సినిమాలు వచ్చినా వాటిలో ఇలా ప్రత్యర్థులను తూర్పారపట్టాలన్న ఉద్దేశం, లక్ష్యం ఏమీ కనిపించవు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా లక్ష్యం మాత్రం ఒక పార్టీకి నష్టం చేకూర్చడం.. ఆ పార్టీ అధినేత వ్యక్తిత్వ హననానికి పాల్పడటమేనని పరిశీలకులు సైతం అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.
ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికలు లక్ష్యంగా మరోసారి అదే ప్రయత్నం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగన్ కు, అధికార వైసీపీకి ప్రయోజనం చేకూర్చేదిగా.. ప్రత్యర్థులకు నష్టం చేకూర్చడమే లక్ష్యంగా వివాదాస్పద దర్శకుడు రామగోపాల వర్మ వ్యూహం సినిమాకు రూపకల్పన చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఈ సారి మాత్రం ఆయన సినిమాకు దీటుగా జనసేన తమ అధినేతకు మేలు చేకూర్చేలా ప్రతి వ్యూహం పేర ఒక సినిమా తీసేందుకు సన్నద్ధమౌతున్నట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
వర్మ తీసే ఈ వ్యూహం, శపథం అనే రెండు సినిమాలూ ఏపీ సీఎం జగన్, అధికార వైసీపీకు మద్దతుగా ఉంటాయని, తెలుగుదేశం, జనసేనలపై విమర్శలు, విసుర్లు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో వైకాపాని టార్గెట్ చేస్తూ `ప్రతివ్యూహం` అనే సినిమాని రూపొందించేందుకు జనసేన అభిమానులు, కార్యకర్తలు రంగంలోకి దిగారని అంటున్నారు. సరిగ్గా.. వర్మ `వ్యూహం` సినిమా విడుదలయ్యే రోజునే . `ప్రతివ్యూహం` కూడా విడుదల చేయాలని భావిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ ఎన్నికలలో ప్రచార వ్యూహాలన్నీ వెండి తెరపై కనిపిస్తాయని చెప్పవచ్చు.