అయినన్ పోవలె హస్తినకు.. ఢిల్లీకి కేసీఆర్
posted on Oct 28, 2022 @ 11:48AM
తప్పులు చేసి దొరికిపోయి హెడ్మాస్టర్ దగ్గరికి వెళ్లాడు లెక్కల మాస్టరు, పిల్లలకు టెస్ట్ పెట్టి పరాగ్గా ఉండద్దని చెప్పి పంపారు పెద్దాయన..కొన్నాళ్లయ్యాక ఏకంగా హాఫియర్లీ పరీక్షల్లో ముగ్గురు వల్ల నలు గురు దొరికారని తెలిసింది. వాళ్లను మంచి విద్యార్థులే.. మా ఊరోళ్లే అని మార్కులేయించు కోవడానికి వెళ్లారు.. మళ్లీ హెడ్మాస్టర్ ఆగ్రహించారు. ఇది పొరపాటు కాదన్నారు. ఆ టీచర్ పెద్దాయన్ను సుముఖు నిగా చేసుకున్నారో లేదో గాని, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీ ఆర్ మాత్రం తనవారిని కాపాడుకోవడానికి మళ్లీ ఢిల్లీ ప్రయాణమయ్యారు. ఆమధ్యవరకూ ఢిల్లీ హైదరాబాద్ కి సమా నమా అని బహిరంగంగానే ప్రశ్నించిన తర్వాత హఠాత్పరిణామాలు ఆ ప్రశ్నకు నీవే బదులిచ్చుకో.. అంటూ పాత పాట పాడించారు కేంద్రం వారు. నిజవే.. అందుకే సొంత ఫ్లయిట్లో మళ్లీ ఢిల్లీ యాత్ర పయనం కావాల్సి వచ్చింది.
అసలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో పార్టీకి, రాష్ట్రానికి పరువు అమాంతం తీసేసిన కేసీ ఆర్ కుటుంబం ఇప్పుడు మరో సారి తన ప్రాంతీయులను, తన పార్టీవారిని తన వ్యూహం నుంచీ తనే తప్పించడానికి ఢిల్లీ ప్రయాణం కావల్సివచ్చింది. ఇది విచిత్రపరిస్థితి. ప్రత్యర్దులను దెబ్బతీయడానికి అనేక వ్యూహాలు, ఎత్తుగడలతో ముందంజ వేయాలి. కానీ అన్ని వ్యూహాలు బెడిసికొట్టడమే కేసీఆర్ కి మింగుడు పడటం లేదు. అన్ని ఆలోచించే రంగంలోకి దిగిన తర్వాత వ్యూహం దెబ్బతినడమేమిటని తెగ గింజుకుంటున్నా రు. లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రంలో కొత్త పథకంతో రాజ్యం చెలాయించవచ్చన్న ఆలోచన ఎలా వచ్చిందో తెలీదుగాని కుమార్తె కవిత ఎత్తుగడ తండ్రి కేసీ ఆర్ ను దిగ్భ్రమకి గురి చేసేంతగా బూమరాంగ్ అయింది. దాన్నుంచీ బయటపడేందుకు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కేంద్రంలో ప్రధాని, హోం మంత్రిత్వ శాఖ వారిని బతిమిలాడి కుమార్తెను రక్షించుకునేందుకు తన విమానంలోనే ఢిల్లీకి పయనమై అక్కడే మూడు నాలుగు రోజులు మకాం పెట్టారు. ఫలితం ఎలా ఉన్నా, ఏమి తేలనున్నా ఆ పర్యటన పార్టీని, రాష్ట్ర పరువును దెబ్బతీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తాయి.
మొదటిసారి వెళితే బావగారు బాగానే పలకరించారని రెండో సారి అత్యుత్సాహంగా వెళితే అరటిగెల తేలేదని సదరు బావ తిట్టాడట. ఇప్పుడు కేసీఆర్ రెండవ ఢిల్లీ పర్యటన పరిస్థితి అదే. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఢిల్లీ కి చేరింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీ తీరును ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
తనకు, కుమార్తెకు జరిగిన అవమానాన్ని తిప్పి కొట్టే వ్యూహం వేయాలని రోజుల తరబడి ఆలోచించి బీజేపీ వారిని ఇరికించాలన్న వల విసిరారు. డబ్బుకు లొంగ కుండా బయటపడిన నలుగురు పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ పరువు కాపాడా రని అందరూ పొగడ్గలతో ముంచెత్తారు. కానీ జరిగినదేమిటి.. ఆ నలుగురుని వల వేసి పార్టీలోకి తీసుకోవడానికి భారీ ప్రయత్నాలు చేయాల్సిన అవసరమే లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. అసలు వారికి అంత స్థాయే లేదని అన్నారు. అయితే అదంతా చాలా వ్యూహా త్మకంగా ఫామ్హౌస్లో ముందుగా కెమెరాల ఏర్పాట్లతోనే పకడ్బం దీగా చేయాలని అనుకున్నా రు. కానీ అనుకోగానే అన్నీ అయిపోవుగా. అసలు వారికి డబ్బు ఆఫర్ చేస్తున్న దాఖలాలే లేవని తేలిం ది. అందువల్ల దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోనవసరం లేదని, అదంతా టీఆర్ ఎస్ పిచ్చి ఆలోచనే అని తేటతెల్లమయింది. దీంతో తన రంగు బయటపడే సరికి తన కొంప పూర్తిగా మునిగే లోగానే, పరువు హుసేన్సాగర్ లో కలిసే లోగానే ఢిల్లీ పెద్దలను బతిమాలి బామాలి ఈసారికీ కాసుకో దొరా అని అడగడా నికే కేసీఆర్ మరోసారి ఢిల్లీ ప్రయాణం కట్టారనేది విశ్లేషకుల మాట.
ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కేసీఆర్ కలవనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని హైదరాబాద్‌లో ఎండగట్టాలని కేసీఆర్ భావించారు. అయితే ఢిల్లీ వేదికగా మీడియా సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.