కవిత కోసమేనా.. అమిత్ షా వద్దకు మాజీ గవర్నర్ నరసింహన్ ను పంపి కేసీఆర్ భంగపాటు?
posted on Oct 29, 2022 7:08AM
నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయింది.
ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను బయటపడేయడానికే అన్నది ఇప్పుడు తేటతెల్లమౌతోంది. తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికి ఆయన చేయని ప్రయత్నం లేదని బయటపడింది. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కేసీఆర్ యూపీ వెళ్లారు. కూడా తన కుమార్తె కవిత, మరో సమీప బంధువు, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. సాధారణంగా చావు పరామర్శకు వెళ్లినా, అంత్యక్రియలకు వెళ్లిన.. అక్కడ నుంచి నేరుగా తిరిగి ఇంటికి రావడమన్నది సంప్రదాయం.. అటువంటిది సెంటిమెంట్లపై విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్ ములాయం అంత్యక్రియలకు హాజరై తిరిగి హైదరాబాద్ కు రాకుండా నేరుగా హస్తినకు వెళ్లి అక్కడే పది రోజులు బస చేయడంపై అప్పట్లోనే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సరే అక్కడ పది రోజులు బస చేసిన ఆయన అక్కడ అన్ని రోజులు ఏం చేశారన్నది ఇన్ని రోజులూ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. అయితే ఇప్పుడప్పుడే అక్కడ ఆయన అన్ని రోజులు బస చేసి చేసిందేమిటన్నది బయటకు వస్తున్నది. ఆయన హస్తిన పర్యటన మొత్తం తన బిడ్డ కవితను ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడేయడానికే అన్నది తేటతెల్లమైపోయింది. ఈ విషయమై ఆయన ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లి మరీ ప్రయత్నించారనీ, అలాగే బీజేపీ పెద్దలతో భేటీకి కూడా ప్రయత్నించారనీ హస్తినలో కేంద్ర ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల నుంచి అందిన సమాచారం. అలాగే పలు జాతీయ పార్టీల నాయకులతోనూ టచ్ లోకి వెళ్లి మద్దతు కోరినట్లు చెబుతున్నారు.
అయితే ఎవరూ కూడా ఈ విషయంలో కేసీఆర్ కు ఎవరి నుంచీ ఎటువంటి మద్దతూ లభించలేదని అంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్.. ఆ తరువాత రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆయనను హస్తినకు పిలిపించుకుని సహకారం అందించారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ గా అప్పట్లో నరసింహన్ కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించారని అంటుంటారు.
అలాగే కేసీఆర్ కూడా నరసింహన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వారని చెబుతారు. ఆ పరచయాన్ని ఉపయోగించుకుని కేసీఆర్ నరసింహన్ ను తన తరఫున అమిత్ షాను కలిసి కవిత విషయంలో మద్దతు కోరాల్సిందిగా అడిగారని ఢిల్లీ వర్గాల భోగట్టా. మొహమాటానికైనా నరసింహన్ అందుకు అంగీకరించారనీ, కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన నరసింహన్ కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో అధికారులతో తనకున్న పరిచయాల ద్వారా అమిత్ షా అప్పాయింట్ మెంట్ తీసుకుని ఆయనను కలిశారనీ, కేసీఆర్ విషయం ఆయనకు చెప్పారనీ అంటున్నారు.
అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ, ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ కూడా ఆ వర్గాలు తెలిపాయి. ఇదే విషయాన్ని నరసింహన్ కేసీఆర్ కు చెప్పడంతో కేసీఆర్ కూడా ఆగ్రహంతో రగిలిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల పర్యవశానమే.. ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు కారణమైందని పరిశీలకులు అంటున్నారు. ఎలాగైనా బీజేపీని ఇరుకున పెట్టాలనీ, అమిత్ షాకు టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా గుణ పాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు తెరతీశారని అంటున్నారు. అయితే ఫామ్ హౌస్ నుంచి చేసిన ఫోన్ అమిత్ షా లిఫ్ట్ చేయకపోవడంతోనే ఈ డ్రామా రక్తికట్టలేదని పరిశీలకులు అంటున్నారు.