పాద యాత్ర ..పోరు బాట
తెలంగాణలో ఇప్పడు రాజకీయ నాయకుల పాద యాత్రల సీజన్ నడుస్తోంది. ఓ వంక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాద యాత్ర సాగుతోంది. మరో వంక వైఎస్సార్ తెలంగాణ పార్టీ, (వైఎస్సార్ టీపీ) అధినాయకురాలు వైఎస్ షర్మిల సుమారు సంవత్సర కాలానికి పైగా, అంచెల వారీగా సాగిస్తూ వస్తున్న ప్రజాప్రస్థానం పాద యాత్రకు బ్రేక్ పడింది. వారం రోజుల క్రితం వరంగల్ లో ఆమె యాత్రను తెరాస నాయకులు అడ్డుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆమె యాత్రకు ముందుకు సాగకుండా, ఒకదానివెంట ఒకటిగా అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పడు ఆమె యాత్ర అనుమతి కోసం ‘దీక్ష’ చేసి ఆసుపత్రి పాలయ్యారు. ఆమె పాదయాత్రకు కోర్టు అనుమతి ఇచ్చినా, తెరాస సర్కార్,మాత్రం ససేమిరా అంటోంది.
నిజానికి, బండి సంజయ్ యాత్రకు మొదట్లో పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత పోలీసులు బండి యాత్రకు ఓకే చెప్పారు. కానీ, షర్మిల విషయంలో మాత్రం కోర్టు అనుమతించినా, పోలీసు పూజారులు నో అంటున్నారు. అయితే, ఇంతవరకు ఎప్పుడూ షర్మిల యాత్రను అడ్డుకోని తెరాస, ఇప్పడు హటాత్తుగా షర్మిల యాత్రను అడ్డుకోవడం వెనక ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వ్యూహం ఏమిటో కానీ, ఇదేదో ట్రయాంగిల్ పొలిటికల్ స్టొరీలా ఉందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి.
అదలా ఉంటే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు సిద్డంవుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి డిసెంబర్ 9 నుంచి ఆయన పాదయాత్ర మొదలవుతుందని, కొంత ప్రచారం జరిగింది. అయితే,డిసెంబర్ 7 నుంచే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడంతో, ఆయన యాత్రను వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, అదొక కారణమా అయితే కావచ్చును కానీ, అసలు కారణం వేరే ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో, రేవంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్ర వివాదాస్పదమైన నేపధ్యంలో, ఆయన ఆచి తూచి అడుగులు వేస్తున్నారని అంటున్నారు. అయితే, రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాదయాత్రకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇచ్చిందని, రూట్ మ్యాప్ కూడా ఓకే అయిందని, పాటలు, ప్రచార సామగ్రి సైతం సిద్ధమైందని రేవంత్ వర్గం ప్రచారం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత, కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలవుతుందని అంటున్నారు.
అదలా ఉంటే ఇప్పటికే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేసిన, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా, నేను సైతం అంటూ పాదయాత్రకు నడుం బిగిస్తున్నారు. హైకమాండ్ అనుమతి ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఆయన ప్రకటించారు. మరోవంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొందరు, రేవంత్ రెడ్డి పాదయాత్ర లక్ష్యం పార్టీని బలోపేతం చేయడం కాదని, పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకే పాదయాత్రకు తొందర పడుతున్నారని, సీనియర్లు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఒక్కరేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని సీనియరాలు కోరుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలంతా పాదయాత్ర చేయాలని ఆదేశించింది. అందులో భాగంగా, పీసీసీ, సీఎల్పీ నేతలు ఇద్దరు, కలిసి పాదయాత్ర చేయాలనే ప్రతిపాదనను అదిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ ఐక్యతను చాటే విధంగా పార్టీ కీలక నేతలంతా కలిసి బస్సు యాత్ర చేయాలన్నమరో ప్రతిపాదన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్లు చెపుతున్నారు.
అయితే, గమ్మతుగా, రేవంత్ రెడ్డి పాద యాత్ర చేపడితే, మద్దతు ఇస్తానని, జగ్గా రెడ్డి ప్రకటించారు. మరోవంక, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాని శపధం చేసిన, కోమటి రెడ్డి వెంకట రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పొమ్మన కుండా పొగ పెట్టింది. అయన పార్టీలో ఉన్నా లేనట్లే, తాజాగా ప్రకటించిన కాంగ్రెస కమిటీలు వేటిలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. మరో వంక,మాణిక్ ఠాగూర్, రేవంత్ మీదనే కాంగ్రెస్ అధిష్టానం పూర్తి విశ్వాసం ఉంచింది. ఈ నేపధ్యంలో కొత్త సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర ఖాయంగా ఉంటుదని,అయితే ఆయన వెంట భట్టి ఉంటారా లేదా అన్నదే తెలవలసిల్సి ఉందని అంటున్నారు.
అయితే ఎవరు ఏ యాత్రలు చేసినా రాష్ట్ర రాజకీయాలపై యాత్రల ప్రభావం ముపటిలా ఉండదని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పాదయాత్రల ప్రభావం పెద్దగా ఉందని, అంటున్నారు. మునుగోడు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఒకటి రెండు రేజులు పాదయాత్ర చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్ధి డిపాజిట్, కోల్పోయారు. అలాగే, పాదయాత్రలు చేసిన నాయకులు అందరూ గెలుస్తారనే భరోసా కూడా లేదని, అంటున్నారు.