నిర్భయ ఘటనకు పదేళ్లు... దేశంలో మార్పేది.. మృగాళ్లకు శిక్షలెక్కడ?

 దేశాన్ని కదిలించి కన్నీళ్లు పెట్టిన నిర్భయ సంఘటన జరిగి నేటికి సరిగ్గా పదేళ్లు. దేశంలో మహిళల భద్రత గాలిలో దీపం అని ప్రపంచానికి చాటిన ఘటన అది.  దేశ రాజధాని నగరం ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ అమ్మాయిపై   సామాహిక అత్యాచారం జరిగింది. తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన ఆమెపై సామూహిత అత్యాచారం జరిగింది. అత్యంత పాశవికంగా హింసించి ఆమెపై అఘాయిత్యం చేసి బస్సులోంచి తోసేశారు. ఆమె స్నేహితుడిని సైతం కొట్టి బయట పారేశారు.  ఈ అత్యాచార ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పార్లమెంట్‌ను  కుదిపేసింది. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేత కన్నీళ్లు పెట్టించింది. దేశం అంతా కదిలిపోయింది. ఆగ్రహంతో రగిలిపోయింది. ప్రభుత్వమూ స్పందించింది.   నిర్భయ పేరుతో చట్టం తీసుకొచ్చింది. తర్వాతి కాలంలో నిర్భయ ఘటనలో దోషులకు శిక్ష పడింది. అయితే ఈ ఘటన జరిగి పదేళ్లయినా మహిళల భద్రత విషయంలో దేశంలో పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు వచ్చిన దాఖలాలు లేవు. కఠిన చట్టాలు తీసుకు వచ్చినా  మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. మహిళలపై దాడులు, అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. చాలా ఘటనల్లో దోషులకు శిక్షలు పడటం లేదు. మహిళలపై అఘాయిత్యాల కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి సత్వరమే శిక్షలు పడేలా చేయాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఆ కారణంగానే దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ఇందుకు జాతీయ క్రైం బ్యూరో రికార్డులే సాక్ష్యం. గత ఏడాది అంటే 2021లో దేశంలో  మహిళలపై అత్యాచారాలు 2020తో పోలిస్తే 40శాతం పెరిగాయి. దేశ రాజధాని నగరంలో అయితే 2021 సంవత్సరంలో మహిళలపై నేరాల సంఖ్య 13 వేలు. తాజాగా స్కూలుకు వెళ్లే చిన్నారిపై యాసిడ్ దాడి జరిగింది. మహిళలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నంత కాలం తమ కుమార్తె నిర్భయకు న్యాయం జరిగినట్లు కాదని నిర్బయ తల్లిదండ్రులు అన్నారు.  పారామెడికల్‌ స్టూడెంట్ అయిన నిర్భయ  2012 డిసెంబర్ 16  అర్ధరాత్రి తన స్నేహితుడితో కలిసి ఓ ప్రైవేట్ బస్సు ఎక్కింది. అందులో ఉన్న ఆరుగురు కామాంధులు ఆమె  స్నేహితుడిని తీవ్రంగా కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సును  ఢిల్లీ వీధుల్లో తిప్పుతూ ఒకరి తర్వాత ఒకరు ఆ అమాయకురాలిపై పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడారు. జననాంగాల్లో ఇనుప రాడ్డులు జొప్పించడంతో బాధితురాలి పేగులు చిధ్రమయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్న ఆమెను ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డపై విసిరేసి పరారయ్యారు. ముందుగా ఢిల్లీలో చికిత్స పొందిన నిర్భయను ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్స కోసం సింగపూర్‌‌ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. దేశ రాజధానిలో జరిగిన ఈ ఘోర ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ నలుమూలలా ఆందోళనలు, ర్యాలీలు ఒక ఎత్తయితే ఢిల్లీ వేదికగా సాగిన పోరాటం మరో స్వాతంత్య్ర సంగ్రామాన్ని తలపించింది. ఈ ఉద్యమానికి యువతే మార్గ నిర్దేశం చేసింది. అనేక యూనివర్సిటీలు, కాలేజీల నుంచి వేల సంఖ్యలో వచ్చిన యువతీ యువకులు ఇండియాగేట్‌పై దండెత్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించిన ఘటన ఇదే. అమాయక అబలలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేయాలని..నిర్భయ లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదని నాటి యూపీఏ ప్రభుత్వం నిర్భయ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ.. ఎన్ని చట్టాలు తెచ్చినా మృగాళ్లలో మార్పు కనిపించడం లేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో రోజుకు సగటున 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే ఇక్కడ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ కేసుల్లో నిందితులలో చాలా తక్కువ మందికి శిక్షలు పడుతున్నాయి.ఎన్ని చట్టాలు తెచ్చినా.. కఠిన శిక్షలు విధించినా మార్పు శూన్యం. మహిళలపై దాడులు, అత్యాచారాలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి. 

వ్యతిరేక ఓట్లను చీల్చే పార్టీలకు స్వాగతం.. తెలుగు రాష్ట్రాల సీఎంల ఉమ్మడి వ్యూహం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలు, అనివార్యంగా కనిపిస్తున్న ఓటమి నుంచి బయట పడేందుకు   పరస్పర సహకారంతో  ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయా? ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా?  అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఎంత మేరకు ఉందనేది అనుమానమే, అయినా, నువ్వొకందుకు పోస్తుంటే, నేనోకందుకు తాగుతున్నాను అనే స్నేహ బంధం అయితే వుందనేది  మాత్రం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు అవసరార్ధం చేతులు కలిపారని, ప్రతిపక్షాలు ఆరోపించడమే కాదు, ఆ ఇద్దరి నడక, నడతలను దగ్గరగా గమనిస్తున్న రాజకీయ పండితులు, విశ్లేషకులు సైతం అదే అంటున్నారు.  నిజమే 2019 ఎన్నికల్లోనూ వైసేపీని గెలిపించేదుకు,కేసేఆర్ ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా మరీ ముఖ్యంగా ఆర్ధిక వనరులు సమకూర్చడంలో జగన్ రెడ్డికి సంపూర్ణ సహకరం అందించారు. అంతే కాదు, తెలుగుదేశం టికెట్ పై గెలిచి, తెరాసలో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాస యాదవ్  ను తెలుగు దేశం పార్టీకు వ్యతిరేకంగా రంగలోకి దించారు. తెలుగు దేశం పార్టీలో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే  పనికి తలసానిని ఉపయోగించారు. అందుకే  ఎన్నికల ఫలితాలు వచ్చి  జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే  ఆయన కేసేఆర్  చేతుల్లోకి వెళ్ళిపోయారనే ఆరోపణలు మొదలయ్యాయి. మరో వంక జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు కూడా అదే విషయాన్ని  స్పష్టం చేశాయి.  అదేదో నాగార్జున సినిమాలో.. బ్రహ్మానందం,   ముందు ఆమె నన్ను ప్రేమించింది  ఆ తర్వాత నేను ఆమెను ప్రేమిచవలసి వచ్చింది అంటారు చూడండి, అలాగే, కేసీఆర్ వ్యూహత్మకంగా జగన్ రెడ్డిని ముగ్గులోకి లాగి ఉచ్చులో బిగించారని అంటారు. ముందు కేసీఆర్ జగన్ రెడ్డి దంపతులను హైదరాబాద్ కు ఆహ్వానించి, శాలువ కప్పి సన్మానం చేశారు. ఇక ఆతర్వాత ఏమి జరిగిందనేది  అందరికీ తెలిసిన విషయమే. ఆఫ్కోర్స్  అలాగని జగన్ రెడ్డి అమాయకుడు  కేసీఆర్ ఉచ్చులో చిక్కుకు పోయారు అనుకుంటే  అది పొరపాటే అవుతుంది. ఇంతకు ముందే అనుకున్నట్లుగా, ఇద్దరు ఇద్దరే, నువ్వొకందుకు పోస్తుంటే నేనోకందుకు తాగుతున్నాను, అన్నట్లు ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ ఆస్తులను, తెలంగాణ సర్కార్ కు సమర్పించి  అందుకు ప్రతిఫలంగా  హైదరాబాద్ లో తమ అక్రమ ఆస్తులను కాపాడు కోవడంలో  కేసీఆర్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నారని అంటారు. అయితే, ఇలా ఇద్దరు సార్ల మధ్య సాగుతున్న బేరసారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు ముఖ్యంగా ఆంద్ర ప్రదేశ్ ప్రయోజనాలు ‘క్విడ్ ప్రో కో’ టైపులో కొట్టుకు పోతున్నాయని అంటారనుకోండి అది వేరే విషయం.  ఇక ప్రస్తుత ‘ప్యూర్’ పాలిటిక్స్ విషయానికి వస్తే, లక్ష్యం ఏదైనా కావచ్చును, తెలంగాణలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే కావచ్చును. కాదంటే, కాలం ఖర్మం కలిసోస్తే దేవెగౌడ లెక్క  ప్రధాని కావాలనే పగటికలల  ప్రభావమే కావచ్చును అదీ కాదంటే చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణలు, సిబిఐ, ఈడీ దాడుల నుంచి రక్షణ పొందే వ్యూహమే కావచ్చును కారణం ఏదైనా తెలంగాణ ముఖ్యమంత్రి, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా  ఏపీలో తెరాస నయా చహారా  బీఆర్ఎస్ కు రూట్ క్లియర్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక్కడే మరోసారి, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల, ఉభయకుశలోపరి.. సంభాషణ మొదలైందని అంటున్నారు.  అందులో భాగంగా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ... తెరాస నయా చహర.. భారత రాష్ట్ర సమితి (భారాస)కు స్వాగతం పలుకుతున్నారు. ఏపీ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతుగా స్వాగత బ్యానర్లు వెలుస్తున్నాయి. అటు విజయవాడలో ఆఫీసు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటి వెనకా ఎవరున్నారో వేరే చెప్పనక్కరలేదు. ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి  భారాసకు స్వాగతం పలికారు. మిగిలిన విషయాలు ముఖ్యమంత్రులు ఇద్దరూ మాట్లాడుకుంటారని అన్నారు. అంటే ఆ ఇద్దరి మధ్య ఇప్పటికే ఒక అవగాహన ఉందని  సజ్జల చెప్పకనే చెప్పారు. నిజనికి ఇద్దరి మధ్య అవగాహన లేకుంటే  ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకునే  ‘రహస్యం’  ఏముంటుంది? అందుకే, ఓటమి నుంచి తప్పించుకునేదుకు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్మడి కుట్రకు పాల్పడుతున్నారనే విషయం స్పష్టమవుతోంది పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే  తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు జగన్ రెడ్డి ఇప్పటికే సోదరి షర్మిలను బరిలో దించారు. ఇంతకాలం ఆమె ఎవరు విడిచిన బాణం అనే విషయంలో అనుమానాలున్నా, రీసెంట్ ఎపిసోడ్స్ లో ఆమె కేసీఆర్ కోసం జగన్ రెడ్డి వదిలిన బాణం అనే విషయం స్పష్టమైంది. అదొకటి అలా ఉంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల ఉమ్మడి వ్యూహంలో భాగంగా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ  ఆమ్ ఆద్మీ పార్టీ, (ఆప్) సహా మరికొన్ని, ప్రభత్వ వ్యతీరేక ఓటును చీల్చే పార్టీలు నాయకులకు స్వాగత తోరణాలు సిద్దం చేస్తునట్లు తెలుస్తోంది. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో చెప్పకనే చెపుతోందని పరిశీలకులు అంటున్నారు. అందుకే, ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటై ఎన్ని వ్యూహాలు రచించినా, అక్కడ ఏపీలో వైసీపీ, ఇక్కడ తెలంగాణలో తెరాస ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో కొట్టుకు పోవం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. చూద్దాం. కథ అయిపోలేదు.. సశేషమే!

తెర పైకి మళ్ళీ జమిలి ఎన్నికలు!

దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే అవుననే సమాధానం కాదనే జవాబు రెండూ ఒకేసారి వస్తున్నాయి. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు,  కేంద్ర ప్రభుత్వం  జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు,అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు. కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటిరెండు ప్రాతీయ పార్టీలు మినహా, తెరాస సహా చాలా వరకు పార్టీలు  జమిలికి జై కొట్టాయి.నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది.  మరో వంక జమిలి ఎన్నికల నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట  సమయంలో లోక్’సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమికను పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం నిర్మాణంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది.  అదలా ఉంటే, తాజగా కేంద్ర ప్రభుత్వం మరోమారు జమిలి ఎన్నికలకు సానుకులతను వ్యక్తపరిచింది. రాజ్యసభలో ఇందుకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయని తెలిపారు.1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగిందని రిజుజు చెప్పారు. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జెట్ పెరిగిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిపాలనలో సుస్థిరత కోసం జమిలి ఎన్నికలే మేలంటూ లా కమిషన్ తన 170వ నివేదికలోనూ సూచించిందని కేంద్రం తెలిపింది.  దీంతో మరోమారు జమిలి ఎన్నికలపై చర్చ మొదలైంది. అయితే అది అనుకున్నంత తేలిక కాదని, ముఖ్యంగా కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, జమిలి ఎన్నికల వస్తే, ప్రస్తుతం కేంద్రంలో, సగానికి పైగా రాష్ట్రాలో అధికారంలో ఉన్న బీజేపీని ఒకే సారి ఎదుర్కోవడం కష్టమనే రాజకీయ కోణంలో జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయని అంటున్నారు. అయితే, తరచుగా వచ్చే ఎన్నికల వలన  నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని, అన్నిపార్టీల ఎంపీలు సభ్యులుగా ఉన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని తెలిపింది. 2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ. 7వేల కోట్లకు పైగా ఎన్నికల నిర్వహణపై ఖర్చు పెట్టాల్సి వచ్చిందని స్టాండింగ్ కమిటీ పేర్కొంది.అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్‌ పేర్కొంది. ఈ సవరణలను పార్లమెంట్ ఉభయ సభలతో పాటుగా, సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ లెక్కన మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్.. వన్‌ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని ప్రధాని మోడీ భావిస్తే.. జమిలి ఎన్నికలు వచ్చినట్లే అంటున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణ పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  కానీ, జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడంలో వెనకా ముందవుతోంది. ఓ వంక జమిలి ఎన్నికలకు సై అంటూనే బీజేపీ,గుజరాత్, హిమాచల్ ఫలితాలు వచ్చిన వెంటనే 2023 లో జరగనున్న  పది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. కమిటీలు, రోడ్ మ్యాపులు సిద్ధచేసుకునే పనికి బీజేపీ రెడీ అయింది. అయితే, బీజేపీ నాయకులు మాత్రం మోడీ, షా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల పరుగు నిరంతర ప్రవాహంలాగా సాగుతూనే ఉంటుందని, అంత మాత్రం చేత బీజేపీ, కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల అంశాన్ని అటకెక్కించినట్లు కాదని అంటున్నారు. అయితే, జమిలి ఎన్నికలు 2024 లో వస్తాయా? అంతకు ముందే వస్తాయా? అంటే మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు.

హైదరాబాద్ ఐఎస్ బీ చంద్రబాబు దార్శనికతకు దర్పణం

ఒక దార్శనికుడిని రాజకీయ వైరంతో మరుగున పడేయడం ఎవరి వల్లా కాదు. ఆ విషయం చంద్రబాబు విషయంలో పదే పదే రుజువు అవుతోంది. రాజకీయంగా చంద్రబాబుకు వస్తున్న గుర్తింపు, పెరుగుతున్న ప్రతిష్టం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు కంటగింపు కలిగిస్తే కలిగించొచ్చు కానీ.. నిజమైన అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలకు సాంకేతికతను ఆయన ఉపయోగించిన తీరు మేధావులూ, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే పరమార్ధంగా తమతమ రంగాలలో నిష్ణాతులైన వారూ మాత్రం చంద్రబాబు దార్శనికతపై ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. కేవలం చంద్రబాబు దూరదృష్టితో చేసిన ప్రయత్నం వల్లనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) హైదరాబాద్ కు వచ్చింది. కేవలం రెండు దశాబ్దాలలోనే ఐఎస్ బి హైదరాబాద్ అంతర్జాతీయంగా ఎనలేని గుర్తింపు పొందింది.  ఏవో ఏవేవో రాజకీయ కారణాల వల్ల హైదరాబాద్ ఐఎస్ బీ విషయంలో చంద్రబాబు ప్రమేయాన్ని తక్కువ చేసి చూపడానికో, గుర్తించకుండా ఉండటానికో ఎన్ని ప్రయత్నాలు జరిగినా చరిత్ర మాత్రం హైదరాబాద్ లో ఐఎస్ బీ రావడానికి ఏకైక కారణం చంద్రబాబుదార్శనికత, సమర్ధత కారణమని పదే పదే గుర్తు చేస్తూనే ఉంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఐఎస్ బి రెండు దశాబ్దాల ఉత్సవాల ముగింపు సమావేశంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. శుక్రవారం (డిసెంబర్ 16) సాయంత్రం  ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) హైదరాబాద్ క్యాంపస్‌లో 20 ఏళ్ల ఆవిర్భావ ముగింపు వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల్లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబు  ఐఎస్‌బీ విద్యార్ధులతో ముఖాముఖీ చర్చలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో  ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ క్యాంపస్ ఆవిర్బావానికి కర్త, కర్మ, క్రియ అన్నీ అయిన  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందు చూపును, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా,  రాష్ట్రానికి సీఈవోగా ఆయన ఐఎస్ బీని హైదరాబాద్ లో ఏర్పాటయ్యేలా చేయడానికి చేసిన కృషిని ఒక సారి అవలోకనం చేసుకుందాం.     అప్పటికే ఐటీ హబ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను  కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు  తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.    ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో  నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే..  ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే   బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్న విధానంపై  దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం  గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ.  దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు.  ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు.  ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు. అలా వచ్చినంత మాత్రాన    హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు  గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు.  అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు.  అలా వచ్చిన వారిని  ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు.   స్వయంగా  బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు.  చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది.  బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.  అయితే అంతటితో  పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది.  స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన   కాంగ్రెస్‌ పలు విమర్శలు చేసింది.  ఆరోపణలు గుప్పించింది.   కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం  సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో  రాష్ట్ర ప్రభుత్వం  ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.  అదిగో ఆ విషయాన్నే తాజాగా  మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఐఎస్బీ లీడర్ షిప్ సమ్మిట్లో చెప్పారు.  సరే అదలా ఉంచితే రాష్ట్రంలో ఐఎస్బీకి   రాయతీలు ఇవ్వడాన్ని అప్పట్లో ఇక్కడ విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విమర్శలు, ఆరోపణలూ గుప్పిస్తే కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రానికి ఐఎస్ బీని సాధించలేకపోయినందుకు తమ రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌కు పునాదిరాయి పడింది.  2001లో నాటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్‌బి హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రారంభోత్సవ వేడుక   ఘనంగా జరిగింది.   

నితీష్ కుమార్’ కు కోపమొచ్చింది .. ఎందుకో తెలుసా?

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ స్థాయిలో మంఛి పేరున్న నాయకుడు. కాలం కలిసొస్తే, 2024లో  ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న సీనియర్ మోస్ట్  రాజకీయ నాయకుడు.     అవినీతి అంతగా అంటని మంచి పరిపాలన దక్షుడు. రాజకీయ పొత్తులు, రాజకీయ సమీకరణలు మారినా ముఖ్యమంత్రి పీఠం చేజారకుండా కాపాడుకోవడంలో సిద్ద హస్తుడు. రాజకీయ చతురుడు. అటో మోడీ, షా,ఇటు లాలూ అండ్ ఫ్యామిలీ ఇద్దరినే తమ ఎత్తులతో చిత్తూ చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీలో శాశ్వతంగా సెటిలై పోగల రాజకీయ జిత్తుల మారి ‘నేత’. ఈ అన్నిట్నీ మించి, నితీష్ కుమార్’కు  సౌమ్యుడు. సహనశీలి, స్నేహశీలి అనే మంచి గుర్తింపు వుంది.  అయితే, అంతటి మంచి మనిషికి కోప మొచ్చింది.  అంతటి సహన శీలి, సౌమ్యుడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది కూడా రాష్ట్ర శాసన సభలో... నితీష్ కుమార్ ఉగ్రరూపం ప్రదర్శించారు. అది కూడా నిన్నమొన్నటి వరకు తాను  కూర్చున్న ముఖ్యమంత్రి పల్లకీని మోసిన, మాజీ మిత్ర పక్షం, ప్రస్తుత విపక్షం బీజేపీ నేతలపై , ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఫైరయ్యారు . భగ్గుమన్నారు. ఆయున నోటి నుంచి ఏకే 47 తూటాల వంటి మాటలు దూసుకొచ్చాయి. అయితేమ ఇంతేకీ నితీష్ కుమార్ సార్’కు ఇంతలా కోపం ఎందుకొచ్చింది? అంటే అందుకు మందు కారణం. కాదు, ఆయన మందు తాగి, సభకు రాలేదు. కానీ, సంపూర్ణ మధ్య నిషేధం అమలులో ఉన్న రాష్టంలో, ఈ మధ్య కాలంలో కల్తీ మద్యం అమ్మకాలు ఎక్కువయ్యాయి. కల్తీ మద్యం తాగి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఛాప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగిన ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సహజంగానే రాజకీయ దుమారం భగ్గుమంది. ఈ నేపధ్యంలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో గడచిన రెండు రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మద్యం మాటల యుద్ధం సాగుతోంది.ప్రజలకు ముఖ్యమంత్రి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.  ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ‘తాగేసి వచ్చారా?’ అంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు.‘‘ఒకవేళ తాగితే చస్తారు’’ అని నితీశ్ నోరు జారారు.దీంతో అసహనానికి గురైన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.కాగా, మద్యం సాగి సభకు వచ్చారా అంటూ సీఎం అసెంబ్లీలో గద్దించడంపై బీజేపీ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆదరణ తగ్గి వయసు పెరుగుతుండటంతో ఆయనకు కోపం పెరుగుతోందని ఆ పార్టీ నేత గిరిరాజ్ సింగ్ విమర్శించారు. నితీష్ పని అయిపోయిందని, అందుకే కోపం ప్రదర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు.  అయితే, అధికార ప్రతిపక్షాల మాటలు ఎలా ఉన్నప్పటికీ, బీహార్’లో నితీష్ కుమార్ బీజీపే తో తెగతెంపులు చేసుకుని,ఆర్జేడీతో చేతులు కలిపినా తర్వాత, ఆయన అసహనననికి గురవుతున్నడి నిజమే,ఆర్జేడీ, బీజేపీల మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో నితీష్ లేగ దూడల నలిగి పోతున్నారు. అందుకే, చివరకు ఈ ఒక్కసారికి మాత్రమే తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతాని, వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో, ఆర్జేడీ నేత, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్’ ముఖ్యమంత్రి అభ్యర్ధిగానే ఆర్జేడీ, జేడీయు కూటమి ఎన్నికలకు వెళుతుందని ప్రకటించారని, అంటున్నారు. నిజానికి, పొత్తులు మార్చి ముఖ్యమంత్రి కుర్చీని అంటిపెట్టుకుని  కూర్చోవడం వలన నైతేనేమి, ఇతరత్రా కారణాల వలన చేతనేతే నేమి, నితీష్ కుమార్ చరిష్మా చాలా వరకు మసక బారింది. అలాగే, జేడీయు కూడా ఒక విధంగా  క్షీణ దశకు చేరుకుంది, ఇప్పటికే థర్డ్ ప్లేస్’లో ఉన జేడీయు వచ్చే ఎన్నికల్లో బలం మరింత తగ్గి, పార్టీ కాలగర్భంలో కలిసి పోతుందని, అందుకే నితీష్ కుమార్’ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంతోందని పరిశీలకులు సైతం అంటున్నారు.

108 సమ్మె సైరన్

ఏపీలో ఆందోళన బాట పట్టని వర్గం లేదంటే అతి శయోక్తి కాదు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రైతులు, కార్మికులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారూ కూడా తమ సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆందోళన బాట పడుతున్నారు. ఇప్పుడు 108 సర్వీసుల కాంట్రాక్టు ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించారు. సకాలంలో వేతనాలు అందక నానా యాతనలూ పడుతున్నామని, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన ఒక్క హామీ కూడా ఈ మూడున్నరేళ్లలో నెరవేరలేదని వారు చెబుతున్నారు. అంతే కాకుండా 108 నిర్వహణ సంస్థ కారణంగా పలు సమస్యలు ఎదురౌతున్నాయని వారు ారోపిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుండా వచ్చే నెల 15 తరువాత ఏ క్షణమైనా సమ్మె బాట పడతామని 108 కాంట్రాక్టు ఉద్యోగులు హెచ్చరించారు.

మద్యం మృతులకు నో ఎక్స్ గ్రేషియా.. బీహార్ సీఎం

సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్ లో కల్తీ మద్యం కాటేసింది. ఈ కాటుకు 30 మంది బలయ్యారు. రాష్ట్రంలోని సారన్ జిల్లా ఇసువాపూర్ పరిధిలో బుధవారం మద్యం తాగిన వారిలో 30 మంది మరణించగా.. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. మద్యం తాగిన వారిలో 21 మంది బుధవారం మరణించగా, మరో తొమ్మిది మంది మరణించారు. కాగా కల్తీ మద్యం కాటుకు 30 మంది మరణించిన ఘటనపై అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం  విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. కల్తీ మద్యం యథేచ్ఛగా ఏరులై పారుతోందనీ, ఇది ప్రభుత్వ వైఫల్యమేననీ విమర్శించాయి.  మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విపక్షాల విమర్శలను తిప్పి కొట్టిన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ లో మద్య నిషేధం అమలులో ఉందని, అలాంటి రాష్ట్రంలో మద్యం తాగడం కూడా నేరమేనని అన్నారు. తాగితే చస్తారు. అలా చనిపోయన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేది లేదని స్పష్టం చేశారు.   

మత్తు మహిమ ఇంతింత కాదయా..!

మత్తు మనిషిని చిత్తు చేస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇవన్నీ పెద్దలు చెప్పిన మాటలు.. ఏపీ ప్రభుత్వ మద్యం విధానం కారణంగా జేబు, ఒళ్లు కూడా గుల్ల అవుతున్నా.. గుర్తించలేని స్థితిలో మందు బాబులు ఉన్నారు. అధిక ధరలకు చౌక మద్యం విచ్చల విడిగా సరఫరా చేస్తున్న జగన్ సర్కార్ సంపూర్ణ మద్య నిషేధం బాటలో అడుగులు వేస్తున్నాం కనుకనే జనంలో మద్యం అలవాటుకు మాన్పించేందుకు ధరలు పెంచేస్తున్నాం అని చెబుతోంది. మద్యం విషయంలో సమాజానికి ఏపీ సర్కార్ చేస్తున్న చేటు చాలదన్నట్లు డ్రగ్స్, గంజాయిలకు రాష్ట్రంలో గేట్లు తెరిచేసింది. దేశంలో ఏమూల డ్రగ్స్ పట్టుబడినా, గంజాయి దొరికినా ఆ రవాణా మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటేనే పరిస్థితి ఏమిటో అర్దం చేసుకోవచ్చు. ఇక విశాఖ వంటి నగరాలలో అయితే గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్మగ్లింగ్ కు గేట్లు తెరిచేయడంతో గంజాయి ఇంటి ముంగిటికి కూడా వచ్చే చేరుతోంది. దీంతో విశాఖలో ఆడా, మగా తేడా లేకుండా మద్యం, గంజాయి వాడకం పెరిగిపోయింది. దీనికి నిదర్శనంగా తాజాగా విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన ఒక సంఘటన నిలుస్తోంది. బీచ్ రోడ్డులో మద్యం తాగుతూ, గంజాయి సిగరెట్ పీలుస్తూ.. ఓ యువతి వీరంగం సృష్టించింది.  ఇదేమిటని ప్రశ్నించిన ట్రాఫిక్ ఎస్ ఐ పై ఆ ఆమ్మాయి దాదాపు దాడి చేసినంత పని చేసింది. అసభ్యంగా దూషిస్తూ తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పి శాల్తీ లేపేస్తా జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. మద్యం మత్తులో ఒళ్లు మరచి వీరంగం చేస్తున్న ఆమెను నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు చివరికి అదుపులోనికి తీసుకుని తొలుత ఆసుపత్రికి ఆ తరువాత ఠాణాకు తరలించారు.

కమలానికి కన్నా గుడ్‌బై?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయ ముంది. ముందస్తు ఎన్నికలు తధ్యమని ప్రచారం జరుగుతున్నా, ఆ ముచ్చట ముడిపడే సూచనలు పెద్దగా కనిపించడం లేదు. అయినా అటు ఏపీలో, ఇటు తెలగాణ ఎన్నికల సందడి ఉపందుకుంటోంది, పొత్తులు,ఎత్తులు తెరపై కొస్తున్నాయి. రాజకీయ లెక్కలు మారి పోతున్నాయి. ఉభయ రాష్ట్రాల రాజకీయ ‘కుల’ సమీకరణాలు కలగాపులగంగా కలిసి పోతున్నాయి.  ముఖ్యంగా ఉభయ రాష్ట్రాలలో ఎంతో కొంత సినిమా, రాజకీయ గ్లామర్’ ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందనే వార్త సహజంగానే  ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరికోసం అనే ప్రశ్న సహజంగానే, పై కొచ్చింది. అంతే కాదు  అక్కడ ఎపీలోనూ పవర్ స్టార్, బీజేపీతో తెగతెంపులు చేసుకునే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. నిజానికి, బీజేపీ, జనసేన పొత్తు ఉన్నా లేనట్లే, ఎవరి దారిలో వారు పోతున్నారు. రోడ్ మ్యాప్ అవీ ఇవీ అని మాట్లాడుతున్నా ఎప్పుడైనా బీజేపీ, జనసేన బంధం పుటుక్కుమనవచ్చనే ఉహాగానాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అదలా ఉంటే, ఇప్పడు బీజేపీ - జనసేన పొత్తు కథ కొత్త మలుపు తిరిగింది. కాంగ్రెస్ ను వదిలి కమలం గూటికి చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పనున్నారనే వార్త గుంటూరు జిల్లా రాజకీయాల్లో చాలా కాలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని అక్కడా, ఇక్కడా వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా తన  నుంచి పార్టీ అధ్యక్ష పగ్గాలు పుచ్చుకున్న సోము వీర్రాజుకు కన్నాకు మధ్య దూరం పెరిగింది. సోము వీర్రాజు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కన్నా సన్నిహితుల  వద్దనే కాదు మీడియా ముందు కూడా మొరపెట్టుకున్నారు. అయినా బీజేపీ అగ్ర నాయకత్వం కన్నా వేదనను  ఏమంత పట్టించుకోలేదు. అందుకే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పే  ఆలోచనలో ఉన్నట్లు, పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.  అందుకు తగ్గట్టుగానే   బుధవారం(డిసెంబర్14)  కన్నా ఇంటికి అనుకోని జనసేన అతిథి వచ్చారు. జనసేన పీఏసీ చైర్మన్, ఆ పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌ మరి కొందరు స్థానిక నాయకులను వెంట పెట్టుకుని  కన్నా  ఇంటికి వచ్చారు. దీంతో ఇప్పటికే ఆయన పార్టీ మారబోతున్నారని గాల్లో వినిపిస్తున్నవదంతులకు  మరింత బలం చేకూరింది. నిజానికి, నాదెండ్ల మనోహర్‌ ఒకరిద్దరు అనుచరులతో వచ్చి వెళ్లుంటే ఎలా ఉండేదో ఏమో కానీ, అది అలా జరలేదు. మరో వంక అదే సమయంలో కన్నా అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో  ఆయన నివాసానికి చేరుకోవడంతో ఏదో జరుగుతోందనే గుసగుసలు గుప్పుమన్నాయి. ఈ నేపధ్యంలోనే గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  రెండు  మూడు నెలల క్రితం కన్నా పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన పరోక్షంగానే అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కారాలు మిరియాలు నూరారు. అలాగే, రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన జనసేన ముఖ్యనేతతో భేటీ కావడంతో పార్టీ మార్పు విషయంలో నిర్ణయం తీసుకున్నారా  అనే వార్తలు జోరందుకున్నాయి. అయితే, చివరకు అటు కన్నా, ఇటు నాదెండ్ల కూడా అబ్బే అదేం లేదు. ఒకప్పుడు ఒకే గూటి పక్షులం కదా, పైగా కలిసి చాలా కాలమైంది..ఒకసారి కలసి కూర్చుని కబుర్లాడుకున్నాం.. అంతే  అంతకు మించి ఇంకేమీ లేదు. కోడి గుడ్డు మీద ఈకలు పీక్కండి అనే అర్ధం వచ్చేలా చిన్నపాటి వివరణ ఇచ్చారు. కానీ, ఆడవారి మాటలకే కాదు, రాజకీయ నాయకుల మాటలకూ అర్థాలు వేరనే విషయం తెలియంది కాదు.  అవునంటే కాదని,  కాదంటే అవునని అనే కదా అని అనుకునే వారు అనుకుంటున్నారు. అలాగే, ‘దాల్ మే కుచ్ కాలా హై ..అని కొందరు హిందీలో,  నిప్పులేనిదే పొగ రాదుగా అని తెలుగులో ఇంకొందరు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. అయితే  కన్నా  పార్టీ మారడం విషయం ఎలా ఉన్నా  కేసేఅర్,  జగన్ రెడ్డి సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో, పవన్ కళ్యాణ్  హీరోనా ..? విలనా? అనేది ..అసలు ఆయన నటిస్తున్నారా .. నటిస్తుంటే ... ఇలా చాలా చాలా కొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

జగన్ సర్కార్ రుణానంద లహరి

ఎవ్వనిచే జనించు ఋణ మెవ్వనిచే భ్రమియించు లోకమం దెవ్వని బుద్ధియే ఋణద మెవ్వడు నవ్వుచు నప్పులిచ్చు దా నివ్వగ జాలనంచనక నివ్వగ జాలక, దిప్పనట్టి వా డెవ్వడు --- ఆ ఋణాత్ము, ఋణదేశ్వరు నేను ఋణంబు వేడెదన్ పోతన పద్యానికి ఇది ప్రసిద్ధ రచయత ముళ్లపూడి వెంకటరమణ పేరడీ. ఇప్పుడు ఈ పేరడి జగన్ సర్కార్ తీరుకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. ముళ్లపూడి వెంకటరమణ సాహిత్యంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు అప్పారావు. అవసరం, కారణాలతో సంబంధం లేకుండా అప్పులు చేసుకుంటూ  పోవడం ఆ క్యారెక్టర్ తీరు.   ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలన సాగిస్తున్న తీరు చూస్తుంటే.. ఎవరైనా సరే ఈ సర్కార్ ను అప్పారావు క్యారెక్టర్ తో పోల్చకుండా ఉండలేరు. ఎడాపెడా వృధా నియామకాలు, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ఉచిత పందేరాలు, ఇందు కోసం నిధుల లేమిని ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్ అప్పులను అలంబనగా చేసుకుంది. ఎడా పెడా.. ఎక్కడ దొరికితే అక్కడ కోట్లకు కోట్లు అప్పులు చేసేస్తోంది. ఒక కుటుంబ యజమాని ఏదైనా అవసరం కోసం అప్పు చేయాల్సిన అనివార్య పరిస్థితి వస్తే.. ఆ చేసిన అప్పు తీర్చడానికి ఉన్న మార్గాలేమిటి? తన కుటుంబ వ్యయాన్ని ఏ మేరకు నియంత్రించుకోవాలి, తీసుకున్న అప్పుకు నెలనెలా వడ్డీ ఎలా కట్టగలం అన్న అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని  ఫరవాలేదు.. అప్పు తీర్చగలను అన్న నమ్మకం కలిగితేనే అప్పు చేస్తాడు. అలాంటిది ఒక ప్రభుత్వాధినేత అప్పు చేయాల్సివచ్చినప్పుుడు.. ప్రభుత్వానికి ఉన్న ఆదాయవనరులేమిటి? అప్పు తీర్చేందుకు ఆ వనరులు సరిపోతాయా.. లేదా ఆదాయ పెంపు మార్గాలేమిటి? వంటివన్నీ ఆలోచించాలి. రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమం కుంటు పడకుండా అన్ని విధాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి. కానీ డబ్బు కొడితే ఓట్లు రాలతాయి.. అనుకుంటూ.. ఆదాయానికి పొంతన లేకుండా వ్యయాలను పెంచేస్తూ.. అభివృద్ధిని విస్మరించి సాగితే... ఏమౌతుందో ప్రస్తుతం ఏపీ పరిస్థితిని చూస్తే అర్ధమౌతుంది.  ఇక మళ్లీ జగన్ సర్కార్ అప్పోపాఖ్యానం వద్దకు వస్తే.. ఏపీ సర్కార్ అప్పుల పై కేంద్రం కన్నెర్ర చేసింది. బ్యాంకులు ఇక ఇవ్వలేం బాబోయ్ అంటున్నాయి. ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఇంత చేసినా కేంద్రం ఏపీ సర్కార్ కోరడం ఆలస్యం అన్నట్లు అదనపు అప్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆర్బీఐ చూసీ చూడనట్లు వ్యవహరిస్తుంది. దారులన్నీ మూసుకుపోయినా కిటికీలు బలవంతంగానైనా సరే తెరిచేసి జగన్ సర్కార్ అప్పుల బాటలో రాష్ట్రాన్ని తిరోగమన బాటలో బ్రహ్మాండంగా పరుగులెట్టించేస్తున్నది.  తాజాగా ఏపీ సర్కార్ మరో 2300 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఎందుకో తెలుసా?... రిజర్వ్ బ్యాంకు అప్పు తీర్చడానికి. ఎందుకంటే ఈ  నెల 17లోగా ఓడీ అప్పు చెల్లించకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింపులు పూర్తిగా నిలిపివేస్తామని రిజర్వ్ బ్యాంకు విస్పష్ట హెచ్చరిక జారీ చేయడంతో జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పు చేసింది. మూడు కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని ఓ 23వందల కోట్ల రూపాయలు అప్పు చేసేసింది. ఇలా అప్పు చేసి అలా రిజర్వ్ బ్యాంకుకు 200 కోట్లు చెల్లించేసి.. మళ్లీ ఓడీకి లైన్ క్లియర్ చేసుకుంది. తీసుకున్న అప్పులో మిగిలిన 300 కోట్ల రూపాయలతో  ప్రభుత్వోద్యోగుల నవంబర్ నెల వేతనాలకు కొందరికి చెల్లించింది. ఇంకా దాదాపు 30 శాతం మందికి వేతనాలు అందనే లేదు. వారికి వేతనాలు చెల్లించాలంటే మళ్లీ ఎక్కడో అప్పుపుట్టాల్సిన  పరిస్థితి. జగన్ సర్కార్ ఇలా రుణగొణ ధ్వనితో అప్పులు చేస్తూ పాలనను నెట్టుకొచ్చేస్తోంది. ఇక్కడకు ఇది  అలా ఉంచితే..   అసలు కార్పొరేషన్ల ద్వారా ఏపీ సర్కార్ కు రుణం ఎలా లభించిందన్నది సమాధానం రాని మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందు కంటే.. కార్పొరేషన్లద్వారా తీసుకున్న అప్పును ఆయా కార్పొరేషన్ల అభివృద్ది, అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.  అయితే జగన్ సర్కార్ అందుకు భిన్నంగా వాడేసుకుంటోంది. దీంతో ఏపీలోకి కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వవద్దని, ఒక వేళ ఇస్తే ఆయా కార్పొరేషన్లకు తిరిగి ఆ అప్పు తీర్చే స్తోమత ఉందో లేదో పరిశీలించడంతో పాటు.. ఆ తీసుకున్న అప్పును ఎలా వినియోగిస్తున్నారో కూడా చూడాలని ఆర్బీఐ బ్యాంకులకు విస్పష్ట ఆదేశాలిచ్చింది. అయినా జగన్ సర్కార్ కు యథేచ్ఛగా కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాలు ఉత్తుత్తినే ఇచ్చిందా? లేక ఆ ఆదేశాలను బ్యాంకులు ఖాతరు చేయడం లేదా? అంతా జగన్మాయ.. జగన్ రుణ లీలలు ఇన్నిన్ని కావు. 

అక్కడా.. ఆ నలుగురే!.. కేసీఆర్ ఒంటరే

తెలంగాణ ముఖ్యమంత్రి,భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధినేత, కల్వకుట్ల చంద్రశేఖర రావు జాతీయ రాజకీయ ప్రస్థానంలో మరో ముందుగు వేశారు.  నిజానికి, కేసేఅర్  గత నాలుగు సంవత్సరాలుగా జాతీయ రాజకీయ ప్రస్థానం గురించి ఇదిగో అదిగో అంటూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెరాస నాయకులు కుడా జాతీయ కలలలో తెలిపోతూనే ఉన్నారు. అలాగే, అనేక సమయాల్లో అనేక ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. వ్యూహాలు మారుస్తూనే ఉన్నారు. ప్రాంతీయ పార్టీల జాతీయ కూటమి, ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్’ ఇంకో ఫ్రంట్ మరో ఫ్రంట్  అంటూ నాలుగు సంవత్సరాలుగా కేసేఆర్ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించ లేదు. కేసీఆర్ తో చేతులు కలిపేందుకు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రాంతీయ  నాయకులు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపధ్యంలో, ఆయన ఫ్రంట్  టెంట్ ఆలోచనను పక్కన పడేసి, తెలంగాణ రాష్ట్ర సమితి ( తెరాస) పేరును, భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) గా మార్చి, జాతీయ రాజకీయాలలో కాలు పెట్టేందుకు కేసేఆర్ తనకు తాను ఒక వేదిక తయారు చేసుకున్నారు. ముహూర్తం చూసుకుని దేశ రాజధాని ఢిల్లీలో కాలు పెట్టారు. జాతీయ పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కత్తిరించారు. బీఆర్ఎస్ జెండాని ఢిల్లీలో అవిష్కరించారు.  అయితే ఢిల్లీ వెళ్ళినా మళ్ళీ అదే కుమార స్వామి, అదే అఖిలేష్ యాదవ్ తప్పించి మరో ముఖ్య నాయకుడు ఎవరూ అటు కేసి కన్నెత్తి చూడలేదు. చివరికి కుమారస్వామి కేసీఆర్ కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక రోజు ముందు ఆయన తండ్రి హెచ్ డి దేవెగౌడ్ హస్తినలో ప్రధాని మోడీని కలిసి వచ్చారు. అదీ సంగతి. సరే, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల నుంచి కొందరు రైతు నాయకులు బీఆర్ఎస్  వేడుకల్లో పాల్గొన్నా, ఆ  నాయకులకు వారి సొంత రాష్ట్రాలలో ఉన్న క్రెడిబిలిటీ ఏమిటో ఎవరికీ తెలియదు. దేశంలో రైతు నాయకుడిగా ఎంతో కొంత గుర్తింపు ఉన్న తికాయత్  వస్తారని ప్రచారం జరిగినా, ఆయన రాలేదు. అలాగే, స్వాగత తోరణాల్లో కనిపించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్  కూడా బీఆర్ఎస్ వేదిక మీద కనిపించలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సంగతి అయితే చెప్పనే అక్కర లేదు. కేజ్రివాల్ కాదు కదా  ఆయన పార్టీ నుంచి మరో నాయకుడు కనీసం ఉప ముఖ్యమంత్రి సిసోడియా అయినా కేసీఆర్ ను పలకరించిన పాపాన పోలేదు. అంతే కాదు, హైదరాబాద్’ లో కట్టి నట్లు , అడ్డదిడ్డంగా అనుమతులు లేకుండా, కట్టిన, ‘దేశ్ కీ నేతా కేసేఆర్   బ్యానర్లు, పోస్టర్లను ఆప్  సర్కార్ కట్ట కట్టి చెత్త కుప్పలో పడేసింది. అనుమతులు లేకుండా బ్యానర్లు, హోర్డింగులు కట్టినందుకు ఢిల్లీ ఆప్ సర్కార్ కేసులు పెట్టిందో లేదో తెలియదు కానీ, తెలంగాణ ప్రజల పైసలు మూట కట్టి ఆప్ ఏలుబడిలోని పంజాబ్ లో పందారం చేసినా, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాత్రం తమ్ముడు తమ్ముడే పేకాటే అన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కు కనీస మర్యాద ఇవ్వలేదు. నిజానికి  ఇప్పుడే కాదు  గతంలోనూ కేసేఆర్ ను కేజ్రీవాల్  ఇంతకంటే ఘోరంగా అవమానించారు. ఇంచుమించుగా వారం రోజులు అప్పాయింట్మెంట్ ఇవ్వకుండా గేటు దగ్గరే ఆపేశారు.      ఒక్క కేజ్రీవాల్ మాత్రమే కాదు, గతంలో ఆ రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు డబ్బుల మూటలో వెళ్ళినప్పుడు కేసేఆర్ కు స్వగతం పలికిన  బీహార్, ఝారఖండ్ ముఖ్యమంత్రులు, ముఖ్య నాయకులు   బీఆర్ఎస్ వేడుకకు రాలేదు. కనీసం  ఆయన ఢిల్లీలో అడుగు పెట్టిన విషయాన్నీ గుర్తించ లేదు. కనీసం, మాటవరసకు అయినా  ‘ఆల్ ది బెస్ట్’ చెప్పలేదు. చివరకు  మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా, తెరాసతో జట్టు కట్టిన ఉభయకమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులు కనీసం మర్యాదపూర్వకంగా అయినా కేసేఆర్ ను పలకరించలేదు.  ఎవరి దాకానో ఎందుకు, రాష్ట్రం నుంచి అనేక అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెక్కలుకట్టుకుని  విమానాల్లో ఢిల్లీ వెళ్ళారు. కానీ, మంత్రి కేటీఆర్ మాత్రం ఎందుకనో ఢిల్లీ పండక్కి డుమ్మా కొట్టారు. వై ..ఎదుకు .. అందుకే  ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమం చాంతాడంత రాగం  తీసి ఏదో పాట పడినట్లు ముగిసిందని, ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో కేసేఆర్, సింపుల్  గా మరోసారి ఒంటరి అయిపోయారనే విషయం రుజువైందే తప్ప, పెద్దగా ఒరిగిందేమీ లేదని పార్టీ నాయకులు మరో ‘సారీ’ నిట్టురుస్తున్నారు. అక్కడా .. ఆనలుగురితోనే అయింది, అనిపించారని, ఢిల్లీ వెళ్లి వచ్చిన ముఖ్య నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.

2022 రౌండప్ .. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కీలకం

మార్చి  2022 కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. మరి కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే ...తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి.  ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది.  మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.   యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు.  మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది. ఏప్రిల్ 2022 విశేషాలు రేపు

కరీంనగరా.. కరినగరా?

తెలంగాణ బీజేపీ కరీంనగర్ కు కొత్తగా నామకరణం చేసిందా? కరీంనగర్ ను కరినగర్ గా ఏకపక్షంగా మార్చేసిందా? అంటే ఆ పార్టీ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ప్రకటనలలో కరీంనగర్ పేరును కరినగర్ గా పేర్కొంది. దీంతో అందరూ కరీంనగర్ పేరు కరినగర్ గా ఎప్పుడు మారింది అన్న సందిగ్ధంలో పడ్డారు. మరి కొందరేమో ముద్రారాక్షసమంటూ చర్చ లేవదీశారు. చివరకు తేలిందేమిటంటే.. పూర్వ కాలంలో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట. ఎందుకంటే కరి అంటే ఏనుగు.. ఎనుగులు ఎక్కువగా తిరిగే ప్రదేశం కనుక అప్పట్లో కరీంనగర్ ను కరినగరంగా పిలిచేవారట.. కాలక్రమేణా నాటి కరినగరంపేరు కరీంనగర్ గా స్థిరపడిందట. ఇప్పుడు పాత చరిత్ర పుటలను తిరగేసి బీజేపీ ఏకంగా ఏకపక్షంగా  కరీంనగర్ ను కరినగర్ గా మార్చేసింది. అయినా బీజేపీకి ఇలా నగరాలు, ప్రదేశాల పేర్లను మార్చేయడం  కొత్తేమీ కాదు.  బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచీ దేశంలోని పలు నగరాలకు పున: నామకరణం చేస్తూ వస్తోంది. యూపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని పలు నగరాల పేర్లే మార్చేశారు. కర్నాటకలోనూ బీజేపీ ప్రభుత్వం అదే చేసింది. తెలంగాణలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చాకా పలు నగరాల, ప్రాంతాల పేర్లు మారుస్తామని చెబుతోంది. అయితే రాష్ట్రంలో ఇంకా అధికారంలోకి  రాకుండానే బీజేపీ కరీంనగర్ కు కరినగరంగా నామకరణం చేసేసింది. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్లలోనూ, పోస్టర్లు, ఫ్లెక్సీలలోనూ కరీంనగర్ అని కాకుండా కరినగర్ అని పేర్కొంది. బీజేపీ పేర్ల మార్పు ప్రహసనంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పేర్ల మార్పు ప్రక్రియను బీజేపీ చేపట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ఇక కరీంనగర్ విషయానికి వస్తే కరీం అంటే మైనారిటీ వర్గానికి సంబంధించిన పేరు అంటూ అసలు కరీంనగర్ వాస్తవ నామం కరినగర్ అంటూ వాదిస్తోంది. ఇటీవల తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ భైంసా పర్యటన సందర్బంగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే భైంసా పేరును మార్చేస్తామని ప్రకటించారు. ఎప్పటి నుంచో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామంటూ వస్తున్నారు. హిందుత్వ అజెండాలో భాగంగానే బీజేపీ ఈ విధంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు ఆ పార్టీ అసలు ఖాతరు చేయడం లేదు.  

హస్తినలో బీఆర్ఎస్.. క్యా సీన్ హై!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలన్న లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే సంతృప్తికరమైన సమాధానం మాత్రం దొరకదు. దాదాపునాలుగేళ్లుగా ఆయన జాతీయ రాజకీయాలలో  ప్రవేశం కోసం చేయని ప్రయత్నం లేదు.. కలవని పార్టీ లేదు.   ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మొదలు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరకు, బీహార్ సీఎం, జేడీఎస్ అధినేత నితీష్ కుమార్ మొదలు యూపీ మాజీ సీఎం, ఎస్పీ నేతఅఖిలేష్ యాదవ్  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నుంచి  తమిళనాడు సీఎం స్టాలిన్ దాకా అందరినీ కలిసారు.  వీళ్లూ వాళ్లూ అని లేకుండా బీజేపీ యేతర పార్టీల నేతలందరినీ కలిశారు. కానీ జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామిని మినహాయిస్తే ఇంకెవరూ కేసీఆర్ తో కలిసి నడవడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.  దీంతో ఆయన  తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి జంప్ చేసేశారు. కానీ బీఆర్ఎస్  జాతీయ పార్టీ అని, కేసీఆర్ ఆయన పరివారం ఎంతగా ప్రచారం చేసుకున్నా అదిఇప్పటికిప్పుడు జాతీయ పార్టీ కాదు. దానికా గుర్తింపు రాదు. సరే అధికారిక గుర్తింపు సంగతి పక్కన పెడదాం. కానీ జాతీయ స్థాయిలో ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి ఏమైనా స్వాగతం లభిస్తోందా? అంటే దానికీ సంతృప్తి కరమైన సమాధానం రాదు. సరే హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఆర్భాటంగా యాగం చేసి మరీ ప్రారంభించిన కేసీఆర్ కు అక్కడైనా ఏమైనా సానుకూల స్పందన లభించిందా అంటే అదీ లేదు. హైదరాబాద లో పార్టీ ఆవిర్బావ సభకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి మాత్రమే వచ్చారు. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి కుమారస్వామికి అదనంగా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఒకరు కలిశారు అంతే. పోనీ జాతీయ మీడియా అయినా రాజకీయ యవనికపై ఒక కొత్త పార్టీ వచ్చి చేరిందన్న ఆసక్తి కూడా కనబరచలేదు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం వ్యవహారం అంతా ఏదో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ వ్యవహారంగా జాతీయ మీడియా లైట్ తీసుకుంది. బీఆర్ఎస్ ను అస్సలు పట్టించుకోలేదు. ఏదో ప్రాంతీయ పార్టీ పేరు మార్చుకుని ఢల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసుకుంటోందంటూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరించింది. దేశ రాజధాని నగరంలో యాగం చేసి, నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లతో హడావుడి చేసినా కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశానికి సంబంధించిన వార్తలకు జాతీయ మీడియా పెద్దగా పట్టించుకోలేదు.  ఇటీవలి కాలంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా కేసీఆర్ జాతీయ మీడియాకు కోట్లాది రూపాయల అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చారు. జాతీయ చానెళ్లకైతే స్లాట్లు తీసుకుని మరీ తెలంగాణ మోడల్ అభివృద్ధిని ప్రచారం చేసుకున్నారు.  అవేవీ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కవర్ చేసే విధంగా జాతీయ మీడియాను కదిలించలేకపోయాయి. అంతే కాకుండా బీఆర్ఎస్ కు జాతీయ, అంతర్జాతీయ మీడియా కో ఆర్డినేటర్ గా కేసీఆర్ తన బిడ్డ కవితను నియమించారనీ, ఆమె రికమెండ్ చేసిన విధంగా ఒక పీఆర్వోను కూడా నియమించారనీ అంటున్నారు. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కనీసంగా కూడా ప్రచారం చేయించుకోలేకపోయారు. మీడియా సంగతి పక్కన పెడితే ఢిల్లీలోనే ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసలు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం జరుగుతోందనే గుర్తించ లేదు. కనీసం అటుకేసి తొంగి చూడలేదు. ఆయన ఆహ్వానం అందిందా? అందలేదా అన్నది వేరే ప్రశ్న.. కానీ బీజేపీని వ్యతిరేకించే బలమైన పార్టీ నాయకుడిగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా మరో బీజేపీ వ్యతిరేక పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరు కాకపోవడమే బీఆర్ఎస్ విషయంలో ఆయన వైఖరి ఏమిటన్నది స్పష్టమౌతుంది. అలాగే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వీరెవరూ ఇటు కేసి కనీసం చూడను కూడా చూడ లేదు. దీనిని బట్టి చూస్తే పేరు మార్పు తప్ప బీఆర్ఎస్ తో కేసీఆర్ సాధించిందేమీ లేదని పరిశీలకలు అంటున్నారు. టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ పేరు మార్పు ప్రహసనంగానే మిగిలిపోయిందంటున్నారు.  

ధరణి కోట టు ఎర్రకోట.. అమరావతి రైతుల మరో పోరు యాత్ర

ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. అందుకు భూములు ఇచ్చిన రైతులు  మరో పోరాటానికి సిద్దమయ్యారు. 2019, డిసెంబర్ 17వ తేదీన ఏపీ సీఎం వైయస్ జగన్.. ఏపీకి మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశారు.. ఆయనా ప్రకటన చేసి 2022, డిసెంబర్ 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతుంది.  ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని.. అమరావతి రైతులు ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు... పేరుతో దేశ రాజధాని ఢిల్లీకి పోరు బాట పట్టనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఢిల్లీలో రైతులు..  నిరసనలు తెలపనున్నారు. ఆ క్రమంలో 17వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అమరావతి రైతులు ధర్నా చేపట్టనున్నారు. అలాగే 18వ తేదీన ఇతర రాష్ట్రాల ఎంపీలను కలిసి.. వారికి ఈ తమ గోడును విన్నవించుకోనున్నారు. ఇక 19వ తేదీన రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్ సంఘ్ కార్యక్రమంలో  అమరావతి రైతులు పాల్గొననున్నారు. అదీకాక.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీలు.. ఢిల్లీలోనే ఉంటారని.. వారందరినీ కలిసి.. రాజధాని అమరావతికి మద్దతు ఇవ్వాలని రైతులు కోరనున్నారు. అందుకోసం అమరావతి నుంచి 1800 మంది రైతులు... ప్రత్యేక రైలులో ఢిల్లీకి పయనమవుతున్నారు. ఏపీకి  అమరావతే ఏకైక రాజధాని అని న్యాయస్థానం స్పష్టం చేసినా... జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై అమరావతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మూడు రాజధానులంటూ ప్రకటన చేసిన నాటి నుంచి... అమరావతికి భూములు ఇచ్చిన రైతులు.. వరుసగా నిరసనలు, దీక్షలు, యాత్రలలో పోరాడుతూనే ఉన్నారు. ఆ క్రమంలో న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి నుంచి తిరుపతి వరకు మహాపాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి అనుమతి తెచ్చుకున్నారు. అలాగూ అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు మరో మహాపాదయాత్ర చేపట్టారు. అయితే ఈ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద ఈ పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ పాదయాత్ర ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.   అయితే విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అంటూ ఇప్పటికే జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో అమరావతి రైతుల పాదయాత్ర... ఉత్తరాంధ్ర జల్లాల్లో ప్రవేశిస్తే.. పరిస్థితులు  ఎలా ఉంటాయన్న ఆందోళన వ్యక్తమైంది. ఎందుకంటే.. అమరావతి రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా.. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఉంటే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందంటూ... జగన్ పార్టీలోని పలువురు కీలక నేతలు.. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోటీగా  ఆందోళనలు నిర్వహించేందుకు రంగం చేస్తుకొన్నారని సమాచారం. అలాంటి వేళ.. ఈ అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలో ప్రవేశిస్తే.. పరిస్థితులు ఆందోళనకరంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయని ఓ చర్చ సైతం బలంగా సాగుతోంది.    మరోవైపు గతంలో శాతవాహనుల రాజధానిగా అమరావతి ఉండేది. ఆ సమయంలో అమరావతిని ధాన్యకటకం.. ధరణికోట పేర్లుతో ప్రజలు పిలిచుకునే వారు. ఈ పేర్లను పురస్కరించుకొని. ధరణికోట నుంచి ఎర్రకోట పేరుతో అమరావతి రైతులు హస్తిన యాత్రకు శ్రీకారం చుట్టారు.

హెలికాప్టర్ కు యాదాద్రిలో వాహన పూజ..

ఆలయాల్లో వాహన పూజలు సర్వసాధారణం. ఎవరైనా కొత్త వాహనం కొనుక్కుంటే ముందుగా ఆలయానికి తీసుకువచ్చి వాహన పూజ చేయిస్తారు. ఇలా చేయిస్తే ఆ వాహనంపై ప్రయాణం ఎలాంటి ప్రమాదాలకూ తావు లేకుండా సజావుగా సాగుతుందని ఒక విశ్వాసం. కార్లు, బైకులు, ట్రక్కులు, బస్సులు, వ్యానుకు ఇలా రకరకాల వాహనాలకు వాటి యజమానులు పూజలు చేయించడం విశేషమేమీ కాదు. తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన  యాదాద్రి ఆలయం వద్ద తమ వాహనాలకు వాహన పూజలు చేయిచుకునే వారి సంఖ్య చిన్నదేం కాదు.  కానీ ఒకాయన ఏకంగా తాను కొనుక్కున్న చాపర్ కు పూజలు చేయించడానికి ఆలయానికి తీసుకు వచ్చారు. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంఘటన యాదాద్రిలో జరిగింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..యాదాద్రిలో మొట్టమొదటి సారిగా ఒక హెలికాప్టర్ కు వాహన పూజ జరిగింది. దీంతో ఆ హెలికాప్టర్ ను చూడటానికి వచ్చిన జనం పర్వదినాలలో యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని చూడటానికి వచ్చిన భక్త జనసందోహం కంటే తక్కువగా లేరు. ఇంతకీ తన చోపర్ కు వాహన పూజ చేయించిందెవరయా అంటే.. కరీంనగర్‌ ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ అయిన బోయినపల్లి శ్రీనివాసరావు. ఆయన తాను కొనుగోలు చేసిన హెలికాప్టర్‌కు యాదాద్రి పెద్దగుట్టపై బుధవారం (డిసెంబర్ 14)  వాహన పూజ చేయించారు. హెలికాప్టర్ కు పూజారులు వాహన పూజ చేస్తుంటే.. ఆ విషయం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో హెలికాప్టర్ ను చూసేందుకు పోటెత్తారు.   

కేరళలో కోళ్లు, బాతులకు చంపేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

కేరళలో కోళ్లు, బాతులను వెంటనే చంపేయాలని ఓ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నిజమే.. కొట్టాయం జిల్లా కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది. దీంతో కోళ్లు, బాతులు, ఇతర పెంపుడు పక్షులను చంపేసి క్రిమి సంహారక మందులు చల్లాలని ఆయన ఆదేశించారు. ఆ ఆదేశాల మేరకు వేల సంఖ్యలో కోళ్లు, బాతులు, పెంపుడు పక్షులను చంపేస్తున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని మాళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మళ్లీ వైరస్ లు విజృంభించడం ఆందోళన రేకెత్తిస్తోంది. బర్డ్ ఫ్లూ, ఎబోలా, జికా ఇలా వైరస్ ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో వైపు ఉదృతి తగ్గినా మరో సారి పడగ విప్పేందుకు కరోనా, ఒమిక్రాన్ వైరస్ లు పొంచే ఉన్నాయి.  తాజాగా కర్ణాటకలో ఐదేళ్ల చిన్నారికి జికా వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. చైనాలో కరోనా కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో బర్డ్ ఫ్లూ విజృంభణను అరికట్టేందుకు పెద్ద సంఖ్యలో పక్షులను చంపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొట్టాయం జిల్లాలో బుధవారం (డిసెంబర్ 14) నుంచి మూడు రోజుల పాటు వ్యాధి వ్యాప్తికి కేంద్రంగా ఉన్న చోటు నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న కోళ్లు, బాతులు,ఇతర పెంపుడు పక్షులు, అలాగే   మాంసం సహా సేంద్రీయ ఎరువుల క్రయ విక్రయాలను నిలిపివేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వల్ల ప్రజలకు నేరుగా ఎలాంటి హానీ లేకపోయినప్పటికీ, బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయిన.. పక్షుల మాంసం తినడం వల్ల   ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఈ చర్యలు తీసుకున్నారు.

గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ.. ఎక్కడంటే?

ఇప్పటి పిల్లలకు తెలియదు కానీ.. గతంలో స్కూళ్లలో హోంవర్క్ చేయకపోయినా, అల్లరి చేసినా గుంజీలు తీయించే వారు. గోడ కుర్చీ వేయించేవారు. అవి పిల్లలకు అప్పట్లో విధించే శిక్షలు. కానీ గుంజీలు తీయడం వ్యాయామంలో అతి కీలకమన్న విషయం అప్పట్లో శిక్షలు విధించిన టీచర్లకు కానీ, వాటిని అనుభవించిన విద్యార్థులకు కానీ తెలియదు. ఇప్పుడు అందరిలోనూ హెల్త్ కాన్షస్ నెస్ పెరిగింది. జిమ్ములనీ, మార్నింగ్  వాక్ లనీ, సిట్అప్స్ (గుంజీలు) అని ఎక్కువ మంది ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. కానీ చాలా మందికి వ్యాయామాలంటే బద్ధకం. లేదా పని ఒత్తిడిలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అటువంటి వారి కోసం గుంజీలు తీస్తే బస్ టికెట్ ఫ్రీ అని బంపరాఫర్ ప్రకటించిందో ప్రభుత్వం. ఔను నిజమే రొమేనియా నగరంలో స్పెర్ట్స్ ఫెస్టివల్ అనే ఒక హెల్త్ మిషన్ లో భాగంగా రొమేనియా ప్రభుత్వం ఈ బంపరాఫర్ ఇచ్చింది. గుంజీలు తీసి పొందిన ఫ్రీ బస్ టికెట్ కు ఓ పేరు కూడా పెట్టేసింది. దాని పేరు హెల్త్ టికెట్. అయితే ఈ టికెట్ పొందాలంటే రెండే రెండు నిముషాల్లో 20 గుంజీలు తీయాలి. అలా తీస్తేనే హెల్త్ టికెట్ అనే ఫ్రీ బస్ టికెట్ ఇస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ విడియోలో ఓ అమ్మాయి టికెట్ మిషన్ ఎదుట నిలబడి 20 గుంజీలు తీసింది. ఆమె గుంజీలు తీయడం పూర్తి కాగానే టికెట్ మిషన్ నుంచి టికెట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.  మన దేశంలో కూడా ప్రజలలో వ్యాయామం పట్ల ఆసక్తినీ, అవగాహనను పెంపొందించడానికి ఇటువంటి చర్యలు తీసుకుంటే బెటర్ అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

హైకోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఏపీ సీఎస్ కు కోర్టు ఆదేశం

కోర్టులు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా జగన్ సర్కార్ కు బొప్పి కట్టడం లేదు. కోర్టు ఆదేశాలను ఖాతరు చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా సర్కార్ వ్యవహార శైలి ఉంది. తాజాగా హైకోర్టు మరో సారి ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పాఠశాలల ఆవరణల్లో ఇతర నిర్మాణాలేవీ చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే హై కోర్టు ఆదేశాల తరువాత కూడా పాఠశాల ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం చేపట్టడంపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విస్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా వాటిని ఖాతరు చేయకుండా కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయడం, నిర్మాణాలు చేపట్టడంపై స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.   ఏపీ సర్కార్ తీరు, అధికారుల వ్యవహార శైలిపై కోర్టు గతంలో కూడా పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి విదితమే. సీఎస్ కు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించడానికి ఒక్క రోజు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి నెల రోజులు జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ఉద్యోగుల క్రమబద్ధీకరణ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించింది. ఇలా పలు సందర్భాలలో కోర్టు ధిక్కరణ కేసుల్లో ఏపీ అధికారులు కోర్టు మందలింపులకు, శిక్షలకు గురయ్యారు.