ఏపీ సర్కార్ దివాలా?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం దివాలా తీసిందా? అంటే, ప్రభుత వర్గాల నుంచే అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్రం ఇప్పటికే ఇక అప్పులు  పుట్టని స్థితికి చేరుకుంది. చివరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను, పాత బకాయిల కింద వెనక్కి తీసేసుకుందంటే పరిస్టితి ఏమిటో మళ్లీ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సుమారు వెయ్యి కోట్ల రూపాయల నిధులను ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.   అదలా ఉంటే, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదు. చివరకు   పెన్షన్లు కూడా సకాలంలో జమ కావడం లేదు. పెన్షన్ జమ కాగానే, హమ్మయ్యా, ఈ నెలకు పెన్షన్ జమైంది  అనే భావన కలుగుతోందని  పెన్షనర్లు వాపోతున్నారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి ఉందని వారంటున్నారు. అలాగే, ఫస్ట్ తేదీన జమ కావలసిన జీతాలు 15, 20 తేదీల వరకూ కూడా జమ కావడం లేదు.  ఏ రోజుకు ఆరోజు గల్లాపెట్టె చూసుకుని, విడతల వారీగా ఉద్యోగుల జీతాలు జమ చేస్తున్నారు. ఈ అన్నిటినీ మించి, చిన్నా చితక కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు, కొండల్లా పేరుకు పేరుకుపోతున్నాయి.  ఓ వంక ఉద్యోగులు, జీతాలు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, కాంట్రాక్టర్లు బిల్లుల కోసం కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దివాలా తీసింది అనేందుకు సంకేతాలే.  నిజానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు, ఆర్థిక వ్యవస్థ తడబడుతూనే ఉంది. తప్పటడుగులు వేస్తూనే వుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ‘ఉచిత’ ఖర్చుల పద్దును  పెంచుకుంటూ, పట్టాలు తప్పి ప్రయాణం సాగిస్తోంది. ఇప్పుడు పరిస్థితి మరింతగా దిగజారి, చేతులెత్తేసే  స్థితికి వచ్చేసిందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా  సర్కార్ పనులు చేసిన కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లులు ఎంత కాలానికీ క్లియర్ కాకపోవడంతో రోడ్డెక్కి, ఆందోళనలు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా, సర్కార్ లో కదలిక లేదు. ఇక చేసేది లేక కోర్టు తలుపులు తట్టారు. క్యూ కట్టి ప్రభుత్వం పై చీటింగ్ పిటిషన్లు వేస్తున్నారు. అది కూడా ఒకరో ఇద్దరో కాదు. ఒకటో రెండో కాదు.. ఏకంగా వందల సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోర్టులు, అక్షింతలు వేసినా, తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఆదేశాలు జారీ చేసినా, జగన్ రెడ్డి ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మీద విశ్వాసంతో అప్పులు చేసి పనులు చేసిన కాంట్రాక్టర్లు  మరోమార్గం లేక కోర్టు ధిక్కరణ కేసులు వేస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు సరికదా, అసలుకే ఎసరు పెట్టే  ఆలోచనలు చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్‌కు వెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. అంటే కోర్టు వెలుపల మాజీ నాయమూర్తుల ద్వారా వివాదాలను పరిష్కరించునే ప్రయత్నం  సర్కార్ చేస్తునట్లు తెలుస్తోంది. ఆర్బిట్రేషన్‌కు వెళ్ళడం అంటే కాంట్రాక్టర్లను మరో విధంగా మోసం చేయడమే అవుతుందని, అంటున్నారు. అదే జరిగితే, ఒక విధంగా ప్రభుత్వం విశ్వాసం కోల్పోవడమే అవుతుంది.  అంతే కాదు, ప్రభుత్వం దివాల తీసిందని, పరోక్షంగానే అయినా ప్రభుత్వమే అంగీకరించినట్లు అవుతుందని అంటున్నారు.  అదోకటి అలా ఉంటే, మోసపోయిన వారిలో, కరోనా సమయంలో మానవతా దృక్పథంతో మాస్కులు కుట్టిన మహిళలు, చిన్న చిన్న టైలర్ షాపులు, దర్జీలు, కరోనా రోగులకు భోజనాలు  సరఫరా చేసిన హోటల్ యజమానులు, ఇతర చిన్నా చితకా వ్యాపారులు కూడా ఉన్నారు. ఇప్పడు వీరంతా వీధిన పడ్డారు. అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే, ప్రభుత్వ దివాలా కు సాంకేతిక నిర్వచనం  ఏదైనా కావచ్చును, కానీ, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మాత్రం  సర్కార్ దివాలాకోరుతనానికి  అద్దం పడుతోందని అంటున్నారు.

పొలిటికల్ వార్ ట్యాంక్ రెడీ..జనసేనాని సిద్ధమయ్యారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ  యుద్ధానికి వార్ ట్యాంక్ రెడీ అయ్యింది. ఆ వాహనానికి వారాహి అని నామకరణం కూడా చేశారు. జనసేనాని రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ఇప్పటికే ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఇందు కోసం ప్రత్యేక వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చైతన్యరథంపై రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన పర్యటన  ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. ఇప్పుడు పవన్ కల్యాన్ కూడా నాటి చైతన్య రథాన్ని పోలినట్లు ఉండేలా తన వాహనాన్ని తీర్చి దిద్దారు. చూడగానే యుద్ధ ట్యాంకును స్ఫురింప చేసేలా ఆ వాహనానికి తుది మెరుగులు దిద్దారు. హైదరాబాద్ లోని ఓ గ్యారేజీలో ఈ వాహనానికి తన పర్యటన అవసరాలకు తగినట్లుగా మార్పులు, చేర్పులు చేయించిన పవన్ కల్యాణ్ బుధవారం (డిసెంబర్ 7) ట్రయల్ రన్ ను కూడా చేశారు. అనంతరం స్వయంగా తన ఎన్నికల వార్ ట్యాంక్ వారాహి ఫొటోలను ట్వీట్ చేశారు. రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ అన్న క్యాప్షన్ కూడా పెట్టారు. ఇంత వరకూ బానే ఉంది.  నాడా దొరికింది.. ఇక గుర్రాన్ని వెతుకుదాం అన్నట్లుగా ఉంది.. యాత్ర షెడ్యూల్ లేకుండా వాహనాన్ని ప్రదర్శించి ఫొటోలను ట్వీట్ చేయడం అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. నిజమే వరుస సినిమాల బిజీ షెడ్యూల్ మధ్యలో ఆయన ఈ వాహనంపై రాష్ట్ర వ్యాప్త పర్యటన అంటున్న బస్సు యాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంలోనే స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన బస్సు యాత్ర అంటూ రెండు మూడు సార్లు తేదీలు ప్రకటించి వాయిదాలు వేశారు. అంతే కాదు ఇటీవల హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తాను రాజకీయాలలో ఫెయిలయ్యానని స్వయంగా ప్రకటించారు. పరీక్షల(ఎన్నికల)కు ముందే తన ఫెయిల్యూర్ ను ప్రకటించిన జనసేన అయినా పోరాటం ఆపనంటూ బస్సు యాత్ర కోసం ‘వారాహి’ని సిద్ధం చేసుకున్నారు. అయితే వరుస సినిమాల బిజీ షెడ్యూల్స్ మధ్య ఆయన ఎన్నికల పోరాటం ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎలా కొనసాగిస్తారు అన్న సందేహాలు జనసేన శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి.  అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ పవన్ కల్యాణ్ రెండు పడవలపై కాళ్లు పెట్టి చేస్తున్న ప్రయాణం వల్లే ఆయనను ఇంకా సినీహీరోలానే జనం చూస్తున్నారు తప్ప రాజకీయ నాయకుడిగా గుర్తించడం లేదు. సినిమా హీరోగా ఆయనకు అశేష అభిమాన జనసందోహం ఉండి ఉండొచ్చు.. కానీ రాజకీయ నాయకుడిగా ఆయన జనం విశ్వాసాన్ని పొందలేకపోయారన్నదానికి గత ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్లు, సీట్లే నిదర్శనం. అప్పటికీ, ఇప్పటికీ ఏం మారిందనడానికి సర్వేలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రసంగాలు, రాజకీయ కార్యక్రమాలకు, పార్టీ నిర్మాణానికి,  పార్టీ వ్యవహారాలకు ఆయన ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారన్నది చూస్తే ఇట్టే అవగతమై పోతుంది. సినిమాల్లో అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కచ్చితంగా షూటింగ్ లో పాల్గొని కమిట్ మెంట్ ప్రకారం పూర్తి చేయాల్సిందే. లేకుంటే నిర్మాతలు నష్టపోతారు. సినిమా హీరోలంతా నిర్మాతలు నష్టపోకూడదు అంటు తరచూ చెబుతుంటారు. పవన్ కల్యాణ్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అందుకే ఆయన ఇప్పటికే ఒప్పుకున్న, కొత్తగా అంగీకరించిన సినిమాలకే ఆయన తన పొలిటికల్ యాక్టివిటీస్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.  పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.  ఇప్పటికే ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే  ఆయన మరో సినిమాని ప్రకటించారు. ఇక గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. అదే సమయంలో బస్సు యాత్ర చేస్తాననీ, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో పర్యటించి పార్టీ బలోపేతం చేయడంతో పాటు.. ప్రజలకూ చేరువ కావాలని పవన్ కల్యాణ్ వ్యూహరచన చేస్తున్నారు. కార్యాచరణ రూపొందిస్తున్నారు.   జనవరి 2023 నుంచి, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర  ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది.అయితే  పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు   డేట్స్ ఎలా అడ్జెస్ట్ చేస్తారన్న అనుమానాలు మాత్రం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి. ఇందుకు ఆయన వరసగా సినిమాలను అంగీకరిస్తూ ఉండటమే కారణం.  ఎందుకంటే ఇప్పటికే ఆయన అంగీకరించిన సినిమా షూటింగ్ కు పూర్తి అయ్యే సరికే పుణ్య కాలం కాస్తా గడిచిపోయేటట్లు ఉంది. అదీ కాక పరిశీలకులు అంచనా వేస్తున్నట్లుగానూ, జగన్ సర్కార్ తరును బట్టి జనం కూడా భావిస్తున్నట్లుగా ముందస్తు ఎన్నికలకు వస్తే అసలు పవన్ కల్యాణ్ బస్సుయాత్ర మాట దేవుడెరుగు అసలు తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారమైనా చేయగలుగుతారా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. ఇన్ని సందిగ్ధతల మధ్య ఆయన ‘వారాహి’ రెడీ అంటూ చేసిన ట్వీట్ వెంటనే వైరల్ అవ్వడమే కాదు.. ట్రోలింగ్ కూ గురౌతోంది.  

మద్యం సీసాలతో మరో ఉద్యమం!

ఒక్క ఐడియా జీవతాన్నే మార్చేస్తుంది. అలాంటిది. పది మంది మహిళలు కలిసి చేసిన అలోచన ఇంకెంత మార్పు తెస్తుందో కదా.. ఒక సమజాన్నే మార్చి వేస్తుంది. బీహార్ లో మహిళల మెదళ్లలో మెదిలిన ఓ అలోచన ఓ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంది. మధ్యపానం సామాన్య ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా, మద్యం విక్రయాల్లో.. మద్యం మరణాల్లో అగ్ర స్థానంలో నిలిచిన తెలుగు రాష్ట్రలలో అయితే  మద్యం మహమ్మారి  దుష్ప్రభాల గురించి వేరే చెప్పనే అక్కరలేదు. తెలుగు రాష్ట్రాలలో పట్టణాలలోనే కాదు, గ్రామాలలోనూ మద్యం ఏరులై పారుతోంది. ఇంక ఎన్నికల సమయంలో అయితే చెప్పనే అక్కరలేదు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల అనతంరం కుప్పలు పోసిన ఖాళీ మద్యం సీసాలు చూసినప్పుడు, నెల రోజుల్లో మునుగోడు ఇంత మద్యం తాగేసిందా? అని జనం  ముక్కున వేలేసుకున్నారు.  ఇక్కడ మనం ముక్కున వేలేసుకున్నాం  కానీ, బీహార్ లో మహిళలు, తాగిపడేసిన  ఖాళీ బాటిల్స్ లో  ఉపాధి చూసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో, ప్రభుత్వాలకు  మద్యంపై వచ్చే ఆదాయమే మూలాధారం.  మద్యం విక్రయాలు లేనిదే  ప్రభుత్వాలకు పూట కాదు క్షణం గడవదు. అందుకే  అంచెల వారీగా మధ్య  నిషేధం విధిస్తామని వాగ్దానం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చిన  వైసీపీ ప్రభుత్వం, స్వయంగా మద్యం వ్యాపారం చేస్తోంది.అంతే కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చే బాధ్యతను మద్యపాన ప్రియుల భుజస్కందాలపై ఉంచింది. కానీ బీహార్ లో అలా కాదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న అతి కొద్ది రాష్ట్రాలలో బీహార్ ఒకటి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్  2016లో మినహాయింపులు లేకుండా సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. అయినా మద్యపాన నిషేధం అమలులో ఉన్నా  అక్రమ మద్యం మద్యం అమ్మకాలు  మాత్రం ఆగలేదు. కల్తీ కల్తీ మద్యం బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో మద్యం అక్రమ విక్రయాలు, వినియోగానికి వ్యతిరేకంగా మహిళలు, మహిళా సంఘాలు, విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి.  అనేక విధాల పోరాటాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పడు  కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓ రకంగా ఉపాధి పొందుతూ.. ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారులపై దాడులు చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో, చేతి గాజులు, ఇతర అలంకరణ వస్తువులు తయారు చేసి విక్రయించడం ద్వారా  జీవనోపాధి పొందుతున్నారు.మరో వంక మధ్యనిషేధ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు.  నిజానికి ముందుగా ఈ ఆలోచన ఏ బాధిత మహిళ మెదడులో పురుడు పోసుకుందో ఏమో కానీ  ఇప్పడు అదొక ఉద్యమంగా సాగుతోంది. జీవిక స్వయం సహాయక సంఘానికి చెందిన 150 మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీవిక అనేది ప్రపంచ బ్యాంకు సహాయంతో నడుస్తున్న బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్ట్‌లో ఒక భాగం. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి సంస్థ అయిన బీహార్ రూరల్ లైవ్లీహుడ్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఇప్పటి వరకు రెండు టన్నుల మద్యం సీసాలతో 70 వేల చేతి గాజులు తయారు చేశారు. నవంబర్ 26న పాట్నా జిల్లాలోని సబల్‌పూర్ గ్రామంలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌కు రోజుకు 80,000 బ్యాంగిల్స్‌ను తయారు చేయగల సామర్థ్యం ఉంది. దేశంలోనే చేతి గాజుల తయారీ హబ్‌గా పేరుగాంచిన ఫిరోజాబాద్‌కు చెందిన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రెండు టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత కొలిమి ఉంది. ఈ గ్యాస్‌ కొలిమిని నిర్వహించడంలో శిక్షణ పొందిన 10 మంది మహిళలు అక్కడ పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇలాంటి అలోచన చేస్తే బాగుటుంది. నిజానికి చేతి గాజుల తయారీలో బీహార్ లో ఫిరోజాబాద్‌కు ఎంత పేరుందో, మన హైదరాబద్ పాత బస్తీకీ అంత పేరుంది. ఇక ముడి సరుకు, మద్యం సీసాలంటారా? కొదవే లేదు. నిజానికి, రాష్ట్రం మొత్తానికి ఒకటి కాదు, ఉరుకొకటి, వీధి కొకటి ఏర్పాటు చేసినా  ముడి సరకు సీసాల కొరత అయితే ఉండదు.. అందుకు   ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలదే హామీ..

ఎంసీడీ ఎన్నికలలో ఆప్ స్వీప్..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ దుమ్ము రేపింది. గత15 సంవత్సరాల బీజేపీ ఆధిపత్యానికి గండి కొట్టి ఘన విజయం సాధించి  తొలిసారిగా ఢిల్లీ మున్సిపాలిటీని చేజిక్కించుకుంది. దీంతో 15 ఏళ్లు బీజేపీ ఆధిపత్యానికి చెక్ పెట్టింది.   మొత్తం 250 సీట్లున్న ఢిల్లీ మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ ఇప్పటికే సాధికార విజయం సాధించింది. ఎమ్ సీడీలో అధికారం చేపట్టాలంటే 126 స్థానాలలో  గెలవాల్సి ఉండగా ఆప్ ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. కడపటి వార్తలందే సరికి 134 స్థానాలలో విజయం సాధించి దూసుకుపోతోంది. బీజేపీ 104 స్థానాలలో విజయం సాధించగా, కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితమైంది.   ఎగ్జిట్ పోల్స్ ఏదైతే అంచనా వేశాయో అంతకు మించి ఆప్ విజయం సాధించింది. బుధవారం (బిసెంబర్ 8) ఉదయం ఓట్ల లెక్కింపు ఆరంభమై తొలి ఫలితాలు వెలువడటం మొదలవ్వడానే మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) ఎన్నికలలో ఆప్, బీజేపీల మధ్య పోరు హోరాహోరీగా సాగిందా అనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయన్నట్లుగా టీవీ టాక్ షోలలో చర్చలు నడిచాయి. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆప్ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఢిల్లీలో 15 ఏళ్ల కాంగ్రెస్ ఆధిపత్యానికి  కేజ్రీవాల్ చెక్ పెడితే,  తాజాగా ఎంసీడీలో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి  కూడా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ చెక్ పెట్టింది.    

ఇటలీ జంట హిందూ పెళ్లి

హిందూ వివాహాలకు ఉంటే ఆకర్షణ, విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాశ్చ్యాత్య దేశాల వారు కూడా హిందూ వివాహ సాంప్రదాయం అంటే ఎంతో మక్కువ చూపుతారు. ఇంత వరకూ హిందూ వధువు, విదేశీ వరుడు లేదా హిందూ వరుడు, విదేశీ వధువు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు చేసుకున్న సంఘటనల గురించి విన్నాం, చూశాం. అయితే ఒక ఇటలీ జంట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని అందుకోసం ఇండియా వచ్చారు. ప్రేమకు చిహ్నంగా నిలిచే తాజ్ మహల్ వద్ద మనువాడారు. అయితే వారేమీ కొత్త జంట కాదు.. ఎప్పుడో 40 ఏళ్ల కిందట వారి సంప్రదాయం ప్రకారం ఇటలీలో వివాహం చేసుకున్నవారే. అయితే హిందూ వివాహంలోని ప్రతి ఘట్టం వెనుకా ఒక శాస్త్రీయ, హేతుబద్ధ కారణం ఉంటుందని వారు విశ్వసించారు. ఎలాగైనా సరే హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా వారి కోరిక ఈడేరడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. వారికి ఇటలీలో వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగిన నాలుగు దశాబ్దాల తరువాత వారికి భారత్ రావడానికి వెసులుబాటు చిక్కింది. ఇక్కడకు రావడంతోనే వారు హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ చిహ్నమైన తాజ్ మహల్ వద్ద వివాహం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. తన 40వ పెళ్లి వార్షికోత్సవాన్ని వారు భారతీయ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం ద్వారా సెలిబ్రేట్ చేసుకున్నారు. ఆ జంట మౌరో, స్టోఫానియా. ఇరువురూ భారత సంప్రదాయ దుస్తులు ధరించి తాజ్ మహల్ సందర్శించారు. అక్కడ సంప్రదాయ బద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నారు. ఇటలీలో వివాహం చేసుకున్నా... తమ ఇద్దరికీ కూడా ఇండియాలో, ఇండియన్ కల్చర్ ప్రకారం పెళ్లి చేసుకోవాలన్న కోరిక ఉండేదనీ,  ఆ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి ఇన్నేళ్లుగా ప్లాన్ చేస్తూనే ఉన్నామనీ, ఇప్పటికి ఆర్థికంగా భారత్ వచ్చి మనువాడేందుకు తగిన స్థితిమంతులమయ్యాకా, తమ 40వ వెడ్డింగ్ యానివర్సిరీని ఇలా సెలబ్రేట్ చేసుకుని చిరకాల వాంఛ నెరవేర్చుకున్నామని ఆ జంట చెప్పింది.  

ప్రాణం తీసిన వాషింగ్ మిషన్ వాటర్.. జర జాగ్రత!

ఇరుగూ పొరుగూ అన్నాక సఖ్యత ఉండాలి. చిన్న చిన్న పొరపొచ్చాలున్నా  సద్దుకు పోయే సహృదయత ఉండాలి. అలా లేకపోతే నిత్యం గొడవలతో సతమతవమ్వాల్సిందే. అయితే ఆ చిరు గొడవలే చినికి చినికి గాలివానగా మారితే ఏమౌతుందనడానికి సత్యసాయి జిల్లాలో జరిగిన దారుణ ఘటనే ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తుంది.  సత్యసాయి జిల్లా కదిరిలో ఇరుగు పొరుగుల మధ్య వాషింగ్  మిషన్ పెను వివాదానికి దారి తీసింది.   పద్మావతి అనే మహిళ వాషింగ్ మిషన్ ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ  ఆ మిషన్ నుంచి బయటకు వచ్చే నీళ్లు తమ  ఇంటి గుమ్మం మీదుగా వెళుతున్నాయంటూ పొరుగునే ఉన్న వేమన్న కుటుంబం తగవు పడుతూ వస్తోంది. ఆ తగవే చినికి చినికి గాలివానగా మారింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మేమన్న కుటుంబీకులు ఆమెపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అవీ అలాంటిలాంటి రాళ్లు కాదు ఏకంగా బండ రాళ్లతో దాడి చేయడంతో ఆ దాడిలో పద్మావతి తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకూ తరలించారు. అయితే ఫలితం లేకపోయింది. బెంగళూరులోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మాసింది.

కేంద్రంతో కయ్యం వ్యూహాత్మక తప్పిదమా?

ధాన్యం కొనుగోలు వివాదంతో మొదలైన బీజేపీ వర్సెస్ తెరాస, మోడీ వర్సెస్ కేసేఆర్, స్టేట్ వర్సెస్ సెంటర్ తగవు మెల్లిమేల్లిగా మలుపులు తిరిగి చివరకు,ఇదిగో ఇంతవరకు వచ్చింది. ఓ వంక రాజకీయ రచ్చగా మొదలైన వివాదం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల దాడులకు దారి తీసింది. చివరకు ఇప్పుడు న్యాయస్థానాలకు చేరింది. అయితే, ధాన్యం తగవు మొదలు ప్రస్తుత,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వ్యూహాత్మక యుద్ధం దాకా, ప్రతి ఎపిసోడ్’లో పై చేయి సాధించేందుకు ప్రత్యర్ధి పక్షాలు వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నాయి. అయితే ఆదిలో  కేంద్రం వెనకడుగు వేసినట్లే కనిపించినా, కథ అడ్డం తిరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, అధికార తెరాస డిఫెన్సు లో పడుతోందని, జరుగతున్న పరిణామాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ పరిశీలకులు, పేర్కొంటున్నారు. రాజకీయ పరిశీలకులే కాదు తెరాస కీలక నేతలు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్, అనవసరంగా కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి కష్టాలు కొని తెచ్చుకున్నారని అంటున్నారు. ముందుగా ధాన్యం కొనుగోలు విషయమే తీసుకుంటే, గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ ఎంతగా ఉద్యమాలు చేసినా, చివరకు మిగిలింది సున్నకు సున్నా- హళ్లికి హళ్లి. అంతే కాకుండా ఎనిమిదేళ్ళుగా రైతులు పండించే  ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటోందనే  భ్రమల్లో ఉన్న రాష్ట్ర రైతాంగానికి, ధాన్యం కొనుగోలులో రైతులకు చెల్లించే ధాన్యం ధరతో పాటుగా, గోనే సంచులు, హమాలీల కూలీతో సహా ధాన్యం సేకరణకు అయ్యే ప్రతి రూపాయి. ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తోందనే నిజం ఇటు రైతాంగానికి  అటు రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలిసొచ్చింది. అలాగే  కేంద్ర నిదుల కేటాయింపు, రాష్ట్ర అప్పులు  ఇతరత్రా వివాదాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం వాదనలో పసలేదని, ప్రజలకు అర్ధమైంది.   అదొక ఎత్తయితే, ప్రస్తుతం సాగుతున్న కేంద్ర  రాష్ట్ర దర్యాప్తు సంస్థల  ఆధిపత్య పోరులో కేసీఆర్‌ ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) తెలిపోతోంది.  ‘సిట్’ పరిధి దాటి,  బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ మరో ఇద్దరికి సర్వ్ చేసిన మెమో చెల్లదని, ఏసీబీ కోర్టు విస్పష్టంగా చెప్పింది.  అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు పెంచుతున్నాయి. కోర్టులోనూ సిట్‌కు ఎదురుదెబ్బలు తగులుతుండం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాని నరేందర్ మోడీతో  ఎందుకు పెట్టుకున్నామా అన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఫ్యామిలీ టార్గెట్ గా కేంద్ర దర్యాప్తు సంస్థలు సాగిస్తున్న దాడి  రోజురోజుకూ పెరుగుతోంది.  దీని ప్రభావం ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీపైనా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేస్తూ కేంద్రం దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న తీరు ఇటు గులాబీ నేతలతోపాటు అటు వైసీపీ నేతలనూ చికాకు పెడుతోంది. లిక్కర్‌ స్కాంతో మొదలైన మోదీ దాడి.. ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ వరకూ వచ్చేసింది. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా ఇన్నాళ్లూ సేఫ్‌గా వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ నేతలూ ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ను టార్గెట్‌ చేసే క్రమంలో టీఆర్‌ఎస్‌ నేతల చుట్టూ ఉన్న వారి ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌కు ఆర్థికంగా అండ దండలు అందించిన హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మాఫియాతోపాటు ఢిల్లీ లిక్కర్‌ స్కాం సిండికేట్లను కేంద్రం కదిపింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీతో పాటు ఐటీని కూడా ప్రయోగిస్తోంది. ఆయా సంస్థల దాడులతో లిక్కర్‌ స్కాం, రియల్‌ ఎస్టేట్‌ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ నేతల పాత్ర బయటపడుతుండటంతో  ఆ పార్టీ ఇరుకునపడుతోంది, పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్‌ ఎదురు దాడి మార్గం ఎంచుకోవడంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్‌ చేసింది. ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులతో అంటకాగుతున్న వైసీపీ నేతల్నీ వదిలిపెట్టడం లేదు.  దీంతో ప్రధాని, కేంద్రం ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కేసీఆర్‌తో పాటు జగన్‌కూ ముందస్తు హెచ్చరికలు పంపేందుకే ఎవరినీ లెక్కచేయకుండా ఈ దాడులు చేయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీలో పరిస్థితులు మారిపోయి వైసీపీ సైతం బీజేపీకి వ్యతిరేకంగా మారితే ఏం జరుగుతుందనే దానికి ట్రైలర్‌గా తెలంగాణను ఏపీ అధికార పార్టీకి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు..

వీర భక్తితో వింత వింత మొక్కులు మొక్కుకునే వారు చాలా మందే ఉంటారు. రాజకీయ నాయకులు యాగాలు చేస్తారు. ప్రజల సొమ్ముతో.. దేవతలకు, దేవుళ్లకు భారీ కానుకలు సమర్పించుకుంటామనీ మొక్కుకుంటారు. అయితే మొక్కులన్నీ ఒకలా ఉండవు. కొన్ని మొక్కులు తీర్చుకోవడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది. కొన్ని మొక్కులు మొక్కుకున్న వారిని చిక్కుల్లో పడేస్తుంటాయి. దేవుడి ఆగ్రహానికి గురౌతామన్న భయంతో మొక్కులు తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంటారు కొందరు. అయితే అవన్నీ ఒకెత్తయితే.. గుజరాత్ లో ఓ వ్యక్తి మొక్కు చెల్లించుకుంటూ పడిన ఇబ్బందులు మత్రం నెట్టింట నవ్వులు పూయించాయి. ఎరక్కపోయి మొక్కుకున్నావు.. ఇరుక్కు పోయావు బ్రో అంటూ నెటిజన్లు తెగ జోకులు పేలుస్తున్నారు. ఇంత కీ విషయం ఏమిటంటే.. గుజరాత్ లోని ఓ ఆలయంలో చిన్న సైజు ఏనుగు విగ్రహం ఉంది. తన కోరిక తీరిస్తే ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి పాక్కుంటూ వస్తానని మొక్కుకున్నాడో వ్యక్తి. సరే కోరిన కోరిక తీరిందో ఏమో.. మొక్కు తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ ఏనుగు విగ్రహం కింద నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆ విగ్రహం కింద ఇరుక్కు పోయారు. సంగం వరకూ విగ్రహం కింద నుంచి బయటకు వచ్చిన ఆయన కింది భాగం మాత్రం విగ్రహం కింద ఇరుక్కు పోయింద. బయటకు రావడానికి అవకాశం లేకుండా చిక్కుకుపోయాడు.

సిట్ పీఛే ముఢ్?

కేంద్రానికే కాదు.. రాష్ట్రాలకూ దర్యాప్తు సంస్థలున్నాయంటూ గర్జించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చెల్లదంటూ కోర్టు విస్పష్టంగా తేల్చేసింది. మీకు  దర్యాప్తు  సంస్థలు ఉంటే మాకు లేవా అంటూ కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయ యుద్ధాన్ని దర్యాప్తు సంస్థల వరకూ తీసుకు వచ్చిన కేసీఆర్..ఇప్పుడు ఏసీబీ కోర్టు తీర్పుతో కంగు తిన్నారు. ఎమ్మెల్యేల కోనుగోలు బేరసారాల కేసులో సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం దాటి వెళ్లి మరీ దర్యాప్తులో దూకుడు ప్రదర్శించి సంచలనాలు సృష్టిస్తుందని ఆశించిన కేసీఆర్ ఇప్పుడు సిట్ ఉనికే లేకుండా పోయే పరిస్థితి ఎదురు కావడంతో ఏం చేయాలన్న మీమాంసలో పడ్డారు. తెలంగాణలో అదుపులోనికి తీసుకున్న ముగ్గురు వినా తెలంగాణ బయటి వ్యక్తులకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం తప్ప మరేం చేయలేకపోయిన సిట్.. ఇప్పుడు కోర్టు తీర్పుతో అసలీ కేసులో దర్యాప్తు చేయడానికే అర్హత లేని దర్యాప్తు సంస్థగా మారిపోయింది. దీంతో సిట్ ను ఆయుధంగా భావించి కేసీఆర్ కేంద్రంపై మొదలెట్టిన యుద్ధం ఆరంభంలోనే పరాజయం ఎదురైన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏసీబీ కిందకు వస్తాయి. ఆ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను దర్యాప్తు చేయాల్సింది ఏసీబీయే తప్ప సిట్ కాదని కోర్టు స్పష్టం చేసింది.   దీంతో సిట్ ఉనికే ప్రశ్నార్థకం అయింది.  గతంలో రేవంత్ రెడ్డిపై ఇలాంటి కేసే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఓటుకు నోటు కేసు కాబట్టి ఈసీ సెక్షన్ల కింద కేసులు పెట్టాలని రేవంత్ సుప్రీం కోర్టులో   పోరాడుతున్నారు. అప్పుడు రేవంత్ రెడ్డిని ఎలా అయితే స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా పట్టుకున్నారో..ఇప్పుడు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో కూడా కేసులోనూ నిందితులపై ఏసీబీ కేసు పెట్టారు. అయితే అప్పటిలా కాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ సర్కార్   సిట్ ఏర్పాటు చేసింది.  ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయడం చెల్లదని ఏసీబీ కోర్టు చెప్పింది.     ఇప్పుడిక కేసీఆర్ ఏం చేస్తారన్నది చూడాలి.  

ఈ వరుడి తోడి పెళ్లి కొడుకు ఓ కుక్క!

పెళ్లికి వెడుతూ పిల్లిని చంకన పెట్టుకు వెళ్లినట్లు అన్నది సామెత. అయితే ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లికి పెంపుడు కుక్కను వెంట పెట్టుకు వచ్చాడు. పెంపుడు జంతువులపై అపారమైన ప్రేమ ఉండొచ్చు కాదనలేం. తాము ప్రేమగా పెంచుకుంటున్న జంతువును తమతో పాటే తిప్పుకోవాలని ఉంటుంది తప్పుపట్టలేం. అయితే ఎంత ప్రేమగా పెంచుకుంటున్నా జంతువులను ఎక్కడికి తీసుకు వెళ్లాలి, ఎక్కడకు తీసుకు వెళ్లకూడదు అన్న విచక్షణ మాత్రం ఉండి తీరాలి. బస్సులు, రైళ్లలో  పెంపుడు జంతువులను తీసుకువెళ్లడం నిషేధం. వాటిని దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేటప్పుడు బస్సులూ రైళ్లలో కొన్ని నిబంధనలు ఉంటాయి. అలాగే శుభకార్యాలు జరిగే ఇళ్లల్లో వారి పెంపుడు కుక్కలు, పిల్లులు వంటి వాటిని ఆ శుభకార్యం జరిగే ప్రదేశంలోకి రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. అది విధాయకం. ఎంత ప్రేమగా పెంచుకుంటున్నా జంతువుల వద్దకు వచ్చే సరికి మనుషులతో సమానంగా వాటికి స్థానం కల్పించే విషయంలో ఒకిన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సహజం కానీ మధ్య ప్రదేశ్ లో ఓ వరుడు ఏకంగా పెళ్లి మంటపానికి తన పెంపుడు కుక్కతో వచ్చాడు. సాధారణంగా కారులోనో.. లేదా వారి వారి సంప్రదాయల ప్రకారం పళ్లకిలోనో, గుర్రంపైనో వరుడు కల్యాణ మంటపానికి రావడం సహజం. అయితే ఈ వరుడు మాత్రం బైక్ పై అదీ తన పెంపుడు శునకంతో సహా వచ్చేశాడు. అతడి పైత్యం అక్కడితో ఆగలేదు. తన పెళ్లికి తాను కొత్త బట్టలు ధరించి రావడమే కాకుండా.. తన తోడు పెళ్లి కొడుకు కుక్కేనంటూ దానికి కూడా కొత్త బట్టలు తొడిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో పాటు.. ఇదే పని బ్రో ఎంత పెంపుడు కుక్కపై ప్రేమ ఉన్నా ఇలా పెళ్లి మంటపానికి తోడ్కోని రావడం ఎబ్బెట్టుగా ఉందంటూ విమర్శలూ చేశారు.

వైసీపీలో రోజాకు పొమ్మనలేక పొగ?

మంత్రి రోజా అంటే ఫైర్ బ్రాండ్. నోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే.  జగన్ తొలి క్యాబినెట్ లో రోజాకు స్థానం దక్కకపోవడానికీ, మలి క్యాబినెట్ లో చోటు దొరకడానికీ కూడా ఆమె  డైనమిజమే కారణం అంటారు. అయితే తన చిరకాల వాంఛ నెరవేరిన తరువాత అంటే  మంత్రి పదవి చేపట్టిన తరువాత పార్టీలో ఆమెకు అడుగడుగునా పరాభవాలే ఎదురౌతున్నాయి. కనీసం ప్రోటోకాల్ ప్రకారం గౌరవం కూడా ఆమెకు దక్కడం లేదు. తాజాగా తిరుపతిలో రాష్ట్రపతి పర్యటనలో రోజాకు పరాభవం ఎదురైంది. రాష్ట్రపతి పర్యటనలో జిల్లా మంత్రి హోదాలో రోజా పాల్గొన్నా ఆమెను పట్టించుకున్న వారెవరూ లేకుండా పోయారు.ట. ఎక్కడా ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ప్రోటోకాల్ ప్రకారం.. రాష్ట్రపతికి జిల్లా మంత్రి స్వాగతం చెప్పాలి. పెద్దిరెడ్డి కూడా మంత్రే. అయినప్పటికీ ఇద్దరూ స్వాగతం చెప్పే వారిలో ఉండాలి. కానీ రోజాకు చాన్స్ రాలేదు. తర్వాత కార్యక్రమంలో వేదికపై చోటు కూడా దక్కలేదు. మహిళా రాష్ట్రపతి వస్తే మహిళా మంత్రికి స్టేజ్‌పై చోటు దక్కలేదు.   కనీసం ఎక్కడా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక రాష్ట్రపతికి వీడ్కోలు పలికే సమయంలోనూ ఆమెకు ఎలాంటి ప్రాధాన్యతా దక్కలేదు. అంటే మంత్రి హోదాలో ఉన్నా కూడా అధికారులు కూడా ఆమెను పూర్తిగా విస్మరించారనే భావించాల్సి వస్తోంది.  మామూలుగా ప్రోటోకాల్.. ఇతర వ్యవహారాలు అన్నీ.. రాష్ట్రపతి సిబ్బంది చూసుకుంటారు..  కానీ రాష్ట్ర అధికారులు ఇచ్చే జాబితా ప్రకారమే రాష్ట్రపతి సిబ్బంది ఆ విషయాలను ఖరారు చేస్తారు. అధికారులు ఆ జాబితాలో రోజాకు స్థానం కల్పించలేదు. దీంతో రాష్ట్రపతి సిబ్బంది ఆమెను పట్టించుకోలేదు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రోజాకు జరిగిన అవమానంపై ఆమె వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ప్రభుత్వంలో రోజాకు సరైన గౌరవం లభించడం లేదనీ, మంత్రి అయినప్పటికీ సొంత నియోజ కవర్గంలో కూడా  ఆమె ప్రత్యర్థి వర్గాన్ని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నదనీ, రోజాను నిర్లక్ష్యం చేస్తున్నారనీ అంటున్నారు. మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి.. గౌరవం దక్కకుండా చేస్తున్నారంటున్నారు.  ఈ విషయాలన్నిటినీ రోజా  జగన్ దగ్గర మొర పెట్టుకున్నా.. ఫలితం లేకపోయిందని చెబుతున్నారు. పరిస్థితి చూస్తుంటే రోజాకు పొమ్మనలేక పొగబెడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. 

రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం ?

బుధవారం (డిసెంబర్ 7)   నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజున  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఆ మరుసటి రోజే అంటే.. గురువారం(డిసెంబర్ 8) హిమచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితాలు కూడా వెలువడతాయి. ఇప్పటికే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో బుధ,గురు వారాలలో ఏమి జరుగుతుంది? అనే చర్చ  రాజకీయ వర్గాల్లో మొదలైంది. నిజానికి రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు  అంటే సరే, కానీ వీటిని 2024 ఎన్నికలకు సెమి ఫైనల్ గా భావిస్తున్నారు కాబట్టి  అదీ కాకున్నా,గుజరాత్ ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడం వలన   కూడా ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరగడాన్ని  అర్థం చేసుకోవచ్చును. కానీ పార్లమెంట్ సమావేశాల విషయంగా కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగగుతోంది.  ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి రెండు రోజులముందు ( ఆదివారం)  కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది  భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత  రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఇది కొంత వరకు ఉహించిందే  రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7 న యాత్ర ప్రారంభించినప్పటి నుంచి  యాత్ర మీదనే పూర్తిగా దృష్టి పెట్టారు. విలేకరుల సమావేశాల్లో మాట్లాడుతున్న సమయంలోనూ  యాత్ర ..నథింగ్ బట్ యాత్ర .. అన్నట్లుగా భారత్ జోడో యాత్రకు సంబందించిన విషయాలు మినహా మిగిలిన ఏ విషయాన్ని టచ్  చేయడం లేదు. విలేకరులు ఇతర విషయాలు ప్రస్తావించినా సారీ, అనేస్తున్నారు. సో .. రాహుల్ గాంధీ పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరు కాకపోవడం ఒక విధంగా ముందు నుంచి ఉహించిందే.  అయితే  భారత్ జోడో యాత్ర పేరున రాహుల్ గాంధీ  రాజకీయాలకు దూరం అవుతున్నారా? ఒక గౌరవప్రదమైన రాజకీయ నిష్క్రమణ కోరుకుంటున్నారా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ యాత్ర లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాదని, కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కావచ్చు, రాహుల్ యాత్ర ప్రధాన లక్ష్యం ఎన్నికల ప్రయోజనాలు కాకపోవచ్చును, కానీ, ఒక రాజకీయ పార్టీ అధ్వర్యంలో  ఒక రాజకీయ నాయకుడు చేపట్టిన యాత్ర  ప్రత్యక్షంగా కాకున్నా  పరోక్షంగా అయినా రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. ఉదాహరణకు అద్వానీ చేపట్టిన రామజన్మ భూమి రథయాత్ర లక్ష్యం కూడా  అయోధ్యలో రామ మందిర నిర్మాణమే కానీ  బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కాదు. కానీ అద్వానీ రథ యాత్ర ద్వారానే బీజేపీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది.  ఈ రోజు కేంద్రంలో సగానికి పైగా రాష్ట్రాలలో అధికారంలో వుంది.  కానీ, రాహుల్ ధోరణి అందుకు భిన్నంగా వుంది. రాహుల్ యాత్ర నడుస్తున్న సమయంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయినా రాహుల్ గాంధీ ఆ ఎన్నికలకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. గుజరాత్ లో ఒకటి రెండు రోజులు మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొన్నారు. హిమాచల్ లో అదీ లేదు. తెలంగాణలో యాత్ర సాగుతున్న సమయంలోనే మునుగోడు  ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. అయిన రాహుల్ గాంధీ  మునుగోడు ఫలితంపై ఒక్క ముక్క మాట్లాడ లేదు.  అలాగే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలోనూ కాంగ్రెస్ ఓటమి ఇంచుమించుగా ఖరారైనట్లే కనిపిస్తోంది. సరే ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం కానీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ఎన్నికల రాజకీయాల పట్ల నిరాసక్తత చూపడం దేనికి సంకేతం... ఇదే ప్రశ్న కాంగ్రెస్ నాయకులను వెంటాడుతోంది.. రాహుల్ గాంధీ రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది.  అదొకటి అలా ఉంటే రాహుల్ యాత్రకు కొనసాగింపుగా ప్రియాంకా వాద్రా మహిళా మార్చ్’ పేరిట జనవరి నుంచి మహిళా జోడో యాత్ర ప్రారంభిస్తున్నారు. నిజానికి, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా కదులు తున్నారు. ఇది కూడా రాహుల్ రాజకీయ సన్యాసానికి సంకేతమా అనే అనుమానాలు  వ్యక్తం కావడానికి కారణమౌతున్నాయి.

జగన్ తో ఎక్కడ చెడింది.. మోహన్ బాబు కల ఎలా చెదిరింది?

నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ఒకప్పుడు తెలుగుదేశంలో ఒక వెలుగు వెలిగారు. ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కూడా పొందారు. ఆ తరువాత కారణాలేమైతేనేం.. తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. కొంత కాలం రాజకీయాలకు దూరంగా  ఉన్నా.. ఆ తరువాత వైసీపీ గూటికి చేరారు. చేరడం చేరడంతోనే ఆ పార్టీకి లబ్ధి చేకూర్చేందుకే అరహరం పాటుపడ్డారు. గత ఎన్నికలకు ముందు తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి తిరుపతిలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదంటూ తన కుమారుతలో కలిసి రోడ్డెక్కారు. ఏమైతేనేం.. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసీపీలో చాలా చాలా చురుకుగా.. ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీస్ పృధ్వీ, కమేడియన్ అలీ, నటుడు పోసానిలతో సమానంగా కష్టపడ్డారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎం అయ్యారు. అప్పటి నుంచీ మోహన్ బాబు తనకు ఏదో ఒక పదవి వస్తుందన్న ఆశతోనే గడిపారు. కానీ మొట్టమొదట థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి జగన్ పదవి కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ పదవిని కట్టబెట్టారు కానీ అది పృధ్వికి మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఒక మహిళకు ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఆ తరువాత పృధ్వీ ముఖం చూసినా వారే వైసీపీలో లేకుండా పోయారు. ఇక తరువాత అలీ, పోసానిల వంతు వచ్చింది. ఏళ్ల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన వారికి మూడేళ్ల తరువాత ఇక తప్పదన్నట్లుగా రెండు సలహాదారు పోస్టులు కట్టబెట్టి జగన్ చేతులు దులుపుకున్నారు. వారితో పాటే గాయని మంగ్లీకీ ఎస్వీబీసీలో ఓ పోస్టు పందేరం చేశారు. కానీ వారందరి కంటే ఎవరు ఔనన్నా కాదన్నా ఓ స్థాయి పైనున్న మోహన్ బాబును మాత్రం  జగన్ పట్టించుకోలేదు.  గత ఎన్నికల సమయంలో సీఎం వైయస్ జగన్‌కు బాసటగా ఉండి..  ప్రచారం చేసిన మోహన్ బాబుకు మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో సీఎం వైయస్ జగన్‌ వ్యవహారశైలిపై మంచు ఫ్యామిలీలో అసంతృప్తి పీక్స్ చేరిందని, దాని పర్యవసానమే సామాజిక మాధ్యమంలో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సెటైరికల్ పంచ్ అని అంటున్నారు.   అటు పరిశ్రమలోనూ, ఇటు పార్టీలోనూ కూడా మోహన్ బాబు ఎవరికీ పట్టని వ్యక్తిగా మిగిలిపోవడం ఆయన స్వయంకృతాపరాధమే అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మోహన్ బాబు తన కుమార్తె మంచు లక్ష్మితో కలిసి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అప్పట్లో ఇది రాజకీయంగా ఒకింత సంచలనం రేకెత్తించినా..  చిత్తూరు జిల్లాలోని తన కాలేజీలో షిర్డి సాయి విగ్రహ ప్రతిష్టకు చంద్రబాబును ఆహ్వానించడానికే ఆయన ఇంటికి వెళ్లినట్లు మోహన్ బాబు చెప్పి రాజకీయ ఊహాగాన సభలకు తెరదించడానికి ప్రయత్నించారు. మంచు విష్ణుకు సీఎం వైయస్ జగన్ సమీప బంధువుని... ఈ నేపథ్యంలో ఆయన అధికారంలోకి వస్తే.. టీటీడీ చైర్మన్ లాంటి పదవి కోసం మోహన్ బాబు ఆశించారనీ, కానీ చైర్మన్ పదవి కాదు కదా.. కనీసం సలహాదారు పదవి కూడా దక్కలేదన్న దుగ్ధ మోహన్ బాబులో పేరుకుపోయిందని ఆయన సన్నిహితులు అంటున్నారు.   

ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు.. జగన్ కు రఘురామ ప్రతిపాదన

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలంతా రాజీనామాలు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు అన్నారు. ఇందుకోసం తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్న ఆయన వైసీపీ ఎంపీలందరి చేతా జగన్ రాజీనామాలు చేయిస్తే.. తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను బతిమాలి తాను రాజీనామాకు ఒప్పిస్తానని రఘురామ అన్నారు. రచ్చబండలో మాట్లాడిన ఆయన 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధనే లక్ష్యమని చెప్పిన జగన్ అధికారం చేపట్టిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తే ప్రజల ఆసహ్యించకుంటారన్నారు. ఎప్పుడో జరిగిన శ్రీ భాగ ఒప్పందం గురించి మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించడమంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు.  జగన్ ఏది చెబుతారో అది చేయరనడానికి తాజా ఉదాహరణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన అని అన్నారు. ఎన్నికలకు ముందు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తానని వాగ్దానం చేసిన జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత వారిని తొలగించడం దారుణమన్నారు.   కర్నూలు వేదికగా సోమవారం (డిసెంబర్ 5) జరిగిన రాయలసీమ గర్జన సభ జంధ్యాల సినిమాను మించిన హాస్యరసం ఒలికించిందని రఘురామ అన్నారు.  కర్నూలు గర్జన సభకు జనసమీకరణ కోసం వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి బెదరించినా ఎవరూ రాలేదన్నారు.  కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులో మాత్రం హైకోర్టు ఏర్పాటుపై మాట మార్చిందని గుర్తు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని నివేదించారని పేర్కొన్నారు. ఒకవైపు సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయబోమని చెబుతూనే, మరొకవైపు రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కర్నూలులోనే హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.  

దేశంలోనే ఏపీ ఫస్ట్.. ఎందులోనో తెలుసా?

జగన్ పాలనలో అన్ని రంగాలలోనూ ఆంధ్రప్రదేశ్ అధమ స్థానంలోకి పడిపోయింది. అక్షర క్రమంలోనే తప్ప మరెందులోనూ ఏపీ ప్రథమ స్థానంలో లేదు సరికదా.. కింది నుంచి మొదటి స్థానం కోసం బీహార్ వంటి రాష్ట్రాలలో పోటీ పడుతోంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఏపీ దేశంలో మిగతా ఏ రాష్ట్రమూ కనీసం పోటీ కూడా పడలేనంత పురోభివృద్ధి సాధించింది. అయితే ప్రభుత్వం మాత్రం ఎందుకో ఈ అభివృద్ధిని ప్రచారం చేసుకోవడం లేదు సరికదా.. కనీసం తలచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దాచేద్దామంటే ఏదీ దాగదు కదా.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఏపీ సాధించిన పురోభివృద్ధిని బట్టబయలు చేసింది. ఇంతకీ జగన్ పాలనలో మూడున్నరేళ్లలోనే ఆంధ్రప్రదేశ్ ఎందులో కనీవినీ అభివృద్ధి సాధించిందని ఆలోచిస్తున్నారా? అంత శ్రమ వద్దు.. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని తాజాగా విడుదల చేసిన స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదికలో చెప్పారు. స్మగ్లింగ్ ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సాధారణంగా డ్రగ్స్ అనగానే ఎవరికైనా గోవా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేష్. ఇక్కడికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అందుకని సహజంగానే డ్రగ్స్ విషయంలో గోవా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అక్కడా డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ మూడేళ్లలో స్మగ్లింగ్ విషయంలో గోవాను మించిపోయింది. స్మగ్లింగ్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం 2021-22 దేశం మొత్తంలోనే అత్యధికంగా 18, 267 కిలోల డ్రగ్స్ స్వీధీనం అయ్యాయి. ఇది దొరికిన డ్రగ్స్ మాత్రమే. దొరకకుండా రాష్ట్రం ఎల్లలు దాటిపోయినా, లేదా రాష్ట్రంలోని యువత వినియోగించేసిన మాదక ద్రవ్యాల సంగతేమిటనే ప్రశ్నకు ఎవరూ బదులు చెప్పలేరు. మొత్తం మీద కేంద్ర ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం డ్రగ్స్ సంబంధిత కేసుల్లో ఏపీలో 90 మందిని అరెస్టు చేశారు. తొలి స్థానంలో ఉన్న ఏపీలో ఏకంగా 18 వేల 267 కిలోల డ్రగ్స్ స్వాధీనమైతే, పొరుగున ఉన్న తెలంగాణలో  2021-22లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కేవలం 830 కిలోలు మాత్రమే. దీనిని బట్టే డ్రగ్స్ వ్యవహారంలో ఏపీ సాధించిన పురోగతి ఎంత ఘనంగా ఉందో ఇట్టే చెప్పేయవచ్చు. అక్కడితో ఆగిపోలేదే.. ఆ నివేదిక ప్రకారం దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా అందుకు సంబంధించిన లింకులు ఏపీలో ఉంటున్నాయి. ఇక గంజాయి విషయానికి వస్తే ఏపీలోని విశాఖ మన్యం ప్రాంతం నుంచి హస్తిన వరకూ గంజాయి స్మగ్లింగ్ సాగుతోంది. పలు సందర్భాలలో పెద్ద  ఎత్తున పట్టుబడి గంజాయి స్మగ్లింగ్ వాహనాలన్నీ ఇదే విషయాన్ని అప్పట్లోనే తేటతెల్లం చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల పోలీసులూ కూడా తమ రాష్ట్రానికి గంజాయి ఏపీ నుంచే వస్తోందని నిర్ధారించేశారు.  మరి ఇంకా జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనే అధోగతికి చేర్చాశారనే అందామా.. లేక అన్ని విధాలుగానూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన జగన్ పాలన ఒక్క డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో మాత్రం దేశంలోని మరే ఇతర రాష్ట్రం అందుకోలేనంత ఎత్తున నిలబెట్టాడని చెప్పుకుందామా? 

రాజకీయాల్లో పవన్ ఎందుకు ఫెయిలయ్యారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాలలో మాత్రం రాణించ లేక పోతున్నారు. కొంచెం ఆలస్యంగానే అయినా  ఆయనే ఆ నిజాన్ని అంగీకరించారు. రాజకీయాల్లో  తాను ‘ఫెయిల్’ అయ్యానని అయినా, రాజకీయాలను వదిలి వెళ్లనని, పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు. బాగుంది కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఎందుకు రాణించలేక పోతున్నారు? ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? లోపం ఎక్కడ వుంది? అంటే, అందుకు కర్ణుడి చావుకు ఉన్నన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును, ఉండవచ్చును కాదు  ఉన్నాయి.   కానీ ఆయన ఫెయిల్యూర్ కు ఒక ప్రధాన కారణం మాత్రం ఆయన చేస్తున్న జోడు పడవల ప్రయాణం. ఇటు సినిమాల్లో, అటు రాజకేయాల్లో ఇటో కాలు అటో కాలు అన్నట్లు ప్రయాణం చేయడం వలన సామాన్య జనం ఆయన్ని ఇంకా సినిమా హీరోగా చూస్తున్నారే తప్ప సీరియస్ పొలిటికల్ స్టార్ గా గుర్తించడం లేదు. అందుకే  ఆయన మీటింగులకు వస్తున్నారు. చూస్తున్నారు. ఆయన చెప్పే డైలాగు వింటున్నారు చప్పట్లు కొడుతున్నారు. సినిమా చూసినట్లు చూస్తున్నారు. వెళుతున్నారు. అంతే తప్ప ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తించడంలేదు. అందుకే  ఆయన రాజకీయాల్లో రాణించ లేక పోతున్నారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా ఆయనకున్న హీరో ఇమేజే రాజకీయాల్లో ఆయన జీరో ఇమేజ్ కి కారణం అవుతోందని విశేషకులు అంటున్నారు.  అయితే సినిమాలు వదులు కునేందుకు పవన్ కళ్యాణ్  సిద్ధంగా లేరు. అలాగని అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాలకు చుక్క పెట్టి  సినిమాలకు పరిమితయ్యే ఆలోచన కూడా పవన కళ్యాణ్ కు లేదు. చిరంజీవి రాజకీయాలు వదిలేసినా  రాజకీయాలు ఆయన్ని వదలడం లేదు (సినిమాలో కాదు నిజంగానే)  అలాగే  పవన్ కళ్యాణ్ కు అదో ఇదో ఏదో ఒకటి వదిలించుకునే ఆలోచన వుందో లేదో కానీ, అటు రాజకీయాలు, ఇటు సినిమాలు రెండూ కూడా పవన్ కళ్యాణ్ ను వదలడం లేదని ఆయన సన్నిహితులు, అభిమానులు అంటున్నారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి  కానీ, పవన్ కళ్యాణ్ ఏదీ వదులుకునే పరిస్థితిలో లేరు. సినిమాలు వదులు కుంటే పార్టీ నడవదు. రాజకీయాలు వదులు కుంటే, చిరంజీవి అన్నయ్యలా, ఇంచక్కా చిందులు, విందులలో మునిగి తెల వచ్చును. కానీ, పవన్ కళ్యాణ్ ఇంకా  అందుకు సిద్దం అయినట్లు లేరు.అదలా ఉంటే  ఓ వంక ఏపీలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్దమవుతున్నాయి. అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు  జిల్లాలో పర్యటిస్తున్నారు. జనం బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. ఆయన పరుగుల్లో ఆయనున్నారు.  మరోవంక టీడీపీ యువనాయకుడు లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. చివరకు స్టేట్ పాలిటిక్స్ లో స్టేక్ లేని బీజేపీ , కాంగ్రెస్, వామ పక్ష పార్టీలు కూడా ఏంతో కొంత హడావిడి చేస్తున్నాయి.  ఆలాగని  జనసేన ఏమీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చుందని కాదు కానీ, సర్వం తానైన పవన్ కళ్యాణ్  ఏ మేరకు పార్టీకి సమయం ఇవ్వగలరు అనేదే ఇప్పుడు జన సైనికుల ముందున్న ప్రశ్న.  నిజానికి జనసేన ప్రచార రథాలు ఇంచుమించుగా సంవత్సరం క్రితమే సిద్ధమయ్యాయి. జిల్లాల్లో ప్రచారం కోసం బయలుదేరి వెళ్ళాయి, కానీ, ప్రచారం మాత్రం అంతగా పట్టాలు ఎక్కలేదు. మరోవంక జనవరి 2023 నుంచి, పవన్ కళ్యాణ్ బస్సుయాత్ర  ప్లాన్ చేసుకున్నారు. బస్సు కూడా రెడీ అయింది.అయితే, పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ఎంత వరకు డేట్స్ ఇవ్వగలరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరసగా వస్తున్న సినిమా ప్రకటనలు గమనిస్తే, ఎన్నికల చివరి సంవత్సరంలో అయినా పవన్ కళ్యాణ్ పార్టీకి సమయం కేటాయించగలరా అనేది అనుమానంగానే ఉందని అంటున్నారు.  ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత వెంటనే మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటారని ఆయా సినిమాల రూపకర్తలు ప్రకటించారు. సుజిత్ డైరక్షన్‌లో ఓ సినిమాను కొత్తగా ఎనౌన్స్ చేయగా.. గతంలోనే ప్రకటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా కూడా వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని.. హరీష్ శంకరే ప్రకటించారు. ఎలా లేదన్నా ఒక్క సినిమా షూటింగ్‌కు కనీసం నాలుగు నెలలు పడుతుంది. మరి కొన్ని కమిట్ మెంట్స్ కూడా ఉన్నాయి.ఇవ్వన్నీ అయ్యే సరికి పుణ్యకాలం పూర్తయి ఎన్నికల రానే వస్తాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్  బస్సు యాత్ర మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఒకటి రెండు సార్లు వాయిదా పడిన బస్సు యాత్ర అనుకున్నవిధంగా జనవరిలో మొదలవుతుందా? మొదలైనా, నిరాటంకంగా జరుగుతుందా, షూటింగుల మధ్యలో, ‘గ్యాప్’ యాత్రలు చేస్తారా అన్నదానిపై ఇప్పటికే స్పష్ట్టత లేదు. సో.. పవన్ కళ్యాణ్  రాజకీయాల్లో ఎందుకు రాణించలేక పోతున్నారో, ఎందుకు ఫెయిల్ అయ్యారో అర్థమైంది. కానీ, ఆయన సినిమాలు చేయకపోతే, రాజకీయం చేయలేరు, సినిమాలు చేస్తే రాజకీయాలలో రాణించలేరు, పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు.. పిచ్చి కుదిరితే గానీ, పెళ్లి కాదు.  పీకేది ..అదే .. అదే డైలమా ...

ఆప్ ఆశలు గల్లంతు.. కాంగ్రెస్ కు నిరాశ..

హిమాచల ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి  జాతీయ స్థాయిలో హస్తం పార్టీ పై  పైచేయి సాధించాలని, ఆశలు పెంచుకున్న ఆప్(ఆమ్ ఆద్మీపార్టీ) కలలు కల్లలయ్యాయి. ఆప్  ఆశలపై ఎగ్జిట్ ఫలితాలు నీళ్లు చల్లాయి. ఆప్  అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆశలు  ఎగ్జిట్  లో కొట్టుకు పోయాయి. అయితే, ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్  బీజేపీకి గట్టిగా జెల్ల కొట్టింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వమున్నా 15 ఏళ్లుగా, ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఎంసీడీ) పై ఎగురుతున్న కాషాయ జెండాను, ఆప్   చీపురు దించేసింది. ఊడ్చేసింది. అయితే  ఇవి ఎగ్జిట్  ఫలితాలే, ‘అంతిమ’ తీర్పుకు ఇంకా సమయముంది ... ఢిల్లీ ఫలితాలు  బుధవారం(డిసెంబర్ 7) హిమాచల్, గుజరాత్ ఫలితాలు గురవారం(డిసెంబర్ 8) వెలువడతాయి.  అప్పుడు గానీ  అసలు కథ బయటకు రాదు. రాజెవరో రెడ్డెవరో తెలియదు. అయితే  ఎగ్జిట్ ఫలితాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయనే అభిప్రాయమే రాజకీయ విశ్లేషణలలో వినిపిస్తోంది.  అంకెల్లో స్వల్ప తేడాలున్నా గెలుపు ఓటముల విషయంలో మాత్రం ఇంచుమించుగా అన్ని ఛానల్స్, అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ ఫలితాలు ఒకేలా ఉన్నాయి. సో .. సీట్ల సంఖ్యలో  తేడాలున్నా  ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్  లో ఆప్ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.  అలాగే, గుజరాత్ లో వరసగా  ఏడవ సారి బీజేపీ అధికారం కైవసం చేసుకోవడం కూడా ఖరారైనట్లే ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే, హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య, నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్నట్లుగా కనిపించినా  పోల్ అఫ్ పోల్  లో బీజేపీవైపే హిమాచల్   ఓటరు మొగ్గు చూపుతున్నట్లు ఎగ్జిట్ ఫలితాలు సూచిస్తున్నాయి.  నిజానికి, గుజరాత్ లో కంటే హిమాచల్  పైనే కాంగ్రెస్ గట్టి ఆశలు పెట్టుకుంది. బీజేపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో పాటుగా, ఏ పార్టీకి వరసగా రెండవసారి అధికారం ఇవ్వని  ఆనవాయితీ మీద హస్తం పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుంది. అయితే, హిమాచల్  ఓటర్లు ఈసారి ఆనవాయితీకి భిన్నగా వరసగా రెండవ సారి బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చారని  ఎగ్జిట్  ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళ అస్సాం, ఉత్తరాఖండ్  బాటలోనే హిమాచల్  ప్రదేశ్  ఓటర్లు కూడా ఆనవాయితీకి భిన్నంగా అధికార పార్టీకి సెకండ్ ఛాన్స్  ఇచ్చారని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి.  68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 38 స్థానాలతో మెజారిటీని నిలుపుకుంటుందని, పోల్ అఫ్ పోల్ సర్వే తెలిపింది. హిమాచల్ అసెంబ్లీకి మెజారిటీ మార్క్ 35 (మ్యాజిక్ ఫిగర్).  తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని  టైమ్స్ నౌ అంచనా వేసింది. ఇక హిమాలయ రాజ్యంలో తొలిసారిగా అడుగుపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిందని వెల్లడించింది. ఆ పార్టీ ఇక్కడ ఖాతా కూడా తెరవదని పేర్కొంది.  ఇతరులకు 2 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92 . వివిధ ఎగ్జిట్ పోల్స్’లో  బీజేపీ 110 నుంచి 15౦ సీట్ల వరకు పొందే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ రాష్ట్రాలలో ఆప్  కాంగ్రెస్ పార్టీని అధిగమించక పోయినా, కాంగ్రెస్  ను ఓడించడంలో  మాత్రం కీలక పాత్రను పోషించింది. ముఖ్యంగా, గుజరాత్ లో ముస్లిం ఓటు బ్యాంకు  కాంగ్రెస్ ఖాతా నుంచి ఆప్  ఖాతాలోకి ట్రాన్స్ఫరైందని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. అన్నటికంటే ముఖ్యంగా హిమాచల్, గుజరాత్, ఢిల్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నిమరోమారు నిరాశకు గురిచేశాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.ముఖ్యంగా రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్ర ప్రభావం కానీ, పార్టీ నాయకత్వ మార్పు ప్రభావం కానీ, ఈ ఎన్నికలలో ఏ మాత్రం కనిపించలేదని పరిశీలకులు అంటున్నారు. అలాగే, ఈ ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరిగే, కర్ణాటక,మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ ఫలితాల్తో పాటుగా, 2024 సార్వత్రిక ఎన్నికలపై కూడా ఉంటుందని అంటున్నారు.

షర్మిలకు మోడీ పిలుపు.. తెలంగాణ రాజకీయాలలో పెను కుదుపు

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు మోడీ నుంచి పిలుపు అందింది. ఢిల్లీ రావాల్సిందిగా ప్రధాని  ఆమెను ఆహ్వానించారు. స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి మరీ మోడీ ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ షర్మిలతో దాదాపు పది నిముషాల సేపు ఫోన్ లో మాట్లాడారని సమాచారం. ఇప్పటికే షర్మిల తెలంగాణ రాజకీయాలలో విస్మరించరాని శక్తిగా ఎదిగారు. ఏడాదికి పైగా రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసినా, తెరాసపై, తెరాస అధినాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, చివరాఖరికి హస్తిన వెళ్లి మరీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేసినా రాని గుర్తింపు.. ఆమెను అరెస్టు చేసిన తీరుతో ఒక్కసారిగా వచ్చేసింది. వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రపై రాళ్ల దాడి, కార్ వ్యాన్ దగ్ధం సంఘటనలు, ఆనంతరం హైదరాబాద్ లో  ఆమె తన కారులో ఉండగానే టోయింగ్ చేసి మరీ పోలీసు స్టేషన్ కు తరలించడంతో ఒక్కసారిగా షర్మిల పొలిటికల్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల నుంచీ ఆమెకు మద్దతు లభించింది. ఆమె అరెస్టు ఎఫెక్ట్ తెరాస సర్కార్ ప్రతిష్టను మసకబార్చింది. అంతే కాకుండా ఆమె అన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు కూడా తాకింది. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం (డిసెంబర్5) ఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సు సన్నాహక సమావేశానికి హాజరైన జగన్ ను సొంత చెల్లెలి అరెస్టుపై ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. సమాధానం చెప్పలేక, సమర్ధించుకోలేక జగన్ నీళ్లునమిలిన సంగతి విదితమే. ఆ సందర్భంగా మోడీ షర్మిలను అరెస్టు చేసిన తీరు తనకు ఎంతో బాధకలిగించిందన్నారు. తోడబుట్టిన సోదరుడిగా మీరెందుకు స్పందించలేదని జగన్ ను ప్రశ్నించారు.  ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోనే ప్రధాని స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి హస్తినకు ఆహ్వానించారు. ఆమె అరెస్టు తీరును ఖండించి, ఆమెకు మద్దతు ప్రకటించారు.  ధైర్యంగా ఉండాలని చెప్పారు.   తనకు మద్దతు తెలిపి, పరామర్శించిన ప్రధానికి షర్మిల ఈ సందర్బంగా  ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చి కలుస్తానని చెప్పారు. మొత్తం మీద షర్మిలకు మోడీ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించడం, ఢిల్లీకి ఆహ్వానించడం తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

వల్లభనేని వంశి, దేవినేని అవినాశ్ నివాసాలపై ఐటీ దాడులు

వైసీపీ నేతల నివాసాలపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం (డిసెంబర్6) ఉదయం నుంచే వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ నివాసాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ దాడులకు హైదరాబాద్ లింకులు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు, దాడులు కలకలం సృష్టిస్తున్న సంగతి విదితమే. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం, మరో వైపు చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో వ్యవహారం, ఇంకో వైపు పన్నుల ఎగవేత.. ఇలా వేరు వేరు కారణాలతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీలు తెలుగు రాష్ట్రాలపై వరుస దాడులతో రాజకీయ వేత్తల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. తాజాగా వైసీపీ నాయకుడు, బెజవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాశ్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి నివాసాలపై మంగళవారం ఉదయం నుంచీ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో దేవినేని అవినాశ్ కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఆ ఒప్పందంలో  భాగంగా జరిగిన లావాదేవీలపైనే  ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ కార్యాలయం, ఆ సంస్థ చైర్మన్ సుబ్బారెడ్డి బావమరిది,  డైరెక్టర్ జనార్ధన్‌రెడ్డి  నివాసాలలో   ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తంగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో  36 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.