పొత్తులపై జనసేన పరస్పర విరుద్ధ ప్రకటనలు
posted on Dec 12, 2022 @ 3:24PM
జనసేన.. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని ఈ పార్టీ ఏపీ రాజకీయాలలో కీలకంగా మారింది. సొంతంగా పోటీ చేస్తే విజయం సంగతి ఎలా ఉన్నా..ఇతర పార్టీల గెలుపు ఓటములను మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో పొత్తుల చర్చకు తెరతీసిన జనసేనాని పవన్ కల్యాణ్.. ఆ తరువాత మాత్రం పొత్తుల విషయంపై మాట్లాడకుండా.. రాష్ట్రంలో ఒంటరి ప్రయాణమంటూ సంకేతాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.
ఒక వైపు బీజేపీతో మైత్రి ఉన్నా జనసేనాని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇక బీజేపీ హైకమాండ్ పలు సందర్భాలలో పవన్ ను విస్మరించినా.. ఇటీవల విశాఖ సంఘటనల తరువాత మాత్రం ఆయనకు ఒకింత ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ పై చార్జిషీట్ తయారు చేయాలంటూ విశాఖ పర్యటన సందర్భంగా మోడీ రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ఆదేశించడంతో వచ్చే ఎన్నికలలో ఏపీలో త్రిముఖ పోటీకి రంగం సిద్ధమౌతోందా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. అదే జరిగితే పార్టీల గెలుపోటములపై పలు విశ్లేషణలూ వెల్లువెత్తాయి. మొత్తం మీద ఏపీ రాజకీయాలలో జనసేన కీలకం కానున్నదనే రాజకీయవర్గాలు అంచనా వేస్తూ వచ్చాయి.
అయితే మొత్తంగా జనసేన రాజకీయ ప్రస్థానం మాత్రం పవన్ కల్యాణ్ ‘మూడ్’ కు అనుగుణంగానే సాగుతోంది. అయితే సామాన్య జనం మాత్రం ఆయనను ఇంకా సినిమా హీరోగానే చూస్తున్నారు తప్ప పరిపూర్ణ రాజకీయ నేతగా గుర్తించడం లేదు. ఇందుకు ఆయన సినిమాలకు అగ్ర ప్రాధాన్యత ఇచ్చి.. రాజకీయాలను ఇప్పటికీ పార్ట్ టైమ్ గానే చూస్తున్న తీరే కారణమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. ఒక సారి ఆయన అధికారమే లక్ష్యం అంటారు.. మరో సారి ప్రశ్నించే పార్టీగా జనసేన ఉంటుంది.. అధికారమే పరమావధి అంటారు. తన షెడ్యూల్ ప్రకారమే ప్రజా జీవితాన్ని కొనసాగిస్తున్న తీరు ప్రజలలో ఒక సంపూర్ణ ప్రజా నాయకుడిగా, రాజకీయ నాయకుడిగా గుర్తింపు విషయంలో పవన్ కు విషయంలో ఆయన రెండు పడవల మీద ప్రయాణమే కారణమనడంలో సందేహమే లేదు. ఆయన వరుస సినిమాలు అంగీకరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారే తప్ప.. రాజకీయ నాయకుడిగా నిరంతరాయంగా ప్రజలతో మమేకమౌతూ.. ప్రజానాయకుడిగా గుర్తింపు పొందే విషయంలో మాత్రం పెద్దగా చొరవ చూపడం లేదు. అందుకే ఆయన సభలకు వచ్చే జనసందోహం ఒక సినిమా హీరోను చూడటానికి వస్తున్నట్లుగా ఉంది తప్ప ఆయన చెప్పే విషయాలు, అంశాలపై శ్రద్ధతో కాదు.
ఇలా చెప్పడానికి కారణమేమిటంటే.. పవన్ బయటకు వచ్చినప్పుడు మాత్రమే జనసేన కనిపిస్తుంది. ఆయన మళ్లీ తన షూటింగ్ కు వెళ్లిపోతే జనసేన కార్యక్రమాలు ఏవీ ఉండవు. ఆయన సభలు, ఆయన పర్యటనలు మాత్రమే జనసేన కార్యక్రమాలు. ఆ తరువాత పార్టీ ఊసే రాష్ట్రంలో ఎక్కడా వినపడని పరిస్థితి. రాజకీయంగా ఆయన అడుగులు ఒకడుగుముందుకు ఒకడుగు వెనక్కు చందంగా ఉండడానికి ఆయన జోడు పడవల ప్రయాణమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. గతంలో సినిమాల నుంచి రాజకీయాలలోకి వచ్చి రాణించిన వారెంత మంది ఉన్నారో... వైఫల్యం చెందిన వారూ అంతే మంది ఉన్నారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విషయం తీసుకుంటే.. ఆయన ప్రజా జీవితంలోకి రావాలని నిర్ణయించుకున్న తరువాత ఇక సినిమాల వైపు చూడలేదు. ఆ తరువాతెప్పుడో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆయన ప్రథమ ప్రాధాన్యత మాత్రం రాజకీయ రంగానికే ఇచ్చారు.
పవన్ కల్యాణ్ కు స్వయానా సోదరుడు అయిన చిరంజీవి కూడా రాజకీయాలలో ఉన్నంత కాలం సినిమాల ఊసెత్తలేదు. దాదాపు రెండున్నరేళ్లు పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకున్న తరువాత ఇప్పుడు సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఆయన అడపాదడపా రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నా.. అవన్నీ సినిమాలలో లేదా సినిమా ప్రమేషన్లలో భాగంగానే ఉంటున్నాయి. అయితే పవన్ కల్యాణ్ విషయం అది కాదు.. ఆయన అటు సినిమాలూ, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ప్రజా జీవితం కోసం సినిమాలను, సినిమాల కోసం ప్రజాజీవితాన్ని వదులుకోలేనని చెబుతున్నారు. అటో ఇటో తేల్చుకుంటే తప్ప ఆయన పరిపూర్ణ నాయకుడిగా జనం గుర్తించే పరిస్థితి లేదనే చెప్పాలి.
సినిమా హీరోగా రాజకీయాలు చేస్తున్నంత కాలం ఆయన రాజకీయం కూడా ఒక సినిమాలానే జనం చూస్తున్నారు. అందుకే ఆయన అడుగేస్తేనే జనసేన పార్టీ , ఆయన షూటింగ్ లలో ఉంటే అందుకు సంబంధించిన విషయాలు తప్ప జనసేన గురించి మాట్లాడేందకు ఎవరూ లేరు. జనసేన ఆవిర్బవించి ఇన్నేళ్లయినా ఇప్పటికీ క్షేత్ర స్థాయి నుంచీ పార్టీ నిర్మాణం లేదంటేనే పవన్ కల్యాణ్ పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యత ఎంత, ఏమిటి అన్నది అవగతమౌతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. వారాహి అన్న పేరుతో ఆయన యాత్రకు వాహనం కూడా సిద్ధమైంది. అయితే స్పష్టమైన కార్యాచరణతో షెడ్యూల్ విడుదల కాకపోవడానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణం.
ఇప్పుడాయన వరుసగా చేస్తున్న సినిమా ప్రకటనలు గమనిస్తే, ఆయన బస్సుయాత్ర నిరాటంకంగా సాగుతుందా అన్నది అనుమానమే. ఈ అనుమానాన్ని జనసేన శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. సినిమా షూటింగ్ ల మధ్య విరామంలో ఆయన తన బస్సుయాత్రను ఒక విరామ యాత్రగా సాగిస్తారన్న సెటైర్లూ పేలుతున్నాయి. అందుకే ఆయన ఒక సమయంలో పొత్తులు అంటారు.. మళ్లీ పొత్తుల సంగతి పక్కన పెట్టేసి.. అధికారమే లక్ష్యమని ప్రకటనలు చేస్తారు. ఇలా పరస్పర విరుద్ధప్రకటనలతో తనలోని కన్ఫ్యూజన్ ను పార్టీ శ్రేణులకూ, జనాలకు కూడా పంచుతారు. దీంతో అసలు జనసేన లక్ష్యం ఏమిటన్న విషయంలో పార్టీ శ్రేణులకే ఇంకా స్పష్టత లేని పరిస్థితి. కొంత కాలం కిందట రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వననీ, ఇందు కోసం అవసరమైతే బీజేపీతో మాట్లాడతాననీ ప్రకటించి.. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా పొత్తు పొడుపులపై చర్చకు తెరలేపారు.
ఆ తరువాత ఎమైందో ఏమో కానీ పొత్తు చర్చలు కాదు.. రాష్ట్ర పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యమని ప్రకటించారు. సరే తాజాగా మళ్లీ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పొత్తు పొడుపుల గురించి మాట్లాడారు. పవన్ కల్యాణ్ గతంలో ఏం చెప్పారో మళ్లీ అదే విషయాన్ని మనోహర్ వల్లె వేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జనసేన పని చేస్తుందనీ, ఇందు కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటుందని ఉద్ఘాటించారు. ఇందుకోసం అవసరమైతే పొత్తులకు కూడా వెనుకాడబోమన్నారు. అతి త్వరలో పొత్తులపై క్లారిటీ ఇస్తామన్నారు. దీని వల్ల రాష్ట్రంలో పొత్తల చర్చ మరో సారి తెరమీదకు రావడం వినా మరో ప్రయోజనం అయితే సిద్ధించదు. జనసేన క్యాడర్ లో కన్ఫ్యూజన్ పెరగడం తప్ప మరో లాభం ఉండదు.
గతంలో క్షేత్ర స్థాయిలో జనసేన తెలుగుదేశం శ్రేణులు కలిసి పని చేసేవి. పొత్తులు కాదు.. అధికారం కోసమే జనసేన అన్న జనసేనాని పిలుపుతో ఆ వాతావరణం పోయింది. ఇప్పుడు మళ్లీ పొత్తుల గురించిన ప్రస్తావనతో క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్ అసలు తామేం చేయాలి, ఎలా మెలగాలి అన్న దిశానిర్దేశం లేక నిస్తేజంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జనసేనాని క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంలో క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.