షర్మిల.. సునీత ఒకరికి ఒకరు
posted on Dec 12, 2022 9:13AM
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కోర్టు అనుమతించినా తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో నిరశన దీక్ష చేపట్టారు. అయితే ఆమె దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఆమె లోటస్ పాండ్ లోనే దీక్ష కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ నిర్మల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక వైద్యురాలు పర్యవేక్షిస్తున్నారు. ఆమె ఎవరంటే.. వైఎస్ వివేకా కుమార్తె సునీత. తన తండ్రివ హత్య కేసు తన సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీలో పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదంటూ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ విచారణను పొరుగు రాష్ట్రానికి మార్పించుకున్న సుసీత.. షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్ సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్లుగా షర్మిల.. వివేకా కుమార్తె వైయస్ సునీత ఒకరికొకరు స్నేహభావంతో ఉన్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసు.. తన సోదరుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అతి సూనాయాసంగా ఛేదించవచ్చునని వైయస్ సునీత తొలుత ఆశపడ్డారనీ, ఆ క్రమంలో సీఎం జగన్‌ను కలిసి.. ఈ కేసు ఛేదించడంలో జరుగుతోన్న జాప్యాన్ని ఆయనకు సోదాహరణగా వివరించారనీ, అయితే జగన్ స్పందనతో ఆమె హతాశురాలయ్యారనీ.. ఈ నేపథ్యంలో సోదరుడు జగన్‌ని నమ్ముకునే కంటే.. న్యాయస్థానాన్ని నమ్ముకోవడం ఉత్తమని భావించి ఆమె ఆ దిశగా అడుగులు వేశారనీ నెటిజన్లు అంటున్నారు.
జగన్ అధికారంలోకి రావడం కోసం జగనన్న వదిలిన బాణమంటూ ఉమ్మడి రాష్ట్రంలో షర్మిల పాదయాత్ర చేశారనీ, అయితే ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత షర్మిలను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలోనే సునీత తండ్రి వివేకా హత్య కేసులో జగన్ సొంత సోదరి షర్మిల.. స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి సైతం వాంగ్మూలం ఇచ్చిన సంగతీ విదితమే. ఈ విధంగా జగన్ సోదరి, సవతి సోదరి ఇద్దరూ కూడా జగన్ కు వ్యతిరేకంగా మారారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు ఇప్పుడు వీరిద్దరు ఒక్కటై.. జగనన్నకు బాణం దెబ్బ రూచి చూపించనున్నారని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
వివేకా హత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పులివెందుల్లో అవినాష్ రెడ్డి కుటుంబానికి ఒక్క జగన్ ఫ్యామిలీ మాత్రమే అండగా ఉందనీ, మిగిలిన వెఎస్ ఫ్యామిలీ మొత్తం సునీత, షర్మిలలకే మద్దతుగా ఉన్నారనీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
ఏదీ ఏమైనా.. వివేకా హత్య కేసులో పాత్రదారులు, సూత్రదారులు ఎవరు అనేది వెలుగులోకి వస్తే.. అలాగే తెలంగాణలో వైయస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా మారితే... జగన్ ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్‌లో షర్మిల అరెస్టు, వాహనంలో ఉండగానే టోవింగ్ తదితర పరిణామాలపై ప్రధాని మోదీ సైతం స్పందించినా... జగన్ మాత్రం స్పందించకపోవడాన్ని కూడా సామాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.